"శ్రమేం లేదు....నిమ్మరసం మాత్రం" అంటూ లోపలి కెళ్ళి పది నిమిషాల తర్వాత పళ్ళెంలో ఫలహారం. గ్లాసులో పానీయం తెచ్చి పెట్టింది. నిరంజన్ కు తీసికొనక తప్పింది కాదు.
కొద్ది కొద్దిగ త్రాగుతూ అన్నాడు "సరళ వాళ్ళింటినించి వస్తున్నాను. మీ అమ్మ నాన్నగార్లు అక్కడే వున్నారు. సరళ వరలక్ష్మి వ్రతం చేస్తోంది. ఆలస్యం కావచ్చు...
"ఈ కబురందజేయటానికేనా వచ్చింది." అనుకుంటోంది ప్రేమ నిరంజన్ కంఠం సవరించుకున్నాడు" మీ అన్నా- నాన్నగార్లు మీ వదిన స్థానం బర్తీ చేయటానికి చాల శ్రమ పడ్తున్నారు. ఈ బిడ్డలను కన్న బిడ్డలుగా చూచుకోగల కోడలు కావాలని ఆశ. అది సహజమే ననుకోండి. కానీ అదెంత దుర్లభమో మనకు తెలుసు.... కానీ మా ఎరికలో ఒక అమ్మాయి వుంది. వాళ్ళు కూడా మా లాగానే ఆఫ్రికా వదిలి వచ్చేశారు. అతి సల్పమైన వస్తువులతో డబ్బుతో వచ్చారు.... ఆమె అంతా మా సరళ మాదిరిగానే వుంటుంది... ఓడలు బడ్లౌతాయన్న విషయం వారి పరిస్థితులో అక్షరాలా నెరవేరింది. బాగా చితికిపోయిన సంసారం ఇద్దరు కూతుళ్ళు పెళ్ళి కెదిగినవారే. ఈ అమ్మాయి పెద్దది. ఇరవై నాలు సంవత్సరాలుండవచ్చు.... మీరే ఉద్ధరించకూడదా? అని మేఉ ప్రశ్నించవచ్చు. ఆమె నాకు చెల్లి వరుస అవుతుంది..... వాళ్ళు ఒక్క దమ్మిడీ ఇవ్వలేరు. ఈ సంబంధం విషయంలో మీ అభిప్రాయం తెలియపర్చితే కృతజ్ఞుడను. మీ తల్లిదండ్రులకు చెప్పి వారి అభిప్రాయాన్ని నాకు తెల్పితే బాగుంటుంది.
ప్రేమ చెంపకు చేయి ఆన్చి ఆలోచిస్తూ కూర్చుంది. "నా అభిప్రాయాని కేముందిగాని - అమ్మకు నాన్నకు చెబుతాను. మీరు ఒకటి అర్ధం చేసుకోవాలి. కట్న కానుకల విషయంలో అంత పట్టింపు లేక పోయినా అమ్మాయి ఉన్నత కుటుంబానికి చెందినదిగా వుండాలని వారి యిష్టం. గౌరవం మంచి హోదాగల కుటుంబంలోని పిల్ల కావాలని ఆశ. మీరు చెప్పిన ఈ కుటుంబ పరిస్థితులు మరీ హీనంగా వుంటే ఒప్పించటం కష్టమే అవుతుంది. ఐనా - ప్రయత్నిస్తాను."
నిరంజన్ గ్లాసు ఖాళీచేసి పెట్టాడు. ఆమెవైపు రెప్పవాల్చకుండా తదేకంగా చూస్తూ అన్నాడు "మీరు సుముఖంగా వున్నారు. సంతోషం .... ఒకటి మర్చిపోతున్నారు, పెద్ద హోదాగల కుటుంబాలకు ఆర్ధిక వత్తిడి అంటూ వుండదు.....ఒకవేళ వున్నప్పటికీ ఆ విషయాన్ని గుప్తం గానే వుంచుతారు. ధనాన్ని బట్టి గౌరవం- హోదా హెచ్చుతుంది. ఆర్దికంగా వెనుకబడిన కుటుంబాలకు మర్యాద, గౌరవం, పలుకుబడి లోపిస్తాయనుకోటం పెద్ద పొరపాటే అవుతుంది. వారు గొప్ప వాళ్ళలా దర్జాగా తిరగలేరు. పదిమందిలో విచ్చలవిడిగా ధనవ్యయం చేయలేరు. అంటే హోదా అన్నారే అది అందరాని పండే అవుతుంది.....గుట్టుగా గౌరవంగా బ్రతకటం కూడా ఒక వరమే.... ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి మీరు కోరిన అమ్మాయి మీకులభ్యం కావచ్చు-కాని అందులో మీ త్యాగం ఏమీలేదు? ఆమెను ఆజ్ఞాపించలేరు.....నోరెత్తి ఒక్కమాట అనలేరు కోపగించుకోలేరు? మందలించలేరు..... కానీ మీకన్నా తక్కువ స్తోమతగల అమ్మాయి మూడు వంతులు అణగిమణగి ఉండటానికే ఆస్కారం వుంది......ఈ అమ్మాయి విషయంలో పిల్లలు సుఖపడతారని మీ ఆశ నెరవేరగలదని నా దృఢనమ్మకం.
ప్రేమ అతనివైపు దీక్షగా చూస్తూ విన్నది. చివరి మాటకు నవ్వు వచ్చింది. ఆమె నవ్వుతూండటం గమనించి నిరంజన్ కొద్దిగా ముందుకు వంగి ఆత్రంగా అన్నాడు.
"నా మాటలకు మీకు నవ్వొస్తోంది! పెళ్ళయ్యాక మారితే ఏం చేస్తారు?" క్షణ క్షణానికి మారే స్త్రీ హృదయం పై అంతగట్టి నమ్మకం పనికి రాదనే గా! మీ నవ్వుకు కారణం! అలా భావించకండి. ఆమెను చూస్తే మీ కెటువంటి అనుమానాలు రావు. అంతే కాదు. తండ్రి తనకు వివాహం చేసే పరిస్థితిలో లేడని తెలిసి, తనకన్నా చిన్నది మరొకరి వివాహానికి సిద్ధంగా వున్నదని తెలిసి. ఒక్కొక్క దినం తనమీద భారంగా కూచుంటూ సంవత్సరాలుగా చేస్తున్నదని గ్రహించిన ఏ స్త్రీ అయినా కొంత త్యాగం చేయటానికి, కొన్నికోర్కెలను చంపుకోటానికి సిద్ధమౌతుంది. ఓర్పు, నిరీక్షణ, నమ్రత అధికమౌతాయి. అటు వంటి స్త్రీ వివాహానంతరం మారుతుందంటే నమ్మలేను. ఒకవేళ మారితే? నూటికకోటికి ఒకరుంటారేమో! ..... ఆ ఒకరు ఈమె అయితే! అంటారేమో! దానికి జవాబుగా ఆమె ఆ తొంభైతొమ్మిదిమంది లాంటిదైతే- అంటాను. " నిరంజన్ కనుబొమలు ఎగరేసి చేయి గాలిలో వూపాడు. ప్రేమ ఆశ్చర్యంగా అతనికేసి చూచింది. "మీరు మనుషులను చదవగలరా?"
"ఆ శక్తి నాలో లేదు"
"కానీ నా ప్రతి సందేహాన్ని ప్రశ్న రూపంలో మీరే అడిగి జవాబు కూడా చెప్పారు. అవునా?"
"అవును? మీ సందేహాలన్నీ మీ ముఖంలో ప్రతిబింబించాయి. వాటిని గ్రహింపలేనివాడు ఒట్టి శుంఠ.
ప్రేమ పకపకనవ్వింది. ఆమె హాయిగా స్వేచ్చగా నవ్వుతుంటే ముంగురులు నుదుటిపై సుకుమారంగా నాట్యం చేశాయి. నలు మూలల్నించి అలుముకుంటున్న చీకటిలో ఆమె పలువరస తళుక్కున మెరిసింది ఆమె లేచివెళ్ళి లైటువేసి ఇటు తిరిగేసరికి నిరంజన్ లేచి నుంచున్నాడు.
"అరె అప్పుడే వెళ్తారా?"
"వచ్చిన పని అయింది. రేపు కాలేజీలో..."
"అమ్మావాళ్ళు ఈ విషయాలు నీకెలా తెలిశాయంటే...."
"నిరంజన్ వచ్చాడని చెప్పండి. దాపరికం దేనికి? మీతో మాట్లాడినంత స్వేచ్చగా వారితో మాట్లాడలేననే ఇలా వచ్చాను. అన్నీ ఇలా మాట్లాడే శక్తి వారిద్దరిదగ్గరా వుండదేమా అన్న భయంతో మీతో మాట్లాడాను... ఒకవేళ వీలుకాదని త్రోసిపారేసి వారి ముఖం? ఆ మాట వినటానికి జంకాను.....వస్తాను."
అతను వెనుదిరిగి వెళ్ళిపోయాడు. చూస్తూ నుంచుండిపోయిందామె.
* * *
6
మరుసటి రోజు ప్రేమ కాలేజీకి రోజు కన్నా ముందదే వెళ్ళింది నిరంజన్ తన కోసం నిరీక్షిస్తూ కనబడకపోతే ఆమె ముఖం చిన్న బోయింది. శుభవార్త బరువుగా వ్రేలాడుతోంది.
వెయిటింగ్ రూంలో కూచుని ఆలోచిస్తోంది ప్రేమ. అమ్మా నాన్న కట్నమైతే అక్కర్లేదన్నారు గానీ ఏమీలేని పిల్లను తమ కంట గట్టాలని చూస్తున్నాడా ఆ శ్రీనివాసరావు? అని అన్నారు వారితో మాట్లాడి- బోధ వచ్చి-వాదించి- కనువిప్పు కల్గించింది. పిల్లను చూడక తప్పదన్నప్పుడు బాగానే వుందనుకుంది ప్రేమ వారి మనసు మార్చుకోకముందే ఈ పెళ్ళి చూపులు అవ్వాలని ఆమె ఆరాటంతో వుంది. అన్నయ్య కూడా ఇవ్వాళ వస్తున్నాడు. ఈ సాయంత్రమే వెళ్ళి చూడాలి అనుకుంది.
అడుగుల చప్పుడు విని తలెత్తి చూచింది. గీత- గీత వెనుక నిరంజన్ ప్రేమను చూడగానే అతని ముఖం విప్పారింది.
"మీ ముఖం చూస్తేనే తెలుస్తోంది. పండని" అన్నాడు? రంజన్.
ప్రేమ బెదురుగ చూస్తూ అంది "అన్నయ్య వస్తున్నాడు, సాయంత్రం ఏడు గంటలకు మీ యింట్లో పెళ్ళి చూపులు"
* * *
పెళ్ళికి నిరంజన్ వెళ్ళలేదు. మగపిల్లలిద్దరు ఇంట్లోనే వున్నారు.
"మీమధ్య బంధుత్వంకూడా ఏర్పడింది. ఆ విధంగా పూజా పునస్కారాలకి. శుభకార్యాలకి- మీరు తరచు కలుసుకొంటుంటారు ఈ సంబంధం దేనికైనా దారితీయవచ్చు....స్వార్ధపరుడిని ప్రేమా . నువ్వు నాకు దక్కాలని, నువ్వు నా దానివవాలని తాపత్రయము. నమ్మకంవున్నా ఏదో అనుమానం పీడిస్తోంది."
ప్రేమకు ఈ ధోరణి నచ్చలేదు. తీక్షణంగా చూచింది. "ఇలా మాట్లాడుతూ నన్నెంత బాధపెడ్తున్నారో గ్రహించబడటంలేదు మీరు. ఎందుకలా సందేహిస్తున్నారు? కాలేజీలోకూడా అతనితో మాట్లాడటం మానేశానే! పూవు, తావి, చంద్రుడు, వెన్నెల ప్రేమ. సుధాకర్ ఇది సత్యం" ఆ రోజు ఆమె అంతవరకే మాట్లాడింది. సుధాకర్ ముఖంలో సంతృప్తి అలముకుంటుండగా చూచి ప్రేమ మెల్లగా నిట్టూర్చి కదిలిపోయింది. "ప్రేమ అనేదానికి రంగు రుచి, వాసన లేకపోవచ్చుకాని బరువు అన్నది తప్పక వుంది. హృదయంలో ఈ ప్రేమను పదిలపర్చుకుని ఆ భారాన్ని భరించలేక అశాంతితో, బాధతో, వుండటం సహజం. ప్రేమకు ఈ స్థితి భరించనిదైపోయింది.
* * *
శ్రావణమాసంలో ఒక రోజు-
రాత్రి ఏడున్నర "ప్రేమా- అన్న పిలుపు ప్రేమ హృదయం దివ్యమైన సంగీతం వినిపించినట్లు పులకించింది చటుక్కున వెళ్ళి తలుపు తీసింది.
చిరునవ్వుతో కనబడ్డాడు సుధాకర్. ఆమె ఎర్రని పెదిమలు దరహాసానికి విప్పారి, సన్నని పలువరస బహిర్గతమైంది. కళ్ళు మెరిశాయి, ప్రక్కకు తొలగి "రండి" అంది.

సుధాకర్ లోపలికి వచ్చి దిక్కులు జూచాడు,
"నాన్నగారింట్లో లేరు"
అతను నవ్వుతూ సర్దుకుని కూచున్నాడు.
"ఇప్పుడే వస్తాను......."
ప్రేమ లేవబోయింది. అతను వారించాడు తడబడే మాటల్తో ఇలా అన్నాడు.
"ప్రేమా ఐదు నిమిషాలు నీతో మాట్లాడిపోదామని వచ్చాను....లేదు.....నిజం చెప్పరా? నిన్ను ఒక్కసారి చూసిపోదామని వచ్చాను. కాసేపు మాట్లాడకుండా నా ఎదురుగా కూచో- అంతే చాలు..."
ప్రేమ కనుబొమలు ఎగరేసి గడుసుగా నవ్వింది "సరే ఇక చెప్పండి.
