
'ఫర్వాలేదమ్మా, రేపు ఇవ్వండి' అన్నాడు వాడు.
'వద్దు. వెళ్ళు' అనేసి లోపలి కొచ్చాను. ఏడుపు ఆపుకోవటానికి ఎటువంటి ప్రయత్నమూ చెయ్యలేదు. ఉధృతం తగ్గేవరకూ ఏడ్చాను. ఐదు నిమిషాల్లైనా వీధిలోనే అరుస్తున్నాడు వాడు. లేచి వెళ్ళి మళ్ళా పిలిచాను. 'చూడబ్బాయీ, రేపు కూడా నా దగ్గర డబ్బు లుండవు. జ్వరం వచ్చింది. నిన్నటినుంచీ ఏమీ తినలేదు. దాహం వేస్తోంది. ఒక్క సోడా....ఊరికే ఇస్తావా?'
వాడు తెల్లబోయాడు.
'నిజం తమ్ముడూ, నాకు సోడా తాగాలని ఉంది. నా దగ్గర డబ్బులున్నప్పుడు తప్పకుండా ఇచ్చేస్తాను. ఒక్క సోడా ఇవ్వవూ?'
వాడు తేరుకొని, 'ఇస్తానండీ!' అంటూ పరుగెత్తాడు బండి దగ్గరికి. ఆనాడు ఆ సోడాకు ఉన్న విలువ ఏ అమృతానికీ లేదు. ఆ తమ్ముడు చూపిన దయ జీవితంలో మళ్ళీ పొందలేను. ఖాళీ సీసా ఇచ్చేస్తూ, 'నాకు పుట్టే పాప నీ అంత మంచిది కావాలి' అన్నాను. వాడు నవ్వి వెళ్ళిపోయాడు. దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు అంటారు. ప్రేమతో ఇచ్చిన ఆ సోడా మందులా పనిచేసింది కాబోలు. సాయంత్రానికి జ్వరం తగ్గింది. వంట చేశాను." భాను ఆగింది. నేను భాను మొహంకేసి చూస్తూ ఆవేశంతో వింటున్నాను.
"బావ నీకెప్పుడూ డబ్బు లివ్వరా?"
"అది వేరె అడగాలా?"
"పోనీ, నువ్వెప్పుడైనా అడిగి చూశావా?"
"లక్షసార్లు, నాకేదైనా అవసరం ఉంటుందనీ, చీటికీ మాటికీ అడగటానికి వీలుండదనీ, అప్పుడప్పుడూ పావలా అర్ధా ఇస్తూండమనీ ఎన్నో విధాల అర్ధమయ్యేలా చెప్పాను. సిగ్గు విడిచి కావలసినప్పుడల్లా అడుగుతూ వచ్చాను. నాకు ఒక అణా ఇస్తే అదేం చేశానో, ఖర్చు చెప్పాలి. అలా చెప్పటం నా కిష్టంలేదు. అడగటం మానేశాను. మన ఊరు వెళ్ళినప్పుడు అమ్మ ఐదో పదో ఇస్తుంది. అవే జాగ్రత్తగా వాడు తూంటాను. డబ్బు అనేది ఎంత జాగ్రత్తగా వాడినా తరుగుతుందే కానీ పెరగదుకదా? ఆయన సంపాదన విషయంలో, ఈ సంసారపు ఖర్చుల్లో నేను వీసమెత్తు కూడా జోక్యం కలిగించుకో కూడదు. స్వతంత్రించి ఒక వస్తువు కొనగూడదు. ఒకసారి విలాససరుకులు వీధిలోకి అమ్మొచ్చాయి. ఇరుగు పొరుగు వాళ్ళంతా గుమిగూడి సామాను చూస్తున్నారు. నేనూ వీధి గుమ్మంలో నిలబడ్డాను. అంతా ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కొంటున్నారు. పక్కింటి బామ్మ గారు నన్ను కూడా బలవంత పెట్టింది. అగరు వత్తులు వెలిగించే పింగాణి చెట్టు తీసుకున్నాను. అది చాల అందంగా చక్కగా ఉంది. లావుపాటి మొదలుమీద విరబోసిన కొమ్మల్లో పువ్వులువిడిచి ఉన్నాయి. వాటిలో అగరవత్తులు గుచ్చుతారు. బామ్మగారు రూపాయి బదులిచ్చింది. తీరా అది చూపించి డబ్బులడిగితే, 'ఎవరు కొనమన్నారు?' అని ప్రశ్న. నిర్ఘాంతపోయాను. ఎవరు కొనమనాలి? ఇంటికోసం నాకు నచ్చిన వస్తువు నేనెందుకు కొనకూడదు? ఇంత చిన్న విషయానికి గృహిణిగా నాకు చొరవలేదా? తనని అడగకుండా నా ఇష్టం చెలాయించాను కాబట్టి ఆ రూపాయి ఇవ్వవలసిన అవసరం తనకు లేదు. అదీ తీర్పు. ఏం చెయ్యను? ఆ అప్పు ఎలా తీర్చను? బామ్మగారు తీసుకొంటుందేమో అని అడిగితే, ఆవిడ కోడలికి వెండిదే ఉందిట. వద్దనేసింది. ఇంకెవరికైనా అమ్మజూపితే ఏమనుకొంటారు? తమాయించుకోలేని దుఃఖం వచ్చింది. ఏదో స్ఫురించి పట్టు చటుక్కునలేచి వెళ్ళి బియ్యం ఇచ్చి అప్పు తీర్చుకున్నాను.
తర్వాత 'ఆ రూపాయి ఇచ్చేశావా?' అని అడిగారు.
'ఇచ్చాను. నా దగ్గర ఉంది. ముందు మీరు ఇస్తారేమో అని అడిగాను.'
ఘన విజయం పొందినట్టే నవ్వారు, 'సంసార బాధ్యత నీకూ కావాలంటావుగా?'
'అవును. ఒక్క డబ్బు ఖర్చుపెట్టే విషయం లోనే నాకు సంసారబాధ్యత ఇవ్వండి.'
సరే, నా బాధ్యతలూ, నా స్వతంత్రాలూ అలా ఉంచు. నెలకు నూటయాభై రూపాయల జీతం వస్తోందంటే కనీసం నెలకో పదిరూపాయలన్నా నిలవ చేసుకోకపోతే. ముందు ముందు వచ్చే అవసరాలు ఎలా తీరాలి? పెళ్ళికి కొనుక్కున్న బట్టలే ఇంతవరకూ సరిపోతున్నాయి. రేపటి నుంచి ఏ ఖర్చు చూసినా పెరుగుతుందే కాని తరగదుకదా? ఇప్పుడే మనం అప్పులపాలై పోతే పిల్లవాడు ఎదిగి చదువుకొచ్చేసరికి ఏంకావాలి? ఇటువంటి విషయాలన్నీ ఎన్నిసార్లు బోధపరిచానంటావు? ఏమి ప్రయోజనం కన్పించిందంటావు? నాకు డబ్బు విషయమై ఏమీ చెప్పరు. ఎంత వస్తోంది? ఎంత ఖర్చవుతోంది? ఎంత మిగులుతోంది? లేదా ఎంత అప్పవుతోంది? అసలు మన తాహతేమిటి? మనం ఎంతలో ఉన్నాం? ఈనాడు నా సంసారం ఏమిటో నాకు తెలీదు. నాకు జరీచీర కొనుక్కోవాలని ఉంది. ఆ తాహతు నాకు ఉందో లేదో నాకు తెలీదు. నేను ఏ కోరిక కోరుకోవాలో, ఏ కోరిక తీర్చుకోగలవో అర్ధంకాదు. 'డబ్బు విషయం నీ కనవసరం. నీనుంచి ఒక్క కానీ సంపాదన లేనప్పుడు నువ్వు ఒక్క కానీ ఇవ్వలేనప్పుడు తగులుతోందో మిగులుతోందో నీకెందుకు? ఆ చికాకులేవో నేను పడుతున్నాను. నువ్వు సుఖంగా కూర్చో.' చూశావా? నేనెంత సుఖపడుతున్నానో? డబ్బు విషయం తెలుసు కోకుండా కూర్చుంటే అంతా సుఖమే కాబోలు. ఒకరి పరిస్థితులు ఒకరు తెలుసుకోవాలంటారు. ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకోవాలంటారు. అది ఈ సంసారంలో ఎలా సాధ్యమవుతుంది? నాకు చెప్తే ఇంత ఖర్చెందు కవుతుందని అడగనూ? ఈ ఖర్చు అనవసరమని ఎత్తి చెప్పనూ? కొంత నిలవ చెయ్యాలని పట్టుపట్టనూ? అందుకే నే నా చికాకుల్లో జొరబడకుండా హాయిగా ఉండాలి.
చూడు, మన ఊరువెళ్తే అక్కయ్యలూ వాళ్ళూ ఎన్నో రవికెల గుడ్డ లిస్తారు. ఎన్నో వస్తువులు కొంటారు. అవన్నీ తీసుకోవటమే అవుతోంది గానీ ఎవరికీ ఏమీ ఇవ్వలేకపోతున్నాను. అక్కయ్య పాపలకన్నా ఏమైనా కొని తీసికెళ్దా మంటే నాకు డబ్బు ఎలా వస్తుంది?
మీ బావ ఒకసారి నేను మన ఊళ్ళోనే ఉండగా వచ్చారు. ఉన్న వారంరోజుల్లోనూ ఊరంతా తిరిగి జల్సాలుచేసి పర్స్ లోది కాస్తా తగలేసుకున్నారు. చూస్తే తిరిగి వెళ్ళటానికే రైలు ఖర్చులేదు. అప్పుడు నా దగ్గరా ఏమీలేదు. ఆయన రైలు ఖర్చులకోసం అమ్మనైతేమాత్రం ఎలా అడగను? ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతుకు తున్నప్పుడు ఎవరి అభిమానం వాళ్ళది గానీ అన్ని విషయాలలోనూ తల్లీ బిడ్డ సంబంధం చూడగలమా? ఎవర్ని అడగటానికీ నాకు మనస్కరించలేదు. నా మెడలో మంగళసూత్రాల మధ్య వ్రతంచేసి కట్టుకొన్న వరలక్ష్మీ రూపువుంటే తీసి ఇచ్చేశాను. అది ఎక్కడో పడిపోయినట్టు నటించాను ఇంట్లో. అటువంటి నీచమైన పరిస్థితి ఎందుకు రావాలి? నేను భార్యనే కావచ్చు. అంతమాత్రాన అతి చిన్న విషయాలకు సిగ్గు విడిచి నన్ను దేవిరించుకొనే అవసరం ఎందుకు తెచ్చుకోవాలి? ఆ మగతనమంతా ఏమైపోయింది? ఈ సంసారగాథ ఇలా ఎన్నిగంటలు చెప్తే వింటూ కూర్చుంటావు?" అంది, చటుక్కున సంభాషణ మార్చి నవ్వుతూ.
నేను నిట్టూర్చి అన్నాను: "చెప్పు భానూ. నీ మనసులో ఉన్న బాధంతా నాకు చెప్పు. నేను నీ కే విధంగానూ సహాయం చెయ్యలేకపోయినా కనీసం నీ బాధ నేనూ పంచుకుంటాను. ఇంత వరకూ వచ్చాక ఏదీ మరుగునపరచకు."
"అన్నయ్యా, నాకు భవిష్యత్తు ఎలా జరుగుతుందో అని భయంవేస్తోంది. ప్రతి ఆడదీ భర్తనుంచి ఏ ప్రేమ అనుభవిస్తుందో అదే నాకు లేదు. నేనంటే ఆయనకు ఏవిధమైన అభిమానమూ లేదు. బాబు కడుపులో ఉన్నప్పుడు ఒంట్లో బావుండక పనిపిల్లని పెడితే విసుక్కున్నారు. 'ఇంతోటి రాచకార్యాలకూ నీకు దాసీజనం ఒకటి. కడుపుతో ఉన్నవాళ్ళు స్వయంగా పనులు చేసుకొంటే ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లూ చెప్పరూ? తిని కూర్చున్న దగ్గర మంచీ ఉద్యోగాలేమైనా చేస్తున్నావేమిటి? మహారాణిలా కూర్చోటానికి నీ బాబుగారి సంపాదనేమీ వచ్చిపడటంలేదే' అన్నారు. నిజమే! పని పిల్లకిచ్చే రూపాయిన్నరా ఒకరోజు సిగరెట్లకి రాదూ? పుట్టింటినుంచి ఆస్తిపాస్తులు తెచ్చు కోనిదానికి పనిమనుషులెలా వస్తారు? ఆ మర్నాటినుంచే ఆ పిల్లని రావద్దని చెప్పేశాను. నెలలు నిండుతోన్న కొద్దీ ఎంత చిన్నపని చేసినా ఆయాసం వచ్చేది. నాలుగుసార్లు నూతికీ ఇంటికీ తిరిగితే కాళ్ళు పీకేవి. అంట్లు తోముతోంటే చేతులు తిమ్మెర్లు పుట్టేవి. ఒకసారి అభిమానం చంపుకొని, 'కట్టెలతో వంటచేస్తే మసి గిన్నెలు తోముకోవటం కష్టంగా ఉంది. ఈ నెలలో బొగ్గులు వేయించకూడదూ?' అని అడిగాను.
ఎంత చెత్త కోరిక! అనవసరం. మొహం చిట్లించుకున్నారు. 'కానీ తో అయ్యేపనికి అణాతగలేస్తానంటావు. బొగ్గులకు బదులు కట్టెలు రెండింతలు వస్తాయి. అసలు డబ్బు అంటే ఏ చెట్టునో కాస్తోంది అనుకొంటున్నావు' అన్నారు. నాకు ఆపుకోలేని కోపం వచ్చింది. 'అవును నా సుఖం మాట వచ్చేసరికే ఈ ఆలోచన లన్నీ! మీ జల్సాలకీ సర్ధాలకీ. పేకాటకీ, సిగరెట్లకీ ఈ పొదుపు ఉద్యమాలూ డబ్బు విలవలూ అవసరంలేదు. గుర్తేరావు. కడుపుతో ఉన్నవాళ్ళు స్వయంగా పనిచేసుకొంటే ఆరోగ్యంగా ఉంటారని డాక్టరు చెప్తారు గానీ, సిగరెట్లు కాలిస్తే గుండెలు చెడి జబ్బులు వస్తాయని చెప్పరు' అన్నాను.
'నోర్ముయ్ వాడెవడు మధ్య చెప్పటానికి. నా కష్టార్జితం నా యిష్టమైనట్టు చేసుకుంటాను. ఈ ఇంట్లో నీనుంచి చిల్లిగవ్వ వచ్చి పడటంలేదు.'
'మీ ఉద్దేశ్యం అదె అయితే విశదంగా చెప్పండి. నాకు చేతనైంది నేనూ చేస్తాను.'
