నన్ను ఎన్ని అన్నా భరిస్తాను. కానీ వాడినంటే మాత్రం సహించలేను. అప్పుడు నే నేదైనా జవాబు చెప్తే అన్నం దగ్గర్నుంచి లేచిపోతారని తెలుసు. అయినా నేను ఊరుకోను. 'షికార్లు తిరగటానికి కాకపోయినా వాడిపొట్ట వాడు నింపుకోవటానికైనా కాళ్ళు ఉండాలి. వాడి భారం మీరేం మొయ్యటం లేదు. వాడి విషయంలో నోటికి ఎంతవస్తే అంత మాట్లాడకండి.'
'ఏం చేస్తావేం?'
'ఏమీ చెయ్యను. కానీ అలా మాట్లాడకూడదంటున్నాను.'
'ఈనాటికి నువ్వా నాకు చెప్పేది? నువ్వు అనటం. నేను వినటం. అది ఈ జన్మకి లేదు. అర్ధమైందా?'
ఒక్కోసారి నాకు అసహ్యం హద్దులు మీరి పోతుంది."
"బావ అంతమూర్భంగా మాట్లాడుతాడా?"
"నమ్మేదే మానేదీ నీ యిష్టం. తర్వాత విను. ఆయన ఇంట్లో ఉన్నంతసేపూ వాడు ఏడవ కూడదు. అల్లరి చెయ్యకూడదు. బొమ్మలూ అవీ విసురుతూ శభ్ధాలు చేస్తూ ఆడుకోకూడదు. తండ్రిమీదికి ఎగబాకకూడదు. ఏమాత్రమూ అల్లరి జరగకూడదు. వాడు నిద్రపోవాలి. లేదా నిశ్శబ్దంగా కూర్చోవాలి. అల్లరి లేకుండా ఆడుకోవాలి. ఇల్లు ప్రశాంతత ఉండాలి. అదీ క్రమ శిక్షణ. అందుకు భిన్నంగా వాడు అల్లరిచేస్తే, కేకలు పెడుతూ ఆడుకొంటే, ఆకలేసి గోల పెడితే, నిద్ర వచ్చి ఏడిస్తే-ఆ అపరాధాలన్నీ నాని! నేను ఒక్కదాన్నే కొడుకుని కన్నట్టు మహా మురిసిపోతున్నాను. వెధవ గారాబం మప్పి పాడు చేస్తున్నాను. క్రమశిక్షణ నేర్పకుండా పెంచుతున్నాను. మాటి మాటికీ ఏడవటం అలవాటు చేస్తున్నాను. మొత్తానికి ఇల్లు సంత చేస్తున్నాను. నిజమే కదూ?" నన్ను అడిగింది. వింటూంటే నాకు ఒంటినిండా చీమలు సాకు తున్నట్టే ఉంది.
"సరేలే. చెప్పు."
"ఒకసారి వాడికి అజీర్తి చేసింది. విరోచనా లవుతోంటే రెండు మూడు రోజులు ఆమందూ, ఈమందూ వాడాను. తగ్గలేదు. ఎక్కువైపోయాయి. ఇక లాభంలేదని డాక్టర్ కి చూపించ మన్నాను. ఏమన్నారో తెలుసా? 'తుమ్ము తుమ్మితే డాక్టర్ దగ్గరికి పరిగెత్తమంటావ్. వాడి కా దక్షిణ కాస్తా సమర్పించుకుంటే గానీ నీకు తృప్తి ఉండదు. పక్కింటి బామ్మగారి నడిగి ఏ అల్లం రసమో పట్టకూడదూ? నాకు ఆఫీసుకు టైమైపోయింది. అంత ఎక్కువైతే రేపు చూద్దాంలే.' నాకు ఒళ్ళు మండింది.
'రెండు రోజులనుంచీ ఆ రసాలు వాడుతూనే ఉన్నాను. ఏమీ గుణం కన్పించటం లేదు. బాబు కళ్ళు కూడా విప్పలేకపోతున్నాడు. ఇంకా ఎక్కువవ్వటం అంటే ఏం జరగాలి?'
'అబ్బబ్బ! ప్రతి విషయానికీ ఎందుకలా వాదిస్తావ్? రెండు రోజుల్నుంచీ ఉన్నవాడు ఇవ్వాళ ఏమీ అయిపోడులే. సాయంత్రం చూద్దాం.'
చూద్దాం! వాడి ప్రాణాలు గాలిలో కలిసిపోతే చూద్దాం! అది జరగదు. జరగనివ్వను. నా శాయ శక్తులా ప్రయత్నిస్తాను. వెంటనే బాబుని ఎత్తుకొని రిక్షాలో బయల్దేరాను. ఒక షాపులో నా ఉంగరం ఒకటి అతి చౌకగా అమ్మేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. బాబుకి ఇంజక్షన్ చేయించి మందువేసి పడుకోబెడితే నాకు ఎంతో ధైర్యం వచ్చింది. గర్వం కలిగింది. బాబుకి తల్లి ఉంది! నేను వీధులెక్కి తిరుగుతున్నాననీ, తనని అ గౌరవం చేస్తున్నాననీ తర్వాత చాల రాద్ధాంతం అయిందనుకో అది వేరే సంగతి. ఇప్పుడు చెప్పు. ప్రతి తండ్రీ ప్రతి బిడ్డనీ ప్రేమిస్తాడని చెప్పు."
ఎలా చెప్పను? ఆ సంగతులు వినటానికే చాల ఘోరంగా ఉన్నాయి. కన్నబిడ్డలు గుండెలకు హత్తుకోలేని తండ్రి తండ్రా? పసిపాప అల్లరిలో ఆనందం పొందలేని మనిషి మనిషా? నిశ్శబ్దం కోసం పాకులాడే మనిషి సంసారం ఎందు కేర్పర్చు కున్నట్లు? ఏడాది బిడ్డకు క్రమశిక్షణ నేర్పే పెద్ద మనిషి ఇరవై నాలు గ్గంటలూ ఇల్లు విడిచి ఎందుకు తిరుగుతున్నట్టు? డబ్బుకు కక్కుర్తి పడి కన్నబిడ్డను కూడా నిర్లక్ష్యం చెయ్యగలిగే వ్యక్తి వందలకు వందలు ఎక్కడ తగలేస్తున్నట్టు? అర్ధంలేని ఈ విషయాలకు నేనేమని అర్ధాలు కల్పించను? తను చిన్నతనంలోనే తల్లి తండ్రుల్ని కోల్పోయిన భావనైనా కొడుకుని ప్రేమించటానికి కారణం కావచ్చునే! జీవితంలో ఆ మనిషి మరెవర్ని ప్రేమిస్తాడు?
"ఏవిటన్నయ్యా మాట్లాడవ్?"
"మాట్లాడటాని కేముంది భానూ! తల్లిని. నువ్వు చూసుకొంటావు గదా అని అతను పట్టించుకోకుండా తిరుగుతాడు కానీ కన్నబిడ్డని ద్వేషిస్తారా చెప్పు?"
భానుకు కోపం వచ్చింది. "పెళ్ళి చేసుకొని కుటుంబాన్ని ఏర్పరచుకోని బాధ్యతలు నిర్వర్తించు కోవలసిన సమయానికి కూడా ఆ మనిషి మారవలసిన అవసరమే లేదంటావ్. అంతేనా?" క్షణం ఆగింది. "అన్నయ్యా! శారదే నా స్థితిలో ఉంటే నువ్వింత శాంతంగా మాట్లాడవు."
"భానూ!"
"అవును. ఇన్నాళ్ళూ నా కష్టసుఖాలు విని అర్ధం చేసుకోగలిగే అన్నయ్య ఒకడైనా ఉన్నాడనీ, వాడికి చెప్పుకొని కనీసం సానుభూతైనా పొందుతాననీ పుట్టె డాశతో ఉన్నాను. కనీసం నన్ను అర్ధం చేసుకున్నానని చెప్పినా నాకు తృప్తి కలిగేది. ఇక నాకు ఎవ్వరూ లేరు. ఎవ్వరూ లేరు." భాను మోకాళ్ళలో తలపెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూంటే నాకు మతిపోయింది. నా కళ్ళు కూడా నిండిపోయాయి. భాను చెయ్యి గట్టిగా పట్టుకొన్నాను.
"భానూ! చెల్లీ! నన్నెంత అపార్ధం చేసుకున్నావు భానూ!"
భాను తల ఎత్తి చూసింది.
"నువ్వు ఏదో అశాంతితో బాధ పడుతున్నావని నేను ఎప్పుడో గ్రహించాను. కాని నిన్ను అడగ టానికి ధైర్యం చాలలేదు. ఇవ్వాళ నువ్వు చెప్పిందంతా వింటే నా మనసు ఎంత వికలమై పోయిందో నీకు తెలిసిందా? నీ కంటివెంట నీరుకారితే అది నన్నెంత రంపపు కోత కోస్తుందో నువ్వు గ్రహించగలవా? భానూ! నిన్ను నేను అర్ధం చేసుకోలే దనుకొంటున్నావా? కాని నా భావాలన్నీ పైకి చెప్పి నిన్ను మరీ నిరాశ పాలు చేస్తే ఫలితం ఏమిటి? సున్నితమైన నీ మనసు చెదిరిపోతే, నీ భర్త మీద నువ్వు అయిష్టం పెంచు కుంటే-అర్ధం పగిలితే అతుక్కొంటుందా? నీ మనసు పాడుచెయ్యటానికే నన్ను సాయం చెయ్యమంటావా? ఇన్నాళ్ళు స్నేహాన్ని ఎంత తేలిగ్గా తోసివేశావు భానూ!"
"అన్నయ్యా!"భాను తడికళ్ళతో తదేకంగా చూస్తూ ఉండిపోయింది. "భానూ! శారద నా స్వంత చెల్లే! కాని ఏ విధంగానూ శారదకు ఈ అన్నయ్య సహాయం అవసరంలేదు. కావలసినన్ని చీరలూ, నగలూ, వస్తువులూ అమ్మా నాన్నా అందిస్తూ ఉంటారు. శారద మనసు నీ మనసులా సున్నితమైంది కాదు. అటువంటివాళ్ళకు మానసికమైన బాధలే ఉండవు. అన్నయ్యగా నేను ఏదో విధంగా సహాయపడగలిగితే అది నీకే."
"నన్ను క్షమించు అన్నయ్యా! నేను ఆవేశ పడతానని నువ్వే అంటావు కదూ? నాకు ఎవ్వరూ లేరు అనుకున్నాను గానీ-అది నిజం కాదు. నాకు నువ్వు ఉన్నావు. నువ్వు తప్ప నన్ను ప్రేమించేవాళ్ళెవరూ లేరు" అంది తన చేతితో నా కళ్ళు తుడుస్తూ.
ఆ చెయ్యి పట్టుకున్నాను. "తప్పు భానూ! బావ తర్వాతే నేను. ఒక వ్యక్తిని అంత తొందరగా విసర్జించకూడదు. నీ మంచి చెడ్డలూ, నీ కష్ట సుఖాలూ చూడవలసింది బావే."
భాను బాధగా నవ్వింది. "నా మంచి చెడ్డలూ కష్ట సుఖాలూ! ఆ దాంపత్యధర్మం ఈ సంసారంలో మాత్రం లేదన్నయ్యా!"
నే నేమీ మాట్లాడలేదు.
"నే నేది చెప్పినా సోదిలా ఉంటుందేమో!" అందికొంతసేపటికి.
చెప్పమన్నట్టు చూశాను. ఏం వింటానో అని భయం వేసింది.
"బాబు కడుపులో ఉన్నప్పుడు ఒకసారి జ్వరం వచ్చింది. రాత్రి ఆయన వచ్చేవేళకు పడుకొని ఉన్నాను. పడుకున్నా వేమని అడిగితే, 'జ్వరం తగిలినట్టు ఉంది. తలనొప్పి పెడుతోంటే పడుకున్నాను' అన్నాను.
'ఈ రాత్రికి అన్నం మానెయ్! రేపొద్దుటికి అదే పోతుంది' అన్నారు. కనీసం ఒంటిమీద చెయ్యి కూడా వేసి చూడలేదు. చలివేస్తోమ్తే దుప్పటి కప్పుకొన్నాను.
ఎప్పుడో మెలకువ వచ్చేసరికి దీపం పెద్దగా వెలుగుతోంది. పక్కమీద ఆయన లేరు. వీధి తలుపులు దగ్గరికి వేసిఉన్నాయి. అది అలవాటే అయినా భయంతో గుండెలు కొట్టుకున్నాయి. తొందరగా లేచివెళ్ళి తలుపులు వేసివస్తూ తూలిపడ్డాను. చెమటలు పోస్తున్నాయి. విపరీతంగా దాహం వేస్తోంది. అప్పుడు వేడినీళ్ళు కాచుకో లేక చన్నీళ్ళు తాగి పడుకున్నాను. ఎంతకీ నిద్ర పట్టదు. పన్నెండు కావస్తోంది. అప్పుడు వస్తే తలుపులు తీశాను. 'తొందరగా వచ్చేద్దామని వెళ్తే ఆలస్యమైపోయింది భానూ! జ్వరం ఎలా ఉంది?' అంటూ మంచంమీద కూర్చున్నారు.
'అలాగే ఉంది.'
'మరేం ఫర్వాలేదు. రేపొద్దుటికి తగ్గిపోతుంది.' తగ్గకపోతేమాత్రం ఫర్వా ఎవరికి? ధైర్యం చెప్పమని ఎవడు దేవిరించాడు?
ఉదయానికి జ్వరం ఎక్కువైంది. అది ఆయనకు తెలీదు.
'వంట చెయ్యలేవా?'
'చెయ్యలేను.'
'పోనీ! నేను హోటల్లో భోం చేస్తాను. నీ కేమైనా కావాలా?'
'అక్కర్లేదు.'
'సరే!'
జ్వరం తగ్గకపోతే డాక్టర్ని తీసుకురావాలనీ-జ్వరంతో ఉన్నవాళ్ళయినా ఏ రొట్టో కాఫీయో తాగుతారనీ, ఏదో ఒకటి తెచ్చి యివ్వాలనీ- తెలీదా? నా కళ్ళు నిండిపోయాయి. కడుపుతో ఉన్నవాళ్ళు పస్తులు ఉండకూడదంటారు. కడుపులో పాపకోసమైనా ఏదో తినాలి. ఏం తినను? ఎవరు తెస్తారు? పది గంటలవరకూ అలాగే పడుకున్నాను. వీధిలో సోడా కేక విన్పించింది. లేచి వెళ్ళి సోడా లమ్మే పిల్లవాణ్ణి పిలిచాను. లోపలికి వచ్చి డబ్బులకోసం డ్రాయరు సొరుగులూ, అలమరా బల్లలూ, పాంటు జేబులూ, పెట్టె మూలలూ-అన్నీ వెదికాను. ఎక్కడా ఒక్క చిల్లి కానీ కన్పించలేదు. నెలలు నిండి, పుట్టెడు జ్వరంతో, తినటానికేమీ లేకపోగా సోడా నీళ్ళు తాగాలని బుద్దిపుడితే అర్ధణా........ఒక్క అర్దణా నాదగ్గర లేకపోయింది. చూశావా? నా భర్త సంపాదన నేను ఎంత సుఖంగా అనుభవిస్తున్నానో! ఇంటి ఇల్లాలిగా ఎంత స్వాతంత్ర్యం సంపాదించుకున్నానో! కళ్ళు తుడుచుకు వీధిలో కొచ్చి 'వెళ్ళిపో అబ్బాయ్! డబ్బులు దొరకలేదు' అన్నాను.
* * *
