Previous Page Next Page 
పేక మేడలు పేజి 7


    పండుగ వెళ్ళగానే అమ్మ ఉత్తరం రాయమంది. అమ్మ సంతోషంకోసం అబద్ధాలు కల్పించి రాయాలి. నాలుగవనాటి తెల్లవారుఝామున ఉత్తరం రాస్తూ కూర్చున్నాను.
    'అమ్మా!
    ఇక్కడ మేమంతా కులాసా! మీరంతా క్షేమమని తలుస్తాను. బాబు ఆరోగ్యంగా ఉన్నాడు. మేము పండుగ చాల సరదాగా చేసుకున్నాము. భోగినాడు తెల్ల జరీచీర, పెద్దపండుగనాడు చిన్నక్కయ్య పెట్టిన ఎర్రజరీ చీర కట్టుకున్నాను. నాలుగు రోజులూ నాకు చేతనైన టిఫిన్లు చేశాను. ఎంతైనా మన ఊరు వచ్చేస్తే ఇంకా చక్కగా ఉండేది సుమా.....' కళ్ళలోంచి నీటిబొట్లు అక్షరాల మీద పడ్డాయి. పైట కొంగుతో మెత్తగా ఒత్తుతున్నాను. తలుపు చప్పుడైంది. వెళ్ళి తీశాను. ఎర్రగా జేవురించిన కళ్ళతో గబగబా నడుస్తూ వచ్చి మంచంమీద కూర్చుండిపోయారు. 'పేకాటో పేకాటో అని గోల పెట్టావు గానీ దానివల్ల ఎంత సంపాదించావో తెలుసా? నూటముఫ్ఫై రూపాయలు! నాలుగు రోజుల్లో! నువ్వన్నట్టు ఇంట్లో చేతులు ముడుచుకు కూర్చుంటే ఈ డబ్బు ఎలా వచ్చేది? ఏభై రూపాయలు తీసుకు నీకు కావలసిన చీరే దైనా కొనుక్కో.'
    నేను నవ్వాను. ఆ నవ్వులో ఎన్ని అర్ధాలు ఉన్నాయో ఆయనవంటివాళ్ళు ఎప్పుడూ తెలుసుకోలేరు - అన్యాయమైన డబ్బుకోసం దేవిరించే దుర్మార్గుడా! నీలాగే మనుషులంతా మానవత్వం మరిచిపోయారా? గాయపడిన ఎదుటి హృదయాన్ని నీ డబ్బుతో ఆనందపరచగలవా? నీకోసం నీ భార్యా బిడ్డ లెంత విలపించారో? నీ తిరస్కృతికి ఎంత కృంగిపోయారో-అది ఏనాటి కైనా నీకు అర్ధమౌతుందా? నీచమైన డబ్బు కోసం నీ వాళ్ళని ఏడిపించే నువ్వు, భార్య కన్నీటి కైనా కరిగిపోని నువ్వు, మనసే లేని నువ్వు- మనిషివా? ఈ సత్యం నీకు ఏనాటికైనా తెలుస్తుందా? నిలదీసి అడగాలనీ, కసిదీరా తిట్టాలనీ పరవళ్ళు తొక్కే మనసుని మందలించి నవ్వాను. 'నా శరీరానికి గుడ్డలులేని గతే వస్తే అగ్ని ముట్టించుకొని నుసై మానం  కాపాడుకొంటాను గానీ అటువంటి పాపిష్టి డబ్బుతో.......'
    'అహ్హహ్హహ్హ!' అంటూ ఫకాళించి నవ్వటం ప్రారంభించారు. 'ఆహా! ఆదర్శ నారీ! ప్రతి ఆడదీ ఇంత లేసి గొప్ప చచ్చు ఆదర్శాలు పెట్టుక్కూర్చుంటే......'
    'ఏనాడో బాగుపడేది.'
    'కాదు. కాదు. మగ మహారాజులంతా ముక్కు మూసుకు సన్యాసం స్వీకరించవలసిందే మరి. ఏ స్నేహితు డింట్లో పేకాట పెట్టినా ఆ ఇంట్లో ఆడవాళ్ళు కాఫీలుచేసి మరీ ఇస్తారు.'
    'దౌర్భాగ్యులు! చెయ్యగలిగిందేముంది మరి? బానిసలు!'
    'అది వాళ్ళ దౌర్భాగ్యం కాదు. నీది! సరే నీ ఖర్మ! హాయిగా నేనే ఉలెన్ పాంటు కుట్టించుకుంటాను.'
    భగవంతుడా! నీకు కోటి నమస్కారాలు! తేలిగ్గా గాలి వదిలాను. పంతానికి తనే ఒక చీర తెచ్చి కట్టుకోవాలని ఆంక్ష పెడితే తిరస్కరించగల శక్తి ఉందీ? తిరిగి ఉత్తరం రాస్తూ కూర్చున్నాను-
    'ఏమిటి రాస్తున్నావ్?'
    చటుక్కున ఏదో స్ఫురించింది-'కథ.'
    'ఓ! ఏం కథ?'
    'మొగుడు పేకాట కెడితే పెళ్ళాం ఏడిచే కథ!'
    'ఎందుకూ? తనని కూడా తీసికెళ్ళలేదనా? వెధవ చమత్కారం నువ్వూ! ఇంటికి వచ్చేసరికి ఏదో తగూ! పేకాడటం తప్పని ఏ వెధవ అంటాడో రమ్మను. చెప్తాను. నేనేం తాగి తందనాలాడుతున్నానా? అడ్డమైన కొంపలకి పారా కాస్తున్నావా? ఏమిటి నీ ఉద్దేశ్యం?'
    'తాగినా, తందనాలాడినా, దొంగతనం చేసినా, ఖూనీలు జరిపినా-ఎవడు చేసే పనిని వాడు సమర్ధించుకొంటూనే ఉంటాడు. అవి తప్పులని మీరు విమర్శించడం...........' అభిమానం కోసం కన్నీరు జారకుండా చెంప పట్టుకొని దొడ్డివేపుకు నడుస్తోంటే-'డర్టీ రాస్కెల్! నిద్రపోదామని వచ్చేసరికి లైట్లు వేసుక్కూర్చుని కథలు రాస్తూందట, కథలు. మహా రచయిత్రి మరుగున పడి పోయింది మరి. మాటకు మాట.......ఎంత గర్వం!' మాటలు వినిపించాయి.    
    న్యాయం కానీ అన్యాయం కానీ అధికారానికి అలవాటుపడ్డ మగవాడు ఆడది నోరెత్తి జవాబు చెప్తే సహించలేడు. తననే నమ్మి బ్రతుకుతూన్న భార్యా బిడ్డల్ని సుఖపెట్టలేని పరోపకారి బురఖా స్నేహితులకోసం సర్వస్వం ధారపోయగలడు. వీధి దీపమైనా వెలిగించి దూబరా చేయని పొదుపరి విలాసాలకోసం వందలకి వందలే ఖర్చు చేయగలడు. తను కోరింది కోరిక! తను జరిపేది సరదా! తను చెప్పింది న్యాయం! తను పెట్టింది ఆంక్ష! ఇప్పుడు చెప్పు. ఏ అవసరాలు చూసి ఎదుటివాళ్ళ పరిస్థితులు అర్ధం చేసుకోవాలంటావు?"- భాను నా మొహంలోకి చూడసాగింది.
    ఒకే ధ్యాసగా వింటూన్న నేను, భాను దాంపత్యంలో అనురాగం మమకారం తప్ప మరో భావం ఉంటుందని ఊహించని నేను-కొంత నిజంతెలుసుకొన్న ఆ సమయంలో ఏం చెప్పను? ఏమీ మాట్లాడలేక మూగగా ఉండిపోయాను. భాను హృదయంలో భర్తమీద, మగవాడిమీద- ఇంత కసీ! కోపం!
    నేను అన్నాను-"భానూ! నువ్వు చెప్పింది నేను అర్ధం చేసుకోకపోలేదు. ఒక్క విషయం వింటావా? మన ఆశలూ, ఆశయాలూ, కోరికలూ, అభిరుచులూ-ఒక్క నిమిషం అలా ఉంచు. బావ చిన్నతనంనుంచీ ఆలనా పాలనాలేక, ఎవరి భయ భక్తులూ అనుభవించక ఇష్టానుసారం తిరిగి పెరిగిన వ్యక్తి ! అతను ఏది అనుకొంటే అది జరిగితీరాలనే పట్టుదల! అది మూర్ఖత్వమైనా, పెంకితనమైనా ఏదైనా ఒకటే! అర్ధంలేని స్వేచ్చ మనిషిని ఎన్ని దుర్వ్యసనాల పాలు చేస్తుందో నువ్వు గ్రహించలేవా? నువ్వు......."
    "ఆగు. పెళ్ళికి ముందు బావని గురించి చెప్పానే, అప్పుడు నీ కీ అనుమానం రాలేదా? అలా గాలివాలుకు పెరిగిన వ్యక్తిలో వ్యసనాలు చేరిఉంటాయని అప్పుడు నువ్వు నాకు చెప్పి ఉంటే .......అన్నయ్యా!"
    "భానూ! ఎంత పిచ్చిగా మాట్లాడుతున్నావు! ఇప్పుడతని ప్రవర్తననుబట్టి ఇలా సమర్ధించుకోవాలంటున్నాను గానీ జరిగిపోయిందానికి విచారిస్తామా? పాతిక సంవత్సరాల పెరుగుదలలో ఒక్కసారిగా మార్పు రావాలంటే సాధ్యం కాదు భానూ! నువ్వు ఓర్పు వహించాలి. ఆవేశాపడకు."
