Previous Page Next Page 
ఒక కోయిల గుండె చప్పుడు  పేజి 13

    జడ వేసుకుంటున్న అరుణ చేతిలో దువ్వెన జారిపడింది. దానితో పాటే ఉత్సాహంగా గంతులేస్తున్న ఆమె కూడా జారిపదినట్టు అనిపించింది. ఆవిడ మాటలకి ప్రసాద్ ఏం జవాబు చెప్పాడో వినిపించలేదు.
    ఆ తరువాత మాములుగా అతని వెనకాల స్కూటర్ ఎక్కి ఆఫీసు దగ్గర దిగిపోయింది. కానీ, అతను కానీ, ఆమె కానీ దారిలో ఈ సంగతి ఏమీ మాట్లాడుకోలేదు.
    ఆరోజు అప్లికేషన్ ఇవ్వాలనుకున్న అరుణ ఇంక దాని గురించి ఆలోచించలేదు. ఒక్కరాత్రే వస్తుంది మధురమైన కల. అదీ కాస్సేపే... మధురంగా వుంది కదా అని ఇంకాస్సేపు పడుకుంటే కల కంటిన్యూ అవుతుందా? రాత్రి కలిగిన తీయని ఊహలు, రెక్కలొచ్చిన ఆశలు ఉదయానికల్లా చెదిరిపోయాయి. ఇంక దాని గురించి అలోచించినందు వల్ల ప్రయోజనం ఏం వుంది? అనుకుంది. అన్యమనస్కంగా పనిచేసింది. పోస్టులో తల్లి దగ్గర్నుంచీ ఉత్తరం వచ్చింది మధ్యాహ్నం.
    అన్నయ్య అమెరికా వెళ్తట్ట. వచ్చే నెలల్లో , వీసా ఏదో రావాలిట... మీ నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు. ఆ ఉద్యోగం ఏదో ఇక్కడే చేసుకోవచ్చుగా అంటున్నారు. వాడు మాత్రం అక్కడికే వెడతానని కచ్చితంగా చెప్పాడు. మీ వదిన కూడా అదే బాగు అంటోంది. ఇండియాలో వుంటే ఎదుగుదల వుండదట. ఏమిటో మీ ఇద్దరూ చెరో చోట, మేము ఇదరం రెక్కలు తెగి ఇక్కడ చాలా దిగులుగా వుందమ్మడూ. నువ్వు కూడా వచ్చి చాలా రోజులైంది ఏడాది దాటుతోంది. విజయవాడ ఎంతదూరం అని! ఈసారి దసరా సెలవల కన్నా మీ ఇద్దరూ పిల్లల్ని తీసుకుని వస్తే బాగుంటుంది. మళ్ళీ అన్నయ్య అమెరికా వెడితే ఎపప్తికి కలుసుకుంటారో! అల్లుడి గారికి నా మాటగా చెప్పు. మీ నాన్నగారితో వాళ్ళ ఆఫీసు కి ఫోన్ చేయిస్తాను. పిల్లలెలా వున్నారు? జాగ్రత్తగా చూసుకో... మీ అత్తగారు , మావగారు కులాసానా.... పెద్దావిడ నీకు కాస్త అండగా, సాయంగా వున్నారని అనుకుంటాను.
    హు....పేలవంగా నవ్వుకుంది అరుణ. అందరూ నీలా వుంటారమ్మా ....అనుకుంది.
    అరుణ తల్లి సుశీల చాలా నేమ్మదస్తురాలు. తండ్రి కొంచెం మూర్ఖుడు. ఆయనతో ఇంతకాలంగా నెట్టుకొస్తూ , కాపురం చేస్తోందంటే ఆవిడ ఎంత ఉత్తమురాలో అనిపిస్తుంది. ఎవరికైనా.... ఆవిడ నేమ్మదే అరుణ క్కూడా వచ్చింది. ఆవిడ కోడల్ని చాలా అపురూపంగా చూసుకుంటుంది. కొడుక్కి, కోడలికీ, ఉదయం కాఫీ, బ్రేక్ ఫాస్ట్, గదిలోకి తీసుకెళ్ళి ఇస్తుంది. కోడలు బాగా చదువుకున్న పిల్ల అనీ, హైదరాబాద్ పిల్ల అనీ, ఏంతో గౌరవంగా చూసుకుంటుంది. దానికి తోడూ శరణ్య కూడా గడసరి.
    తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. పుట్టింట్లో ఎంతో గారభం . ఇవతల పుల్ల తీసి అవతల పెట్టె అవసరం లేకుండా పెరిగింది. శరణ్య తండ్రి ఎలక్ట్రిసిటీ బోర్డు లో ఇంజనీరు . హైదరాబాదు లో బంజారాహిల్స్ లో ముప్పై లక్షల విలువ చేసే బంగళా వుంది. బోలెడంత ఆస్తి సంపాదించాడు. అనుకోకుండా తన దగ్గరకే జూనియర్ ఇంజనీరు గా ఇంటర్వ్యూ కి వచ్చిన హరీష్ ని చూసి, అతని తెలివి తేటలు, చక్కదనం చూసి మెచ్చి, ఉద్యోగంతో పాటు పిల్లని కూడా ఇచ్చాడు. ముందు అల్లుడిని ఇల్లరికం వుంచుకోవాలనుకున్నవాడు.... మళ్ళీ ఏం అనుకున్నాడో విజయవాడ కే పోస్టింగ్ ఇచ్చి కూతుర్ని శాస్త్రోక్తంగా అత్తగారింటికి పంపించాడు.
    ముందు కొంతకాలం శరణ్య అత్తగారింట్లో ఉండడానికి రాద్దాంతం చేసింది. కానీ అత్తగారి మంచితనం, ఆవిడ శ్రద్దగా వండి పెట్టడం చూసి సర్దుకు పోయింది. పుట్టింట్లో వంటమనిషి చేసి పెట్టిపోతే, ఎప్పుడో ఎవరికి వాళ్ళు పెట్టుకు తినడం , నచ్చీ నచ్చక తిన్నంత తిని వదిలేయడం , ఆకలి తీరక బయట ఫాస్టు ఫుడ్ తినడం ఆ బాధలన్నీ పోయి, కమ్మగా వండి పెట్ట్ర్ అత్తగారు దొరకడం అదృష్టంగా భావించింది. పెద్ద ఇల్లు, సపరేట్ గా గది అత్తగారి మంచితనం ...భర్త అనురాగం.... వున్న ఒక్క ఆడపడుచూ దూరంగా వుండడం మామగారు ఇల్లు పట్టించుకోని మనిషి ...ఇంక అక్కడ వుండడానికి ఆ అమ్మాయికి అభ్యంతరం కనిపించలేదు. ఎటొచ్చీ తన బతుకే.... ఇలా అయింది. హైదరాబాదు హైదరాబాదు అంటూ మురిసిపోయింది. ఏం వుంది ఈ హైదరాబాదు లో .... విరక్తి గా అనుకుంది అరుణ.
    "అమ్మా, నాన్నా కూడా వస్తారట.... ఏం చేద్దాం ?" అన్నాడా రాత్రి ప్రసాద్....
    "వాళ్ళు వస్తానన్నది తిరుపతికి.. కానీ మనం వెళ్ళేది వైజాగ్ కదా!"
    "వైజాగ్ అంటే, ఎందుకు? ఏమిటి? అని సవాలక్ష ప్రశ్నలేస్తారని తిరుపతి అని చెప్పాను... నాకేం తెలుసు?"
    "ప్రయాణం క్యాన్సిల్ అయిందని చెప్పండి..."
    "ఎందుకులే అరుణా! వెళ్లోద్దాం.... భగవంతుడి దర్శనానికి వెళితే తప్పేం వుంది. ఈసారి నా ఎల్.టి.సి పెట్టుకుని చక్కగా డిల్లీ, ఆగ్రా, హరిద్వార్ అన్నీ చూసొద్దాం.. నాకు అల్ ఇండియా వెళ్ళే అవకాశం వుందిగా.... సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిని.
    అరుణ మాట్లాడలేదు. పిల్లల్ని తీసుకెళ్ళడానికి విసుగు అనిపించే ఈయనకి ఆ ముసలాళ్ళని తీసుకుని ఎలా వెళ్లాలనిపిస్తుంది? అనిపించింది.
    "మాట్లాడవేం?" ఆమె చుబుకం పట్టుకుని తనవైపు తిప్పుకుని అడిగాడు...
    "ఏం మాట్లాడను? పెళ్ళి అయిన దగ్గర్నుంచీ మీతో కలిసి సరదాగా, హాయిగా అనేక చోట్లకి వెళ్లాలని కలలు కన్నాను. ఒక్కటి కూడా తీరలేదు. మొట్టమొదటిసారిగా చిన్న కోరిక కోరాను. ఇది కూడా తీరదా? శని, ఆదివారాలు వాళ్ళకోసమే ఖర్చు పెడతారు. సెలవు రోజులన్నీ వాళ్ళ కోసమే... నాతొ నాలుగురోజులన్నా ఏకాంతంగా గడపాలని మీకెందుకు వుండదో నాకర్ధం కాదు."
    "అబ్బ.... జీవితం అప్పుడే అయిపోయిందా ఏంటి? ఇంకా బోలెడు జీవితం వుంది. తరువాత వెడదాం అన్నాగా.... ' కొంచెం విసుగ్గా అన్నాడు.
    అరుణ నిట్టూర్చింది.  జీవితంలో అయిపోయిందో, ఇంకా వుందో ఎవరికి తెలుసు? ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని నీటి బుడగ లాంటిదీ జీవితం... నిజానికి జీవితం చాలా సుదీర్ఘమైంది అంటారు కానీ చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో అమాయకత్వంతో కొంత, సహాయతతో కొంతా, బాధ్యతతో కొంత, అనారోగ్యంతో కొంతా గడిచిపోతే మిగిలింది ఎందుకు పనికి వస్తుంది. కృష్ణా, రామా అనుకోడానికి తప్ప... ఈ వాస్తవం తెలుసుకోలేని వాళ్ళు ...ఎప్పటి కప్పుడు ఇంకా ముందు, ముందు బోలెడు జీవితం వుంది అంటూ అనేక పనులు, సుఖాలు, ఆనందాలు వాయిదా వేస్తుంటారు. చివరికి ఏమవుతారో!
    "మీ ఇష్టం" అంటూ పక్కకి తిరిగి పడుకుంది అరుణ.
    "ఎల్.టి.సి నాకూ, పిల్లలకీ, మాత్రమే ఇస్తారు. మీరు అవైల్ చేసుకోకపోతే మీకూ ఇస్తారు. మీ అమ్మకీ, నాన్నకీ ఇవ్వరు " కొంచెం విసురుగా అన్నది.
    "సరే.... అయితే నువ్వు అప్లై చేయకు.. నేను చేస్తాను. నాకైతే మా అమ్మకీ, నాన్నకీ కూడా ఇస్తారు. కనీసం చార్జీలన్నా కలిసి వస్తాయి.."
    "మరి ఆగ్రా, డిల్లీ, అవన్నీ ఎప్పుడు వెళదాం?" చురుగ్గా అడిగింది. కొన్ని క్షణాల క్రితం వాగ్దానం చేసి, మళ్ళీ తిరుపతికి అప్లయి చేస్తానంటున్న భర్త ముఖంలో భావాలు వెతుకుతూ....
    "నెక్ట్స్ షెడ్యూల్ లో వెళ్ళచ్చుగా ..." పక్కకి ఒత్తిగిల్లాడు.
    "హు....అంటే మళ్ళీ నాలుగు సంవత్సరాల తరువాతన్నమాట.." బరువుగా కళ్ళు మూసుకుంది.
    ప్రసాద్ మర్నాడు ఆఫీసు నుంచి వస్తూ ...వస్తూ టికెట్లు బుక్ చేయించు కొచ్చాడు. నాలుగు రోజుల్లో ఇంటిల్లిపాదీ తిరుపతి బయలుదేరారు.
    ఆరోజు సెకండ్ సాటర్ డే. అరుణ సోమవారం, నుంచి బుధవారం దాకా లీవు పెట్టింది. ఆరోజు సాయంత్రం వెంకటాద్రి కి బయలుదేరాలి.
    సూట్ కేస్ లో చీరలు, ప్రసాద్ బట్టలు, పిల్లల బట్టలు సర్దుతోంది అరుణ. అనన్య, తన టెడ్డి బేర్ తీసుకొచ్చి మమ్మీ ఇది కూడా సూట్ కేసు లో పెట్టు అన్నది....
    "ఇదేందుకే ...వున్న లగేజీ సరిపోకనా?" తీసి పక్కన పెట్టేసింది అరుణ.
    "ఊ...ఊ.. ఐ వాంట్ మై మంకీ.... ఐ వాంట్ మై మంకీ .." అంటూ గొడవ చేస్తూ ఏడుపు మొదలుపెట్టింది.    
    'అబ్బబ్బ ...ఏమిటా ఏడుపు? చంపుతాను... నోరుమూయ్" కసిరింది.
    "ఐ వొంట్ కమ్ విత్ యూ...." అనన్య విసురుగా మంకీ బొమ్మ తీసుకుని బయటికి పరుగెత్తింది.
    హల్లో ఆదిత్య , ప్రసాద్ కూర్చుని వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు. అనన్య ప్రసాద్ భుజం మీద వాలి, గారాలు పోతూ అన్నది... "డాడీ! నా మంకీ బొమ్మ తీసుకెల్తానంటే మమ్మీ వద్దంటోంది... బాడ్ మమ్మీ..."
    "ఊరికి వెళ్తూ బొమ్మలేందుకు తల్లీ" నచ్చచెప్పాడు భాస్కరం.
    బయలుదేరే రోజు, పులిహోర, పూరీలు చేయడం.. సామాన్లు సర్దడం.... పిల్లలకు కావాల్సిన చిరుతిళ్ళు, ఎమర్జెన్సీ మేదిసిన్స్ తీసుకోవడం వగైరా దగ్గర్నుంచి తిరిగి వచ్చిందాకా ప్రసాద్ తో ఓ గంట కూడా ఏకాంతంగా గడిపే అవకాశం రాలేదు అరుణకి.
    తిరిగి హైదరాబాద్ చేరేటప్పటికి ఒళ్ళంతా పచ్చి పుండులా అయింది నూట రెండు డిగ్రీల జ్వరంతో.... నాలుగు రోజులు సెలవు పొడగించింది. ఆ నాలుగు రోజులు లలితాంబ వంట చేస్తే, ప్రసాద్ పిల్లలు పని చూసుకున్నాడు. అయితే, బియ్యం ఎన్ని పోయాలి? కందిపప్పు ఎంత పోయాలి? కూరలు పావుకిలో వండలా? మీ పిల్లలు కారాలు తింటారా? నా వంట నచ్చుంతుందో లేదో.... ఉప్పెక్కడుంది ? ఆవాలు ఎక్కడున్నాయి? సరుకుల డబ్బాలు సరిగా సర్దుకోలేదేంటి? అనే రకరకాల ప్రశ్నలకు జవాబు చెప్పలేక జ్వరం తాలుకూ నీరసం కన్నా మరో నీరసం ఎక్కువైంది అరుణకి.
    జ్వరం పూర్తిగా తగ్గకుండానే తిరిగి రొటీన్ బాధ్యతలు చార్జి తీసుకోవాల్సి వచ్చింది.
    రెండు రోజులు అలాగే ఇంట్లో పని, ఆఫీసు పనితో బాగా అలసిపోయి, మళ్ళీ మంచం పట్టింది.
    ఈసారి కన్నీళ్లు కారిపోతుంటే అంది. "నేనొక వారం రోజులు మా అమ్మ దగ్గరకు వెళ్తాను... పిల్లల క్కూడా దసరా సెలవులోస్తూన్నాయిగా."
    'అలాగే వెళ్ళు. నేను కూడా వస్తాను పండక్కి రెండు రోజులు ముందు సరేనా" స్వరంలో అనురాగం కురిపిస్తూ అన్నాడు ప్రసాద్.
    అసలే మనసంతా చెమ్మగిల్లి వుందేమో అతని అనురాగంతో కళ్ళు వర్షించసాగాయి.
    "ఏడవకు అరూ.... ఈ మాత్రానికే ఏడిస్తే ఎలా? టేకిట్ ఈజీ అప్త్రాల్ దిసీజ్ లైఫ్ మనం ఇంకా ప్రారంభంలోనే ఉన్నాం. బోలెడంత జీవితం వుంది ముందు, ముందు" అన్నాడు ఆమె నుదుటి మీద వెంట్రుకలు సవరిస్తూ.
     


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS