Previous Page Next Page 
ఒక కోయిల గుండె చప్పుడు  పేజి 11

            పొద్దువాలిపోయింది.

    "అరుణా!త్వరగా రావాలి.."బూట్లు లేసు ముడి వేసుకుంటూ ఓ పొలికేక పెట్టాడు  ప్రసాద్.
    వంటగదిలో పెనంమీద దోసెల పిండి వేస్తున్న అరుణ చుయ్ మన్న శబ్దం పుర్తయిందాకా ఆగి, "వస్తున్నానండి..... టిఫిను చేయాలి కదా!నాకేం పది చేతులున్నాయా?" అన్నది కొంచెం విసుగు కలగలిసిన స్వరంతో...
    బూట్లు తోడుక్కోవడం పూర్తీ చేసి, వంటగది గుమ్మం దగ్గరకివచ్చి నిలబడి, "ఇప్పుడు తీరిగ్గా దోసేలేస్తూ కూర్చుంటే ఎలా? నిన్నుడ్రాప్ చేసి నేను వెళ్ళాలంటే నాకు టైం అయిపోతుంది...." అన్నాడు.
    అరుణ చీర కుచ్చిళ్ళుసరిజేసుకుంటూ "మీకేనా టైం అయేది... నాకు మాత్రం అవదా?ఐదు గంటలకి లేచి చేస్తున్నా పని తెమలదు.... మీకేం దర్జాగా ఏడింటికి లేచి, కాఫీలు, టిఫిన్లు, క్యారియర్లు అందిస్తుంటే టింగురంగా అంటూ తెమిలి నా ప్రాణం తీస్తారు అయిందా? అయిందా?అంటూ.... పిల్లల్నిపంపించి, మామయ్యగారికి అత్తయ్య గారికి టిఫిను చేసి పెట్టి నేను తినాలా? వద్దా ?"
    "అయిందా నీ ఉపన్యాసం.... ఒక్కదానివీ చేసుకోకపోతే మా అమ్మ హెల్ప్ తీసుకోవచ్చుగా..."
    అరుణ చురుక్కున అతడి మొహం లోకి చూసి మాట్లాడకుండా కాలిన దోశె తీసి ప్లేటులో వేసి మరికొంత పిండిపెనం మీద వేసి, గరిటతో పల్చగా వత్తసాగింది.    
    ఓ పక్క వంట చేస్తూనే మిగతాపని చేస్తోంది. పిల్లల్ని స్కూలు అటో ఎక్కించి, గబగబా మొహం కడుక్కుని తయారైంది.మరోపక్క అత్తగారికీ, మామగారికీ దోసె లేసిచ్చింది. పనిమనిషి వచ్చిందంటే బట్టలు నానపెట్టలేదని సణుగుతుంది... ఆ పని పూర్తీ చేసి , అయ్యగారి క్యారేజీ రెడీ చేసింది. దేవుడు ఇచ్చింది రెండు చేతులే.... ఇంకో రెండు చేతులిస్తే  బాగుండేది! అదేం దేవుడో! ఆడవాళ్ళ కి మగవాళ్ళ కన్నా బాధ్యతలు, సమస్యలు, కష్టాలు శ్రమఎక్కువ పెట్టి చేతులు మాత్రం మగవాళ్ళతో సమానంగా రెండే ఇచ్చాడు. అరుణ ప్లేటు లో పెట్టుకున్న దోశ తినబోతూ ఆగిపోయింది.
    ప్రసాద్ స్వరం వినిపించింది... "అమ్మా!" అంటూ...
    కోడలు పెట్టిన టిఫిన్ తిని అప్పుడే చేయి కడుక్కుంటున్న లలితాంబ "ఏంట్రా అంటూ గదిలోంచి బయటికి వచ్చింది.
    "ఏం లేదు.... టిఫిను తిన్నావా? అని అడుగుదామని...." మొహమాటంగా అన్నాడు.
    "ఇప్పుడే తిన్నానురా.... నువ్వింకా వెళ్ళలేదెం" అడిగిందావిడ.
    "అదే.... అరుణ ని కూడా డ్రాప్ చేయాలిట.... తన చేతిలో పని తెమల్లేదు.... నువ్వు కొంచెం సాయం చేస్తే తను బయలుదేరుతుందని..."
    "చేస్తాను.... దానికేం.... ఏం పనిచేయాలో తెలియక నేనేం చేయడం లేదు.."
    అరుణ ప్రసాద్ మీద కోపం గొంతు దాకా వచ్చింది. ఎవరు చెప్పమన్నారావిడకి. ఆవిడేమానుకుంటుంది.... మొగుడితో చెప్పకపోతే తనే చెప్పచ్చుగా అని నిష్టూరాలేయదూ ఏం మనిషి? తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... అవిడైప్పుడు ఏం అంటుందో.....'
    ఆమె అలానుకుంటూ వుండగానే లలితాంబ వంటగది గుమ్మం దగ్గరకు  వచ్చి "అదేంటమ్మా ఏదన్నా సాయం కావాలంటే చెప్పచ్చుగా.... నీ ఇంట్లో ఎదేక్కడుందో తెలియదు అందుకే ఊరికే కూర్చున్నాను... పని కావాలంటే చెబితే చేస్తాను...." అన్నది.
    అరుణ మాట్లాడకుండా స్టవ్ ఆఫ్ చేసి, ప్లేటు లో వున్న దోసెలు రెండు చిన్న బాక్స్ లో పెట్టుకుంది.
    "అదేంటి? నీకా రెండు దోసెలు సరిపోతాయా? అన్నం తీసు కెళ్ళవాక్యారేజీ లో అన్నదావిడ.
    "అన్నం క్యారేజీ సర్దుకున్నానండి.... ఇప్పుడు టిఫిను తినే టైం లేదు. అయన వెళ్ళిపోతే నాకు బస్సు కూడా దొరకదిప్పుడు.... రెండు దోసెలు ఆఫీసు కెళ్ళి తింటాను" అంటూ హడావుడిగా బ్యాగు తీసుకుని భుజాన తగిలించుకుంటూ "మీకూ, మామయ్యగారికి డైనింగ్ టేబిల్ మీద అన్నీ సర్దేశాను. బియ్యం కడిగి కుక్కర్ లో వుంచాను. మీరు అన్నం తినబోయే ముందు స్టవ్ వెలిగించుకోండి.... వేడిగా తినచ్చు కదా! పనిమనిషికి చెప్పండి బట్టలు సరిగ్గా ఉతకడం లేదు... సరిగ్గా ఉతకమన్నానని, లేకపోతె పని మానేయమనండి. వేరే మనిషిని చూసుకుంటామని.... నేను వెళ్తున్నాను.... ఏవండీ! రెడీయా?" గబగబా మాట్లాడేస్తూ గుమ్మం దాటి గేటు దగ్గరకి వచ్చింది.
    అప్పటికే స్కూటర్ స్టార్ట్ చేసి ఎదురు చూస్తున్నాడు ప్రసాద్... అరుణ అతని వెనకాల సీటు మ,మీద కూర్చుని "పదండి" అన్నది.స్కూటరు బర్ మని స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు.
    పది నిముషాల్లో సేక్రటేరియాల్ ముందు స్కూటర్ ఆపి, అరుణ దిగగానే ఎ.జి. ఆఫీసు వైపు పోనిచ్చాడు.
    ఆఫీసులో అడుగుపెట్టి అటెండెన్స్ రిజిస్టరు లో సంతకం చేసి, సీటులో కూర్చున్న అరుణ ఒక్కసారి రిలాక్స్ డుగా ఊపిరి పీల్చుకుంది. ఉదయం ఆరుగంటలకి తగిన కాఫీ ఎప్పుడో అరిగిపోయింది. ఆ తరువాత మంచినీళ్ళు తాగడాని క్కూడా సమయం దొరకలేదు.
    భగవంతుడు ఆడదాన్ని ముందు పుట్టించి, దాని ఆధారంగా మెషిన్ తయారు చేసుకోండని మేధస్సు ని సృష్టించి వుంటాడు. మెషీన్ కీ, ఆడదానికీ పెద్ద తేడా లేదు. కాకపోతే ఆడదానికి మనసుంది కాబట్టి భగవంతుడా ఏమిటీ జీవితం! అని మధనపడుతూ ఉంటుంది.... మెషీన్ కలాంటి భాధలెం లేవు కదా!
    అదేమిటో అత్తగారు, తనలా గిరగిరా తిరుగుతూ , పని చేసుకుంటుంటే చూస్తూ కూర్చుంటుంది.పైగా నాకు నీ ఇల్లు కొత్త కదమ్మా అంటుంది. ఇంకా ఎంతకాలం కొత్త... ఏడాదవుతోంది తమ దగ్గరకి అత్తగారు, మావగారు వచ్చి....!పని చెప్పాలిట.... ఎలా చెప్తుంది తను.... పెద్దావిడకిపని.... అవిడంతట ఆవిడే కలగజేసుకుని కాస్త సాయం చేయచ్చుగా... కనీసం అనన్య కి జడ వేసి, దానిని తయారు చేసి అనన్యకీ, అదిత్యకీ క్యారేజీ సర్ది స్కూలు కి పంపించడం చేయలేదా . ఆవిడకి పనిచేయడం ఇష్టం లేదు... ఇది కోడలిల్లు.... నా ఇల్లుకాదు....అనే పరభావన వుంది ఆవిడకి. కొడుకు తనవాడు.... కోడలు పరాయిది. కొడుకు జేబులోంచి పర్సు తీసి, తనక్కావలసిన దబ్బులుమాత్రం తీసుకోవడానికి ఆవిడకి మొహమాటం లేదు... కోడలుకి పనిలో కాస్త సాయం చేయడానికి కొత్త,మొహమాటం వగైరా.... ఏం మనుషులో! నిట్టూర్చింది అరుణ...
    ఆకలితో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. స్టాఫ్ క్యాంటీన్ కి వెళ్ళారు. బాక్సు తీసుకుని నెమ్మదిగా దోసెలు తినడం ప్రారంభించింది.
    అప్పుడే వచ్చిన నీలిమ పలకరింపుగా నవ్వి.... "ఏంటి ఇవాళ ఇంటి దగ్గర టిఫిను తినడానికి టైం దొరకలేదా" అన్నది సీటులో సెటిల్ అవుతూ.
    అరుణ నవ్వి "లేదోయ్.... మా అయన పనిపూర్తవగానే నా సంగతి ఆలోచించరు.... త్వరగా తెములు అంటూ ఊదర బెట్టేస్తారు..."
    'ఆయనలందరూ అంతే ....అందుకే ఈ మధ్య నేను ముందు తినేసి తరువాత ఆయనకి పెడుతున్నాను..."
    "పతివ్రతవి కావన్నమాట...."నవ్వింది అరుణ.
    నీలిమ కూడా నవ్వి "పెళ్ళయిన కొత్తల్లో పాపం పిచ్చిదానిలాగా నిద్రలేవగానే మంగళ సూత్రాలు కళ్ళకద్దుకునేదాన్ని, ఓసారి ఆయనే అది చూసి పగలబడి నవ్వారు. అప్పటి నుంచీ మానేశాను. ఆ తరువాతవేరు కాపురం పెట్టించాక అందుకు పశ్చాత్తాపపడ్డారనుకో.
    నీలిమతో పాటు అరుణ కూడా నవ్వి , బాక్స్ మూతపెట్టి , బాటిల్ లో మంచినీళ్ళు తాగింది.
    "పద మనంకూడా టీ తాగి వద్దాం" అన్నది నీలిమతో. ఇద్దరూ లేచి క్యాంటిన్ వైపు నడిచారు.
    అరుణ భర్త ప్రసాద్ తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు. అతని తరువాత ఓ ఆడపిల్ల నివేదిత. పెళ్ళి అయింది. భర్తతో పాటు అమెరికాలో వుంటోంది. ప్రసాద్, అరుణకు ఇద్దరు పిల్లలు. అనన్య, ఆదిత్య . అనన్య ఫస్ట్ క్లాస్ చదువుతోంది. ఆదిత్య సెకండ్ క్లాస్ చదువుతున్నాడు.
    ప్రసాద్ తల్లితండ్రులు లలితాంబ, భాస్కరం ఏడాది క్రితం దాకా విజయవాడ దగ్గర చిన్నపల్లెటూరైన సొంత ఊళ్ళో నే వుండేవాళ్ళు. భాస్కరం మొదటి నుంచీ వ్యవసాయం మీదే ఆధారపడ్డాడు. అంతో, ఇంతో కలిగిన కుటుంబమే. కొడుకునీ, కూతురిని హైదరాబాద్ లో హాస్టల్స్ లో వుంచి చదివించాడు. ప్రసాద్ ఎం.కాం పాసై ఏ.జి ఆఫీసులో అకౌంటెంట్ గా ఉద్యోగం సంపాదించుకున్నాడు. నివేదిత బి.ఎస్సీ పాసైన కొత్తల్లోనే అమెరికాలో డాక్టర్ అయినా ఓ కుర్రాడు గురించి తెలిసిన వాళ్లద్వారా వివరాలు తెలుసుకుని సంబంధం కలుపుకున్నాడు  భాస్కరం . ప్రసాద్ స్నేహితుడి చెల్లెలు అరుణ ని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు. పిల్లలిద్దరూ సెటిల్ అవడంతో  నిశ్చింతగా వ్యవసాయం చూసుకుంటూ సొంత ఊళ్ళోనే వుండిపోదాం అనుకున్నారు భాస్కరం దంపతులు.అయితే తండ్రి బాధ్యతల్లో పాలు పంచుకోడానికి ప్రసాద్ అస్తమానం విజయవాడ వెళ్ళాల్సి రావడం, వరదలొచ్చి పొలం పోయి, కొంత నష్టం రావడంతో ఏడాది క్రితం వున్నకొద్దీ పాటి పొలం అమ్మేసి తల్లి దండ్రులను హైదరాబాద్ తీసుకొచ్చాడు.
    అసలే పెళ్ళైన ఏడాదికే ఆదిత్య పుట్టడం, రెండో ఏడు అనన్య పుట్టడంతో రొటీన్ కాపురం తప్ప వైవాహిక జీవితంలోని మాధుర్యం అస్వాదించలేకపోయానని బాధపడుతున్న అరుణ కి వీళ్ళ రాక కొంచెం అసంతృప్తి ని కలిగించింది. దానికి తోడూ ఉద్యోగం పిల్లల బాధ్యత , ఇప్పుడు అత్తగారి, మామగారి సేవలు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS