Previous Page Next Page 
ఒక కోయిల గుండె చప్పుడు  పేజి 12

    అరుణ నేమ్మదస్తురాలే.... కాకపోతే అందరాడపిల్లల కుండే సహజమైన కోరికలు ఆమెకీ వున్నాయి. భర్తతో చక్కగా చెట్టాపట్టాలేసుకుని హనీమూన్ కి ఊటీ యో, కోడై కేనాలో వెళ్ళాలని సినిమాల్లోలా భర్తతో వెన్నెల షికార్లు చేయాలని, పచ్చని చెట్ల కింద , చల్లగాలి ఆస్వాదిస్తూ అతని ఒడిలో పడుకుని కబుర్లు చెప్పాలని ఇలాంటి చాలా కోరికలు అరుణకి వున్నా, వాటిలో ఏదీ కూడా తీరలేదు.
    డిగ్రీ పూర్తీ కాగానే సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి, రిజల్టు కోసం ఎదురుదూస్తూ ఇంట్లో కూర్చున్న అరుణ కి అనుకోకుండా ప్రసాద్ సంబంధం కుదిరింది. అరుణ తండ్రికి ఎరువుల వ్యాపారం వుంది విజయవాడ లో. ఆయన కొడుకు , ప్రసాద్ తో పాటు చదువుకుంటున్నాడు హైదరాబాదు లో. సెలవులకి, ఇద్దరూ కలిసి విజయవాడ వెళ్ళినపుడు అతని చెల్లెలు అరుణతో పరిచయం కలిగింది . అరుణ కున్న పెద్ద జడ చూసి కళ్ళు చెదరిన ప్రసాద్ ఆమె మీద మనసు పారేసుకున్నాడు. ఈ లోపల అరుణ తండ్రి కూడా ప్రసాద్ ని చూడగానే ముచ్చటపడి అతని గురించిన వివరాలు సేకరించి, భాస్కరం దంపతులను కలవడం, సంబంధం నిర్ణయించడం జరిగిపోయింది. తను కోరుకున్న అమ్మాయే కాబట్టి ప్రసాద్ కూడా వెంటనే పెళ్ళికి ఒప్పుకున్నాడు.
    సరిగ్గా నెలరోజుల్లో ముహూర్తం నిశ్చయించారు. కాబోయే భర్తకి హైదరాబాద్ లో ఉద్యోగం అని తెలియగానే అరుణ మురిసిపోయింది. ఎంచక్కా హైదరాబాద్ లో గోల్కొండ కోట, సాలార్ జంగ్ మ్యూజియం, జూపార్కు, లుంబినీ పార్కు ట్యాంక్ బండ్ వగైరా ప్రదేశాల్లో భర్తతో కలిసి రోజూ సాయంత్రాలు షికార్లు చేస్తూ , సినిమాల్లో హీరో, హీరోయిన్ల లాగా బతకచ్చు అనుకుంది. ఏ ఊటీయో, కొడైకెనాల్ లో హనీమూన్ కి వెళ్ళచ్చు అనుకుంది. అయితే ఆమె కోరికల్లో ఒకటి కూడా తీరలేదు ఈరోజు కూడా.
    పెళ్ళికి ముందు రెండు రోజులు , అయ్యాక నాలుగు రోజులు మాత్రం ప్రసాద్ సెలవు పెట్టాడు. పెళ్ళి అయిన తరువాత అత్తగారింట్లో ఆ పల్లెటూళ్ళో , అంతమంది బంధువుల మధ్య భర్తతో రాత్రిపూట తప్ప ఏకాంతంగా గడిపే అవకాశమే దొరకలేదు అరుణకి. ప్రసాద్ నాలుగు రోజులుండి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అరుణ ని అప్పుడే కాపురానికి పంపమని చెప్పి అత్తగారు మరో పది హేనురోజులు అరుణని అక్కడే వుంచేసింది.
    అలా నెలరోజులు పాటు అత్తగారింట్లో ఉంటూ, శని, ఆదివారాలు మాత్రం ప్రసాద్ రావడం, ఏదో రొటీన్ గా గడిపెయడంతో గడిచిపోయాయి.
    ఆ తరువాత ప్రసాద్ ఇల్లు చూసి కాపురానికి తీసుకోచ్చేశాడు. అక్కడికి రాగానే పెళ్ళి కాకముందు కాలక్షేపానికి రాసిన సర్వీస్ కమిషన్ పరీక్ష లలో అరుణ కి సెలక్షన్ వచ్చి సెక్రటేరియట్ లో క్లర్కు గా పోస్టింగ్ వచ్చింది. అరుణకి ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోయినా, ప్రసాద్ ఊరుకోలేదు. "ఇంతమంచి ఉద్యోగం, అదికూడా గవర్నమెంటు ఉద్యోగం... యెంత అదృష్టమో తెలుసా! ఉద్యోగాలు లేక జనాలు గిలగిల తన్నుకుంటున్నారు. నువ్వేంటి గుమ్మం దగ్గరికి వచ్చిన అదృష్టం కాలదన్నుకుంటానంటావు మాట్లాడకుండా జాయిన్ ఆవు" అంటూ వెంట బెట్టుకుని తీసుకెళ్ళి జాయినింగ్ రిపోర్టు ఇప్పించాడు.
    వంట చేసుకోవడం, తినడం, ఆఫీసు కి వెళ్ళడం, అలసిపోయి ఇంటికి రావడం రిటీన్ కాపురం.... ఐదు నెలలు కాగానే వేవిళ్ళు ప్రారంభం కావడం, మళ్ళీ పదిరోజులు పుట్టింట్లో వుండడం, ఇలా సాగిపోయింది. శని, ఆదివారాలు వస్తే ప్రసాద్ తప్పనిసరిగా విజయవాడ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళాల్సిందే.
    జీవితంలో సారం లేనట్లు యాంత్రికంగా గడిచిపోయాయి ఐదేళ్ళు. ఐదేళ్ళలో పద్దెనిమిది నెలలు చూలింత, ఆరు నెలలు బాలింతగా గడిచిపోవడం, మిగిలిన కాలం తల్లిగా, ఉద్యోగినిగా, ఎక్స్ ట్రా బాధ్యతలు మీద పడడంతో కాపురానికి కొత్త, పాత లేకుండా చాలా యాంత్రికమై పోయింది. చార్మినార్, గోల్కొండ, గండిపేట, మ్యూజియం, కొడైకెనాల్ ఊటీ ఇవన్నీ ఎలా వున్నా నర్సింగ్ హోమ్ లు, విజయవాడ ఇమ్లిబస్  బస్ స్టేషన్, సెక్రటేరియట్ మధ్య మధ్య నాలుగైదు సినిమాలు మాత్రం భర్తతో కలిసి వెళ్ళింది. అరుణకి ఒక విషయం రూడీ గా తెలిసింది. ఇంక పిల్లలు ఎదిగి వాళ్ళు సెటిల్ అయితే తప్ప తన కోరిక తీరే అవకాశం లేదని.
    అత్తగారు అదోరకం మనిషి. ఆప్యాయంగా వుంటున్నట్టు వుంటుంది. కానీ అప్యాయతలో నిజాయితీ వుండదు. ఏదో పరాయిదానిలా వుంటుంది. 'అమ్మాయ్ మీ మామగారికి కొంచెం కాఫీ కావాలిట... ఇవ్వనా? మీ మామగారికి కూరల్లో కొంచెం ఉప్పు, కారం తగ్గించమ్మా.... నాకెలా వున్నా ఫర్వాలేదనుకో ....అరుణా! నీ కొడుకు మామగారి కళ్ళద్దాలు విరగ్గోట్టాడమ్మా ...ఇంత అల్లరేంటి? కొంచెం అదుపులో పెట్టుకోవచ్చుగా... మొక్కగానే వంచాలమ్మా పిల్లల్ని, అనక ఎందుకూ పనికి రాకుండా పోతారు. ఇలా ఎవరో పరాయి వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అంటీ ముట్టకుండా వుంటుంది . వాళ్ళ గదిలోంచి త్వరగా బయటికి రాదు. అప్పుడప్పుడు అరుణ కి విసుగొస్తుంది. ఏమిటీవిడ? ఈ వయసులో.... శోభనం పెళ్ళి కూతురిలా గదిలోంచి రాదు. చిటికీ మాటికీ పిలవాలంటే తనకి చిరాగ్గా వుంటుంది అనుకునేది.
    ప్రసాద్ మాత్రం అమ్మకి చెప్పచ్చుగా... అమ్మతో వంట చేయించవచ్చుగా .... అమ్మని అడగచ్చుగా అంటూ తనకి సలహాలిస్తుంటాడు. ఎలా చెప్తుంది తను. ఆవిడలా అంటి ముట్టనట్టు వుంటుంటే... అవిడంతట ఆవిడగా నువ్వు ఆఫీసు కి వెళ్ళాలిగామ్మా.... వంట నేను చేస్తాలే అంటే వంటగది ఆనందంగా ఆవిడ చేతిలో పెట్టగలదు తను . సాయంత్రం తనింటికి వెళ్ళేటప్పటికి ఏ పకోడీలో చేసి, కాఫీ కాచి వాళ్ళింత తిని, తనకూ, ప్రసాద్ కి పెడితే ఎంత హాయిగా వుంటుంది.... అని ఎన్నోసార్లు అనిపిస్తుంటుంది. కానీ, అరుణ గుమ్మం లో అడుగు పెట్టగానే "వచ్చావా? ఐదు ఎప్పుడవుతుందా అని చూస్తున్నాను మీ మావగారు . కాస్త కాఫీ కాచివ్వమ్మా అంటుంది."
    ఓరోజు చిరాకు పుట్టి అన్నది అరుణ "అదేంటత్తయ్య ...కాఫీ తాగేసేయక పోయారా... నాకోసం ఎందుకు ఎదురు చూడడం...."
    "ఎమోమ్మా....డికాషన్ వుందో, లేదో చూడలేదు..."
    అరుణకి ఒళ్ళు మండింది. డికాషన్ వుందో లేదో చూసుకుని లేకపోతె వేసుకోవచ్చుగా... ఏమిటీవిడ? అనుకుని, "మీరెందుకు మొహమాటపడతారు? మూడింటికి మీక్కావాల్సిన కాఫీయో, టీయో తాగేయండి...." అన్నది నిక్కచ్చిగా , ఆయన కాఫీ కోసం తను ఐదింటికల్లా ఇంటికి రావాలంటే కుదరద్దూ! అనుకుంటూ.
    అప్పటి నుంచీ వాళ్ళిద్దరూ తాగేసి కూర్చుంటున్నారు. ఇంటికి వెళ్ళి డికాషన్ చూస్తె వుండదు. ఉన్న డికాషన్ వాళ్ళు కలుపుకుని తాగి ఊరుకుంటారు. మళ్ళీ వేయచ్చుగా . ఆ విషయం మాత్రం అరుణ చెప్పలేకపోయింది. చెప్పాలనిపించలేదు. అవిదకామాత్రం తెలియదా? అనుకుని ఊరుకుంది.
    అరుణ నిట్టూర్చింది. ఛీ ఏం జీవితం? ఇలాంటి బాధలేవీ లేని ప్రసాద్ మాత్రం పూలరంగడి లా హాయిగా వుంటాడు. అరుణ ఏదన్నా చెప్పబోతే, జీవితం అంటే ఇలాంటివి తప్పవు అడ్జస్టు అవ్వాలి అంటాడు. ఎంతకాలం ఈ అడ్జస్టు మెంటు మరోసారి అలా అనుకుని పనిలో పడింది అరుణ.
    "అరుణా! ఎల్.టి.సి అప్లయి చేయవా?" అడిగింది నీలిమ.
    "ఎల్.టి.సి.నా?" అరుణ కళ్ళు మెరిశాయి. అవును అప్లయి చేయవచ్చుగా... నాలుగు రోజులు పిల్లల్ని అత్తగారి దగ్గర వదిలేసి ఎటన్నా వెళ్ళి రావచ్చు అనిపించింది. ఈ ఆలోచన కొంత హుషారు కలిగించింది ఆమెలో. ఆరోజు పనంతా పూర్తీ చేసుకుని బెడ్ రూమ్ లోకి వచ్చి, ప్రసాద్ తో తన మనసులో మాట చెప్పింది.
    "నేను ఈ సంవత్సరం ఎల్.టి.సి. అప్లయి చేస్తాను. ఎక్కడి కన్నా వెళ్దామా?"అడిగింది.
