Previous Page Next Page 
ఒక కోయిల గుండె చప్పుడు  పేజి 14

    దసరా సెలవులకి పిల్లలతో పాటు వారం ముందు అరుణ పుట్టింటికి వెళ్ళింది. దుర్గాష్టమి నాడు ప్రసాద్ కూడా వచ్చాడు. ఆ కాసిని రోజులూ సరదాగా, ఆహ్లాదంగా గడిచాయి.
    కాలం చకచకా నడిచేసింది. ఆదిత్య ఇంజనీరింగ్ ఫస్టియర్ కి వచ్చాడు. అనన్య మెడిసిన్ సెకండ్ ఇయర్.
    ప్రసాద్ , అరుణ నడివయసుకి వచ్చారు.    
    భాస్కరం , లలితాంబ వృద్దులైనారు. ఇప్పుడు వాళ్ళకి మంచం మీదికే అన్నీ . ఇదివరకటి కన్నా వాళ్ళకి సేవలు ఎక్కువగా చేస్తోంది అరుణ. మూడేళ్ళ ముందే రిటైర్ మెంట్ తీసుకుంది. 
    ఇప్పుడామెకి యాభై అయిదేళ్ళు.
    వెనక్కి తిరిగి చూసుకుంటే తను జీవితంలోని మాధుర్యం ఏం అనుభావించిందో ఆమెకే తెలియడం లేదు. ఇప్పుడు అన్నిటికీ నిర్లిప్తంగా అయిపొయింది. పిల్లలు సినిమాకి వెళ్దామన్నా నాకు ఓపిక లేదు మీరు వెళ్ళండి అంటోంది.
    మరో నాలుగేళ్ళు గడిచాయి. అత్తగారు, మావగారు ఒకరి తరువాత ఒకరు కాలం చేశారు.
    అనన్య తన క్లాస్ మేట్ శ్రీహర్ష ని ప్రేమించింది. ఆ అబ్బాయినేఇచ్చి కన్యాదానం చేశారు అరుణ, ప్రసాద్. ఆదిత్య కూడా తన క్లాస్ మెట్ ని ప్రేమించి ఆమెనే చేసుకుంటా నన్నాడు. ఆ అమ్మాయి కన్నడ అమ్మాయి. అయినా కాదనడానికి కారణం కనిపించక ఆదిత్య పెళ్ళి కూడా చేసేశారు.
    ఇప్పుడు అరుణ, ప్రసాద్ పెద్దవాళ్ళ య్యారు. ఇద్దరూ రిటైర్ అయ్యారు.
    అనన్య, ఆమె భర్త సొంతంగా క్లినిక్ పెట్టుకున్నారు.
    ఆదిత్య ఇన్ఫో టెక్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా జాయిన్ అయ్యాడు.
    అతని భార్య గోపిక సత్యం కంప్యూటర్స్ లో చేరింది.
    వాళ్ళిద్దరూ హైటెక్ సిటీకి దగ్గరగా మంచి ప్లాట్ అద్దెకు తీసుకుని విడిగా వెళ్ళిపోయారు.
    ఇంతకాలం ఇండినిండా జనంతో కళకళలాడిందేమో ఇప్పుడు ఇద్దరే వుంటే బోసిగా వుంది ఆమెకి.
    ఆరోజు ఆదివారం...
    ప్రసాద్ కి కాఫీ కలిపిచ్చి, తానూ కప్పు తీసుకుని పెరట్లో తిరుగుతూ అడ్డదిడ్డంగా పెరడంతా తుప్పల్లా పెరిగిపోయిన మొక్కల్ని చూస్తూ కాఫీ తాగడం పూర్తీ చేసి, మొత్తం గడ్డి ,మొక్కలన్నీ పీకేస్తోంది అరుణ.
    అరుణ కనిపించకపోవడంతో వెతుక్కుంటూ వచ్చిన ప్రసాద్ ఆమె దగ్గరగా నడిచి, భుజం మీద చేయి వేసిఅప్యాయంగా అన్నాడు ... "ఇంతకాలం పని....పని.... పని.... క్షణం తీరిక లేకుండా పని,బాధ్యతలు.... ఇప్పుడు ఇంత ఖాళీ సమయం ఏం చేయాలో తెలియడం లేదు కదూ.."
    అరుణ నవ్వింది. "తెలియకేం! చేయదల్చుకుంటే బోలెడు పని ఉంది. చూడండి చిక్కుడు పాదు ఎలా అయిందో, గులాబీ కొమ్మలు కట్ చేసి , ట్రిమ్ చేయాలి. మల్లె పందిరి చూశారా పడిపోయింది. కర్రలు సరిగా పాతి సరిచేయాలి. ఆ పిచ్చి మొక్కలన్నీ పీకేయాలి. నీళ్ళు సరిగా పెట్టడం లేదు. ఇప్పటి నుంచీ రోజు క్రమం తప్పకుండా నీళ్ళు పోయాలి. మందు లేయాలి."
    "అబ్బో బోలెడు పనుందే...." ఆశ్చర్యంగా అన్నాడు ప్రసాద్.
    "మన పిల్లల బాధ్యతలు తీరిపోయాయి. కానీ ఈ పసిపిల్లల బాధ్యత మనమీద ఇంకా వుంది. ఎప్పటికీ వుంటుంద." అంది అరుణ చిక్కుడు పాదు నుండి ఎండిపోయిన ఆకులూ తీస్తూ.
    ఆమె చేస్తున్న పని తదేకంగా చూస్తూ పదేహేనేళ్ళ క్రితం ఆమె కోరిన కోరిక గుర్తు తెచ్చుకున్నాడు ప్రసాద్. ఆమె కోరిక.... చాలా చిన్న కోరిక... తను తీర్చగల స్తోమత వుండి కూడా తీర్చలేక పోయాడు కారణం ఒక్కటే, ఎప్పటికప్పుడు మీద పడుతున్న రకరకాల బాధ్యత ల ఒత్తిడి ...అటు కన్నవాళ్ళ మనసు కష్టపెట్టలేక , ఇటు భార్యని సంతోష పెట్టలేక నలిగిపోయాడు.
    "ఆరూ.... వైజాగ్ వెళ్దామా?' అడిగాడు.
    అరుణ ఆశ్చర్యంగా అడిగింది....' "ఇప్పుడా ? దేనికి?"
    అవును దేనికి? ఆమె కాకతాళీయంగానే అన్నా అలా అనడంలో అతనికి వెటకారంగా అనిపించినట్టనిపించింది. దేనికి? ఇప్పుడెల్లి ఏం చేద్దాం? అని అడుగుతున్నట్లే అనిపించింది.
    "అదే, అరకు, బొర్రా గుహలు ...."
    ఫక్కున నవ్వింది.... "ఈ వయసులో బొర్రా గుహలు చూడగలమనేనా?" 
    "ఏం?"
    "ఏం ఏంటండి... అవన్నీ ఎక్కాలి, దిగాలి... ఎక్కాలి , దిగాలి... చాలా కష్టం. నాకు మోకాళ్ళ నొప్పు లోచ్చేశాయి. మీకు బీపి. వచ్చింది."
    ఉసూరుమంది ప్రసాద్ కి. అంతేనా తనింకా ముసలివాడైనట్టేనా? ఇదివరకులా చలాకీగా వుండలేరా ఇద్దరూ....
    "పోనీ అరకు వెళ్దాం.... నాకు ఆరోజు నువ్వు అడిగింది గుర్తుంది అరుణా....! ఇప్పుడు వెళ్దామా? మనకింక అడ్డేముంది?' అన్నాడు జాలిగా.
    అరుణ క్కూడా అనిపించింది...అవును ఇప్పుడు అడ్డేముంది? హాయిగా తిరగవచ్చు.... తిరుగుతుంటే అదే వస్తుంది ఓపిక.
    "అలాగే వెడదాం" అంది.
    "ఒకే.... నేను వెళ్ళి టికెట్స్ తెస్తాను...." అంటూ బట్టలు మార్చుకోడానికి హుషారుగా లోపలికి వెళ్తున్న ప్రసాద్ ని చూసి నవ్వుకుంది అరుణ.
    వచ్చే శనివారం వాళ్ళు వైజాగ్ వెళ్ళడానికి టికెట్స్ దొరికాయి.
    ఇద్దరూ పదేళ్ళ వయసు తగ్గిపోయినట్టు హుషారుగా ఏర్పాట్లు చేసుకోసాగారు. వైజాగ్, అట్నుంచి అరకు, సింహాచలం , భీమిలీ, విజయనగరం, అరసవెల్లి, మొత్తం ప్లాన్ గీశాడు ప్రసాద్.
    కొంచెంగా, జంతికలు, కజ్జికాయలు చేసింది అరుణ.
    ఇద్దరూ చెరో సూట్ కేసు లో బట్టలు సర్దుకున్నారు. సపరేట్ బ్యాగు లో టూత్ బ్రష్షులు పేస్టు, దువ్వెన, పౌడరు, సబ్బు, సర్ఫ్, మైసూర్ శాండిల్ షొప్స్, ఇద్దరి మందులూ అన్నీ సర్దుకున్నారు. ఒక్క బాస్కెట్ లో తిండి సామాను సర్దింది అరుణ.
    "అవీ, ఇవీ సర్ది లగేజి పెంచకు. నువ్వు మోయలేవు.... నేను మోయలేను... లెస్ లగేజ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్" అన్నాడు ప్రసాద్.
    "నాకు తెలియదా? అన్నీ అవసరమైనవే సర్ధాను. ఇవి కూడా లేకపోతె ఎలా?" అంది అరుణ.
    సాయంత్రం ఏడున్నర కి ట్రైను.
    అరుణ ఇల్లంతా నీటుగా సర్ది స్నానానికి వెళ్ళింది.
    ప్రసాద్ రెడీ అయి కూర్చున్నాడు.
    అరుణ స్నానం చేసి,గంజి పెట్టి ఇస్త్రీ చేసిన గులాబీ రంగు పూలున్న తెల్లచీర కట్టుకుని, పౌడరు రాసుకుని, జడలో మల్లెపూలు పెట్టుకుని ఘుమఘుమ లాడుతూ వచ్చింది. 
    "శోభనం పెళ్ళికూతురిలా వున్నావు" అన్నాడు ప్రసాద్ ఆమెని ఆపాదమస్తకం చూస్తూ....
    "చాల్లెండి " చిరుకోపంతో కసిరి గోడగడియారంచూసింది. ఇంకా టైం వుంది. 
    "పిల్లలకి ఫోన్ చేసి చెప్పారా?' అడిగింది.
    "ఇప్పుడు చేస్తాను.." అంటూ ఫోన్ కోసం లేస్తుండగానే ఫోన్ రింగైంది.
    "నీ కూతురో, కొడుకో నూరేళ్ళ అయిష్షు" అంటూ రిసీవర్ తీసుకుని "హలో" అన్నాడు ప్రసాద్.
    అవతలి నుంచి అనన్య స్వరం నీరసంగా వినిపించింది "అమ్మ వుందా నాన్నా...." 
    "ఆ వుందమ్మా....మేము...." అతనేదో చెప్పబోతుంటే మధ్యలోనే అంది అనన్య "అమ్మకివ్వు నాన్నా...."
    "నీతో మాట్లాడుతుందిట..." అంటూ అరుణ కిచ్చాడు ఫోన్.
    "చెప్పు తల్లీ.... ' అరుణ ఆప్యాయంగా అంది.
    "అమ్మా.... నాకు వారం నుండి వాంతులు,కళ్ళు తిరుగుతున్నాయి. పని చేసుకోలేక పోతున్నాను. క్లినిక్ కి కూడా వెళ్ళడం లేదు. ఏం తినాలనిపించడం లేదమ్మా,నువ్వు రామ్మా...."
    అంతా వింటున్న అరుణ మొహంలో మారుతున్న రంగులు చూస్తున్న ప్రసాద్ కంగారుగా అడిగాడు.
    "ఏమండీ ఆరూ...."
    దీర్ఘంగా శ్వాస వదిలి, రిసీవర్ పక్కన పెట్టేస్తూ ....చిన్నగా నవ్వింది.
    ఆ నవ్వులోశతకోటి భావాలు వినిపించాయి ప్రసాద్ కి. కానీ, అవెం అర్ధం కాలేదు .
    "ఏంటి ఏమైంది?" అన్నాడు మళ్ళీ.
    "ఏం లేదండి.... మీరు తాత, నేను అమ్మమ్మ కాబోతున్నాం.... వైజాగ్ లో గడిపే వారం రోజులు అమ్మాయి ఇంట్లో గడుపుదాం.... పదండి అన్నీ సర్దేయండి...." అంటూ చలనరహితంగా లేచి లోపలికి వెళ్ళిపోతున్న అరుణ వైపు వెర్రిగా చూశాడు ప్రసాద్.
    అనన్య గర్బవతి ....మళ్ళీ అరుణ భుజాల పైన మరికొన్ని బాధ్యతలు పడ్డాయి. అనన్య ఆరోగ్యం కనిపెట్టి వుండడం, ఆమెకి ఇష్టమైనవి చేసి పెట్టడం, సీమంతం, హడావుడి, డెలివరీ, బాబుపుట్టడం, వాడి ఆలనా, పాలనా మరో ఐదేళ్ళు వయసు పెరిగింది ప్రసాద్, అరుణ లకి.
    బాబు స్కూల్ కి వెళుతున్నాడు. ఆదిత్యక్కూడా పాపాయి పుట్టింది.
    సరదాలూ, షికార్ల వయసు దాటిపోయింది. ఆ ఆలోచనా పోయింది. మనవడు, మనవరాలితో ఆడుకోవడం వాళ్ళ ముద్దు ముచ్చట్లు..... వీటితో గడిచిపోయింది. ఇప్పుడు పిల్లల్ని చూడకుండా ఒక వారం రోజులు కూడా వుండలేక పోతున్నారిద్దరూ.
    "ఇల్లు అద్దె కిచ్చేసి, మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళ దగ్గర ఉండచ్చు కదమ్మా" అన్నారు ఆదిత్య, అనన్య కూడా.
    "అవును అలా చేయవచ్చు కదా మనం" అన్నాడు ప్రసాద్ ఒకరోజు.
    కాసేపు మౌనంగా వున్న అరుణ అంది.... "ఒద్దండీ....ఈ ఇల్లుని వృద్దాశ్రమంగా మర్చాలనుకుంటూన్నాను."
    "వృద్దాశ్రమమా?" ఆశ్చర్యంగా చూశాడు ప్రసాద్ ..."దేనికి/ ఎందుకొచ్చిందా ఆలోచన."
    "అదేంటమ్మా అసలా ఆలోచన ఏంటి? బోలెడన్ని వృద్దాశ్రమాలున్నాయి.... వాటిలో మనుషులే లేరుట" అంది అనన్య.
    "వృద్దాశ్రమాలు కావాలి అనన్య.... చాలా కావాలి.... పెద్దవాళ్ళంతా అరవై దాటగానే ఆశ్రమంలో వుంటే పిల్లలు జీవితాల్ని అనుభవించే అవకాశం వుంటుంది.లేకపోతె జీవితంలో పూర్తిగా నిలదొక్కుకోకుండానే పెద్దవాళ్ళ బాధ్యతలు మీద పడతాయి. వాళ్ళ రోగాలు, రోష్టులు , సేవలు ,వీటితో పిల్లల కెరియర్  దెబ్బతింటుంది. యవ్వనం మొత్తం బాధ్యతలతో గడిచిపోతుంది. చిన్న చిన్న కోరికలు కూడా తీరకుండానే వృద్దాప్యం వచ్చేస్తుంది."
    ప్రసాద్ చెవులకి ఆవిడ స్వరంలో లీలగా మెదిలిన జీర వినిపించి చకితుడై చూశాడు. 
    ఇంత వేదన వుందా అరుణ గుండెల్లో.... మరి ఇన్నేళ్ళు ఈ బాధ్యతాలన్నీ ఎలా మోసింది? ఆశ్చర్యంగా చూస్తున్న అతని కళ్ళకి ఆమె వెనకాలవున్నకిటికీ లోంచి దూరంగా అస్తమిస్తున్న సూర్యబింబం తాలూకు నారింజ రంగు అలుముకున్న ఆకాశం కనిపిస్తోంది. 
    "పొద్దు వాలిపోతోంది అరుణా.... లైటు వేయవూ...." అన్నాడు.
    ఆవిడ నెమ్మదిగా లేచింది.

                                                                     --------    


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS