Previous Page Next Page 
మిధ్య పేజి 7


    పూజా మందిరం లో దేవుడి విగ్రహం ముందు దీపం వెలిగించి అశ్రు దారాలతో స్వామి పాదాలు కడుగుతుంది మహేశ్వరి. అంతవరకూ విసురుగా వచ్చి ఆవిడను ఆ స్థితిలో చూసి దిగ్భ్రాంతుడయేడు హరికృష్ణ. తన తల్లి దుశఖానికి కారణం? అతని మనసు ప్రశ్న వేస్తుంటే చెప్పులు వదిలేసి లోపలికి వచ్చి తల్లి మొహాన్ని తన వైపు తిప్పుకుని, "ఎందుకమ్మా?' అన్నాడు.
    మహేశ్వరి మాట్లాడలేదు.
    "చెప్పమ్మా. నిన్నెవరేమన్నారు? నిన్ను అనేవాళ్ళున్నారా ఈ ఊళ్ళో?"
    మహేశ్వరీ కొడుకు వైపూ చూస్తూ, "ఇప్పుడు నువ్వు వెళ్ళింది గిరిజ దగ్గిరకేనా?" అని ప్రశ్నించింది.
    "అవును ఏమమ్మా?"
    "నువ్వు అక్కడికి వెళ్లేందుకు వీల్లేదు."
    కనుబొమ్మలు ముడివేసి అర్ధం కాని వాడిలా అడిగేడు: "అదేమిటమ్మా! నేను వెళ్ళింది మరెక్కడికీ కాదు కదా!"
    "మరెక్కడికైనా ఫరవాలేదు. కానీ, హరీ, నా కడుపు మండించకు. బ్రతుకంతా ఈ ఆరని జ్వాలతో పీల్చి పిప్పినై పోయాను. జవసత్వాలుడిగి నన్ను మరీ క్రుంగ తీస్తున్నాయి. ఈ వయసులో నన్ను నువ్వు కూడా బాధ పెట్టాలను కుంటున్నావా?"
    హరికృష్ణ తెల్లబోయాడు. తనా తల్లిని బాధ పెట్టడం! తన ఉద్దేశ్యాలూ, ఊహలూ , కోరికలూ ఎంత ఉన్నత మైనవైనా తన తల్లి కోసం వాటిని తృణ ప్రాయంగా చూడడా....మరి? కొంచెం ఆగి, "నేను గిరిజని పెళ్లి చేసుకోవాలను కుంటున్నానమ్మా" అన్నాడు.
    మహేశ్వరి స్తబ్దు రాలైపోయింది. అంతరంగం లో సంశయాలు బయలుదేరాయి. ఈడేరిన కొడుకు ధైర్యంగా ఆ పిల్లనే చేసుకుంటానని చెప్పడంతో మనసు చిత్ర విచిత్రమైన దారులు తొక్కుకుంటూ ప్రయాణం చేయసాగింది. తన ప్రేమ గాధ చెప్పి కారణం ఇదని వివరిస్తే విజ్ఞానాన్ని ఆర్జించుకున్న ఏ కొడుకైనా..... కొడుకనే ఏమిటి విచక్షణా జ్ఞానంతో తర్క వితర్కాలు చేసే ఏ యువకుడైనా ఏవగించుకుంటాడు. తన ప్రేమ ఫలించలేదని, ఆ ప్రేమ ద్వేషంగా మారి పగపట్టి కాటు వేసేందుకు సిద్దమైందని తెలుసుకుంటే ఆ స్థానం లో ఆత్మీయులైన మనుష్యు లెవరి నైనా సరే ధర్మా ధర్మ విచారణ చేయటం ద్వారా  వదులు కోకుండా ఉండడు. మనిషిని స్వార్ధం బంధించినంత బిగువుగా న్యాయం బిగించి బంధించ లేదు. ఒకవేళ బిగించినా అది జారు ముడిలా ఏ చివరి నుండి లాగినా దారం విడిపడి పోయి చేతిలో నవ్వుతూ ఎగతాళి చేస్తూ మరీ కనిపిస్తుంది. ఆడది అబలే కాదు, పగట్టిన కోడె త్రాచని ఒక్కో సమయంలో మగవాడు మరచి పోతుంటాడు. ఇందుకు కారణం తల్లి కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, సోదరి కావచ్చు లేదా 'ఆడది' అనే తేలిక భావం కావచ్చును. ఏది ఏమైనా పరిస్థితుల ప్రాబల్యానికి లొంగిపోయిన మగవాడు అప్పుడప్పుడు మోసపోతుంటాడు. వెర్రి వేయి తలలు . స్వార్ధం కోటి తలలు. మహేశ్వరి కొడుకు భుజం పైన చేయి  వేసి తల మీదుగా రప్పించి గుండెల్లో కి దూర్చుకుని దీర్ఘంగా నిశ్వాస విడిచింది. వెచ్చని రోమ్ముల్లోంచి అతను తల్లిని వివిధ కోణాల్లోంచి చూస్తున్నాడు. అందాల అపరంజి బొమ్మ అమ్మ అవిటి వాడిని చేసుకుని ఎంత త్యాగం చేసింది! అమ్మ బ్రతుకులో ఆశలంటూ లేకుండా ఎలా గడిచి పోయేయి రోజులు! తండ్రి పోగా తన కళ్ళలో దీపం వెలిగించుకుని తన బిడ్డ భవిష్యత్తు ను తీర్చి దిద్దిన ఆవిడ కన్న ప్రపంచపు పోకడ తనకు తెలుస్తుందా? నిలదొక్కుకున్నవాడిలా కొద్దిగా తల పైకెత్తి అడిగేడు, "ఏమమ్మా నువ్వేదైనా చెప్పదలుచు కున్నావా?' అని.
    మహేశ్వరి పరికించి చూడసాగింది. నిలువెత్తు విగ్రహానికి అమాయకత్వం నీరు పోసి మిలమిల లదిస్తుంది! "నా నోటితోనే చెప్పాల్సి వస్తుందను కోలేదు" అన్నది ఒక్కొక్క మాటే ఒత్తి పలుకుతూ.
    హరికృష్ణ తెల్లబోయినట్లు చూశాడు.
    ఆడది అబద్దం అడదలుచుకుంటే ప్రపంచాన్ని కూడా జయించేయగలదు.
    "అసలు సంగతి ఇది. కలకత్తా లో ఈశ్వర చంద్రుడు పనిచేసిన మిలటరీ ఉద్యోగం లోనే సంపన్ను డెవరో అమ్మాయి అందం చూసి డబ్బు పెట్టి కొనుక్కుంటున్నాడు."
    "అమ్మా?"
    "దేనికిరా ఆశ్చర్యం? నీ సరసన అది నా ఒళ్లో పెరిగి ఇంతదైనది. ఈవేళ డబ్బు మహత్యంలో నా కొడుకు కానివాడై పోయేడు. వాళ్ళకే లేనిది మగపిల్లని కనుక్కున్న నాకు దేనికి బాధ?"
    "నువ్వంటున్న దేమిటమ్మా! నేను వెళ్లి కనుక్కుని వస్తాను."
    కొడుకు చేయి పట్టుకున్నది మహేశ్వరి. "వద్దు ఇప్పటికి నలుగురిలో జరిగిన ఈ అవమానం చాలు. నువ్వే వెళ్లి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా వన్న కీర్తీ కూడా దక్కించుకోవాలను కుంటున్నావా?"
    క్షణ కాలం నిరుత్తరుడయేడు. చదువుకున్న జ్ఞానం ఆవిడ గాలి దుమారం లేవదీస్తూ "హుష్ కాకీ' అన్న విధంగా పదునుగా విసిరిన ప్రతీకారపు తుఫాను లో లీనం అయిపోయి నామరూపాలు లేకుండా అయిపొయింది. పురుషుడి అహంకారం స్త్రీని గురించి పదేపదే పొగుడుతూ గుర్తు చేస్తూ ఉంటె నాగస్వరానికి తలెత్తిన నాగెంద్రుడి చందాన తయారై అంతలోనే పడగ విప్పి స్వైరవిహారం చేస్తుంది. మెట్లు దిగి చెప్పులు వేసుకుని చేతి కర్ర ఊచుకుంటూ పొలం గట్టు వైపు వెళ్ళిపోయేడు అతను. దారిలో ఒకళ్లిద్దరూ పలకరించినా వినిపించుకోలేదు.
    మలుపు తిరిగి రేవు వైపు వెడుతుంటే గోపాలం కనిపించి, "బాగున్నావా, హరీ?" అన్నాడు. అతను తలెత్తి చిన్ననాటి స్నేహితుడి వైపు ఒక్కసారి దృష్టి మళ్ళించి అంతలోనే తల తిప్పేసి, "ఆ" అన్నాడు విసురుగా.
    "ఈ సంగతి నువ్వు వినే ఊరుకున్నావా?' గోపాలం చాలా దగ్గరగా వచ్చి అన్నాడు.
    'అవును.' హరికృష్ణ పెడసరంగా సమాధానం ఇచ్చి ముందుకు సాగిపోతుంటే "ఏం మనుషులు!" అంటున్న గోపాలం మాటలు అస్పష్టంగా వినిపించేయి.
    తిరిగి తిరిగి సాయంత్రం చీకటి నాలుగు వైపులా కమ్ముకోగానే అలిసిపోయి ఇంటికి వచ్చేడు. తల్లి భోజనానికి పిలిచినా వెళ్ళలేదు. అతని మనసు ముక్కలై పోయింది. చీకట్లో గదిలో ఒంటరిగా కూర్చుని గతించని గతం నెమరు వేసుకుంటుంటే కళ్ళు చెరువులే అయేయి. అతనికి తెలియని సంగతులు అనేకం ఉన్నాయనీ, అందులో నిర్భాగ్యురాలైన గిరిజ ఈ సమయంలో ఆనందాన్ని జుర్రు కుంటూ కాబోయే వివాహాన్ని గురించి కలలు గంటూ కూర్చోదనీ, రాబోయే సిరి సంపదలకి నివాళు లెత్తదనీ అతనికి ఈషణ్మాత్రం తెలియక పోగా తనలాగే అంతు చిక్కని కటిక చీకటి లాంటి సమస్య కి పరిష్కార మార్గం తెలియక భోరున విలపిస్తున్నదనీ కూడా తెలియదు.
    రాత్రి పగలు మధ్య భేదం తెలియని గిరిజ కీ హరికృష్ణ వెళ్ళిపోవడం కూడా తెలియదు. స్నేహితురాలు దుర్గ ఆ విషయం చెప్పినప్పుడు ఉదాసీనంగా విని ఊరుకుంది. తల్లీ కొడుకుల మధ్య ఏదో పేచీ వచ్చిందని నౌఖరు చెప్పిన విషయం అందరూ నమ్మినట్లే తనూ నమ్మింది. మహేశ్వరీ వేసిన ప్రతీ ఎత్తు దిగ్విజయంగా పారుతున్నది.
    శనివారం తెల్లవారు ఝామున బయలుదేరాడు ఈశ్వర చంద్రుడు. అతని కళ్ళలో నీళ్ళు గుండెల్లో కి జారిపోతున్నాయి. కలకత్తా లో తను ఉన్న నైహటీ గుర్తుకు రాగానే గుండెల్లో బరిసె పోట్లు అవిరామంగా పడుతునట్లే ఉంది. ఓడలూ, బళ్ళూ, బళ్ళు ఓడలూ అయిపోవడంతో అతను ఎప్పటికప్పుడు పొట్ట చేతిని పట్టుకుని మజీలిల్ వెంట మజీలీలకి ప్రయాణం చేస్తున్నాడు. నౌఖరు వచ్చి ఎర్రని కనకాంబరాల దండ మహేశ్వరి పంపిందని ఇచ్చేడు. గిరిజ వాటిని అందుకో లేదు. అవి కాలనాగుల్లా కనిపించ సాగేయి. స్టీమరు రాజమండ్రీ వైపు బయలుదేరింది. గిరిజ కన్నీరు గోదావరీ ప్రవాహం లో కలిసి పోతుంటే కలకత్తా చేరడం రెండు మూడు రోజులు పట్టింది.

                             

                           *    *    *    *
    ఈశ్వరచంద్రుడు నైహటీ వచ్చేడనగానే తెలిసిన వాళ్ళందరూ చూసేందుకు వచ్చేరు. అమరేంద్ర చక్రవర్తీ కొడుకు, బెనర్జీ గారూ, తాలుకా ఫీసులో గుమస్తా లూ, పోస్టు మాస్టరు ముఖర్జీ అంతా అతనికి  స్వాగతం చెబుతుంటే అయన లోలోపలే అనుకున్నాడు. "ఎంత పిచ్చివాడిని! పుట్టి పెరిగిన ఊరనీ, ఆంధ్రదేశం అనీ వెళ్లి ఏం కొని తెచ్చుకున్నాను? ఇంతమంది అప్తుల్నీ, అత్మీయులనీ దూరం చేసుకుని తాచుపాముని తొక్కేశాను!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS