Previous Page Next Page 
ఉన్నతశిఖరాలు పేజి 5


    "గీతవాళ్ళింటి కెళ్ళొస్తానమ్మా- వాళ్ళంతా ఇవ్వాళ పార్క్ కు వెళ్తున్నారట..."
    "అలాగే - త్వరగా వచ్చేసెయ్యి" అంది తల్లి.
    ప్రేమ సరాసరి గీత ఇంటికెళ్ళింది. ఆమెకు అబద్ధం చెప్పి పార్క్ కు వెళ్ళటానికి మనసొప్పలేదు. ఆ సమయంలో ప్రేమరాక ఆశ్చర్యాన్ని కల్గించింది.    
    "ఇలా వచ్చేవేం ప్రేమా! మాటమాత్రంగానైనా..."
    "ఉండు... తర్వాత చెబుదూగాని... మనం పార్క్ కు వెళ్ళాలి. సుధాకర్ రమ్మని రాశాడు"
    గీత మఖం చిటపటలాడింది. సంపంగి మొగ్గలాంటి నాసిక నలిగి నట్లు ముక్కు చిట్లించింది.
    "అంత రాచకార్యమేముంది ప్రేమా! పోనీ మీ యింటికి రాకూడదూ?" ప్రేమ మౌనందాల్చింది. నిజమే సుధాకర్ తన యింటికొస్తే ఆటంక పర్చే వారెవ్వరూ లేరు. తనుఎంతో ఆనందించేదికూడా. ఇలా రాక పోకలుసాగితే ముందుముందుకు ఎంతో మేలౌతోంది. కానీ తను బయలు దేరింది. అతను రమ్మన్నాడు. వెళ్ళకుండా మానుకోగలశక్తి తనలో లేదు, అంత ధైర్యం లేదు, మెల్లగా అందామె.
    "ఈ విషయం అతి రహస్యంగా వుంచాలట. కోర్స్ పూర్తయ్యే వరకు తప్పక దీన్ని ఆచరించవలసినదే!"
    "సరిసరి...... ఉష్ట్ర పక్షుల్లా వున్నారు. ఈ సంగతి కాలేజీలో అందరు ఎరుగున్నదే. ఇక రహస్యం దేనికి చెప్పు? గీత విసుక్కుంది. "కాలేజి వాళ్ళకు తెలిస్తే వచ్చే నష్టంలేదు గానీ తల్లిదండ్రులను ఇప్పుడే తెలియకూడదుట. ముఖ్యంగా వాళ్ళనాన్నగార్కి చదువు పూర్తయాక తనకాళ్ళమీద తను నిలబడేశక్తి కలిగాక అప్పుడు చెప్తారట.... అందుకే రహస్యంగా కలుసుకోవాలి"
    గీత మారుపలకలేదు, వెళ్ళి తయారైవచ్చింది.    
    "నేనెందుకు- పానకంలో పుడక లాగ?"
    "నువ్వు పుడకలా వుండాలనే రమ్మన్నాను. ఒక్కత్తినే వెళ్ళటానికి రావటానికి భయం- అంతే.... పద"    
    ఇద్దరు పార్క్ గేటు సమీపించేసరికి ఖంగున ఐదు కొట్టింది. కుడి వైపు చెట్ల దగ్గర సుధాకర్ నుంచున్నాడు.
    క్షణ మాత్రం అతని మోము వికసించింది. మరు క్షణం మేఘావృతమైంది. మధ్యలో ఈ గీత ఎందుకూ- అనుకున్నాడు. సుధాకర్ ను చూచి ప్రేమ ఆనందంతో వివశమయి, కళ్ళు జ్యోతుల్లా మెరిసి ముఖం శశి వదనమే అయింది. తలలోని పూలచెండు పకపక నవ్వు తోంది. గాలికి శరీరాన్ని అంటి పెట్టనున్న చీర ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది!
    మెల్లగా అడుగులేస్తూ సుధాకర్ ను సమీపించింది. వారిద్దరు కనబడేటంత దూరంలో-మాటలు వినబడనంత దూరంలో గీత నడుస్తోంది. వీరిద్దరు ఏకాంతంగా ఒక స్థలం చూచుకొని కూచున్నారు. గీత దూరంగా కూచుని ఏదో నవల తిరగేస్తూ బఠాణీలు నోట్లో వేసుకుంటోంది.
    సుధాకర్ నోటినించి వెలువడిన మొదటి మాట గీత-
    "ఎందుకు పిల్సుకొచ్చావు ప్రేమా?" మందలింపుగా అడిగాడు.
    ప్రేమ మందస్మిత వదనయై దూరంగా కూచున్న గీతకేసి నిశ్చలంగా చూచి అంది "ఒంటరిగా రావటానికి వెళ్ళటానికి భయం -రెండవది అమ్మవాళ్ళతో గీతతో పార్క్ కు వెళ్తున్నానని చెప్పాను. ఆ మాట నిలుపు కోవాలి కదా!... ఇక చెప్పండి....నన్నెందుకు రమ్మన్నారో"
    "నిన్ను రమ్మన మనటానికి కారణం వుండాలి కాబోలు!" చిలిపి కళ్ళతో ఆమె వైపు తదేకంగా చూస్తుండిపోయాడు.
    ప్రేమ మానసంలో వేయి కలువలు వికసించాయి. అనిర్వచనీయమైన ఆనందంతో తన్ను తాను మర్చిపోయింది. అతని చూపుల ధాటికి సిగ్గుతో గులాబి మొగ్గలా ముడుచుకుపోయింది. కళ్ళు వాల్చేసుకుంది.
    "కారణం వున్నట్లే రాశారు మీరు" బుంగమూతి పెట్టింది.
    సుధాకర్ - గడ్డి పరకలను గిల్లుతున్న ఆమె చేయి ముట్టుకున్నాడు.
    బెదురు బెదురుగా చుట్టూ చూచి మెల్లగా చేయి లాక్కుంది.
    సుధాకర్ నవ్వుతూ చేయి తీసేశాడు.
    "అంత భయం దేనికి ప్రేమా?"
    "ఎవరైనా చూస్తే?"
    "చూస్తే ఏం?"
    "ప్రేమ ఆశ్చర్యంతో అతనికేసి చూచింది. "చూచి పెద్దవాళ్ళకి చెబుతారు. రహస్యం బైట పడ్తుంది. మీకే కష్టం - మర్చిపోయారల్లే వుంది."
    సుధాకర్ దీర్ఘంగా నిట్టూర్చి "నిన్ను చూస్తుంటే మతి తప్పు తోంది ప్రేమా ....... అన్నట్లు కాస్త చీకటిపడగానే నిన్ను కార్లో అలా త్రిప్పాలనుకున్నాను........ నువ్వేమో ఒక పేదరాశి పెద్దమ్మను తెచ్చావు."
    ప్రేమ తప్పుచేసిన దానిలా చూచింది. గీతను తీసుకెళ్ళటానికి కుదరదు. ఇవాళ్టికి ఇలా జరిగిపోవాల్సిందే."
    సుధాకర్ క్రింది పెదవిని పై పంటితో నొక్కాడు. అతనికి కోపం వచ్చిందని ప్రేమ నిస్సహాయంగా నవ్వింది.    
    "కాసేపు మౌనంగా గడిచింది.    
    "ప్రేమా" పరవశంగా అన్నాడు సుధాకర్.
    ప్రేమ అరమోడ్పు కన్నులతో వినబోయే విషయం కోసం కొద్దిగా ముందుకు వంగింది!
    "ప్రేమా నువ్వు నా దానివి సందేహంలేదు- ఔనా?"
    ప్రేమ ఆ నిమిషం కళ్ళు మూసుకుని తెరచింది. ఆమె కళ్ళు ఆనందంతో ప్రకాశిస్తూ వింత కాంతు లీనుతున్నాయి.        
    "ఔను" అనాలని వుంది కాని నోరురాలేదు.    
    "నువ్వు ఎవరితో కూడా సన్నిహితంగా మెలగరాదు.... ప్రతి పురుషుడికి దూరంగా వుండాలి. నువ్వు ఒక్కతివి కావు. నీ జీవితంతో బంధించబడింది నా జీవితం-నీ ప్రేమకోసం తపించిపోయే ఒక ప్రాణి సర్వదా నీ సుఖాన్ని కాంక్షిస్తున్నాడన్న సంగతి మర్చిపోకు.....అంతేకాదు, ప్రేమా నీ అచంచల ప్రేమ విశ్వాసాలు నాకు కావాలి....నువ్వు మాట ఇవ్వాలి...అందుకే రమ్మన్నాను..."
    విప్పారిన నయనాలతో సుధాకర్ వైపు చూస్తూంది. ఆమె హృదయం మూగగా రోదించింది. ఎందుకిలా మాట్లాడుతున్నాడు? ఏం జరిగింది? నేను తనను తప్ప వేరొకరిని ప్రేమించలేదని తెలిసికూడా...
    "ఏదీ. మాట ఇవ్వు" సుధాకర్ చేయిచాపాడు.    
    ప్రేమ తేరుకుంది. పండుతమలపాకులా అతి మృదువుగా వున్న అతని చేతివంక చూస్తూ బాధగా అంది "అసలు ఈ బోధలెందుకు సుధాకర్"
    సుధాకర్ శూన్యంలోకి చూస్తూ అన్నాడు "మాట యివ్వు"నిరంజన్ గారింటికి రాకపోక లెక్కు వయ్యాయనేనా? సరళ అంటే నిరంజన్ గారి చెల్లి పెళ్ళి సందర్భంలో రాకపోకలు హెచ్చాయి. అమ్మా నాన్న వెళ్తుంటే తప్పక వెళ్ళ వలసి వచ్చింది .... సరళకోసం వెళ్ళాలి కదా"
    "ఏమో, నాకు బాగాలేదు! నువ్వలా వెళ్ళడం-మానేసెయ్యాలి మానేయాలి"    
    ప్రేమ క్షణం ఆలోచించింది. "తగ్గించ వచ్చుగానీ మానటం అసంభవం ........ అమ్మా నాన్న వాళ్ళు అప్పుడప్పుడు వెళ్తుంటారు ఒకటి రెండు సార్లు ఏదో నెపం జెప్పి తప్పించుకోగలను. కానీ అసలు మానెయ్యడం బాగోదు" అయినా ఆయన చాలా నెమ్మదస్తులు. ఇంట్లోనే వుండరు సాధారణంగా. ఉన్నా పలుకరించి వెళ్ళిపోతారు. పైగా" అని ఇంకా స్వరం తగ్గించి అన్నది ప్రేమ" ఆయనకు మన సంగతి తెలుసు..."
    "నీ మాట నమ్ముతాను ప్రేమా - అయినా జాగ్రత్త సుమా? ఎవరి జాగ్రత్త వారిది?" సుధాకర్ సీరియస్ గా చూచాడు.
    ప్రేమ సహనంతో అంది జాగ్రత్తగానే వుంటాను. నా హృదయం మీదే అన్నాను కదా. ఇంకేమీ బెంగపెట్టుకోకూడదు."
    ప్రేమ మధ్యలో ఆపుచేయటంతో సుధాకర్ ఆతృతతో ఆమెవైపు చూచాడు. "ఆపేశావేం"
    "ఆ....ఏంలేదు....ఒక్కసారైనా మనం ఒకరిళ్ళకు మరొకరం వెళ్ళలేదు. కనీసం మీ సోదరినైనా చూడలేదు, మన పెద్దవాళ్ళు రాకపోకలు సాగిస్తే ఎంతో బావుంటుంది.... కానీ మీరు..." గడ్డిపరక నముల్తూ మౌనం దాల్చింది.
    సుధాకర్ బాధగా నిట్టూర్చాడు. "నా బాధకూడా అదే ప్రేమా. నువ్వర్ధం చేసుకో లేవు? మధ్యలో మన సంగతి బైటపడటం మూలాన ఎన్నో అనర్ధాలు కల్గుతాయి. దాంతో మన పెళ్ళి జరుగకపోవచ్చు........అందుకే జాగ్రత్తగా వున్నాను.... నిన్ను చూడకుండా నీతో మాట్లాడ కుండా - నీ కంఠస్వరం వినకుండా వుండలేను. నా హృదయం ప్రేమ మయమై వుంది... అందుకే ఏకాంతంగా ఎక్కడైనా నీతో కొన్ని క్షణాలు గడపాలని ఆశించాను. నువ్వేమో ఒక గుదిబండ నేసుకొచ్చావు.... నేను కారుకూడా తెచ్చాను..... ఒక్క పది నిముషాలు చాలు నిన్ను నా బాహుబంధాల్లో ఇముడ్చుకుని ఆ అమృత ధారల్ని చిలికించే నీ పెదవులపైన ప్రేమ చిహ్నం ముద్రించటానికి..."
    ప్రేమ చటుక్కున లేచింది. గాభరాగా. బెదరిన లేడి చూపుల్ని భ్రమింపజేసే కళ్ళతో చుట్టూ పరికించి "వద్దు-వద్దు ఏక్షణం ఎలాంటిదో మనకు తెలియదు....వివాహాత్పూర్వం మన ఈ అనురాగం ఇదే పరిధిలో వృద్ధి చెందాలిగాని మరి ఏ బలహీనతకు తావు ఇవ్వకూడదు. ఒక్కసారి ఈ అనురాగానుభూతిని రుచి చూశామంటే..." ప్రేమ ఆపుజేసి లాలనగా అంది.... "సుధాకర్. ఇంకా రెండు సంవత్సరాలు దాటాలి. అది గుర్తుంచుకోవాలి ప్రేమపిచ్చిలోపడి కర్తవ్య నిర్వహణలో అశ్రద్ధ చేయరాదు. నేను స్త్రీనే ప్రతిక్షణం మిమ్మల్ని కోరుతున్నాను. కానీ ఆ దే క్షణం మీకు దూరంగా కొంతకాలం వుండాలని వాంఛిస్తున్నా. మీరు అర్ధం చేసుకోండి....నా విషయంలో నిశ్చింతగా వుండండి.... ఇక వెళ్దామా?" సుధాకర్ ఆరాధిస్తున్నట్లు చూస్తూ లేచి నుంచున్నాడు. "ప్రేమా - నన్ను క్షమించు" సిగ్గుపడుతూ అన్నాడు. ప్రేమ మందహాసం చేసింది. తనివిదీర అతని ముఖాన్నవలోకించి నెమ్మదిగా అడుగులువేసింది. ఆమె ప్రక్క అతను నడుస్తున్నాడు. వారిద్దరూ రావటం గమనించి గీత పుస్తకం మూసి లేచి నుంచుంది. "నమస్తే గీతాంజలి గారూ. అంతగా పుస్తకంలో మునిగి పోకూడదు. ప్రక్కన కూడా చూడాలి" అని ఎత్తిపొడుపుగా నవ్వాడు. గీత మెరపులేని నవ్వు విదిల్చింది.

                                    5

    కాలేజి తెరిచారు. నిర్విరామంగా దినాలు దొర్లిపోతున్నాయి. ఆ సంవత్సరం ఎన్నో మార్పులు ప్రేమ వదిన, ప్రసూతి సమయంలో పసికందును వదలి వెళ్ళిపోయింది. అన్నయ్య పెద్దకొడుకు ముకుంద్. చిన్నవాడు మురళి ఇక్కడే వున్నారు. ప్రేమకు చేతినిండా పని. పిల్లలతో కాలక్షేపం బాగానే వుంది. క్రొత్తసమస్య ఈ పిల్లలకు తల్లిని తేవాలి. ఎక్కడినించి?
    మానని పుండులావుందీ సమస్య.
    నిరంజన్ వారింటికి
రాకపోకలు బాగా తగ్గాయి, ఎప్పుడైనా అమ్మా నాన్నా వెళ్తే ప్రేమ పిల్లలకోసం అన్నట్లు ఇంట్లోనే వుండేది. అదొక విధంగా మేలే ప్రేమకు.
    సుధాకర్ కు కూడా ఇది బాగుంది.
    ఒకరోజు సాయంత్రం ప్రేమ ఒంటరిగా వుంది. పిల్లలిద్దరు ఆడుకుంటున్నారు. తల్లీ తండ్రీ సరళ గారింటి కెళ్ళారు.
    సరళ తల్లి కాబోతోంది!
    లావుపాటి టెక్స్ట్ బుక్ ఒళ్ళో పెట్టుకుని, కారప్పూస నములుతూ చదువుతోంది.
    "నమస్కారం" అన్నంతవరకు ఆ వచ్చిన దెవరో గమనించ లేదు. ఉలిక్కిపడి తెలెత్తి చూచింది. ఎదురుగా నిరంజన్.
    ఆమె ఆశ్చర్యాని కంతులేదు. సంభ్రమంతో ఏం చేయాలో తోచలేదు. గబగబ లేచి "నమస్తే" "కూచోండి" అంటూ కుర్చీ చూపించింది కారప్పూస పళ్ళెం- పుస్తకం మెట్లమీద వుంచి తనొక కుర్చీలో కూచో బోతూ మళ్ళా లేచింది.
    "అనవసరంగా శ్రమ పడకండి.... ఓ చిన్నమాట"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS