Next Page 
తప్పు పేజి 1

 

                                        తప్పు
            
                                                                                       శిఖావెంకటరమణారాజా.

                       


    క్షణం లో పెళ్ళి వారిల్లు రణరంగం లా మారిపోయింది. మగపెళ్ళి వారు దుమ్మెత్తి పోశారు. పెళ్ళి వారు సాధ్యం అయినంత వరకూ గొంతులు చించుకున్నారు.
    వియ్యపురాలు అలక వహించి మాటల ఈటేల్ని వొడుపుగా విసర సాగింది. వియ్యంకుడు ఆకాశం అంత యెత్తున యేగిరాడు. యజ్ఞోపవీతం భుజాలు దాటి వీపు మీంచి క్రిందికి జారిపోతోంది.
    అతను ఒక్కోమాట అంటూ గాలిలోకి యేగురు తుంటే మిట్ట మద్యాహ్నపు ఎండ అయన నున్నటి బుర్రని మేరిపిస్తోంది. తళతళలాడిస్తూ. నడినెత్తిన నిమ్మకాయంత ప్రమాణం లో వున్న పిలక ముడి అదిరిపోయి , సగం విడిపోయి మెడ మీదికి పడిపోయింది చెల్లా చెదురుగా.

                 
    అయన భారీ శరీరం ఎండ వేడిమికి లోపలి వుద్రేకానికీ నిలవలేనట్లు యెడతెరిపి లేకుండా నీటి ప్రవాహాన్ని శరీరనాళాల్లోంచి దిగుమతి చేస్తోంది.
    నల్లని అయన శరీరం మీద పన్నెండు గంటల ఆ సమయంలో ముత్యాల బిందువుల్లా ధారగా ఒక్కొక్క చుక్కే స్వేద బిందువులు కపాలం మీద నుంచి కపోలాల మీదుగా వక్ష స్థలం మీద పడుతుంటే ఆడపెళ్ళి వారు డంగై పోయి స్థాణువుల మాదిరి గా చూస్తూ నిలబడి పోయారు నోట మాట రాక.
    ఆ సమయం లోనే పురోహితుడు నెమ్మదిగా జారుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పెళ్ళి కుదిర్చిన పెద్ద మనిషి అంత క్రిత్రమే అంతర్ధానం అయాడు. ఈ రభసనంతా ఆడపెళ్ళి వారూ, మగ పెళ్ళి వారూ ప్రేక్షకుల వలె  వింతగా వినోదం తిలకిస్తూన్నారు. అప్పుడు ... అటువంటి సందర్బం లోనే విశ్వనాధం లేచి వెళ్ళి వియ్యంకుడి చేతులు పట్టుకున్నాడు. 'యివే కాళ్ళను కొండి. నేను మీ పాదాల్ని అంటుకున్నా తప్పు లేదు. మీరు పెద్దలు . నాకు యిరవై రోజులు గడువు యిప్పిస్తే తల తాకట్టు పెట్టి అయినా మీకు యివ్వాల్సిన సొమ్ము అణా పైసల్తో యిచ్చేస్తాను. నామీద నమ్మకం వుంచుకోండి. ఆరువేలు యిచ్చిన వాడికి నాలుగు వేలు ఎగవేస్తావా మావగారూ.'
    పెళ్ళి కొడుకు తండ్రి దీక్షితులు ఒక్కసారి విశ్వనాధం చేతుల్ని విసిరి కొట్టాడు. 'చాల్చాల్లే . యింత దగా చేస్తారని తెలుస్తే అసలు ఈ సంబందానికే ఒప్పుకునే వాడిని కాను. యేమిటయ్యా తెగ మాట్లాడు తున్నావు. చచ్చు ఆరువేల రూపాయల్తో నన్ను వుద్దరిస్తూన్నట్లు మాట్లాడతావెం? తాహతుకు మించిన పనులు దేనికోయ్ చేయడం. మా కుర్రాడు యింజనీరింగ్ చదివెందుకే పదివేల పైన అయిపొయింది. ఫారిన్ వెళ్ళిన వాడు పదివేలకి తెరగా వస్తాడనుకున్నావా?'
    "ఎడయ్యా ఆ పెద్ద మనిషి. మహా మంచి సంబంధం కుదిర్చేడు. అటు యేడు తరాలూ, యిటు యేడు తరాలూ వల్లే వేస్తూ పోగిడాడని పదివేలకి మొగ్గు చూపాను. తీరా యీ సమయంలో యిలా చేస్తారని తెలుస్తే....' అయన రంకెల కి పేరూరు పోలి మేరలు దద్దరిల్లుతున్నాయి.
    విశ్వనాధం వదల్లేదు. అయన ముందు వినమ్నాడై నిలుచున్నాడు. రెండు చేతులూ జోడించి ముఖాన చేర్చుకున్నాడు. నిమిషం లోనో, సెకెండు లోనో రాలిపడేటట్లున్నాయి అతని కనుకొలుకుల్లో అంతవరకూ నిగ్రహంగా తారట్లాడిన కన్నీటి బిందువులు. అతని ఆశలు గాలి దుమారాల్లా పైపైకి తెలిపోతున్నాయి. అతని నిస్సహాయతని దీక్షితులు గారు పదివేల గొంతులతో వూరూరా మైకు సహాయం అవసరం లేకుండానే చాటి చెపుతున్నాడు. హోరాహోరీ పోరాటంతో సూత్రధారులైన విశ్వనాధం, మీనాక్షీ ల ప్రమేయం లేనే లేదు. కన్యాదాత అయిన అతను నిర్జీవ శిలా ప్రతిమలా చాలాసేపు యిరుపక్షాల వారి బలాబల్నీ నిమిత్త మాత్రుడిలా చూస్తూండి పోయాడు. చివరికి పెళ్ళి పీటల మీద కూర్చున్న కొడుకుని బరబరా లాక్కు వచ్చేందుకు దీక్షితులు సన్నద్దుడు కావడంతో గత్యంతరం లేక అప్పుడే తేరుకున్న వాడిలా వచ్చి ఆయన్ని చేరుకొని ప్రాధేయ పడసాగాడు.
    విశ్వనాధం యిల్లాలు మీనాక్షి కూడా అతని వెనక బయలుదేరి దూరంగా నిలుచుని భర్తకి పురి ఎక్కిస్తున్న వియ్యపురాలి వైపు కొంతదూరం సాగి భర్త లాగే బ్రతిమిలాడ సాగింది.
    ఆవిడ మూతి ముప్పై గజాల దూరానికి నిలిపి భ్రుకుటి ముడివేసి అడ్డ బాసర పై పెదవి మీద కదులుతుంటే గర్వంగా తనకేమి సంబంధం లేనట్లు దిక్కుల వైపు దృష్టిని నిలిపింది. మీనాక్షి అడే మాటలు గాలిలో దూది పింజెల కన్నా తేలికై పోయాయి. అప్పటికప్పుడే మగపెళ్ళివారు బళ్ళు సిద్దం చేయించుకుని, ప్రయాణానికి సిద్దం అయిపోయారు. క్రిందికి దువ్వుకుని మెడ మీదికి చాలా యెత్తుగా చిన్న ముడి వేసుకున్నది సుందరమ్మ. ముడి ఆ విధంగా బిగించి వేసుకోవడం వల్ల తల మీది ఆభరణాలు కొద్దిగా స్థానం తప్పాయి ఎస్టేటుకి అధికారిణి ని అనే దర్పం ప్రదర్శిస్తోంది ఆవిడ. ముక్కుకి నాలుగైదు చెవులకీ దాదాపు కొన్ని వేలు ఖరీదు చేసే విలువైన ఆభరణాలు వున్నాయి. మనిషి అయిదడుగుల భారీ విగ్రహం అవడం వల్ల వీటినన్నిటినీ సులభంగా చాలా తేలికగా భరాయించగల్గె వోపిక వున్నదని గ్రహించేయవవచ్చును. శిరస్సు మీద నుంచి నడుము వరకూ మేలిమి బంగారం ముద్దలు చేసి దిగేసినట్లుంది ఆవిడ. కారు నలుపే అయినా లక్ష్మీ దేవి కటాక్షం వల్ల ఆవిడ అణువణువూ కళకళలాడుతోంది. కంటి కోసల మీదుగా దర్పాన్ని ప్రదర్శిస్తోంది.మీనాక్షి మామూలు నేరేడు పండు రంగు పట్టు చీరలో , మెడలో పచ్చని తాడుతో, నల్ల పూసలతో పసుపు రాసుకున్న వొంటి మీద మూర్తీ భవించిన తెలుగు తల్లిలా వుంది.
    మీనాక్షి వొంటి నిండా కొంగు తీసుకుని ఆవిడ వైపు తిరిగి బేలగా అర్ధించసాగింది. "మీరైనా చెప్పండి పిన్నిగారూ. తప్పకుండా పదిహేను , యిరవై రోజుల్లో అణా పైసల్తోముట్ట జెప్పుతాం అని. అభం శుభం తెలియని గోవిందని అన్యాయం చేయడం ధర్మం కాదు.'
    సుందరమ్మ కళ్లల్లో అగ్ని కణాలు జాజ్వల్యమానంగా ప్రకాశించ సాగాయి. ఆవిడ నోరు విప్పుతే ప్రళయం వచ్చే ముందు కలిగే తపన బయలు దేరసాగింది ఆడపెళ్ళి వారిలో. యిరు పక్షాల వారి మధ్య సంప్రదింపులు పొసగలేదు. బళ్ళు సిద్దంగా వుండి యజమాని అజ్ఞా కోసం నిరీక్షిస్తున్నాయి.
    పెళ్ళికొడుకు మొదటి నుంచీ ఈ రభసని క్షుణ్ణంగా తిలకిస్తున్నాడు. పెళ్ళి కూతురి కళ్ళల్లో నీళ్ళు బొటబొటా రాలి చెంపల మీద పడుతున్నాయి. అతను తలతిప్పి  పక్కకు చూశాడు. ఆ పిల్ల అదోవదన అయి కాలి బొటన వ్రేలితో నేల మీద రాస్తుండి పోయింది. అతనీ సారి దృష్టి ని పందిట్లో జరిగే తతంగం వైపు మళ్ళించేడు. అక్కడ యుద్దకాండ యింకా పరి సమాప్తి కాలేదు. తనేక్కిన కొండ మీంచి దిగేందుకు వ్యతిరేకంగా వియ్యంకుడు భీష్మించుకుని హాఠం వేసుకున్నాడు.
    విశ్వనాధం నిస్సహాయతా, మీనాక్షి బేలతనం యే మాత్రం కరిగించడం లేదు. కలవారైనా మగ పెళ్ళి వారిని.
    యిప్పుడు చాలాసేపటికి పెళ్ళి కొడుకు తండ్రి దృష్టి పీటల మీద యింకా కూర్చుని వున్న కొడుకు వైపు మళ్ళింది. అయన చండ్ర నిప్పులు కంఠంలోంచి కురిపిస్తూ 'దిగవోయ్ యింకా ఎందుకక్కడ దిగమారడం, పదపద,' అన్నాడు.
    అతను తండ్రి వైపు చూశాడు. ఆ తండ్రి వేయి యేనుగుల బలంతో చూపులతోనే మెడ పట్టుకుని గెంటుతున్నాడు.
    గోవింద తల ఎత్తింది. అన్నా వదినలు యిద్దరూ కళ్ళ నీళ్ళు పర్యంత కాగా చేత కాని వారిలా నిలబడి ప్రాధేయ పడుతుండడం గమనించింది. పెళ్ళి కొడుకు లేచేందుకు సిద్దంగా వున్నట్లు కనిపించగానే గోవిందే ముందు లేచి పందిట్లో కి వచ్చింది. పెళ్ళి వారు కళ్ళు వెడల్పు చేసుకుని చోద్యం చూడసాగారు. పెళ్ళి కూతురు బరి తెగించిన దానిలా కనిపించసాగింది వాళ్ళ కంటికి.
    అన్నకి దగ్గరగా వచ్చి అతని భుజం మీద చేయి వేసి 'ఎందుకన్నయ్య ప్రాధేయ పడతావు. బ్రతకలేము అని నీకు భయంగా వుందా చెప్పు. యింత పెద్ద ప్రపంచంలో బ్రతికేందుకు మార్గం కనిపించకపోతే చచ్చిపోవడం నాలాంటి వాళ్లకి కష్టం అంటావా? డబ్బు కక్కుర్తి మనుష్యుల దాహం నువ్వెలా తీర్చగలవు? వెళ్ళనియ్యి. వెళ్లేముందు ఆయనగారితో చెప్పు . రాకపోకలు యెలాగూ వుండవు కనక మెళ్ళో గంట క్రితం కట్టిన తాళికి కోర్టు యెలాగూ విలువ యిస్తుంది కనుకా విడాకులు యివ్వమంటారేమో !" అన్నది.
    దీక్షితులు మొహం మీద కత్తి వాటుకి నెత్తురు చుక్క లేకుండా పోయింది. సుందరమ్మ అప్రతిభురాలై పోయింది. మగపెళ్ళివారు నిర్విడ్నులై పోయారు.
    విశ్వనాధం చెల్లెలు వాగ్దోరణిని ఆపే ప్రయత్నం చేయబోయాడు. గోవింద వినిపించుకోలేదు! 'దేవుడు మంచివాడన్నయ్యా. వీళ్ళ స్వభావాలు అద్దంలో ప్రతిబింబం లా చూపించేడు. లేకపోతె ఏమై పోయేవాళ్ళం మనం.' అని మావగారి వైపు తిరిగింది. పుస్తె కట్టినందుకు కోర్టుల కెక్కి లావాదేవీలు చేసి ఏదో కొంత రాబట్టుకుంటాం అనే భయం మీకువొద్దండి. పరువు గల వాళ్ళం. ప్రతిష్ట కోసం ప్రాకులాడుతున్నాం. మీకు హామీ యిస్తున్నాను. నేను గానీ, మా అన్నయ్య గాని ఏ విధంగానూ మీ జోలికి రాము.'
    'యిప్పుడే యీ క్షణం లోనే మీరు కోరితే తప్పకుండా ఆయనకి విడాకుల పత్రం రాసి యిస్తాను."
    'గోవిందా,' మేఘగర్జనలా వుంది పెళ్ళి కొడుకు స్వరం. అతని స్వరానికి పందిరి తాలూకు స్తంభాలు కదిలినట్లూ పందిరి మీది తాటాకులు యెగిరి పడినట్లూ శబ్దం వినిపించ సాగింది.
    గోవింద మాట్లాడకుండా వివాహ వేదిక మీదికి చూపుల్ని నిలిపింది.
    అతను అడుగులు వడివడిగా వేస్తూ కదిలివచ్చాడు.
    "యేవిటోయ్ ,' అన్నాడు దీక్షితులు హేళనగా.
    పెళ్లికొడుకు గోవింద భుజం మీద చేయి వేశాడు ధైర్యాన్ని పోస్తున్నట్లు. తండ్రి వైపు తిరిగి "మీ ఆస్తి పాస్తుల్లో చిల్లి గవ్వ నాకు వొద్దు నాన్నగారు. యింతవరకూ నేను పనిచేసిన జీతం తాలూకు డబ్బు బాంక్ లో ఆరువేల పై చిలుకే వున్నాయి. అవీ యీ పిల్లని చేసుకున్నందుకు వీళ్ళ అన్నయ్య అడ్వాన్సు గా యిచ్చిన ఆరు వేలూ నా చదువులకి మీరు భరించిన ఖర్చుగా తీసుకోండి. చిన్నతనం నుంచీ పెంచి పెద్ద చేసిన బుణాన్ని యెవరూ తీర్చుకోలేరు . నేనెంత?'
    'గోవింద ఆడపిల్ల. భావిని ఘనంగా చిత్రించుకుని బ్రతికే సామాన్య కుటుంబం లోని సగటు ఆడపిల్ల. నేనే అన్యాయం చేస్తే డబ్బు నాతొ రాదు. ఆ పిల్ల బ్రతుకులో నిప్పులు పోసిందుకు కాదు కదా నేను ఆర్జించిన విజ్ఞానం ,' అని ఆగాడు.
    దీక్షితులు డిల్లపోయేడు. యెదురుగా ఆరడుగుల పొడుగుతో, తగిన బలంతో, విశాల వక్ష స్థలంతో యింతవరకూ తన కంటికి మూడేళ్ళ కుర్రాడిలా కనిపించిన కొడుకే యెదిగి కొన్ని గంటల వ్యవధి లో ఆకాశం అంత యెత్తున పెరిగి పోతాడని అయన అనుకోలేదు. కల అయిందీ యదార్ధం అయిందీ అయన మేధకి అంతు చిక్కడం లేదు. నోట మాట రాని వాడిలా నిలబడి పోయేడు.
    "ఏవిటలా చూస్తూ నిలుచుంటారు? రెక్క పుచ్చుకుని లాక్కు వెళ్ళి బండి లో కూలేయక? నక్కపుట్టి నాలుగు వారాలు కాలేదుట. వీడా మనకి ధర్మ పన్నాలు వుపదేశించేది. చూస్తారేం?' సుందరమ్మ కొడుకు చేతిని అందుకుంది.
    విష్ణు మూర్తి తల్లి వైపు చిరునవ్వు తో చూస్తూ, 'ఆడపిల్లల్ని కన్న వాళ్ళకి తెలుస్తుందమ్మా యీ బాధ. నీకూ నాకూ అర్ధం కాదు. నువ్వు ఒక్కడిని నన్ను కన్న గొప్పింటి యిల్లాలివి. నా చేయి పుచ్చుకుని తీసుకుపోతే నీ వెంటబడి వచ్చేందుకు పాలు తాగే పసివాడినా? నన్ను వదులు.' అన్నాడు సున్నితం గానే.


Next Page 

WRITERS
PUBLICATIONS