'నువ్వేది చెప్పినా నా కవసరంలేదు. మరిచి పోయే చెయ్యలేదో, జ్ఞాపకం ఉండే చెయ్యలేదో నేను ఆలోచించను. నా కంటికి కనిపించిందే నిజం. నామీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా శ్రద్ధగా అన్నీ చేసేదానివి. అది లేకపోబట్టే మరుపువస్తుంది. కాదంటావా?'
నేను చేసింది పొరపాటు-అంతవరకే. ఆ పొరపాటు చెయ్యటంలో నా ఉద్దేశ్యాలు మాత్రం ఆయన ఊహించేవి కావు. ఆయన్ని నిర్లక్ష్యంచేసి అగౌరవపరచటంవల్ల నాకు ఒరిగిందేమీలేదు. అలా చెయ్యటానికి నా అంతరాత్మ ఒప్పదు కూడా. పంచదార లేని కాఫీ ఇచ్చినప్పుడు- 'భానూ! కాఫీలో పంచదార వెయ్యటం మరిచి పోయావు. తీసుకురా!' అంటే ఎంత చక్కగా ఉంటుందీ? ఆ పొరపాటులో పెడర్ధాలు తీసి తిట్టిపోస్తే ఎంత గొప్పగా ఉంటుంది? నేను చేసే తప్పులు క్షమించరానివీ, సమర్ధించుకోలేనివీ మాత్రం కావు. అంతమాత్రపు సమర్ధన భార్యా భర్తల్లో ఉండనవసరం లేదా? అదే ఆయనకు లేదు. తీవ్రమైన అభిప్రాయాలు వెల్లడించటం, ఆ తినేదో, ఆ తాగేదో వదిలి లేచిపోవటం.
ఒక్కోసారి ఇంట్లో నిలవగా ఏదో చిరుతిండి చేసిపెడతాననుకో. అస్తమానూ నేను-'మీకు కావాలా? తెమ్మంటారా?' అని అడుగుతూ ఉండాలి. తనకై తను అడగకూడదట. తనని నేను కనిపెట్టి తిరుగుతూ ఉండాలట. 'మీకు కావాలనిపించినప్పుడు తీసుకుతినండి. లేకపోతే తెమ్మని చెప్పండి. అంతేగాని చుట్టాలకు మర్యాదలు జరిపినట్లు ఎల్లకాలం మనకు మనం జరుపుకోవాలంటే ఎలా వీలవుతుంది?' అంటే-
'చుట్టాలకు మర్యాదలు చేస్తావు గానీ కట్టు కున్నవాడికి చెయ్యలేవా? నామీద నీకు శ్రద్దే ఉంటే నువ్వే చేస్తావు. ఆ బాధ్యత ఆడదానివి నీకు ఉండితీరాలి'-అదీ జవాబు. కొందరి తత్వాలూ, ఉద్దేశ్యాలూ సహజత్వానికి భిన్నంగా ఉంటాయి. ఎల్లకాలం ఒకరు చెయ్యాలి. ఒకరు చేయించుకోవాలి. మాట మాటకూ అపార్ధాలు ఎంచాలి. ఎంతకని భరించ గలం? నేను ఎంత శ్రద్ధగా పనులు చేసుకొంటున్నా యింటి బాధ్యతలే నాకు తెలీటం లేదంటారు. చెయ్యిజారి ఒక కప్పు పగిలిపోయిందనుకో. కిందపడి అద్దం బద్దలైం దనుకో-వాటి గురించి పెద్దగా నేను బాధపడను. విచారించను. మనం కావాలని విసిరివేసుకోము. ఏదో పొరపాటు వల్ల జరిగిపోతాయి. వాటికి బెంగపడి మంచం పడితే ఏమిటి ప్రయోజనం? ఈసారి జాగ్రత్తగా ఉంటే సరి అనిపిస్తుంది. కానీ అదే ఆయన దృష్టిలో ఘోర అపరాధం! 'ఆడవాళ్ళంతా కొత్త కొత్త సామాన్లు సంపాదించుకొంటూ పొదుపుగా సంసారాలు చేసుకుంటారు. నీకు ఆడ లక్షణాలే లేవు. మొగరాయుడిలా చేతికందింది తోసేస్తూ. కాలి కందింది తన్నేస్తూ గర్వంగా తిరుగుతావు. జాగ్రత్తగా పట్టుకొంటే కప్పు ఎందుకు జారుతుంది? పిల్లవాడికి అందేలా అద్దం ఎందుకు పెట్టాలి? నీకు శ్రద్ధ ఎప్పుడొస్తుంది?' అదీ ధోరణి! నాకు తెలీక అడుగుతానూ? ఏ యింటి లోనూ కప్పులు బద్దలవటం లేదూ? పిల్లలు వస్తువులు పాడు చెయ్యటం లేదూ? ఈ అఘాయిత్యాలన్నీ నే నొక్కదాన్నే చేస్తున్నావా? వెధవ కప్పు పగిలినదానికి ఇంత రాద్దాంతమా? ఖర్మకాలి జరిగిన పనికి నిలువునా వణికిపోతూ ఈ క్షణమో మరో క్షణమో జరగబోయే యుద్దానికి సిద్ధం కాలేక ఆ తిట్లు తినలేక ఏడుస్తూ - ఛీ! ఒక మనిషిలా బ్రతుకుతున్నానా నేను? పంచదారకి చీమలు పట్టాయనీ, ఉప్పు జాడీమీద మూత లేదనీ, ఆవకాయ ఎండలో పెట్టటం లేదనీ, కాఫీ గ్లాసు కిటికీలో ఉండిపోయిందనీ, నానిగాడు చీపురు ఊడదీస్తున్నాడనీ-ఛీ! ఛీ! నేను ఏదీ చూసుకోను. హాయిగా తినేసి పడుకుంటాను. ఇక నాకు మార్పు రాదు. ఇంతే! నన్ను చేసుకోవటం తన ఖర్మ! అనుభవించాల్సిందే! ప్రతి రోజూ ఈ సాధింపు ఏ ఆడది భరించగలదు? వంట గదిలోకి వచ్చి మంచినీళ్ళు తాగటానికే పౌరుషపడే మగతనం ఇంత చిన్న చిన్న ఆడవాళ్ళ విషయాలలో కలగజేసుకు తిట్టటానికి ఎలా అంగీకరిస్తుంది? ఏమిటో-అలా తల్చుకొంటూ కూర్చుంటే పిచ్చే ఎక్కుతుంది." భాను తిరిగి అన్నం కలుపుకో సాగింది.
నేను అన్నీ విన్నాను. భానును అర్ధం చేసుకున్నాను. అయినా -"భానూ! నువ్వు అన్నీ తర్కించుకొంటూ కూర్చోకు. బావకి ఇష్ట మైనట్టే ప్రవర్తిస్తే పోదూ?" అన్నాను.
చటుక్కున తలఎత్తి నా మొహంలోకి దీర్ఘంగా చూడసాగింది.
"నీకు కోపంవస్తోంది కదూ?"
అడ్డంగా తల తిప్పింది. "లేదు. ఏ మగ వాడైనా ఆడదాని మనసు అర్ధం చేసుకుంటాడా అని ఆలోచిస్తున్నాను."
"అక్కర్లేదు. అర్ధం చేసుకోవటానికి ప్రయత్నం కూడా చెయ్యడు. కారణం తను మగవాడు గనుక."
"అవును గడ్డిపోచకన్నా, దూది పింజకన్నా తేలికైన ఆడదానికి ఒక మనసూ, అందులో ఏదో ఉండటమూనా? దాన్ని అర్ధం చేసుకోవటానికేముంది? అంతే కదూ?"
"పిచ్చిభానూ! నువ్వు ఎంత పొరబడుతున్నావో నీకు తెలుస్తోందా? నీ విషయం ప్రత్యేకమైంది. నీ స్వంత అనుభవాలతో ఉమ్మడి నిర్ణయాలు చేస్తానంటే ఒప్పుతుందా?"
"పొరబడేది నేను కాదు. ఒక విషయాన్ని ఎత్తి చెపితే స్త్రీని సమర్ధించేది తక్కువ. మగ వాడికి ప్రత్యేకత ఉంది. రెక్కలు విప్పుకు ఎగిరే స్వేచ్చ ఉంది. అవి ఇప్పుడూ ఉన్నాయి. ఎప్పటికీ ఉంటాయి. ఇంకా చెప్పబోతే నాకు అసూయే అనుకోవచ్చు కూడా. అయితే నువ్వూ అంతే నంటావా?"
"ఏం? నేను మగవాడిని కాదంటావా?"
"కావచ్చు. కానీ నీలో ఏదో విశిష్టత ఉంది. నిన్ను నమ్మినవాళ్ళని నువ్వెప్పుడూ అన్యాయం చెయ్యవు. నిన్ను ప్రేమించేవాళ్ళని నువ్వు ఎన్నడూ ద్వేషించవు. నిన్ను కోరేవాళ్ళని నువ్వు ఎన్నడూ త్రోసిపుచ్చవు."
"అది నీ భ్రమ! కాలం ఎవరి నెలా మారుస్తుందో ఎవరికీ తెలీదు. నువ్వు చెప్పిన ఈ మాటలు రేపు నా భార్య నోటినుంచి రావాలి. ఈ ఉద్దేశ్యాలన్నీ ఆవిడ హృదయంలో నాటి ఉండాలి. అప్పుడు నేను నీ ఊహలకు తగినవాన్నని అంగీకరిస్తాను."
"తప్పకుండా అది జరుగుతుంది. కాలం అందర్నీ మార్చలేదు సుమా! కాలాతీత వ్యక్తులు కూడా కొందరుంటారు."
భోజనాలు ముగిశాయి. పైకి గంభీరంగా మాట్లాడుతున్నాను గానీ మనసంతా చేదు చరిత్ర విన్నట్టు కలతబారిపోయింది. అప్పుడే నిద్ర నుంచి లేచిన అల్లుణ్ణి ఒళ్ళోకి తీసుకుని వాడిచేత కొత్త కొత్త మాటలనిపిస్తూ కూర్చున్నాను.
"ఒరే నానీ! నీ కివ్వాళ అంకెలు చెప్తాను. నేర్చుకుంటావా?" వాడు నిద్రమత్తు వదిలించుకొని తల ఊపాడు.
"అయితే నేను చెప్పినట్టే అను. ఒకటీ."
"ఒకతీ."
"ఒకతీ కాదు. ఒకటీ."
"ఒకతీ."
"మళ్ళీ అదేనా? ఒకతీ అంటా వేం?"
"నేను అలాగే అంతాను."
"అలాగే అంతే నేను తంతాను."
"ఎందుకు తంతావు?"
"నోరు ముయ్యవోయ్! వెధవాయ్! చెప్పినట్టు వినక ఎదురు మాట్టాడతావేం? వేలెడు లేవు. వెధవన్నా!"
"నన్నెందుకు తిల్తావు?" నేను చిత్రంగా వాడి మొహంలోకి చూస్తున్నాను. భాను ఎప్పుడొచ్చిందో బుగ్గన చెయ్యి పెట్టుకు నించుంది. నాకేసి చూస్తూ అంది "చూశావా నాకొడుకు?"
"నిజంగానే నీ కొడుకు" అన్నాను. భాను వాణ్ణి ముద్దుల్లో ముంచెత్తింది.
"భానూ! నీ కొడుకు డాక్టరా? ఏక్టరా? లాయరా? ఎవరే?" అన్నాను నవ్వి.
"గొప్ప గొప్ప ఆశలు పెట్టుకు ఒకసారి భంగ పడినా బుద్ధి రాలేదంటా వేమిటి? ఇప్పుడా ఆశలూ లేవు. ఆ తాహతూ లేదు. కూటికీ గుడ్డకీ లోటు లేకుండా నీతిగా బ్రతక గలిగితే చాలు." నిట్టూర్చి నా పక్కన కూర్చుంది. అంతలోనే సంతోషం మరిచి. నా మనసు చివుక్కు మంది. "ఎందుకమ్మా అంత ఉదాసీనంగా మాట్లాడుతావు? నేను ఉన్నంతవరకూ నీకూ నీ పిల్లలకూ ఏ లోటూ రాదు. నీ కొడుకుని గొప్ప డాక్టర్ చేసి చూసిస్తాను. నా కిచ్చేస్తావా?"
"తీసికెళ్ళు, వాళ్ళ నాన్నకి సగం భారం తగ్గుతుంది. ఆ మిగిలిన సగం తగ్గేది కాదనుకో."
నాకు నిజంగా కోపం వచ్చింది. "భానూ! అలా మాట్లాడొద్దని ఎంతసేపటినుంచి చెప్తున్నావు? నీ ధోరణి నీదేనా? ప్రతి విషయాన్నీ ఎందుకంత సీరియస్ గా తీసుకుంటావు? కొడుకుని భారం అనుకొనే తండ్రి ఉంటాడని నువ్వు చెప్పగానే మరి వినటం. లేని పోనీ నిందలు మోపటం నీకు మాత్రం భావ్యం కాబోలు."
భాను క్షణం నాకేసి చూసింది. "అవును, మంచి మనసుకు చెడ్డ చెపితే అంటదు. మనుషులంతా నీలా ప్రేమనే పంచిపెడతా రనుకొంటే పొరపాటే. తల్లిగానీ, తండ్రిగానీ, భార్యగానీ, కొడుకుగానీ-మమకారంలేని హృదయానికి అంతా ఒకటే!
"బావ ఒక్కసారైనా కొడుకుని ఎత్తుకు తిరగటం నీ కళ్ళతో నువ్వు చూశావా? వీధిలో పోయేవాళ్ళు కూడా ఆడుకొంటూన్నవాణ్ణి ముద్దు పెట్టుకు వెళ్ళారే! అంతమాత్రపు అభిమానం కన్నతండ్రికి ఏదీ?"
"బావుంది. ఈ మాత్రానికే......"
"కాదు అన్నయ్యా! కొడుకుని తండ్రి ఎత్తు కోకపోవటం అనేది ఈ మాత్రపు విషయంగా నేను తీసివెయ్యలేను. నిద్ర మంచంమీద లేస్తూనే ఆ పసివాడిమీద విసుక్కుంటారు. నేను ఐదు గంటలకే లేచి దొడ్డివేపు వెళ్ళిపోతాను. వీడు ఒక్కోసారి లేచి తిన్నగా నా దగ్గరికి వచ్చేస్తాడు. ఒక్కోసారి ఏడుస్తూ కూర్చుంటాడు. ఆయనగారికి నిద్రా భంగమైపోతుంది. మండి పడుతూ లేచి-'ఛీ! వెధవా! లేస్తూనే ఏడుపూ నువ్వూ! వెధవ పోలిక-' అంటూ వాడి రెక్క పట్టుకొని గది బయట పారేసి తలుపులు బిడాయించుకొంటారు. ఎనిమిది గంటలవరకూ వాడు భయంతో ఏడుస్తూంటే నా కడుపు తరుక్కుపోతుంది ఎన్ని పనులున్నా మాని వాణ్ణి దగ్గర పెట్టుకు కూర్చుంటాను. కళ్ళు నిండి పొర్లి పోతాయి. కొడుకులంతా తండ్రుల గుండెలమీదే నిద్రపోతారంటారు. ఆ అదృష్టం దౌర్భాగ్యులకి ఎలా దక్కుతుంది? అందుకే చాలాసార్లు నేను లేచి వస్తున్నప్పుడే వాణ్ణి బుజంమీద వేసుకు తీసుకువచ్చి వంటింటి గడపలో చాప పరిచి పడుకో బెడతాను. చంటిబిడ్డ ఏడుపుకి నిద్రాభంగ మయ్యే సుకుమారులు పేకాటలకోసం రాత్రింబవళ్ళు జాగారాలు చెయ్యగలరు సుమా! అది ఎదటివాళ్ళు అడగలేకపోయినా వాళ్ళ అంతరాత్మలు నిద్రపోతా యంటావా? ఇక ఆయన అన్నం గానీ టిఫిన్ గానీ తింటూంటే వాడు ఆ పరిసరాల్లో తిరగటానికి వీల్లేదు. వాడే అఘాయిత్యం చేస్తాడో ఏమో! అందుకని వాణ్ణి ఆయన అన్నంవేళ దొడ్డిలో తిప్పాలి. నేను మళ్ళీ వడ్డన జరపటానికి దగ్గరే ఉండాలి. వాడు నా వెనకే వచ్చేస్తే-'వెధవకి కాళ్ళు విరిగి కుంటివాడై కూర్చుంటే బావుండిపోను' అంటూ మండి పడతారు.
