Previous Page Next Page 
ఉన్నతశిఖరాలు పేజి 9

   
    ప్రేమ రెండవసారి కాఫీ త్రాగుతుంటే గీత మందలింపుగా చూచి ఆమెకు దగ్గరగా జరిగి మెల్లగా అంది" అంతా చూచాన్లే రెండవడోసు."
    ప్రేమ "పోవే" అని కొంగుతో ముఖం తుడుచుకుంది "నిరంజన్ అగుపించదేం" అందామె ప్రేమనుచూచి ప్రేమ విన్పించుకున్నట్లు లేదు. "అతడి విషయం మాట్లాడితే చెవులు రిక్కించుకుని వింటావు. ఇతడి విషయం అడిగితే చెవుడంటావు. నీతో ఏంజెయ్యాలి?" గీత గొణిగింది. ప్రేమ నవ్వకుండా వుండలేకపోయింది. నిజంగానే చివరికి నిరంజన్ కంఠస్వరంకూడా విన్పించలేదు. గీతమాత్రం ఆతృతతో పరికించి చూస్తోంది. ఒక స్టేషన్ లో ఫ్లాట్ ఫారమ్ మీద కనిపించాడు. ఆమె హృదయం ఉప్పొంగిపోయింది. "ఏమండీ కాస్త మేగజైన్లు తెస్తారు?" అంటూ డబ్బులు తీసి అందించింది.    
    నిరంజన్ డబ్బందుకుని రెండు తెచ్చాడు. ముఫ్ఫై ఐదుపైసలు వెనక్కిస్తూ మందహాసం చేస్తూ అన్నాడు" అదిమీది, ఇది నాది, మీరు చదివాక ఓ మాటు రెండూ నాకివ్వండి" తనపని అయిపోయినట్టు దాటి వెళ్ళి పోయాడు.
    రైలు కదిలింది. గీత హృదయంలో వేయిరైళ్ళు కదిలిపోతున్నాయి. బెంగుళూరు చేరారు. బాగా అలసిపోయారు. దూర ప్రయాణాలెరుగని వాళ్ళతిక్క కుదిరిందనే చెప్పుకోవాలి,
    అందరూ బిలబిల మంటూ దిగారు. సామాన్లు దింపి లెక్కచూచుకున్నారు టాక్సీలు తీసికొని బయలుదేరారు.    
    అప్పటినుంచి సుధాకర్ గుంభనంగా, పటీపట్టనట్లు ప్రేమ విషయంలో ప్రవర్తిస్తుంటే ఆమెకు తృప్తిగా వుంది. ఆ చల్లని వాతావరణంలో ఆమె అందం ఇనుమడించింది. కపోలాలు కెంపులే అయ్యాయి. నాశికాగ్రభాగం అరుణవర్ణం దాల్చింది. విశాల నయనాల్లో వింతతళుకు-ముఖంలో నూత్న తేజస్సు ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి.
    రెండురోజులు బెంగుళూరులో గడిపారు. బృందావన్ గార్డెన్స్ చూచారు. అక్కడ పూవులు. ఆకులు సేకరించకూడదు. అందుకని నేత్ర సర్వంతో తృప్తిజెందారు ఫౌంటెన్స్ దగ్గర. నీళ్ళకుండీల దగ్గర కూచుని కబుర్లు చెప్పుకున్నారు. ఆ చన్నీటి సన్నటి తుంపర గిలిగింతలు పెడ్తూ మేను మైమరపింపజేసింది. ప్రేమ హుషారుగా వుంది. ప్రతి సుందర దృశ్యంలో, ప్రతి పూవులో ఆమెకు సుధాకర్ కానవస్తున్నాడు. తనకు దూరంగా వుండే కొద్దీ ప్రేమకు సుధాకర్ పై జాలి, అనురాగం అతిశయిస్తున్నాయి. కానీ తను మాత్రం ఏం చెయ్యగలదు! ఏవో తీయటి ఊహలతో తలంపులతో సంతృప్తి చెందేది ఆమె!
    మైసూరులో రెండురోజులు గడిపారు. ఆ తర్వాత నీలగిరి కొండలకు వెళ్ళారు.
    ముందుగా తీసికొన్న కాటేజ్ లో దిగారు. రక్తం గడ్డ కట్టేంత చలి, పర్వతాలు తెలిమబ్బులను కప్పుకున్నాయి. తెల్లటి పొగమంచు సుతారంగా తేలిపోతోంది. ఆకాశాన్నంటుతున్న పర్వత పంక్తులు మేఘాలతో దోబూచులాడుతున్నాయి. సూర్యోదయమై సూర్యుడు వేడిమిని పుంజుకునేవరకు ఇవతలికి రాలేకపోయారు. అక్కడా ఇక్కడా సేకరించిన పూలను ఆకులను గూర్చి రాస్తూ, రికార్డ్, డైరీ రాస్తూ కాలం గడిపేవారు. ఆ తర్వాత తెచ్చుకున్న వులెన్ దుస్తులు వేసికొని చిన్న సంచీ పట్టుకుని జట్లు జట్లుగా వెళ్ళిపోయేవాడు.
    రెండవరోజు ఆ పరిసరాల్లో తిరిగి వెనుదిరిగి వచ్చిన ప్రేమ వాళ్ళ కాటేజీ వరండాలోని వ్యక్తుల్నిచూచి నివ్వెరపోయింది. తనను వాళ్ళు చూడలేదు!
    ఆ వ్యక్తులు నుంచున్న తీరు. మాట్లాడే తీరు, వారి ముఖాల్లో ద్యోతకమౌతున్న ఆందోళనను చూచి ప్రేమ ఆశ్చర్యంతో క్షణం అచేతనురాలైంది. అంతసేపు మౌనంగా వింటూ, తను వింటున్న విషయాలను నమ్మలేను - అన్నట్లు చూస్తూన్న గీత, నిరంజన్ మాట్లాడటం ఆపిన వెంటనే రెండు చేతుల్లో చెంపలు పట్టుకుని ముకుళించిన పద్మంలా ముడుచుకుపోయి దగ్గరలో వున్న కుర్చీలో కూలబడింది:
    వాళ్ళు అతిమెల్లగా మాట్లాడుతున్నారు. ప్రేమకు ఏమీ విన్పించటం లేదు.
    గీత ఎందుకలా వుంది? నిరంజన్ ఏం చెబుతున్నాడు? వాళ్ళిద్దరు ప్రేమికులా? నిరంజన్ ఆమె ప్రేమను తృణీకరిస్తున్నాడా? తను కొన్నాళ్ళుగా చూస్తోంది. నిరంజన్ అంటే గీతకు ఓ రకమైన అభిప్రాయం వుందని. తను ఈ ప్రేమపాశంలో చిక్కుకుంది. అదేమిటో తనకు తెలుసు. కాని గీత విషయంలో తను వూహించుకోగలదు? ప్రేమ ఇరకాటంలో పడిపోయింది. వాళ్ళ సంభాషణను భంగపర్చడం యిష్టంలేక వచ్చిన పని పూర్తి చేసుకోకుండానే వెళ్ళిపోయింది కాని ఆ రాత్రి ఏకాంతంగా గీత దొరికే వరకు - అసలు విషయం కనుక్కోవాలన్న కుతూహలం పోలేదు.    
    ప్రేమ అడుగుతుంటే గీత గాభరాగా క్రింది పెదవిని పంటితో నొక్కుతూ కొన్ని క్షణాలు మౌనం దాల్చింది. ఒక్క నిట్టూర్పు విడిచి కళ్ళు మూసుకుంది. ఆమె ముఖంలో అంతకు ముందు కనబడని ప్రశాంతం కానవచ్చింది. కళ్ళు తెరచింది. ప్రేమ అర్ధవంతంగా చేయి నొక్కింది. ఉన్నట్లుండి ప్రేమ అంది "నాకు చాలా సంతోషం గీతా- మరైతే నీ ముఖంలో ఏదో తీరని వ్యధ గోచరించింది ప్రొద్దుట- ఎందుకని? ఏం చెప్పాడు నిరంజన్"
    "ఏవో వుంటాయిలే - అవన్నీ నీకెందుకు? నీకు సుధాకర్ కు ఇలాంటి పోట్లాటలు కాలేదా?" అంది బుంగమూతి పెట్టి, ప్రేమ హృదయం ఝల్లుమంది.
    
                           *    *    *

    మూడవనాడు అక్కడికి దూరంగా వున్న సెలయేటి ప్రాంతంలోకి వెళ్ళారందరూ చాలామంది జట్లు జట్లుగా విడిపోయారు చెట్టు కొకరు గుట్టకొకరుగా వెళ్ళిపోయిన వారిలో ప్రతి ఒక్క హృదయం ఏకాంతాన్ని కోరుతుందా అన్నట్లుంది. భగవంతుని విచిత్రమైన సృష్టిని అనుభవించితీరాలంటే ఏకాంతం కావాలని కోరుతున్నట్లు గుంపులు విడిపోయారు ఒకరికొకరు సమీపంలో వున్నా చెట్టుచాటుననో రాతిప్రక్క    గానో కూచుంటున్నారు. అంతా ఎవరికివారు పరధ్యానంగా కూచున్నారు.
    గీత వారి మధ్య లేదు.
    ఆమె ఎక్కడికి వెళ్ళిందో అందరు ఊహించుకుని నవ్వుకున్నారు. నీవుమాత్రం హాయిగా అలా తీర్చటానికి వెళ్ళలేదేమి? - అన్నట్లు ప్రేమను చూడసాగారు. ప్రేమ ఆ చూపులు భరించలేక వారిమధ్యనించి పారిపోయివచ్చింది, ప్లాస్టిక్ సంచి, ప్రక్కన పెట్టుకుని కూచుంది. సంచిలో తెచ్చుకున్న చాక్ లెట్స్ బైటికిలాగి ఒకముక్క తుంపుకుని నోట్లో వేసుకుంది. ఎందుకో భయం వేసింది. గీతా అని అరచింది. జవాబు లేదు. లక్ష్మీ అని పిలచింది. "ఆఁ" అన్న జవాబు ఆమెకు కొంత ధైర్యాన్ని చ్చింది. ఒకవైపు ఎక్కడో మూగగా ఆమె సుధాకర్ రాకను కోరుతోంది. మరొకవైపు ఆయనొస్తే మళ్ళీ ఏం జరుగుతుందో అని భయం కూడా వుంది. లేచి నిలుచుంది. ఒంటరిగా నిలబడి ఆలోచించేబదులు ఎక్కడికైనా వెళ్ళి ఎవర్నేనా కలుసుకొంటే బాగుండునని కొంతదూరం వెళ్ళింది.

                            
    "ప్రేమా అన్న పిలుపు. ప్రేమ, హృదయంలో అ పిలుపు ఓకే సారిగా వికాసం, విస్మయం కలిగించింది. అయినా విప్పారిన నేత్రాలతో ఆ పిలుపు వినవచ్చినవైపు పరీక్షగా చూస్తూంది. అప్పుడే విచ్చుకుంటున్న ఎర్రగులాబిమొగ్గలా పెదిమలు సుకుమారంగా విడివడినై. కనబడవలసిన వ్యక్తి కనబడలేదు. ప్రేమకు ఈ దాగుడు మూతల్లో ఏదో తియ్యదనం కనబడింది. ఈ నిరీక్షణలో మధురిమ లేదు: సిద్దించాలను కున్న కోరిక బలవత్తరమౌతున్న సమయంలో దూరంగా ఎక్కడో ఒక సహ విద్యార్ధిని నవ్వు వినవచ్చింది.    
    సుధాకర్ రాలేదు. ఇదంతా కేవలం భ్రమేనా?
    ప్రేమ తెగించి మెల్లగా అంది "ఎక్కడున్నావో - ఇవతలికి రాకూ డదూ!" సుధాకర్ పౌదలమాటునించి వచ్చాడు. రెండుచేతులు చాచి.
    "ప్రేమా-ఇటువంటి ఏకాంతం కోపం ఎన్నాళ్ళుగా ఎదురుచూచానో తెలుసా?"
    ప్రేమకు ఈ మాటలు, ఎక్కడో మాటుమణిగిన సంఘటన జ్ఞాపకాలను రేకెత్తించాయి. "తప్ప.....ఎందుకీ మాటలు" అనుకుని కనుబొమలు సన్నగ ముడిచింది. అతని హాస్యాలు అందుకోకుండా ఒక రాతిపై కూచుంది. సుధాకర్ నెమ్మదిగా వచ్చి ఆమెను తాకుతూ కూచున్నట్లు కూచున్నాడు. వారిద్దరి మద్య సందులేదు. కాసేపు అలా కూర్చుని ఇద్దరు లేచి చాల దూరం వెళ్ళారు. ప్రేమ మౌనంగానేవెళ్ళింది అతని రాకకోసం- సన్నిధి కోసం పరీక్షించిన తాను అతని సమక్షంలో ఎందుకిలా బిగుసుకుపోయి మంచుముక్కల్లా అయిపోతుంది? ఈ సమయం - ఈ ఏకాంతం. ఈ ప్రకృతిశోభ. ప్రేమికులకు పిచ్చిని రేకెత్తిస్తుంది, అనాదిగ భారత స్త్రీ రక్తంలో ఇమిడిపోయిన సౌశీల్యత, పవిత్రత తననీ విధంగా చేస్తున్నదా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS