"అక్కర్లేదు. లేరని నే నెప్పుడూ అనలేదు. నేను జాత్యభిమానంతో మాట్లాడటం లేదు. తప్పు అనేది ఎవరు చేసినా తప్పే. అమ్మాయిల విషయంలో నువ్వు ఎత్తిచూపిన అవలక్షణా లేమీ నాకు లేవనే అనుకొంటున్నాను. ఆ సంగతి నీకూ తెలుసు. బావగారు నాకు పెళ్ళి బట్టలలో ఒక నైలాన్ చీర కూడా తీసుకొచ్చారు. అది కట్టుకోవటం నాకు నచ్చదు. అయినా బావగారి కోసం నాలుగైదుసార్లు రాత్రి సమయాలలోనే కట్టుకున్నాను. ఇప్పటికీ అలాగే ఉంది. నేను ఫాషన్ గా టాయిలెట్ చేసుకోననీ, నిరాడంబరంగా ఉంటాననీ బావగారికి నచ్చదు. విపరీతమైన బావగారి వ్యసనాలు నాకు నచ్చవు. నువ్వు అన్నట్టు చెడ్డనైనా కొంతవరకూ అయితే భరించవచ్చు. ఏవి చేసినా మితిమీరవంతవరకూ పరదాలు. మీరితే వ్యసనాలు. కాదంటావా? పండుగ రోజు ఒక్కపూట భర్తతో గడపాలనే అతి సామాన్యమైన కోరిక తీర్చుకోలేని దౌర్భాగ్యపు స్థితిని ఎలా సమర్ధించుకోను? అర్ధంలేని ఈ నాగరికతనీ, ఈ సభ్యతలనీ ఎలా భరించను?" భాను క్షణం ఆగింది. "ఒక విషయం విను అన్నయ్యా! నీకు పరిస్థితి తెలుస్తుంది. మొన్న సంక్రాంతికి అమ్మ ఉత్తరం రాయించినా నేను వెళ్ళలేదు. అప్పటికి ఒక్క పండుగ కూడా ఇక్కడ చేసుకోలేదు. సంక్రాంతి ఇక్కడే చేసుకోవాలని బుద్ధిపుట్టి ఉండిపోయాను. పండుగ పది రోజు లుందనగానే ఎన్నో ఆలోచించుకున్నాను. ఎన్నో నిర్ణయించుకున్నాను. ఆ నాలుగు రోజులూ నేనేం చీరలు కట్టుకొనేదీ, బాబుకిఏయే చొక్కాలు తొడిగేదీ, ఏమేమి టిఫిన్లు చేసేదీ, ఏమేమి వంటలు వండేదీ-ఒకటేమిటి? అన్నిటికీ పట్టీ రాసి పెట్టుకున్నాను. అన్నీ బావగారికి చెప్పాను. 'పండుగ నాలుగు రోజులూ కొత్త కొత్త టిఫిన్లు చేసుకు తిని కబుర్లు చెప్పుకొంటూ కూర్చుందాం. సాయంత్రాలు ఎటైనా షైరు వెళ్ళివద్దాం. ఈ పండుగ సంతోషంగా జరుపుకోవాలని ఉంది. ఎప్పుడూ మిమ్మల్ని ఏమీ అడగలేదు. ఆ నాలుగు రోజులూ ఇంట్లో ఉండాలి మీరు......ఈ ఒక్క సారైనా.....కనీసం నా కోసం...' ఎంత సిగ్గు విడిచి ఎంత కోరికతో అడిగానో గ్రహించగలవా? అలా ఆడది అడగవలసిన అవసరమే రాకూడదు. గృహస్థుకే ఆ సలక్షణం అలవడి ఉండాలి! ఆయన ఏమీ చెప్పలేదు. నవ్వి ఊరుకున్నారు. నా కోరిక తోసివెయ్యరని గర్వపడ్డాను. భోగి ఉదయం ఎంతో సంతోషంగా పనులు ప్రారంభించాను. తలంట్లు అయ్యాయి. టిఫిన్ తిని ఆయన పేపరు చదువుకొంటూ కూర్చుంటే నేను వంట గదిలో పని చేసుకుంటున్నాను. ఒక్క అరగంట కాబోలు గడిచింది. ఆయన వంటింటి గుమ్మం ముందు కొస్తూ-"ఏం ఊసుపోవటం లేదు భానూ!' అన్నారు.
'ఒక్క పావుగంట కూర్చోండి. వచ్చేస్తాను' అన్నాను.
'అబ్బ! ఇలా చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చుంటే చిరాగ్గా ఉంది. అలా కాస్సేపు బయటికి వెళ్ళొస్తాను.'
నేను ఆశ్చర్యంగా తలెత్తి చూశాను. 'ఇప్పుడు బయటికి వెళ్తే మీరువచ్చినట్టేనా? కనీసం ఈ పండుగ రోజులైనా.....'
'ఏమిటో నీ సోది. పండుగ కాబట్టే పది మందీ చేరతారు. ఇలా ఇంట్లో కూర్చుని ఏం చెయ్యమంటావ్?'
ఇంట్లో కూర్చుని ఏం చెయ్యమంటావట! ఇళ్ళలోనే ఉండే వ్యక్తులంతా ఏం చేస్తున్నారు? చెప్పిందంతా ఏ గంగలో కలిసిపోయింది? కోపం వస్తున్నా నెమ్మదిగా అన్నాను. 'మనం ఇద్దరం ఉంటేనే మీకు తోచదంటున్నారు కదా? మీరు వెళ్ళిపోయి నేను ఒక్కదాన్ని ఉంటే నా కెలా తోస్తుంది చెప్పండి?'
'అందుకని నీకు నన్ను కాపలా కాయమంటావేమిటి? ఏ పక్కవాళ్ళింటికో వెళ్ళూ.'
నా కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగిపోయాయి. 'ఇంట్లో మనిషి మీరు ఇల్లువిడిచి తిరుగు తూంటే నేను వాళ్ళనీ వీళ్ళనీ దేవిరిస్తూ వెళ్ళనా? పండుగపూట మన ఇంటి తలుపులు మూసుకొని ఎవరింటికైనా వెళ్ళి కూర్చుంటే బావుంటుందా? అందరి మగవాళ్ళూ ఇళ్ళలో ఉండటం లేదా? మన మిద్దరం కలిసి పండుగ చేసుకోవాలనే సరదా నా కెప్పుడు తీరేది?'
'భానూ! నీ ప్రశ్నలకి నువ్వే మురిసిపోవాలి. ఎక్కడికీ వెళ్ళకపోతే బాబుని పెట్టుకొని ఇంట్లో కూర్చో. నేను మాత్రం ఆడదానిలా కూర్చో లేను.'
నేనేం మాట్లాళ్ళేదు. కూర ముక్కలు కోస్తూ తల దించుకున్నాను. కళ్ళలోంచి నీళ్ళు జలజలా రాలిపడ్డాయి.తనకోసం దేవిరించే భార్యా బిడ్డల్ని నిర్లక్ష్యంచేసి, బయట పదిమందికోసం పాకులాడే ఆ సంసారికి అంతకన్నా ఏం చెప్పను? కనీసం ఆ నాలుగు రోజులూ ఆయన్ని ఇంటిపట్టున ఉంచుకోవాలని కోరటం తప్పా? నా వాళ్ళతో నేను పండుగ సంతోషంగా జరుపుకోవాలని తపించటం అన్యాయమా? అంత సామాన్య మైన కోరిక ఎందుకు తీర్చుకోలేకపోయాను?
నిండుతూన్న కళ్ళని మాటిమాటికీ తుడుచుకొంటూ బాబుని దగ్గరపెట్టుకుని కూర్చున్నాను. పది, పన్నెండు...... మూడు......ఐదు......ఎనిమిది.......పదకొండు! అర్ధరాత్రి పదకొండు గంటలకి తిరిగి రాక! లేచి అన్నం వడ్డించాను. ఉదయం చేసిన పులిహోర, సగ్గుజావ అలాగే ఉన్నాయి. నేను రుచి కూడా చూడలేదు. ఇంటికి వచ్చారన్న సంతోషం నిమిషమైనా నిలవకుండా, అన్నం తిన్న చేతి తడైనా ఆరకుండా, తిరిగి బట్ట వేసుకొంటూంటే ......ఆ పరిస్థితి ఎలా చెప్పను? నా ఒళ్ళు కోపంతో, దుఃఖంతో కంపించిపోతూంది. అకస్మాత్తుగా తల బద్దలై ఆ వ్యక్తి కళ్ళ ఎదుట నేను చచ్చిపోతే....? ఏదైనా అజ్ఞాత శక్తి ఆయన్ని ఆపితే....? ఆ శరీరవాణి దూషిస్తే...ఏమౌతుంది? వెళ్ళబోతున్న మనిషి చెయ్యి నేనే పట్టుకున్నాను. 'ఇంత రాత్రి......ఒక్కదాన్ని..... బాబుతో......మళ్ళీ వెళ్తారా?' అంతకన్నా కంఠం పెగలలేదు.
'ఛీ! ఎందు కీ మాత్రానికే శోకాలు పెడతావ్? నేనేం దేశాలు తెగించి పోతున్నావా? స్వాతంత్ర్యం, సమానత్వం-
కావాలని లెక్చర్లు దంచుతారే! ఒక్కరాత్రి ఒంటరిగా ఉండలేవూ? మరేం ఫర్వాలేదు. తలుపేసుకు పడుకో.'
నేను పౌరుషపడి తక్షణం సంభాషణ విరమించుకోవచ్చు. కానీ ఆ మనిషిని మార్చుకోవలసిన అవసరం, బాధ్యత నామీద ఉన్నాయి. ఎంతో సాత్వికంగా అన్నాను- 'పగలంతా అక్కడే ఉన్నారు. రాత్రి కూడా ఏమిటిది చెప్పండి? ఇరవై నాలుగ్గంటలూ ఇల్లు విడిచి ఏమి టీ సరదాలు?'
'అంతమాత్రం నాకు తెలుసుగానీ నువ్వు నోరు మూసుకొందూ? ఎప్పుడూ ఇల్లూ, వాకిలీ, పెళ్ళాం కొడుకూ, దొడ్డీ నుయ్యీ, చీపురు కట్టాలూ, అన్నం కంచాలూ-వెధవ సొద! ఉత్త రోజుల్లో ఎలాగూ ఆ ఆఫీసులో పడి కొట్టుకొంటూనే ఉంటాం. వంటగదిలో పడి తన్నుకొనే నీకేం తెలుస్తాయి మగవాడి సరదాలు? మహా అడగొచ్చావ్?'
'సరదా లనేవి మగవాడి స్వంతం కావు. ఆడదానికీ ఉన్నాయి. అవి తీర్చాలనే ధ్యాసే మీకు లేదు. ఆ వంటగదిలో పడి తన్నుకోలేక కదూ మీ కోసం దేవిరించటం?'
'అక్కర్లేదు. అది నీకు అలవాటే?'
ఆ రాత్రి ఎంత ఏడిచానో, ఆ తిరస్కారం ఎలా భరించానో ఎవరికి తెలుసు? నేను ఏడిస్తే ఎవరు బాధపడాలి? నేను అలిగితే ఎవరు బ్రతిమిలాడాలి? ఆయన చేసే తప్పులు నేను ఎత్తి చెపుతాననీ, విమర్శిస్తాననీ నామీద ఆయనకి కోపం. నేనంటే ఇష్టపడకపోవటానికి అదే కారణం! ఆయనకి మంచి అలవాట్లు తక్కువ. ఆయన్ని మార్చటానికి ప్రయత్నించకూడదు. వాదించకూడదు. విమర్శించకూడదు. ఆమోదించాలి. ప్రోత్సహించాలి ఎలా? ఎలా చెయ్యగలను?
ఆ పగలు నేను అన్నం తినలేదు. ఆ రాత్రి కూడా ఆకలి వెయ్యలేదు. కాని బాబుకోసం......తల్లిని! నేను బాబుని పస్తు ఉంచగలనా? అన్నం తిని బాబు పక్కలో పడుకున్నాను. ఎవరు నిద్ర పోకపోయినా తెల్లవారుతుంది. ఆ రోజు పెద్ద పండుగ! సంక్రాంతి! నేను ఎర్రజరీ చీర కట్టుకొని బాబుకి తెల్ల సిల్కు బుష్ కోటు తొడగాల్సిన రోజు! కోవా చేసుకుతిని కొత్త సినిమా చూడాల్సిన రోజు! కానీ....కన్నీళ్ళతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలకలేకపోయాను. సాధారణంగా వంట కానిచ్చి బాబుకి మాత్రం కొత్త బట్టలు తొడిగి కూర్చున్నాను. మధ్యాహ్నం పన్నెండుకి కాబోలు వచ్చారు. అన్నం వడ్డించాను-పచ్చడితో, చారుతో.
'ఇవ్వాళేం చెయ్యలేదా?'
'లేదు.'
'ఏం?'
'ఎవరికోసం?'
"నేను చచ్చా ననుకొన్నావా?'
'.............................'
'పండుగపూట అంతా హాయిగా వండుకు తింటారు. ఏమిటీ దౌర్భాగ్యం? ఏం నేను భోజనానికి రావటం లేదా? లేకపోతే రావద్దనా నీ ఉద్దేశ్యం?'
'మిమ్మల్ని ఇంటికి రమ్మనో, పొమ్మనో-నా ఉదేశ్యం ఏమిటో మీకు తెలుసు. మీరు ఇంట్లో లేకుండా నాకేం చెయ్యాలనిపించలేదు. చెయ్యలేదు.'
'ఓహో! నేను ఇంటికి రాకపోతే వంటా పెంటా మానేసి పడుకొంటా వన్నమాట. ఎన్నాళ్ళు పంతం పడతానో నేనూ చూస్తాను. నీకు అని పించటం అనిపించకపోవటం నా కవసరం లేదు. పండుగ రోజుల్లో ఏదో ఒకటి చెయ్యాల్సిందే. నీ పంతం సాగించుకో మరి. చూస్తాను.'
'పంతం! ఒక ఆడది పంతం పట్టి గెలుస్తుందని మీరు అనుకోవటం భ్రమ! పంతాలకి పోయి నేను వంట మానలేదు.'
'కాకపోతే గర్వం! నిర్లక్ష్యం! అంతేనా?'
'.....................'
'మాట్లాడవేం? నువ్వు ఏ ఉద్దేశ్యంతో మానేసినట్టు?' నాకు దుఃఖం పొర్లి పొర్లి వచ్చింది. పిచ్చిదానిలా వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టాను.
'ఛీ! ఇంటి కొచ్చేసరికి ఏడుపు మొహం! పండుగా లేదు పాడూ లేదు. ఎప్పుడూ ఏడుపు! ఏడుపు! ఏడుపు! ఇక నీ బ్రతుకింతే. చచ్చేటప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటావు.'
అన్నం కెలికేసి గదిలోకి వెళ్ళి పడుకున్నారు. నేను ఎంతోసేపు అలాగే కూర్చున్నాను. ఒక మనిషిని మరో మనిషి న్యాయాన్యాయ విచక్షణ లేకుండా నిలబెట్టి దండించటానికీ, నోటికి వచ్చినట్టు తిట్టటానికీ ఎక్కడి దా శక్తి? అది అందరికీ ఎందుకు లేకపోతూంది? పండుగపూట అంతా పిండివంటలు వండుకు తింటారుగానీ, భార్యా బిడ్డలతో కాలం గడపరూ? అది అడిగే తాహతు నాకు లేదూ? భగవాన్! నీ సృష్టిలో ఇంత పక్షపాతమా? ఒకమనిషి మరో మనిషికి బానిసా? కనీసం నా ఉద్దేశ్యాలు చెప్పుకోవటానికి వీలైనా నన్నీ మూగ బాధవేధించకపోవునే. మధ్యాహ్నం ఇంటిలోనే ఉంటారనుకొని అప్పటి కప్పుడు పొయ్యి అంటించి రవ్వలడ్డూలు చేశాను. స్నానం చేసి వచ్చేసరికి పక్కమీద మనిషి లేరు. స్టాండున బట్టలు లేవు. వరండాలో జోళ్ళు లేవు. ఆశ్చర్యపోవటానికి గానీ, దుఃఖ పడటానికి గానీ నాకు శక్తీ లేదు. ఆయన ఏం చేస్తున్నా పట్టించుకోకుండా ఊరుకోవాలి. ఏ రాత్రి వచ్చినా నవ్వు మొహంతో హాజరవ్వాలి. మన సెంత వికలమైనా లక్షణంగా లాంఛనాలు జరపాలి. అదే నాకు చేత కాదు. నాకు అభిమానం లేదూ? నాకు కోపం రాదూ? నాకు దుఃఖం కలగదూ? నా మనసు బాధపడదూ? ఆడదానినైనా నాకు అన్ని లక్షణాలూ ఉన్నందుకే ఈ శిక్ష! చాలదూ?
తీరని వేదన ప్రసాదించి సంక్రాంతి లక్ష్మి వెళ్ళిపోయింది. అమ్మ కోరిక మన్నించి పుట్టింటికి వెళ్ళి ఉంటే- అక్కయ్యలతో, చెల్లెళ్ళతో, పదిమంది చుట్టాలతో, అమ్మ ప్రేమాభిమానాలతో -అన్నిటినీ తిరస్కరించి నేనేం కోరుకున్నాను? ఏం జరిగింది?
