
"కవల పిల్లల్లో అంతగా పోలికలుగలవార్ని ఇంతవరకు నేను చూడలేదు. మీ పెద్దన్నయ్య ఎంత పెద్ద?"
"నలభై రెండు నిమిషాలుట."
"చూపులకు ఇద్దరు ఒకేలా వున్నారు. వారి ప్రవర్తనలో కూడా తేడా లేకుండా వుంటుందా! బుద్దిలో ..."
సరళ సుమలత వైపు చూచి జవాబిచ్చింది గుణాల్లోను, ప్రవర్తనలోను, ఒకే విధంగా వుంటారు. పెద్దన్నయ్యకు కోపతాపాలు తక్కువ. కానీ రెండో అన్నయ్య..."
కాఫీ పాట్ ఖాళీ అవటంతో సరళ లోపలి కెళ్ళింది, కిళ్ళీలు చుట్టి వాటి చుట్టూ వెండి పొర అంటిస్తున్న అన్నలకేసి కృతజ్ఞత తో చూసింది. తన సంతోషం కోసం ఇద్దరన్నలూ ఎంత తాపత్రయపడ్తున్నారు! వెనకాలే వెళ్ళిన గీత ఆ దృశ్యాన్ని చూచి చలించిపోయి వారికి అగుపడకుండా ఇవతలికి వచ్చింది.
మరి కాసేపటికి సరళ కాఫీ పాట్ తెచ్చింది. ఆమె కళ్ళు మెరుస్తున్నాయి.
సూర్యాస్తమయం పిల్లతెమ్మరలు సుతారంగా ఆ కన్యల చెక్కిళ్ళను తాకుతూ- వారి చెదరిన ముంగురులతో దోబూచులాడుతున్నాయి. వూ తీగ మీది మొగలు సునాయాసంగా నాట్యం చేస్తున్నాయి. గడ్డి తడిగా మెత్తగా ముఖమల్ లాగా వుంది. ఆ సుందరాంగుల హృదయాలు ఆనందంతో సంతృప్తిచెందాయి. కాసేపు పోయాక తల్లివచ్చి సరళను పీటవేసి కూచో బెట్టింది. హారతి యిచ్చారు. రెండు జట్లు తెచ్చిన బహుమతులను సరళకు - ఆశీర్వదిస్తూ సమర్పించారు. తల్లి ఆనందభరితయై అంది. "మీరంతా రావటంవల్ల ఎంతో సంతోషంగా జరుపుకోగల్గిందే.....మీకంతా మాకృతజ్ఞతలు"
"రేపు పెళ్ళికి మాదే పెత్తనమండోయ్" సుమలత అంటుంటే గీత విస్తుపోయి చూచింది?
"తప్పకుండా.... కాని అంతా కుదరాలికదా" అని ఆమె వెళ్ళిపోయింది.
"ఎవరు సరళా ఆ అదృష్టవంతుడు?"
సరళ ముఖం కోపంతో ఎరుపెక్కింది ...... అబ్బ.....అందరూ ఇంతే. చదువు మానేసినప్పటినుంచీ నన్ను వేపుకుతింటున్నారు. ఇవాళ పుట్టాను కదా ఇప్పుడే పెళ్ళేమిటి?"
"ఆడది పుట్టటం పెళ్ళిచేసికోటానికేగా అని గారాలు పోయింది.
"రామ-రామ పెళ్ళి మినహా ఆమె జన్మకు వేరే అర్ధంలేదా?"
"ఈ వ్యవస్థ మారాలి"
"మార్పుల్ని అంగీకరించని మనస్తత్వం మనది"
"స్త్రీ ఒంటరిగా ఉండాలి"
"ఉండలేదు"
"ఉంటేనే ప్రగతి"
"ఉండనివ్వరు తగినంత మనస్థైర్యం నిగ్రహం వున్నా బెదరకొట్టి, చెదరగొడతారు"
ఇలా సాగింది సంభాషణ స్త్రీ ఆర్ధిక, సాంఘిక, రాజకీయ స్వాతంత్ర్యాలమీద, స్తీలో రావలసిన విప్లవం మీద.
"కాబట్టి - సోదరీ మణులారా - తేల్చి చెప్పిన దేమిటంటే స్త్రీ అవివాహితగా వుండటం అపాయకరం - కాబట్టి వివాహం అత్యవసరం - అనేకదూ" ప్రేమ హాస్యంగా అన్నమాటలకు అందరు హాయిగా నవ్వేశారు.
"బాగా చెప్పావమ్మా - తెలీకడుగుతాగానీ - అమ్మాయిలూ మీలో ఎంతమంది ఒంటరిగా వుండదల్చుకున్నారు? ...." ఐరావతమ్మ అలా అనటంతో అంతా విస్తుపోయి చూచారు. ఆమె వాళ్ళకు అగుపించ కుండా కొంత దూరంలో కూచుని వారి సంభాషణ అంతా విన్నది. చివర కుండబట్టలేక ఇవతలికొచ్చి ఆ ప్రశ్న వేసింది.
జవాబు ఏమని చెబుతారు? అందరు నవ్వుతూ ఆ నవ్వుతోనే తను జవాబు వ్యక్తపర్చారు.
వాళ్ళలో సూరేకారం పాలు కాస్త ఎక్కువ వున్న అమ్మాయి మాత్రం-
"నాకుండటం ఇష్టమేనండి........ కానీ మా బావ నన్నుండ నివ్వడు" అంది కనుబొమ్మలు చిట్లించి.
అంతా గొల్లున నవ్వేశారు, "అదేమరి బావో, బంధువో, ప్రియుడో, మొగుడో, ఎవడో ఒక మొగాడు మనలో ప్రతివార్నీ నడిపిస్తాడు"
ఐరావతమ్మ నిండుగా నవ్వింది.
మంచి జవాబు చెప్పావమ్మా-పెళ్ళంటే ఒంటి కాలుమీద లేచే మా సరళకూడా తన క్రొత్త సంసారానికి కావలసినవన్నీ సిద్ధం చేసి కొంటోంది?"
సరళ తల్లివైపు చురచుర చూస్తే ఆ చూపులోని అందమైన ఆగ్రహాన్ని తనివిదీర చూచి ఆనందించిందా మాతృమూర్తి.
ఎవరో వున్నట్లుండి లేచారు" ఏడు కావస్తోంది......ఇక పదండర్రా"
"ఉండండమ్మా- ఏడు గంటలకు టాక్సీలొస్తాయి.......మరేం కంగారు పడకండి" అందరు పేరు పేరున వారిద్దరికీ ధన్యవాదాలు తెల్పారు. సరళ ముఖం ఆనందంతో పరిపూర్ణత చెంది తేజోవంతమైంది. హృదయ కుసుమం ఆ నూతన స్నేహబృందం చూసిన ప్రేమలో వికసించింది.
అంతలో టాక్సీలు రావటంతో లేచారు. రెండు జట్లు వేరు వేరుగా టాక్సీల్లో ఎక్కాయి. ఒక టాక్సీ కదిలిపోయింది. ప్రేమ, గీతా వాళ్ళది ఇంకా ఆగివుంది. లోపల కూర్చున్న తర్వాత సమస్య మొదలైంది. ప్రేమ వాళ్ళ ఇల్లు చాల దూరం. తను ఒంటరిగా వెళ్ళటం కష్టం. బస్సు ఎక్కిస్తే బస్సు సరాసరి ఇంటి ముందర ఆగుతుంది. అది ఆలోచించుకుని ప్రేమ టాక్సీ దిగింది. ఆమె అలా దిగటం చూచి సరళ గబగబ టాక్సీ దగ్గర కొచ్చింది.
తనకు వచ్చిన ఇబ్బందినిచెప్పి బస్ లో వెళ్తానంది ప్రేమ, అప్పుడే తండ్రి కొడుకులు అటు వస్తున్నారు.
"పోనీ టాక్సీలో మా పెద్దన్న సాయంగా వస్తారు లెండి" అంది చిటికెలో పరిష్కరించినట్లు....
ప్రేమ హృదయం ఝల్లుమంది - భయమో-ఆనందమో కానీ ఆ క్షణమే సుధాకర్ జ్ఞాపకాని కొచ్చాడు. అహ......అలా అతడితో వెళ్ళి నట్లు తెలిస్తే సుధాకర్ బాధ పడ్తాడు, ఆమె తటపటాయిస్తూ మౌనంగా నుంచుంది. తర్వాత అంది "బస్సులో వెళ్ళిపోగలను ఫరవాలేదు.
ఆమె మాటలనెవరు వినలేదన్నట్లు ఎవరికీ తోచిన సలహా వారిస్తున్నారు.
వచ్చిన ముగ్గురికి అందరు నమస్కరించి వందనాలు చెప్పారు. సరళ ప్రేమ విషయం చెప్పింది.
దీనికింత ఆలోచన దేనికి? సరళా - నువ్వు నరేంద్ర వెళ్ళండి,ఇదుగో డ్రైవర్ - ఇదే అడ్రస్ కు మరొక టాక్సీ పంపు."
"ఐతే ఇక వస్తాము" అంటూండగా టాక్సీ బయల్దేరింది.
అరగంటకు మరొక టాక్సీ వచ్చింది. అంతసేపు సరళ - ఐరావతమ్మ ప్రేమ దగ్గర కూచుని కబుర్లు చెబుతున్నారు. ఆమె ప్రేమ తల్లి దండ్రులను గూర్చి ప్రశ్నించింది. వ్యక్తిగత విషయాలు తెలుసుకోదగినవి మాత్రం అడిగి తెలిసికొందామె.
ప్రేమకు ఒక అన్నయ్య మాత్రం వున్నాడు. అతడు సబ్ మేజి స్ట్రేట్ గా పని చేస్తున్నాడు. తండ్రి రామారావు మునిసిపల్ కమీషనర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. ప్రేమ వెళ్ళకముందు ఆ వృద్ధదంపతులను ఆహ్వానించింది. అందరు తప్పక ఒకనాడు తను గృహం పావనం చేయవలెనని కోరింది. ఐరావతమ్మ దగ్గర మాట పుచ్చుకునిగాని ఇంటికి బయలు దేరింది కాదు.
నరేంద్ర ముందర కూచున్నాడు. ప్రేమ, సరళ వెనక కూచున్నారు శ్రీనివాసరావుగారు కూతుర్ని హెచ్చరించాడు. "ఈ సారిని అమ్మాయిని వదలిపెట్టి వెంటనే వచ్చేయండి. ఇంకోసారి తీరికగా వెళ్తువుగాని" మెట్లమీద నుంచుని వీడ్కోలిస్తున్న ఆ భార్యా భర్తలకు, నిరంజన్ కు నమస్కరించింది. టాక్సీ కదలిపోయింది.
రెడ్ లైట్ సన్నటి ఎర్రని కాంతి వారి ముఖాలపై ప్రసరించింది. కారు వెళ్ళిపోయేవరకు వారు అక్కడే నుంచున్నారు.
ఎవరి ఆలోచనలు వారివి- తండ్రి దీర్ఘంగా నిట్టూర్చి గాద్గదికంతో "వచ్చే జన్మదినం ఎక్కడ ఎవరింట్లో జరుపుకుంటుందో తల్లీ" అన్నారు. అది తలంచుకోగానే తల్లి హృదయంలో చిన్న మంట ప్రారంభమైంది. ఏమీ అనలేదు. మౌనంగా చూస్తోంది. అదే ఆమె జవాబు. నిరంజన్ కు. ఈ నిశ్శబ్దగంభీర వాతావరణం నచ్చలేదు, వారిద్దరిలోని బాధను గ్రహించి లోపలికి దారి తీశాడు "అమ్మా- పద. అంతా సర్దుకుందాం. రాముడొచ్చాడు- అవన్నీ కడిగేస్తే లోపల సర్దుదాం"
కొడుకు పిలుపుతో ఆమె లోపలికి వెళ్ళిపోయింది.
సరళవాళ్ళు తిరిగి రావటానికి గంట పట్టింది.
"ప్రేమగారు లోపలికి తీసుకెళ్ళి బొట్టు పెట్టారు. వాళ్ళ అమ్మా నాన్న గార్లు కాసేపు కూచోమన్నారు. మీరన్న మాటలే వారితో అన్నాను. నవ్వి వెళ్ళటానికి సెలవిచ్చారు.....అబ్బ.... ఎంత పెద్ద ఇల్లు. చక్కని తోట.... నాన్నగారూ......ముఫ్ఫై రకాల గులాబి అంట్లున్నాయట. వెనుక వైపంతా ద్రాక్ష తోట మిమ్మల్ని తప్పక కలవాలన్నారు. మీరు గులాబి మొక్కల పైగల శ్రద్ధ చెప్పాను..."సరళ అలా మాట్లాడుతూనే వుంది. నిరంజన్ - నరేంద్ర నవ్వుకున్నారు.
"రేపట్నుంచి నువ్వు ఒ. సి. ని" చిన్నాన్న అన్నాడు.
"అంటే?" అంది ప్రశ్నార్ధకంగా చూస్తూ.
"అంటే ఆర్డినరీ పర్సన్ - అంటే మామూలు సరళని అన్న మాట" సరళ చటుక్కున గదిలోకి వెళ్ళి చీర మార్చుకుని వచ్చింది ముఖం అరుణ వర్ణం దాల్చింది. ముంగురులు అలవోకగా కదుల్తూ వింజామరలు వీస్తున్నా ఆక్రోధం శాంతింపలేదు.
తండ్రి అంతా గమనించి అన్నారు. "పదండర్రా - ఆకలి వేస్తోంది.... "మీరేం తినలేదూ?" ఆత్రంగా అడిగింది.
"లేదు తల్లీ" సరళ తన కోపాన్ని కాసేపు ప్రక్కకు త్రోసి గబగబ వంటింటివైపుకు నడిచింది.
* * *
4
ఆ విధంగా నిరంజన్ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. నాలుగైదు వారాలకోమాటు ప్రేమ వెళ్తుండేది. సరళ ప్రతినెల ఓకే మాటు వెళ్ళివస్తుండేది. వారిద్దరు అతి సన్నిహితులై పోయారు.
ఒకసారి శ్రీనివాసరావు గారు కుటుంబ సమేతంగా వారింటికెళ్ళారు అంటే మగపిల్లలు మినహా - తరువాత ప్రేమా వాళ్ళు వెళ్ళారు. తండ్రులకు తోట వేయటం - గులాబి మొక్కల్ని పెంచటం హబీలవటం చేత వారు అతి త్వరలో స్నేహితులైపోయారు. తమ తోటల్లో లేని గులాబి అంట్లు మరొకరి తోటనించి తెప్పించుకున్నారు. అని దినదినాభివృద్ధి చెంది నట్లు వారి స్నేహం గాఢమైంది.
తల్లులకు ఒకటే ప్రశ్న - ఒకే చింత. ప్రేమకు మంచి సంబంధం తేవాలని. సరళకు త్వరలో పెళ్ళి చేయాలనీ. ఈ అంశాలపై వారు గంటలతరబడి మాట్లాడుకునేవారు. ప్రేమ, సరళ ఆ దరిదాపుల్లో వుండే వారుకారు.
ప్రేమ అ కుటుంబాన్ని ప్రత్యేక దృష్టితో చూసేది కాదు. కేవలం స్నేహితులన్న భావన మాత్రమే ఆమెలో వుండేది.వారింటి కెళ్ళి వచ్చిన తర్వాత ఆమె హృదయం అసంతృప్తితో నిండి పోయేది. శ్రుతి జేసిన వీణను మీటెందు కెవరూ లేనట్టు. వడ్డించిన విస్తరి ముందు ఎవరూ కూర్చొనట్లు అవ్యక్తమైన బాధకు లోనయేది. మనసు పరి పరి విధాలుగా పోతుంటే నిగ్రహించుకోవటం విఫలమయేది.
దానికికారణం ఒకటే. సుధాకర్ కుటుంబంలోని వ్యక్తులతో ఈ విధంగా కొంతకాలం గడపాలని ఆమె ఆశించేది. తను సకుటుంబ సమేతంగా నిరంజన్ వారింటి కెళ్ళినట్లు అక్కడికి వెళ్ళాలని కోరేది. తన తండ్రి- సుధాకర్ తండ్రి సన్నిహితులు కావాలని ఆరాటపడేది. కానీ అది అందరాని ఫలం అయిపోయింది. ఆ అవకాశమే లభించలేదు. ఎంత దూరంగా వుండాలన్నా - సరళ వాళ్ళతో - వీలవటం లేదు.
ఎందుకు? ఎందుకు? రోజుకి వెయ్యిసార్లు తన్నుతాను ప్రశ్నించుకునేది. జవాబు - అందకుండా వుంది.
ఆ సంవత్సరం గడిచిపోయింది.
వేసవి సెలవల్లో సరళ పెళ్ళి అయిపోయింది. అతను ప్రైవేట్ కంపెనీలో మేనేజరు. ఆరువందల జీతం. ఈ సంబంధానికి మించిన సంబంధం తేలేకపోయారు. పెళ్ళి నిరాడంబరంగా జరిగిపోయింది. స్నేహితులంతా మళ్ళీ కలిశారు. ఒక శుభ ముహూర్తాన సరళ అదేవూళ్ళో వున్న అత్తగారింటి కెళ్ళిపోయింది. అతని పేరు రమణ. ఈ పెళ్ళి సందర్భంలో ప్రేమ తల్లిదండ్రులు శ్రీనివాసరావుగారింటికి తరచుగా రావటంతో స్నేహం గాఢమైంది, ప్రేమ హృదయాన్ని ఎవరో కాల్చేస్తున్నట్లు బాధపడేది.
పెళ్ళి ఇంటినుంచి వచ్చిన ప్రేమ ఇంకా దుస్తులు మార్చుకోలేదు. రాత్రంతా నిద్రలేమివల్ల సోఫాలో చేరబడి వుంది. అలసటగా కళ్ళు మూసుకుంది.
ఉత్తరం మీ కివ్వమన్నారమ్మా ... ప్రొద్దుట ఎవరో అబ్బాయి తెచ్చాడు. తోటమాలి ఇచ్చేసి వెళ్ళాడు.
తన కెవరు రాస్తాను? అన్నయ్యదా- పోస్టులో వస్తుందిగాని ఇలారాదే. తనపేరు పొడక్షరాలలో వుంది. అప్పటికి స్ఫురించింది చటుక్కున లేచి తన గదిలోకి వెళ్ళింది.
అది సుధాకర్ రాసిన లేఖ. ఆమె హృదయం ఆనందంతో పరవళ్ళు త్రొక్కింది. హృదయవీణ మంజుల నాదం చేసింది. ఆతృతగా తెరుస్తుంటే చేతులుకాస్త వణికాయి.
ప్రేమా.
రేపు శనివారం సాయంత్రం ఐదు గంటలకు పబ్లిక్ గార్డెన్స్ లో కలుసుకుందాము. వీలు చేసుకుని రావాలి.
సుధాకర్
ఆ లేఖలో ఏం మహత్తు వున్న దోగాని ప్రేమ వందసార్లయినా చదువుకుంది. ఆజ్ఞాపిస్తున్నలా రాశాడు. తనలో తాను నవ్వుకుంది. సుధాకర్ ఆజ్ఞాపిస్తేనే బావుంది, రేపు ఐదుగంటల అనంతరం తన ప్రియుని కలుసుకోబొతోంది. ఆమంచి సమయం కోసం నిరీక్షిస్తూ అశాంతితో ఆ రాత్రి గడిపింది.
వంగపండు రంగులన్నీ క్రేప్ చీర కట్టి లేతరంగు పట్టు రవికె వేసుకుంది. ఆ రెండు కుదరలేదు. మరో జత చీరలుకట్టి విప్పింది. చివరికి శాంతి నికేతన్ చీరకట్టుకుని తెలుపు పూలుకుట్టిన తెల్ల ఫుల్ వాయిల్ బ్లౌజు వేసుకుంది. తలలో మల్లెచెండు తురిమింది ఒక్కసారి తృప్తిగా అద్దంలో చూసుకుంది. తన అందానికి తానే మురిసిపోయింది ఆ సోగ కళ్ళు చిలిపిగా నవ్వుతున్నాయి. హాసరేఖ పెదిమలపై తప్పటడుగులు వేస్తోంది నీలాల కుంతలాలు చెవుల దగ్గర గుసగుసలాడుతున్నాయి. వాటిని జుట్టులోకి - జడలోకి సర్ది తల్లి దగ్గర కెళ్ళింది.
