Previous Page Next Page 
పేక మేడలు పేజి 5


    "ఎప్పుడు లేచావు భానూ?" అన్నాను.
    "నీకు మెలుకువ వచ్చేసిందేవిట్రా? ఇక రానులే. పడుకో" అని లైటు తీసేసి వెళ్ళి పోయింది. ముసుగు బిగించాను. నిద్ర రాలేదు. మరి పడుకో బుద్ధికాలేదు. పాపం భాను సగం చీకటి నెత్తిన వేసుకొని ఒక్కతీ లేచి పని చేసుకొంటూంది. కాస్త ఏవైనా సాయంచేస్తే బావుండును. నాకే పనీరాదుకదా ఖర్మ! లేచి వెళ్ళి పీట వాల్చుకు కూర్చున్నాను.    
    "అప్పుడే లేచావేం?" అంది బియ్యం కడుగుతూ.
    "నిద్ర పట్టటంలేదు. నీకు జత కూర్చుందామని వచ్చేశాను."
    "మంచివాడివి గానీ కొబ్బరి చిప్పలు కోరుతా వేమిటి?" అంది. ఆ కటిక చీకట్లోనే కడిగీ కడగనట్టు మొహం కడిగేశాను. లేకపోతే అంత రాత్మ అరుస్తుందికదా! కొబ్బరి నీళ్ళు ఒక్కన్నే తాగేశాను. భాను ఏవో పనులు చేసుకొంటూనే కబుర్లు చెపుతూంది. "కొబ్బరి కోరటం ఇంకా కాలేదూ? ఈ ఏలకులు మెత్తగా పొడుం చెయ్యి. ఇవిగో పీటమీద పెడుతున్నాను. తర్వాత జీడి పప్పు ఒలిచిపెట్టు. మరి తొందరగా కానివ్వరా!" అంటూ హడావుడి పడుతూంది.
    "బావుందేవ్! తెల్లారేసరికి వంటంతా నేర్పేసేలా ఉన్నావ్!" అన్నాను తాపీగా కొబ్బరి కోరుతూ.
    "మంచిదేకదూ? నీ పెళ్ళాం సుఖపడుతుంది" అంది.    
    "దాని సుఖంకోసం నన్ను కష్టపెడతావేమిటి?"
    "రేపు నీ సుఖంకోసం అది కష్టపడదూ?"
    "ఎలాగైనా నిన్నటినుంచీ నువ్వు ఎక్కువమాట్లాడుతున్నావు."
    "సరేగాని అన్నయ్యా! ఏడాది కోనాడైనా మొగుడూ పెళ్ళాం వంటింట్లో కూర్చుని కబుర్లాడుకొంటూ పనిచేసుకొంటే సరదాగా ఉండదూ?"
    "వేరే అడగాలా? అవుతే వెంటనే వెళ్ళి బావగార్ని లేపుకు రమ్మంటావా?"
    "వెళ్ళు. వెళ్ళు. నీ పళ్ళెం ఎక్కువయ్యా యేమిటి?"
    "బాపురే! శ్రీవారిని గుర్రం లక్షణాలు కూడా ఉన్నాయేమిటి?" అన్నాను. అంతలో చటుక్కున గుర్తువచ్చి-"భానూ! ఇన్ని పనులు ఎప్పుడు నేర్చేసుకున్నావు చెప్మా? కాఫీ పెట్టటం కూడా తెలిసేదికాదు. ఏడుగంటల వరకూ ముసుగు బిగించేదానివి. ఇప్పుడు..."
    "ఇన్నాళ్ళకు నన్ను మెచ్చుకున్నవాడివి నువ్వు కనపడ్డావు. ఇదో పునర్జన్మ!"
    "ఏమిటి భానూ అలా మాట్లాడుతావు?"
    దానికి జవాబు చెప్పకుండా-"సరేగాని ఏలకులు పొడుంచేశావూ? జీడిపప్పు ఒలిచావూ? అయ్యయ్యో! ఏంపనిరా! గొప్పగా చేస్తానని నీకు చెప్పాను. అన్నీ పెచ్చులు పెచ్చులే గిల్లిపోశావు. తొక్కలన్నీ చూర్ణం చేశావు" అంటూ నాలుగు తిట్టి తను మళ్ళా బాగుచేసుకోసాగింది. నేను అలిగి కూర్చున్నాను.
    ఆరుగంట లయ్యేసరికి కారియర్లు రెండూ కట్టిపెట్టింది. నాకు వేన్నీళ్ళు తోడి అంతలో నానిగాడు లేస్తే వాడికి నీళ్ళుపోసింది. తను స్నానం చేసి అన్నీ సర్దిపెట్టి లేత నీలం జరీ చీర కట్టుకు ముస్తాబైంది.
    బావగారు లేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకొంటూ వస్తే టూత్ బ్రష్ అందించింది. ఆయన స్నానంచేసి టిఫిన్ అదీ కానిచ్చి వీధి అరుగుమీది కెళ్ళేసరికి ఎవడో ఒకాయన గుండెలు కవికేలా పరుగెత్తుకొంటూ వచ్చిపడ్డాడు-"రాజూ! రాత్రి మెయిల్లో రామం వచ్చాడోయ్! ఇవ్వాళ ఆదివారంకదా? నిన్ను కాఫీ అదీ అవగానే రమ్మని చెప్పమన్నాడు."
    అదేం వార్తోగానీ వింటూనే బావగారిమొహం విద్యుద్దీపంలా వెలిగింది-"రామం వచ్చేశాడా? ఏంవార్త చెప్పావయ్యా! పద, పద. నీ వెనకే వస్తున్నాను. అలా మూర్తిని కూడా పిలిచి వెళ్ళు" అనేసి లోపలికొస్తూ-"భానూ! ఓ జత బట్టలు తీసిపెట్టు. బహుశా నేను మధ్యాహ్నం భోజనానికి రానేమో! అన్నట్టు సాక్స్ మాసినట్టున్నాయి. మార్చిపెట్టు" అంటూ ఏవేవో ఆర్డర్ చేసేస్తూంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదేమిటి?రాత్రి పిక్నిక్ కి వెళ్దామనుకొన్న సంగతి మరిచిపోయాడా?

                                 * * *

                    

    భాను నసుగుతూనే అంది-"ఇవ్వాళ తోటకి వెళ్దాం అనుకున్నాం కదూ? కారియర్లు కూడా సర్దిపెట్టేశాను."
    "గొప్ప పని చేశావ్! తోట ఎక్కడికీ పారిపోదులెద్దూ. మళ్ళీ వారం వెళ్దాం. ఏమండీ రావుగారూ! హాయిగా హోటల్నుంచి తెచ్చుకున్నట్టు కారియర్లు విప్పుకొని అన్నా చెల్లెళ్ళిద్దరూ తిని కూర్చోండి. ఏమంటారు?" అన్నాడు నవ్వుతూ. నిజానికి నాకు చిరాకు వేసింది. కాని నవ్వి ఊరుకున్నాను. బట్టలు వేసుకొని వెళ్ళిపోయాడు. ఐదు నిమిషాల్లో జరిగిపోయిన హఠాత్సంఘ టనకు నా మతి పోయినట్టే అయింది. నిట్టూర్చి తల తిప్పి చూస్తే భాను గుమ్మానికి తల ఆన్చి నిలబడి ఉంది. కళ్ళలో నీళ్ళు నిలిచి ఉన్నాయి.
    "ఛ! ఇంతమాత్రానికే ఏడుస్తున్నా వేమిటి? భలే దానివి. ఊరునుంచి స్నేహితుడొస్తే ఎవరి కైనా సంతోషం కదూ? పిక్నిక్ కేముంది? మరోసారి వెళ్దాం. బావ అన్నట్టు కూర్చునికబుర్లు చెప్పుకొందాం" అన్నాను ఓదార్పుగా.
    భాను కళ్ళు ఒత్తుకొంటూ అంది-"నీకు తెలీదన్నయ్యా! ఆయన వెళ్ళింది స్నేహితుణ్ణి చూడటానికి కాదు.....ఈ పేకాటవల్ల నా సంసారంలో ఎన్ని సుఖాలు మాసిపోతున్నాయో నీకు తెలీదు."    
    నేను త్రుళ్ళిపడ్డాను- "భానూ!"
    అవునన్నయ్యా! నీకు ఎలా చెప్పను?"    
    తనకు తానై పిక్నిక్ కార్యక్రమం వేసి అర్ధరాత్రి లేచి భార్య అన్నీ చేస్తే......తీరా అంతా అధ్వాన్నం చేసిపోయింది పేకాటకా? నా ఆశ్చర్యానికి అంతులేదు. అతను పేకాడుతున్నందుకు కాదు- భాను పేకాటను సహిస్తున్నందుకు- పేకాడే వ్యక్తిని భరిస్తున్నందుకు-భాను ఏవగించుకొనే విషయాలలో పేకాట ఒకటి. "మగ వాడు జూదరి అయితే అది సహించగలిగే శక్తి ఏ ఆడదానికే ఉండకూడదు" అంది ఒకసారి.
    "భానూ! అంత తీవ్రంగా నిర్ణయం చేసుకోకు. ఈ రోజుల్లో పేకాట అనేది తిండికన్నా ముఖ్యావసరంగా మారిపోయింది. అలాంటి విషయాలలో అంత అసహ్యం పెంచుకోవటం మంచిదికాదు" అంటే-అదోరకంగా చూస్తూ- "అన్నయ్యా! నువ్వు నిజంగానే చెప్తున్నావా?" అంది. "అయితే మీ ఆయనకి పేకాట బాగా ఇష్టమనుకో. నువ్వేం చేస్తావు?"
    "ఏం చేస్తావా? మాన్పిస్తాను." ఎంత ధీమా!
    అతను వినకపోతే?"
    "ఏమిటి నువ్విలా మాట్లాడుతావు? భార్యా భర్తలు ఒకరు చెప్పింది ఒకరు విననినాడు ఆ బంధమే నిరర్ధకమనుకొంటాను."
    నాకు ఏదో చెప్పాలని అనిపించింది కానీ అంత కన్నా ఎలా చెప్పాలో అర్ధం కాలేదు-అదే భాను....ఈనాడు? మంచంమీద పడుకొని వెక్కి వెక్కి ఏడుస్తూంది. నా శరీరం కంపించింది. ఆ సంసారం అంతా అర్ధమైపోయినట్టు అనిపించింది.భాను ఏడవటం నే నెన్నడూ చూడనిదీ -చూసినా సహించనిదీ. నెమ్మదిగా తలదగ్గర కూర్చుని జుట్టుమీద చెయ్యి వేశాను.    
    "ఎందుకు భానూ ఏడుస్తావు?" అన్నాను. కొంతసేపటికి కళ్ళు తుడుచుకొంది. "ఇదే నాకు మిగిలింది. ఏడిస్తే కొంత తృప్తిగా ఉంటుంది."
    నేను ఏమీ మాట్లాడలేకపోయాను. భాను సంసారంలో సుఖం, సంతోషం అనుభవించటం లేదు. నేను ఊహించిన భయా లేవో నిజమౌతున్నాయి.
    "భానూ!" అన్నాను అప్రయత్నంగా. "నీ తెలివి తేటలతో బావని మార్చలేకపోయావా?"
    "నీ చాతుర్యంతో రాయిని మనిషి చేస్తావా?మనుషుల్లో రాళ్ళు కూడా ఉంటాయని నా కెప్పుడూ తెలీలేదు."
    "భానూ! తొందరపడుతున్నావు సుమా! ఒక మనిషిని పాషాణం అనటానికి కారణాలు చాలా కావాలి. పేకాడటం అనేది అతి స్వల్ప విషయం."
    భాను మాట్లాడలేదు. నేనే అన్నాను- "అసలు నీ ప్రయత్నాలు నువ్వు చేసి చూశావా భానూ?"
    భాను కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. "నేను పూర్తిగా ఓడిపోయా నన్నయ్యా! ఈనాడు నా గర్వం అంతా మాసిపోయింది. ఈ రెండు సంవత్సరాలలో ఎన్నో నిజాలు తెలుసుకున్నాను." కళ్ళు ఒత్తుకుంది. "ఈ క్షణంవరకూ నా కష్టం సుఖం ఎవ్వరికీ చెప్పుకోలేదు. ఆఖరికి అమ్మకి సుశీలకి కూడా తెలీనివ్వలేదు. మనసు కలతబారి నప్పుడల్లా ఏనాటికైనా ఒక్క నీకు మాత్రం చెప్పుకోవాలనిపిస్తూ ఉంటుంది. నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరు. నీకు ఏం చెప్పను? ఎలా చెప్పను? నేను ఎంతో హాయిగా, సుఖంగా బ్రతుకుతున్నానని కలలు కంటూన్న నీకీ నిజాలు ఎలా చెప్పనన్నయ్యా?" తలగడమీదికి వాలిపోయివెక్కి వెక్కి ఏడవసాగింది. భాను ఎందుకింత పిచ్చిగా తయారైంది? చూస్తోన్నకొద్దీ ఆశ్చర్యం ఎక్కువ అవుతూంది.
    "బావ తరుచూ పేకాడుతూంటారేమిటి?" అన్నాను నెమ్మదిగా.
    భాను కళ్ళెత్తి చూసింది. "తరుచూనా? తరుచూ ఏం ఖర్మ! ప్రతి రోజూ! ప్రతి గంటా! ప్రతి నిమిషం! క్లబ్బేఇల్లూ వాకిలీ! పేకాటే సంసారం! స్నేహితులే భార్యా బిడ్డలు! ఆయనకు మరేమీ వద్దు. ఇల్లు నరకం! భార్య రాక్షసి! కొడుకు శత్రువు! మరేం చేస్తారు?"
    నేను కొంతసేపు ఆలోచించాను.
    "భానూ! నీకు కష్టంగానే ఉంటుంది కానీ ఎదుటివాళ్ళ పరిస్థితులు కూడా కొంచెం అర్ధం చేసుకోవాలి. చూడూ! ఈ ఆధునిక యుగాన్ని నువ్వూ ఆమోదిస్తావు. ఇష్టపడతావు. దేశ కాల పరిస్థితులను బట్టి మారే విషయాలను కొంత వరకైనా మనం అలవాటు చేసుకోవాలి. సిగరెట్లూ, షికార్లూ, పేకాటలూ, క్లబ్బులూ, సినిమాలూ, జల్సాలూ-ఇవన్నీ మనం కోరుకునే నవనాగరకత ప్రభావమే. ఒక స్నేహితుడు సిగరెట్ ఇస్తే థాంక్స్ చెప్పి అందుకోకపోతే అసభ్యత! పదిమందీ కలిసి పేకాడాలన్నప్పుడు వెనుకంజ వేస్తే పిరికితనం! రోడ్డుమీద కలిసినవాళ్ళయినా హోటల్ కు తీసికెళ్ళి కాఫీ పోయించకపోతే అమర్యాద! తనకు సినిమామీద బుద్దిపుడితే స్నేహితుల నాహ్వానించకుండా ఒక్కడూ వెళ్ళివస్తే సిగ్గుచేటు! మంచో చెడో కొన్ని పనులు అని వార్యంలా తయారౌతున్నాయి. ఈనాడు అన్నిటినీ మంచిగానే ఆమోదిస్తూన్న మగవాళ్ళు దేనికీ వెనుకంజవెయ్యరు. కాల ప్రభావాన్ని బట్టి మంచి గానీ చెడ్డగానీ అనుభవించటమే అలవాటు చేసుకోవాలి భానూ!"'    
    "విడిదిలో బావగారు సిగరెట్ ఇవ్వబోతే తిరస్కరించా నన్నావు, గుర్తు ఉందా?"
    "దానికీ దీనికీ ముడిపెట్టుకు భానూ! ఇద్దరు వ్యక్తులు ఒకేవిధంగా ఎలా ప్రవర్తిస్తారు? నిన్న బావగారు నన్ను ఆడపిల్లనని ఎలా హాస్యం చేశారో చూశావా? నేను సిగరెట్లు కాల్చననీ, పేకాడననీ, నాకె సరదాలూ లేవనీ కదా ఆయన ఉద్దేశ్యం? చెడ్డ అలవాట్లకి దూరంగా ఉండేవాడు లోకం దృష్టిలో అసమర్ధుడు! పిరికివాడు! అందుకే చాలమంది ఏదో గొప్పకోసం జల్సాలన్నీ అలవాటు చేసుకుంటారు. అది వారి వారి మనస్తత్వాలను బట్టి ఉంటుందనుకో. నేను అనే దేమిటంటే కాలంతోపాటు వచ్చిపడే ఇటువంటి విషయాలను సరదాలుగానే తీసుకోవాలిగానీ చెడ్డగా మనసుకు పట్టించుకోకూడదు. మాన మర్యాదలలోనూ, కట్టు బొట్టు తీరులోనూ అసహ్యంగా ప్రవర్తిస్తున్న అమ్మాయిలు ఎంతమంది లేరు భానూ? ఆ నైలాన్ చీరలూ, ఒంటినిండా రకరకాల రంగులూ, జుట్టు  కత్తిరింపులూ, ప్రతి మగవాడి తోటీ రాసుకు తిరగటాలూ-అవన్నీ చూస్తే వాళ్ళ నెంత నీచంగా చూడాలంటావు? కాని నిజానికి అలా చూస్తున్నానూ? కాలం మారింది. వేష భాషలలో కూడా మార్పు లొచ్చాయి. వాళ్ళ వాళ్ళ సరదాకొద్దీ ఏదో అలంకరించుకొంటున్నారు -అనుకొని సమర్ధించుకోవటం లేదా? అలాగే మగవాడి అలవాట్లలో కూడాను. అయినా ఈ వ్యసనాలకు మగవాళ్ళే అలవాటు పడ్డారని నువ్వు అనుకొంటున్నావు గానీ సిగరెట్లు కాలుస్తూ మగవాళ్ళని మించి పేకాడే 'సొసైటీ లేడీస్'ను ఎంతమందిని చూపించమంటావు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS