"ఇంకా ఎనిమిది నెలలు" సుధాకర్ వ్రేళ్ళు లెక్కపెట్టాడు.
"అంటే?"
"ఎనిమిది యుగాలు" నిట్టూర్చాడు "సరేలెండి, ఇదేనా!" తానేమీ ఆదుర్దాపడనట్లు తేలిగ్గా అంది.
"మీ అమ్మా వాళ్ళేరి?"
"అమ్మ ఊరికెళ్ళింది. నాన్నగారు ఊళ్ళో కెళ్ళారు. ఇవ్వాళ శ్రావణ శుక్రవారం కదా? ఎవరో బంధువుల ఇంట్లో పూజ. అక్కడికి వెళ్ళి వస్తాను.....ఎందుకని?"
"ఆ....ఏం లేదు......త్వరగా వస్తే పరిచయం చేసుకోవలసి వస్తుందని. అంతే....అలా తోటలోకి వెళ్దామా? వెన్నెట్లోకి వెళ్ళాలని లేదా నీకు?"
ప్రేమ లేచి నిలబడింది "సరే....పదండి"
వెండి పూత పూసినట్లు మెరుస్తోంది పృధ్వి.
ఎత్తుగా పెరిగిన నందివర్ధనచెట్ల సమీపంలో నేలమీద కూచున్నారు. సుధాకర్ అదేపనిగా ప్రేమవైపు చూస్తున్నాడు. అతని హృదయం ఎత్తుగా లేచి పడ్తూంది. కాళ్ళు చాపి కూర్చున్న సుధాకర్ వెనక్కు వాలాడు కుడి మోచేతిపై - ఆకాశం వైపు దృష్టి మరల్చాడు.
ఇలా నిశ్శబ్దంగా వుంటే బాగా లేదనుకుంది ప్రేమ.
"ఏదో మాట్లాడాలని వచ్చారు"
"ఇప్పుడు కాదు.....ఈ సమయం అతి పవిత్రమైనది నిన్ను చూస్తూ ఐదు నిమిషాలు గడపనీ ప్రేమా"
ఆమె గర్వంగా నవ్వుకుంది తనను. ఎంత ప్రేమిస్తున్నాడు! తన ఎదురుగా కొన్ని క్షన్లు గడపటానికి వచ్చాడు. అది చెప్పలేడు కానీ తనకు చెప్పించాలని కాంక్ష.
సుధాకర్ మెల్లగా వుద్రేకంతో అన్నాడు.
"ప్రేమా రెండు నంది వర్ధన పువ్వులు కోసి నా కళ్ళమీద పెట్టవూ?"
"ఓ యస్ దానికేం ఆమె లేచింది. పువ్వులు ఎత్తున వున్నాయి. ఒకటి కోసి రెండవది కోసేలోపల ఆమె నడుము చుట్టూ ఏదో చుట్టుకుంది.
గబహరగా కేకవేసి విదిలించబోయింది. అది వదల్లేదు. అప్పటికి గ్రహించింది ప్రేమ - అది పాము కాదని - సుధాకర్ హస్తం అని. పాము కాదన్న భావన క్షణం ఆమెకు కాంతిని చేకూర్చింది: మరుక్షణం అంతకంటే మించిన భయంతో ఇటు తిరిగింది. సుధాకర్ ఆమె నడుం చుట్టూ చేతులు పోనిచ్చి పట్టుకున్నాడు. గాఢంగా ఊపిరి వదుల్తున్నాడు. "సుధాకర్ ఏమిటది?" బెదిరిన ఆమె చూపులు. భయంగా కంపిస్తూన్న శరీరం - అతని బాహు బంధాన్ని విడిపించుకోవాలని ప్రయత్నిస్తూన్న హస్తాలు ఏవీ అతని దృష్టిలో పడటం లేదు అతని కళ్ళు మైకం క్రమ్మినట్లున్నాయి ఎప్పుడు చూడని మంచు పొరలు ఆకళ్ళపై కదిలాడుతున్నాయి. ఆచ్చాదనలేని రవికె క్రింద నడుమును తాకుతున్నా అతని చేతులు చల్లగా మంచుముక్కల్లా వున్నాయి. తిమ్మిరెక్కినట్లు బాధ పడింది.
ఆ విధంగా ఉన్మాదావస్థలో అతన్నెప్పుడూ చూడలేదు ఆమె భయపడింది. సుధాకర్ ఆమెను హృదయం పైకి లాక్కుంటున్నాడు. గట్టిగా అంది సుధాకర్ ఏమిటిది? పిచ్చెక్కిందా "చేతితో టెంపను కొట్టింది! అతను పట్టు సడలించాడు కానీ ఆమెను వదల్లేదు.
"ఏమైంది - ఏమైంది రెండు చేతులెత్తి అతని ముఖాన్ని పట్టుకుని అటు ఇటు వూపింది ఒకసారి గట్టిగా వూపిరి వదిలాడు. అతని చేతులు వదిలాయి.
మరుక్షణంలో క్రింద కూలబడిపోయాడు. మోకాళ్ళమీద తల పెట్టుకుని వాటిచుట్టూ చేతులువేసి నిశ్చలంగా కూర్చున్నాడు.
ప్రేమ నిశ్చేష్టురాలై నిలబడింది. కొన్ని క్షణాలు నిశ్శబ్ధంగా గడిచి పోయాయి.
"ప్రేమా"
అతను తలెత్తాడు. ఆ దృష్టి మామూలుగా వుంది. ఆమె ముఖం త్రిప్పుకుంది.
"ఎందుకలా భయపడ్డావు?" జాలిగా ప్రశ్నించాడు.
"ఏమో.....భయపడటం సహజమే కాబోలు"
"ఎక్స్ క్యూజ్మీ ప్రేమా"
ఆమె మౌనంగా నుంచుంటే అది భరించలేకపోయాడతను.
"ప్రేమా....నన్ను క్షమించలేవా?" అతను లేచి నుంచున్నాడు.
ప్రేమ ఒక్క అడుగు వెనక్కి వేసింది ఏదో గొణుక్కుంది.
"అయామ్ సారీ ప్రేమా- ఏవో మిశ్రిత భావాలు కలగలు వయ్యాయి.....ఈ వెన్నెల రాత్రి, ఆకు పచ్చగడ్డి మీద ఈ మంచు బిందు వులు.... ఈ నందివర్ధన పుష్పాలు....పాము కుబుసంలాంటి తెల్లచీరతో నుంచున్న నువ్వు.....పువ్వులు కోయబోయిన నీవు ఎవరో మహాకిల్పిచే పూర్తిచేసిన చలువరాతి విగ్రహంలా.....ఎందుకో విగ్రహం కోల్పోయి నన్ను నేను మర్చిపోయాను ..... మూర్ఖంగా ప్రవర్తించాను .... నన్ను క్షమించు ప్రేమా. ఇలా - ఇక ఎన్నటికీ తొందర పడకు ప్రేమ మృదువుగా అంది. "మీరిలా చేస్తే ఎలా? ఆనాడు పార్క్ లో ఏమనుకున్నాము? దూరంగా వుండాలని కాదా! మీతోబాటు నేనూ ఆవేశానికి లొంగితే-?....అసలు నాదే పొరపాటు.... మీరు నన్ను బైటికి రమ్మన్నప్పుడే- రాకుండా వుండవలసింది. లోపల కూచుని వుంటే ఇలా అయ్యేదికాదు...." ఆమెపరిశీలనా శక్తికి ఆశ్చర్యపోయాడు సుధాకర్.
"వెళ్ళొస్తాను ప్రేమా- మా అమ్మకు మన విషయం చెప్పాను. మా అమ్మ గుట్టకు మారుపేరు. ఎప్పుడైనా నిన్ను తీసుకొని రమ్మని చెప్పింది.
ప్రేమ ఆలోచిస్తూ లోపలికెళ్ళి అప్రయత్నంగా గడియారం వంక చూచింది. సుధాకర్ అక్కడున్నది సరిగ్గా పదహారు నిమిషాలు! ఏదో ప్రమాదం తప్పిపోయిన సంతోషంతోబాటు జరగకూడనిదేదో జరిగినట్లు విచారంకూడా కలిగింది.................అంతాచేసి పదహారు నిమిషాల్లో? ఆమె లోపలికెళ్ళి రెండుగ్లాసులు మంచినీళ్ళు త్రాగింది.
"రంగా రంగా" వాడు రాలేదు. మళ్ళీ పిల్చింది. కళ్ళు మలుము కుంటూ వచ్చాడు.
"ఏరా- మళ్ళీ చుట్టకాల్పటానికి - వెళ్ళావు కదూ? ఎంత పిల్సినా పలకవు. అయ్యగారురానీ..."
"వద్దండమ్మా- ఇక ఎప్పుడు కాల్పను"బెదిరిపోయాడు.
"నేను చదువుకుంటాను. అయ్యగారు రాగానే పిలువు", మేడమీది గదిలోకి వెళ్ళి తలుపేసుంది. మంచంమీద పడుకుంది. ఆమెకు ఆశ్చర్యం కలిగింది. తనలో అంత నిగ్రహశక్తి ఎలా వచ్చింది?
అతని కౌగిలి వెచ్చదనంకోసం, అతని స్పర్శకోసం అనుక్షణం ఆరాటపడే తను ఎందుకంతగా భయపడిపోయింది! దగ్గరకు తీసికొన్నంత మాత్రాన భయమేముంది?
ఆ దృశ్యంఅంతా ఊహాలోకంలో పునర్నిర్మించుకుంటూ ఆనందించ సాగింది. ఆమె ఊహాలోకంలోంచి బైటపడటానికి ఎంతోసేపు పట్టలేదు!
"అయ్యగారొచ్చారమ్మా" అన్నాడు రంగడు. ప్రేమ సిగ్గుపడ్తూ లేచింది! కానీ తన ఊహల ప్రభావం ఆమెలో స్పష్టంగా అగుపించాయి! ముఖం అద్దంలో చూచుకుంది! ఏదో పోగొట్టుకున్నట్లుందా ముఖం! ముఖం తుడుచుకుని రెండు నిముషాలు మంచంమీద కూచుంది.
* * *
ఒకనాడు సాయంత్రం కార్ లో వచ్చాడు సుధాకర్. విమలమ్మ ఇంట్లో వుంది.
ఆరుగంటలవవస్తోంది. కారు శబ్దం విని పూలుకొస్తున్న ప్రేమ గేటు వరకు వెళ్ళింది.
"ఒక్క అరగంట సెలవడిగినా ప్రేమా! మా యింటికి వెళ్దాం నాన్న గారు లేరు. వదిన పుట్టింటికెళ్ళింది. తమ్ముడికి ఒంట్లో బాగాలేదు. అమ్మను చూచి వచ్చేద్ధువుగాని"
ప్రేమ సాలోచనగా అతని వైపు చూచింది. నెమ్మదిగా తల అడ్డంగా ఆడించింది. "క్షమించు సుధాకర్. మా అమ్మకు జ్వరంగా వుంది. రాలేను.....పెద్దజ్వరం కాదు గాని.....తలనొప్పితో కాస్త ఒళ్ళు వెచ్చజేసింది. నేను రాలేను...ఏమీ అనుకోకు?"
సుధాకర్ కు ఈసారి కొద్దిగా కోపం వచ్చింది. కోపం స్పష్టంగా కనబడిన ఆ కళ్ళలోకి సూటిగా చూచి కొద్ది భయంతో పేలవంగా నవ్వింది. "మీ అమ్మగారు ఒక్కరు చూస్తే చాలా?..... అలా అనుకుంటే వారినే ఒక సారి ఏదో నెపంతో పార్క్ కు తీసుకొని రారాదు?"
సుధాకర్ మరి మాట్లాడకుండా కారు స్టార్ట్ చేశాడు. ప్రేమ నిర్జీవంగా నడుస్తూ లోపలికెళ్ళింది!
"ఎవరో వచ్చినట్టున్నారమ్మ" అన్నది విమలమ్మ.
"ఎవరిదో ఇంటికోసం వెతుక్కుంటూ వచ్చారు, మా కాలేజీ అబ్బాయి. తెలీదని చెప్పేను."
కొంగులో పూలు చాపమీద పోసి కట్టడంలో నిమగ్నమైంది. సుధాకర్ తో వెళ్ళి ఉండవలసింది. కానీ అతని ఆహ్వానం ఏదో ప్రమాదాన్ని సూచించినట్లయింది. ప్రతి విషయంలో భయపడే అతను ఎవ్వరులేని సమయంలో ధైర్యం చేయటంలో అర్ధము గొప్పతనం ఏమున్నాయి? తల్లి సుముఖంగా వుంటే చాలా?
అంత రహస్యంగా వుంచాలనుకున్నవాడు కొన్ని మాసాలు ఆగలేడా?....అతనితో వెళ్ళవచ్చు కాని: ఆ రోడ్డుమీద తను ఎవరితోనో కారులో వెళ్ళడం. నాన్నగారే ఎదురుగా రావచ్చు. నిరాకరించింది గాని, అతనేమనుకుంటున్నాడో అని బాధగానే వుంది. పూలమాల బాగా రాడం లేదు.
7
రేవతి పురిటికని ముందుగానే వచ్చేసింది. పిల్లలతో తల్లిగారింట్లో వీలుగా వుండదని అత్తగారింట్లోనే వుంటోంది. స్వతహాగా ఆమె మిత భాషిణి. పిల్లల్ని చూచుకోవటం- అత్తగారికి గృహ కృత్యాలలో సాయపడటం, ఏ పుస్తకమో తిరగెయ్యటం తప్ప ఆమె దినచర్యలో మార్పులేదు. సాయంత్రాలు రేవతి, ప్రేమ, తోటలో కూచుని కబుర్లు చెప్పుకోవటం జరిగేది. వీలుంటే విమలమ్మ కూడా వచ్చేది.
కోడలి విషయంలో ఇంతవరకు అందరికి తృప్తికరంగా వుంది ముఖ్యంగా రేవతి అంటే భర్తకు అపరిమితానురాగం, పిల్లలకు తల్లిలేని లోటు దీర్చి, తనకు అర్ధంగిగా ఆమె తన్ను తాను సమర్పించుకుంది. క్రోధం అన్న దానికి అర్ధం ఆమెకు తెలియదు.
వదిన విషయంలో ప్రేమ తన్నుతాను అభినందించుకునేది. రేవతి ఆ ఇంటి కోడలు కావటంలో తన ప్రమేయం చాలా వున్నదన్న విషయమే ఆమెకు గర్వం కలిగించేది. అప్పుడప్పుడు విమలమ్మ దగ్గర ఆ మాటే చెబుతుండేది."అంతా భగవదనుగ్రహం - మధ్యలో నీ పెత్తన మేముంది?" అనేది ఆమె.
రేవతి వచ్చి వారం రోజులైంది. ఆ రోజు టిఫిన్ తింటున్న పేరును పుస్తకాల కోసం అడిగింది.
"అదేం వదినా నాన్నగారి గదిలో బీరువానిండా పుస్తకాలున్నాయిగా"హాస్యం చేసింది వదినను. అవన్నీ పాతకాలం పుస్తకాలు- "లా" పుస్తకాలు-గీతా రహస్యం. మొదలు వేమన పద్యాల వరకున్న బీరువా అది. "ఆ పుస్తకాలు నువ్వు చదవరాదుటే ప్రేమా- వదిన చదివేసింది" అని నిమలమ్మ కోడలిని సమర్ధించింది. ప్రేమ ఫక్కున నవ్వింది. "నా గదిలో వున్నాయి కొన్ని. పై అరలోని పుస్తకాలు నవలలు తీసికోవదినా- "అంటూ లేచింది. రేవతి భారంగా అడుగులేస్తూ మేడమీది కెళ్ళింది. నాలుగైదుపుస్తకాలు తీసుకుని పేర్లు చూచింది. అందులో ఒకటి నచ్చటంతో మిగిలినవి పైన పెట్టబోయింది. ఒకపుస్తకం జారటంతో చేతిలోని పుస్తకాలన్నీ క్రిందపడినై. ఆ పుస్తకాల్లోనించి ఒక కవరు బైటపడింది. ఆ కవరునందుకుని తిరిగి పెట్టబోతూ. మామూలుగా తెరచిచూచి తెల్లబోయిందామె. ఎంతోసేపటికి సంభాళించుకుని యధాస్థానంలో పుస్తకాలను సర్ది వచ్చేసింది.
ఆవేళ సాయంత్రం ఒదినా మరదళ్ళు రోజు మాదిరిగానే తోటలో కూచున్నారు. రోజూ సరదాగా మాట్లాడే రేవతి ఆ వేళ మౌనంగా కూచుంది. ప్రేమకి ఎలాగో వుంది.
చాలాసేపు అలా కూర్చున్నాక ప్రేమ అడిగింది! "అలావున్నావేం వదినా? ఏం జరిగింది?"
"ఏమీలేదు ప్రేమా"
"ఏదో వుంది నీ ముఖమే చెబుతోంది..."
"ఏదో దాస్తున్నానని గ్రహించిన తర్వాత దాచడం కష్టమే నమ్మా..." "ఏమిటది? ..... కొంపదీసి సంబంధాలు కుదుర్చుతున్నావా ఏమిటి?" "ఊఁహూఁ. సంబంధాలు కుదర్చాలన్నమాట.....ఒకవేళ అదే ననుకో....కుదుర్చుతానే అనుకో.....నీకు నచ్చుతుందా?" ప్రేమ చటుక్కున వదిన కళ్ళల్లోకి సూటిగా చూచింది.
అనుమానం స్ఫురించినా గడుసుగా నవ్వింది నువ్వు కుదర్చడం నాకు నచ్చకపోవడమూనా!"
"ఏమో అనుమానమే?"
"ఎందుకా సంశయం" "మాలాంటివాళ్ళదాకా వదుల్తావా అని సంశయం!"
ప్రేమ ఉలిక్కిపడింది. ఒదినకు ఏదైనా అనుమానం కలిగిందా! ఓరగా వదిన వైపు చూచింది. రేవతి ఆ చూపుకు జవాబివ్వక నేలకేసి చూస్తోంది.
"ప్రేమా....సుధాకర్ ఎవరు?"