    "ఎల్.టి.సి . నా? ఎక్కడికి వెడదాం?" అడిగాడు.
    "పిల్లలతో కష్టం అరుణా.... నాకు చిరాకు.... వాళ్ళ అల్లరి, ఉచ్చలు, గోల.... ఎంజాయ్చేయలేం " అన్నాడు.
    "పిల్లల్ని మీ అమ్మగారి దగ్గర వదిలేసి వెళ్ళచ్చుగా...." గోముగా అన్నది.
    "నిజమే సుమా ...నాకీ ఆలోచన రాలేదు . ఒకే వెడదాం...." అన్నాడు.
    అరుణ పొంగిపోయింది. హమ్మయ్య అంత త్వరగా ఒప్పుకుంటాడనుకోలేదు. ఏ కళనున్నాడో.... లేకపోతె లీవు లేదు, ఆడిటింగ్ అవుతుందనో, చార్జీలు ఆఫీసు వాళ్లిస్తే మిగతా ఖర్చులకి డబ్బేది అనో అంటాడనుకుంది. ఆరాత్రి మొదటిసారిగా ఆనందంగా గడిపాననిపించింది ఆమెకి.
    తెల్లారి లేస్తూనే అన్నది... "మీ అమ్మగారికి మీరు చెప్పండి."
    "ఎందుకు నువ్వే చెప్పు....భయం దేనికి?"
    "భయం కాదు.... ఊరికినే మీరు చెప్పండి.. నేను చెబితే ఏమన్నా అనుకుంటారు.
    "సరేలే చెప్తాను. "నిశ్చింతగా ఊపిరి పీల్చుకుని ఉల్లాసంగా పని చేసుకుంది. రోజుకన్నా త్వరగా, సునాయాసంగా పని అయిందనిపించింది.
    ప్రసాద్ స్నానం పూర్తీ చేసి, తనకీ, తల్లిదండ్రులకీ ఉప్మా ప్లేట్లు తీసుకుని వాళ్ళ గదిలోకి వెళ్ళాడు. గదిలోంచి వినిపించే సంభాషణ కోసం అరుణ చెవులు రిక్కించుకుని వినసాగింది.
    "అమ్మా.... మీకు పిల్లలు బాగా మాలిమి అయ్యారా?" అడిగాడు ప్రసాద్.
    "వాళ్ళ మొహం వాళ్ళకి మాతో గడిపే తీరికేదిరా? స్కూలు, ట్యూషన్, హోం వర్క్ అంటూ మీ ఇద్దరి కన్నా బిజీగా వుంటారు." అన్నది లలితాంబ.
    "తప్పదు కదా. ఈ రోజుల్లో ఇలా కష్టపడితే గానీ, పెద్దయ్యాక సుఖపదలేరు. కాలం అలా అయింది. అంతా పోటీ యుగం, అన్నిట్లో పోటీయే."
    "ఏం పోటీనో, సరదాగా ఎప్పుడూ అడుకున్నట్టు కనిపించలేదు నాకు" అన్నాడు భాస్క్జరం.
    ప్రసాద్ కాస్సేపు ఏం మాట్లాడలేదు. కొన్ని క్షణాల తరువాత అన్నాడు. "నేను అరుణా ఊరు వెళ్ళాలనుకుంటున్నాం...పిల్లల్ని మీ దగ్గర వదిలేసి..."
    "ఏం ఊరు?" ఆసక్తిగా అడిగాడు భాస్కరం.
    "వై....కాదు.. తిరుపతి' అన్నాడు వైజాగ్ అంటే ఇప్పుడెందుకక్కడికి ? ఎవరున్నారు అని అడుగుతారానిపించింది. సరదాగా తిరగడానికి అంటే దానికోసం అక్కడికి ఎందుకు? అంటారని, చటుక్కున తిరుపతి అన్నాడు.
    "తిరుపతా? అలా అయితే అందరం కలిసే వెళ్ళొచ్చుగా. ఏడుకొండల వాడి దగ్గరకు పిల్లల్ని తీసుకెళ్లకుండా ఎందుకు? పైగా మీ నాన్నగారు కూడా చాలా కాలమైంది తిరుపతి వెళ్ళి ఓసారి వెళ్ళి రావాలి అని నిన్ననే అన్నారు కూడాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS