Previous Page Next Page 
ఒక కోయిల గుండె చప్పుడు  పేజి 16

                                              కలుపుమొక్క
    "సర్"
    ఆలోచనలో మునిగి వున్న చైతన్య ఉలిక్కిపడ్డాడు.
    చేతిలో ఫైల్ తో సెక్రటరీ సౌమ్య సౌమ్యంగా నిలబడి ఉంది. ఆమె మొహంలో లీలగా భయం, సంకోచం....
    ఆమెని చూడగానే అప్పటివరకూ కల్లోల సముద్రంలా వున్న మనసు హటాత్తుగా ప్రశాంతంగా మారినట్టు అయింది.
    మొహంలో చిరునవ్వు స్వరంలో మృదుత్వం తెచ్చి పెట్టుకుని "యస్....చెప్పండి" అన్నాడు.
    "ఇది రమేష్ గారి కాంట్రాక్ట్ కిసంబంధించిన ఫైల్ మీరు అడిగారు కదా!" ఫైల్ టేబుల్ మీద పెట్టింది.
    "ఆయన వచ్చారా?" ఫైల్ దగ్గరకి లాక్కుంటూ అడిగాడు.
    "లేదు సార్ .... మధ్యాహ్నం ఫోన్ చేశారు."
    నొసలు ముడేసి అన్నాడు "అలాంటప్పుడు ఇతని ఫైల్ ఎందుకింత ఇంట్రస్టింగ్ గా తీసుకొచ్చారు? టెండర్ వేసిన వాళ్ళు చాలామంది వున్నారు కదా!"
    అతని వైఖరి కి విస్తుబోతూ చూసింది. ఇది డైరెక్టర్ బెనర్జీ గారి పర్సనల్ కేసు. ఈ ఫైల్ ఇంకా తనదాకా ఎందుకు రాలేదని అయన మూడు రోజుల నుంచీ అడుగుతూనే వున్నారు. తను ప్రతిరోజూ చైతన్య టేబుల్ మీదకి పంపిస్తూనే వుంది. అది చైతన్య టేబుల్ మీదకు ఎలా వెళుతుందో అంతే భద్రంగా ఆఫీసు వేళలు పూర్తయ్యే సరికి తన టేబుల్ మీదకి తిరిగి వస్తోంది. ఇతను పరధ్యానంగా వుంటున్నాడు. ఇవాళన్నా ఇతని సంతకం తీసుకుని డైరెక్టర్ గారికి పంపించకపోతే తనకి ఆయన చేతిలో కచ్చితంగా అక్షింతలు పడతాయి.
    కొంచెం గొంతు సవరించుకుని అంది "డైరెక్టర్ గారు మీకు ఫోన్ చేయలేదా అని అడిగారు రమేష్ గారు."
    చైతన్య కి అకస్మాత్తుగా గుర్తుకు వచ్చింది. అవును. ఈ కాంట్రాక్ట్ రమేష్ కే ఇవ్వాలని డైరెక్టర్ బెనర్కీ రికమెండ్ చేశారు. అస్థిమితంగా వున్న మనసుతో తనసలు పట్టించుకోవడం లేదు. గభాల్న మరింత ముందుకు లాక్కుని పేజీలు  తిప్పుతూ ఫైల్ అంతా ఒకసారి పరిశీలించి , ఆఖరి పేజీలో సంతకంచేసి సౌమ్య వైపు నెట్టాడు.
    ఆమె కొంచెం వంగి తీసుకుంది.
    అలా వంగడంలో ఆమె కంఠన్ని చుట్టుకున్న మెత్తటి చున్నీఒకవైపు నుంచి కిందకి జారి టేబుల్ మీద పడింది. అతని దృష్టి ఆమె చున్నీ మీదకి, ఆ తరువాత అది వుండాల్సిన స్థానం లోకి మళ్ళింది. వెంటనే చూపులు తిప్పేసుకుని టేబుల్ మీద ఉన్న న్యూస్ పేపరు చేతులోకి తీసుకున్నాడు. అతని చూపులు తనవైపు ప్రసరించడంతో ఇబ్బంది పడిన సౌమ్య చటుక్కున వెనక్కితిరిగి చాంబర్ లోంచి బయటికి వచ్చేసింది.
    చైతన్య అంటే బెనర్జీ కి ఎంతో అభిమానం.అతనిసామర్ధ్యం మీదా, అతని తెలివితేటల మీదా అపారమైన నమ్మకం. సౌమ్య ఆ ఆఫీసులో స్టెనో గా చేరి రెండు నెలలైంది.బెనర్జీ ఆమెని ఇంటర్వ్యూ చేయగానే చెప్పాడు. "చైతన్య గారి దగ్గర మీకు పి.ఏ. గా పోస్టింగ్ ఇస్తాను . అతనిదగ్గర మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. త్వరలోనే ఆఫీసు కి సంబంధించిన అన్ని విషయాల్లో మీకు ఎక్స్ పీరియన్స్ వస్తుంది" అని.
    నిజమే అనుకుంది...కానీ, ఈ రెండు నెలలుగా జాగ్రత్తగా గమనిస్తుంటే అతని ప్రవర్తన, చూపులు అతని పట్ల ఏ మాత్రం సదభిప్రాయం కలిగించడం లేదు. పైగా అతనంటే చిరాకుగా, కొంచెం కోపంగానూ వుంటోంది. కారణం వచ్చిన దగ్గర్నించీ తనని కళ్ళప్పగించి చూడడం, తను మాట్లాడుతుంటే పరధ్యానం లోకి వెళ్ళిపోయి తన గుండెల వైపు అదోలాచూడడం చూస్తె ఇతను బుద్ది మంతుడని డైరెక్టర్ గారికి ఎలా అనిపిస్తోందనే సందేహం కలుగుతోంది. "ఇతనికి బొత్తిగా మర్యాద తెలియదు, సంస్కారం లేదు' అనుకుంటుంది సౌమ్య ప్రతిసారీ.
    అలా అని అతనెప్పుడూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం , అవసరానికి మించి ఒక్క అక్షరం కూడా ఎక్కువగా మాట్లాడడం గానీ చేయలేదు. అందుకే ఈ మాత్రం గా నైనా అతని ముందుకు రాగాలుగుతోంది . కానీ ఏదో వెతుక్కుంటున్న వాడిలా తనను అతడలా తేరిపార చూడడం మాత్రం భరించలేక పోతోంది.
    ఏం మనిషి ఇతను ఆడదాన్ని ఎప్పుడూ చూడనట్టు చూస్తాడు అనుకుంటుంది.
    చున్నీ జారిపడడం చాలా సహజం. అంత మాత్రాన అతనలా చూడడం ఛీ.... సౌమ్య కి చాలా అవమానంగా అనిపించింది.
    ఇలా చాలాసార్లు జరుగుతోంది. తన గుండెల వైపు చూడడం, వెంటనే తప్పు చేసినా వాడిలా తల తిప్పుకోవడం ...తప్పు అని తెలిసి ఎందుకు చూడాలి?వెధవ, వెధవ.... తనని తను రాజ్ కపూర్ అనో, శోభన్ బాబు అనో అనుకుంటున్నాడెమో.... చాలా రొమాంటి క్ గా చూస్తున్నాను అనుకుంటున్నాడు కాబోలు.... చండాలంగా , దరిద్రంగా చూస్తున్నాడని, ఆ చూపులు తనకి వాళ్ళంతా మంటలు మండిస్తున్నాయని చెప్పాలి ఆ వెధవ చూపులకి కంపరం పుడుతోంది. ఒళ్ళంతా గొంగళి పురుగులు పాకుతున్నట్టు, నరాలన్నీ వానపాముల్లా తిరుగుతున్నట్టు చికాకు పుట్టేస్తోంది. మానర్స్ లేని బ్రూట్..... అసలైనా డైరెక్ట్ గా ఉన్నత పదవుల్లోకి వచ్చిన వాళ్ళకి సభ్యతా,సంస్కారం వుంటాయి. వీడు ముందు అటెండర్ గా జాయిన్ అయ్యాట్ట మరి వీడికి ఆఫీసర్ పోస్ట్ ఎలా ఇచ్చాడో ఆ పెద్ద మనిషి.
    ఏమైనా సరే చెప్పేయాలి . రేపే డైరెక్టర్ గారికి చెప్పేయాలి వీడి దగ్గర పని చేయలేనని సౌమ్య మరోసారి దృడంగా నిశ్చయించుకుంది.
    అయితే, సౌమ్య చూపుల్లో కనిపించే తిరస్కారం గానీ, ఆమె బాడీ లాంగ్వేజ్ లో తన పట్ల ప్రదర్శితమవుతున్న అసహ్యం గానీ, ఆమె మాటల్లో అణచి పెట్టుకున్ననిర్లక్ష్యం గానీ చైతన్య గమనించలేదు.
    గమనించాలన్న ధ్యాస అతనికి లేదు. అతనికి కేవలం ఆమె కళ్ళలో దయ, మెత్తని చిరునవ్వులో ప్రేమ కనిపిస్తున్నాయి. ఆమెని చూస్తుంటే చనిపోయిన తన తల్లే సౌమ్యగా మారి తనకి అసిస్టెంటు గా వచ్చిందేమో అనిపిస్తోంది. తల్లి తన దేహాన్ని సౌమ్యకి ఇచ్చి ఆమె ఆత్మ మాత్రం పరమాత్మ లో లీనమైందనిపిస్తోంది.
    సౌమ్య మాట్లాడుతుంటే అచ్చు అమ్మ మాట్లాడుతున్నంత మృదువుగా వుంటుంది. ఆమె తనవైపు చూస్తుంటే గాయపడిన గుండెకి నవనీతం రాస్తున్నంత చల్లగా అనిపిస్తుంది. ఆమె నవ్వుతుంటే అచ్చు అమ్మ నవ్వంత మధురంగా వుంటుంది. ఫైలు తన టేబులు మీదకి తెచ్చినా చూపుడు వేలితో ఫైలు లో వున్న ఇంపార్టెంట్ విషయాలు ప్రత్యేకంగా చూపించినా ఆ వేలు కూడా అమ్మ వేళ్ళలా తన క్రాఫ్ ని ఆప్యాయంగా సవరిస్తున్నట్టు అనిపిస్తుంది. పెరుగు తగ్గట్టే ఆమె ఎంతో సౌమ్యంగా వుంటుంది!
    సౌమ్యతో ఎక్కువసేపు మాట్లాడాలని, ఆమె సమక్షంలోమౌనంగా కూర్చుని అమ్మలాగా పాడుతుంటే పరవశించి పోవాలని అనిపిస్తోంది! ఆకాశంలో పల్టీలు కొడుతూ అలసిన పావురాలు రివ్వున వాలి సేదతీర్చుకుంటున్నట్టుండే ఆ గుండెల మీద తలదాచుకుని సాంత్వన పొందాలనిపిస్తుంది.
    ఆమె ఎదురుగా రాగానే కన్నీళ్లు కార్చి, బీటలు వారిన తన మనసు అనే నేలమీద తొలకరి చినుకులు పడినంత హాయిగా, ఆహ్లాదంగా వుంటుంది. ఆమె స్వరం వినగానే కోల్పోయిన చైతన్యం తిరిగి వంపులు తిరుగుతూ తన అణువణువునా చేరినట్టు అనిపిస్తుంది సౌమ్య! అసలీమే ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆఫీసుకే ఎందుకు వచ్చింది? తన దగ్గరకే ఎందుకు అసిస్టెంట్ గా వేశారు డైరెక్టర్ గారు...ఆదైవం పంపినట్టు అటు అమ్మపోగానే ఇటు ఈమె తన జీవితంలోకి రావడం ఏమిటి? జీవితంలోకి వచ్చిందా? కాదు, కాదు మనసులోకి వచ్చింది. ఊహ కాదు, కాదు తను పనిచేస్తున్న ఆఫీసుకు చాలా కాకతాళీయంగా వచ్చి చేరింది. ఆచేరిన క్షణం ఎలాంటిదో తన అభిమానాన్ని తన ఆదరణ ని చూరగొన్న అనురాగమూర్తిగా, అమ్మగా మనసంతా ఆక్రమిస్తోంది.
    ఊదురు గాలికి కదిలి, కదిలి పూలన్నీ రాల్చుకుంటున్న జాజిపందిరిలా చైతన్య మెదడులో తల్లి జ్ఞాపకాల పందిరి కదిలి , ఆవిడ పంచిన మమతల సుమాలన్నీ ఒడిలో రాలుతున్నట్టుగా అయింది.
    ఈనాటి తన ఉన్నతికి కారణమైన అమ్మ అనామకుడిగా బతకాల్సిన వాడిని ఆఫీసరుగా చేసిన అమ్మ.
    
                                                          ****
    "నువ్వు బాగా చదువుకోవాలి చైతూ! చదువుకుంటే చాలు నాన్నా మన దగ్గర అంబానీ కన్నా ఎక్కువ సంపద ఉన్నట్టే" మంత్రాల్లాంటి మాటలు.
    ఓ పక్క వంట చేస్తూ, మరో పక్క తన చేత శ్రద్దగా హోమ్ వర్క్జ్ చేయించేది. పెరట్లో పంపు దగ్గర బట్టలు ఉతుకుతూజామచెట్టు కింద చాపేసి కూర్చోబెట్టి పాఠాలు కంఠతా పట్టించేది. "కాస్సేపు టీవీ చూస్తానమ్మా" అంటే చల్లగా నవ్వి , "అన్నం తిన్నంత సేపు టీవీ చూడు" అంటూ ఏ సమయాన్ని ఎలావాడుకోవాలో సమయపాలన నేర్పించింది.
    "నీకు ఇవ్వగలిగిన ఆస్తి కేవలం చదువే చైతూ! నా దగ్గర స్థిరాస్తులు లేవు, చరాస్తులు లేవు.ఉన్నది కొంత విజ్ఞానం , మరి కొంత వివేకం. అవి రెండూ నీకిచ్చి రిక్త హస్తాలతో వెళ్ళిపోతాను. వాటిని జాగ్రత్తగా కాపాడుకో.... వీలైతే ఆస్తుల్ని పెంచుకున్నట్టు పెంచుకో..." నీ పిల్లలకి కూడా నువ్వు అవే ఇవ్వాలి.."
    అమ్మ మాటలు వింటూ అలసిన కళ్ళు మూసుకుంటే అమృతం కురిసే చేతులో క్రాఫ్ నిమురుతూ అమ్మ పాడే జోలపాట , అదే తనకి బతుకుబాట.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS