ప్లీడరు బెనర్జీ గారన్నారు! "ఏం తమ్ముడూ , అక్కడంతా కులాసాయేనా? ఓ కార్డు ముక్క రాస్తే స్టేషను కి మనిషిని పంపేవాడిని కదా. పిల్లతో ఇంత దూరం ఒక్కడివీ రావడం అదేమంత న్యాయంగా లేదు. మేమంతా ఏమైపోయేమనుకున్నవోయ్?" చిన్నగా నవ్వి సమాధానం ఇచ్చేడు: "హటాత్తుగా వచ్చేసి మిమ్మల్నందర్నీ ఆశ్చర్యంలో ముంచాలని పించిందన్నయ్యా. పెద్దమ్మ సుఖంగా ఉండి ఉంటుందని గట్టి నమ్మకం తోచింది. బండి దిగి చుట్టూ చూస్తె ఎంత మార్పు! ఇరవై ఏళ్ళ క్రిందటి కలకత్తా లో నైహటీ కి ఇప్పటి నైహటీ కి గుర్తు పట్టలేనంత మార్పు వచ్చేసింది. పెద్దమ్మ పేరు చెప్పగానే బండి వాడు ఎకాయేకీ ఇక్కడికి తీసుకు వచ్చేడు. ఇదివరకు దారి పొడుగునా కనిపించే ఈల చెట్లూ, తాటి తోపు లూ ఈత కొమ్మలూ-- అవన్నీ మచ్చుకు కూడా కనిపించక పొతే కొంపతీసి బండివాడు బోల్తా కొట్టించడం లేదు కదా! అనుకున్నాను. మొత్తానికి మన ఊరు వచ్చేశాను౧."
బెనర్జీ అతని వైపు నిశితంగా చూస్తుండి పోయేడు. నైహటీ లో పరమేశ్వరీ కాళీ ఆ ఊళ్ళో అందరికీ పెద్దమ్మే. ఆవిడకి కొద్దిగా ఆస్తి పాస్తులు భుక్తికి గడిచిపోగా వెనక వేసుకుందుకు నాలుగు రాళ్ళు మిగిలే పాటివి ఉన్నాయి. ఆవిడ పుట్టుకతోటే అందరికీ మాతృమూర్తి లా కనిపించ సాగింది. ఎప్పుడు తల్లీ, తండ్రీ ఆవిడ మెడకు ఉచ్చు తగిలించేరో తెలియదు కానీ నలభై ఏళ్ళు వచ్చినా మస్తుగా తాగేసి వచ్చి చిత్తుగా తన్నే భర్త ఆదరం తప్పలేదు. అయినా ఆవిడ పట్ల భగవంతుడు నిర్దయగానో, దయనీయం గానో ఏదో ఊహించి సంతానాన్ని ఇవ్వలేదో కానీ ఆవిడ కడుపు మాత్రం ఫలించలేదు. ఉన్నట్లుండి నవీన రాయ్ అర్ధరాత్రి ఊరి ముండను లేవదీసుకు వెళ్లిపోవడంతో ఆవిడ బంధనాలన్నీ ఆ నాటితో తెగతెంపు;లయి పోయేయి. "పెద్దమ్మ మనసు చాలా మంచిది. భగవంతుడు ఏ పిల్లనో, పిల్లాడి నో ఇచ్చి ఉంటె ఎంత బాగుండి పోయేది!' అని ఎవరైనా అంటే ఆవిడ తేలికగా నవ్వేస్తూ , "మీరంతా నాకు భారం అయిపోతారని దేవుడికి తెలుసును. అందుకే ఇవ్వలేదు పిల్లల్ని. నాకే బెంగా లేదు. మీరంతా నా పిల్లలు కాదా?" అనేది. అటువంటి సమయంలోనే సర్వీసు అయిపోగానే ఆవిడ ఇంట్లో అద్దెకు ఉన్నాడు ఈశ్వర చంద్రుడు కొన్నాళ్ళు.
వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోగానే బెనర్జీ గారు ఈశ్వర చంద్రుడి ని చూస్తూ, "నా అంచనా తప్పు కాకపోతే నువ్వేదో దెబ్బతిని ఈ ఊరు వచ్చేవు. నీకు నేను అన్ని విధాలా ఉన్నాను." అనేసి లేచి నిలుచున్నారు. దీపాల వేళ కాగానే దీపాలు వెలిగించి తండ్రికి, బెనర్జీ గారికీ పాదాభివందనం చేసింది గిరిజ.
బెనర్జీ గారు అప్పుడు చూశారు గిరిజని. "ముంముర్టులా తల్లి పోలికే. ముక్కూ, గడ్డం, కళ్ళూ అన్నీ....అదృష్టవంతురాలు!"
ఈ మాట విని ఈశ్వర చంద్రుడు చిత్రమైన శుష్కహాసం చెయడం కూడా బెనర్జీ గారు గ్రహించేరు.
"నేనన్న మాటలు నూటికి నూరు పాళ్ళు నిజమే , అన్నయ్యా, అనే రోజు ముందున్నది. తమ్ముడూ. కర్రను పట్టుకుని పామని భ్రమిస్తున్నావు. పామునే పట్టుకుని కిరీటం ధరించే రోజులు భవిష్యత్తు లో ఉన్నాయి."
ఒక్కసారి కళ్ళెత్తి చూశాడు ఈశ్వర చంద్రుడు .
"బెనర్జీ హస్త సాముద్రికం తెలిసిన మనిషే అనుకుంటున్నావు. పిచ్చివాడా! వజ్రం హారంగా ధరించి మసి బొగ్గుగా దేనికి ఊహించుకుని తిప్పలు పడతావు?"
"ఎమిటన్నయ్యా నువ్వనేది?"
"నీ కూతురు గిరిజ ని చూశాక అనిపించింది నువ్వెంతటి అదృష్ట వంతుడివో!" బెనర్జీ గారు గుమ్మం మెట్లు దిగుతుంటే అయన వెనకే సాగనంపేందుకు అడుగు వేశాడు ఈశ్వర చంద్రుడు.
వృద్ధాప్యం మీద పడినా కర్రలాంటి శరీరంతో మంచి దారుడ్యంతో పరమేశ్వరీ కాళీ ఇల్లంతా కలియ తిరుగుతూ పడుచు పిల్ల కన్నా ఉత్సాహంగా పనిపాటలు చేసుకుంటుంటే కళ్ళు పెద్దవిచేసుకుని మరీ చూడసాగింది గిరిజ. సంధ్య పారిపోయి నిశీధి నిలదొక్కుకున్నా చీకట్లో చాలా నేర్పుగా, వడివడిగా పరుగులు పెడుతున్నదని భ్రమ కల్పించే నడకతో ఉన్న ఆవిడని చూసి గిరిజ స్తబ్దురాలుగా కూర్చుండి పోయింది గుమ్మం లోనే.
గదిలో దీపం వెలిగించేందే కానీ గుమ్మం దగ్గిరకీ ఆ కాంతి ప్రసరించడం లేదు. డెబ్బై -- ఏళ్ళు మీద పడిన ఆవిడకి సాధారణమైన మనిషి అయితే నల్లటి చీర కట్టుకున్న గిరిజ కనిపించక పోయేది. కానీ ఆవిడ సంగతి వేరు. పిడకలు లోనికి చేరుస్తూ "ఈ చీకట్లో కూర్చున్నావేం గిరిజా? ఇక్కడ ఇంకా చదును చేయలేదు. పురుగూ పుట్రా తిరుగు తుంటాయి. లోపలికి పద. అయ్యో, మతి! చేపలు పొయ్యి మీద ఉంచే ఆ సంగతి మరిచి పోయెను. వాసన మాడుతున్నట్లు నీకు అనిపించ లేదు?' అన్నది.
గిరిజ అవాక్కయి పోయింది. చేపలు....." పెదాలు కొట్టుకున్నాయి అస్పష్టంగా . ఆలోచనల్లో పడి ఆ వాసన గ్రహించనే లేదు. తీరా ఆవిడ గుర్తు చేశాక కడుపులో చెయ్యి పెట్టి కేలికినట్లయి గొంతు వరకూ వచ్చిన వెగటు వాంతి రూపం ;లో బయటకు వచ్చేసింది.
ఆవిడ కంగారు పడ్డది -- "ఏమమ్మా! ఏమైందీ?' అంటూ.
మెట్లెక్కి లోపలికి వస్తున్న ఈశ్వర చంద్రుడు అన్నాడు. "నీకే విషయాలూ చెప్పనే లేదు, పెద్దమ్మా. ఏదీ, అందరూ నిన్ను వదిలి పెడితేనా? బ్రాహ్మణులు చేపలు తినడం గిరిజకు తెలీదు. చాలా ఏళ్ళయిందని నేను కక్కుర్తి పడ్డాను కానీ అసలు ఆ సంగతే పిల్లకి తెలియ నిచ్చెను కాదు!"
ఆవిడ ఆశ్చర్య పోయింది. "అంటే నువ్వు ఈ తిళ్ళు తినడం మానుకున్నావా!"
అయన ముసిముసిగా నవ్వేడు.
"దానికి అన్నం ముందు పెట్టేయి. పెద్దమ్మా, తరవాతే నేను తింటాను." అంటూ కుక్కి మంచం మీద చేరగిల బడి పాత అలవాట్ల ని నెమరు వేసుకుంటూ తాత్కాలిక ఆనందంతో హుక్కా పీలుస్తూ త్రిశుంకస్వర్గం లో విహరించసాగెడు.
"పెద్దమ్మా" అని అందరూ పిలుస్తున్న ఆవిడని తనూ అలాగే పిలవాలని గిరిజ కి స్పురించినా "అంత పెద్దావిడ' అనుకుంది. వంట ఇంటిని అనుకున్న రెండు గదులకీ అవతల ఉన్న మరో వసారా లోకి ఈ వాసన అంతగా రావడం లేదు. గిరిజ అక్కడికి వెళ్లి లాంతరు వెలిగించి "పడవ మునక' సగం చదివినది పూర్తీ చేస్తూ "పెద్దమ్మా!" అని కేక పెట్టింది.
రెండు నిమిషాల తరవాత ఆవిడ వచ్చింది. "ఏమిటి?' అంటూ.
"నాకు ఆకలిగా లేదు, పెద్దమ్మా. కొద్ది పాలుంటే ఇవ్వు. నాన్నకి పెట్టేయి. అయన అడిగితె తిన్నానని చెప్పు." అన్నది.
ఆవిడ వేసిన మసాలా తాలుకూ వాసన చీరతో ఐక్యం అయిపోయి గిరిజ ముక్కు పుటాల ని బద్దలు చేస్తుంది. ఆవిడ గ్రహించిన దానిలా తల పంకించి వెళ్ళిపోయింది.
నైహటీ చేరుకున్న వారం పది రోజుల వరకూ ఎడతెరిపి లేకుండా ఈశ్వర చంద్రుడిని చూసేందుకు స్నేహితులూ, అప్తులూ వస్తూనే ఉన్నారు. ఈశ్వర చంద్రుడి మామగారి తాలుకూ బంధువర్గం ఒకటి రెండు సార్లు వచ్చి, ఆయన్నీ, అయన పరిస్థితినీ గ్రహించిన వాళ్ళ మాదిరి ఒక్కసారిగా ఆత్మీయత ని ఒలకబోసి పరామర్శించి తమ తమ విధ్యుక్త ధర్మాలని వెల్లడి చేసి తాము ఆదుకో గలమనే హామీల నిచ్చి మరీ వెళ్ళేరు.
రాజకీయాలూ, పార్టీ వర్గాలూ అయన చాలా కాచి వడబోసిన మనిషి కనక అన్నిటికీ తల తాటించి వాళ్ళని ఆనందపరిచి మరీ పంపేవాడు.
అమరేంద్ర చక్రవర్తి ఆ ఊరి పోస్టాఫీసు లో జనరల్ మేనేజర్ గా పనిచేసి రిటైరయిన మనిషి. అణా పైసల దగ్గరి నుంచీ లావాదేవీలు చేసి డక్కా మొక్కీలు తిన్న మనిషి. తిన్న ప్రతి పైసా కూడబెట్టి ప్రిత్రర్జితాన్ని తన అర్జితంతో ఏకం చేసి రెట్టింపు చేసిన మనిషి. ప్రస్తుతం అతని ఆస్తి పాస్తుల బెరీజంతా లకారాల మీదనే నడుస్తున్నది. ఆయనకు ఆడపిల్లలు ఇద్దరు. ఇద్దర్నీ వేల మీద వదిలిన్చుకుని పెద్ద కొడుకు పెళ్లి చేసి వాటిని రాబట్టుకున్నాడు. తిరిగి బాంకులో వేస్తె ఇన్ కంటాక్స్ గొడవలు ఉంటాయని ముందే గ్రహించిన వాడు కావడంతో ఇన పెట్టె లో భద్రంగా భద్రపరిచెడు చాలా మటుకు. రెండవ కొడుకు తండ్రి వ్యవహారాలూ, యాంత్రిక తాంత్రిక మాంత్రిక కుయుక్తు లూ నచ్చక తన వాటా ఇవ్వమని పేచీ పడి లాభం లేకపోవడంతో మనసు పడ్డ పేద ఇంటి పిల్లని సలక్షణంగా గుళ్ళో పెళ్లి చేసుకుని తండ్రి చేసిన పోస్టాఫీసు లోనే మంచి హోదాలో స్థిర పడిపోయేడు. అతని పట్ల గ్రామీణ జనానికి ఎనలేని అభిమానం ఉంది. తండ్రి కట్నం పేరిట విధించే శిక్ష కి భాగ్యవంతులు తట్టుకోగలరని అతడికి తెలుసును. అధికార యుక్తలాగా చలామణీ ఆయె భార్య కట్నం ఇచ్చేననే భావంతో ఏ విధంగా ప్రవర్తించేదీ అతడు తన అన్న సతీష్ భార్య కుముదిని ద్వారా యిట్టె అకళింపు చేసుకున్నాడు. అతనంటే ఆరాధించి, అంతర్గతంగా ప్రేమిస్తూ వచ్చిన సౌదామినని కోరి చేసుకుని తండ్రికి దూరమయేడు. రమేష్ చక్రవర్తీ , సౌదామినీ ఒకే కాలేజీ లో బి.కాం కలిసి చదువుకున్నారు. మూడో పిల్లవాడే మెడిసిన్ ఫైనలియర్ చదువుతున్న మన్మోహన్ చక్రవర్తి.