    "అన్నయ్యా! పండుగపూట ఒక్క రోజు ఇట్లో ఉండమని దేవిరించిన భార్యను తోసి పుచ్చిన వ్యక్తిలో ఎన్ని తరాలకు మార్పు వస్తుందంటావు? నా ఓర్పుకి ప్రయోజనం ఏమి టంటావు?"
    "తొందరపడకు భానూ! నేను బావని సమర్ధించటం లేదు. నువ్వు శాంతం వహించటం కంటే మరో మార్గం ఉందా చెప్పు? అతనికి పేకాట పిచ్చి తప్పితే నీమీదేమైనా ద్వేషమంటావా? నువ్వూ ఆలోచించు భానూ!"
    భాను నిట్టూర్చింది. "నీకు తెలిసింది చాలా తక్కువే అన్నయ్యా! నువ్వు ఇక్కడికి చదువు కొస్తానని రాస్తే నాకు భయం వేసింది, నా సంసారం నీకు అర్ధమైపోతుందని. కాని ఈనాడు నాకై నేనే అంతా బయటపెట్టుకొంటున్నాను. నే నేది చెప్తే ఈబాధ నీ కర్ధమౌతుంది? ఎంత దిగులుతో కృంగిపోతున్నానో నీ కెలా బోధపడుతుంది? ఇది నీకు నువ్వు తెలుసుకోవాలి. అంతే!"
    నేను వింటూ ఊరుకున్నాను. ఏదో అడగాలని ఉంది కానీ అది సమయం కాదు. భాను స్వతహాగా ఆవేశం కలది. భర్త ప్రవరతన అనుచితంగా తోస్తే, తన ఆశలు దెబ్బతింటే బాధే కలుగుతుంది. బావను మించిన జూదగాళ్ళను వందల మందిని చూస్తున్న నేను తొందరపడటంలో అర్ధంలేదు. ఆ వెర్రిలో వాళ్ళు ఏం చేసినా ఆశ్చర్యపడాల్సిందిలేదు. నెమ్మదిగా సంభాషణ మార్చాను. స్కూలు జీవితం గుర్తుచేశాను. ఆనాటి స్నేహితులందర్నీ జ్ఞాపకం చేశాను. యూనివర్శిటీ కబుర్లు చెప్పుకొచ్చాను.

                                 * * *

                  
    పన్నెండు దాటింది. "ఆకలేస్తోంది భానూ !" అన్నాను. భాను చటుక్కున లేచి, "మాటల్లోపడి కూర్చుండిపోయాను. రావెళ్దాం" అంది. మౌనంగా కారియర్లు విప్పి వడ్డించింది. ఏ క్షణాని కేం జరుగుతుందో తెలీదంటారు ఇదే కాబోలు. తోటలో చెరువుగట్టున మర్రిచెట్టు క్రింద కూర్చుని తినాలనికొన్న సరదా ఏమైందనీ!
    "నవ్వు వున్నావు కానీ.......లేకపోతే ఈ పూట ఇవి ఇలాగే ఉంటాయి" అంది భాను.
    "అదే పొరపాటు! నువ్వు చెయ్యాల్సింది ఉపవాసాలూ, జాగారాలూ కాదు. కనీసం నువ్వు అన్నం తినలేదని తెలుసుకొనేవాళ్ళయినా లేరు కదా? ఆకలి తీరటానికి కడుపుకోసం ఇంత తిండి తినటానికి అభిమానం ఎందుకూ?"
    "ఏమో అన్నయ్యా! ఈ ఇంట్లో అనుకున్నది చేస్తామో లేదో, వండుకున్నది తింటామో లేదో తెలేదు. దానికి కారణం ఆయన ఒక్కరే అని నేనూ అనను. నేనూ ఏవో పొరపాట్లు చేస్తూనే ఉంటాను. టిఫిన్ పెట్టిన దాన్ని మంచి నీళ్ళివ్వటం మరిచిపోతాను. ఒక్కోసారి పంచదార వెయ్యకుండానే కాఫీ కలిపి యిచ్చేస్తాను. మజ్జిగ గిన్నెలో ఉప్పురవ్వ పడెయ్యాలని గుర్తే రాదు. అవి కేవలం మతిమరుపులవల్ల జరిగే పొరపాట్లే కావచ్చు. కానీ వాటి పర్యవసానం చాల తీవ్రంగా ఉంటుంది. నేను తనని నిరక్ష్యం చేస్తున్నాననీ, తన పనులంటే యిష్టంతో చెయ్యటం లేదనీ, తనమీద నాకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఇలా అలక్ష్యంగా ప్రవర్తించననీ-వాటికి నే నేమీ సమాధానాలు చెప్పుకోలేను. చెప్పినా ప్రయోజనం లేదు-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS