"నువ్వు మహా ఆరిందా అయిపోయినట్టు నన్ను మరీ పిల్లకాయలా తీసేస్తున్నావు. అసలు నువ్వే నాకన్నా చిన్నదానివి" అన్నాను కోపంగా. భాను నవ్వింది. ఆ నవ్వులో ఏదో తక్కువైంది. ఆ నవ్వటంలో ఏమిటో లోటు ఉంది.
పరీక్ష ఫలితాలు తెలిశాక భానుకు సంతోషంతో ఉత్తరం రాశాను-"భానూ, నేను ఎం. ఏ. మీ సిటీలో చదవాలనుకొంటున్నాను. ఈ టౌన్ మార్చెయ్యాలని బుద్దిపుడుతూంది. మళ్ళా నీకు దగ్గరగా వస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది." కానీ నాకో అనుమానం వచ్చిపడింది. భాను నన్ను వాళ్ళ ఇంట్లోనే ఉండి చదువుకోమని బలవంత పెడుతుందో ఏమో! ఏం చెయ్యాలి? వాళ్ళు ఏ అడ్డూ ఆపూ లేకుండా స్వేచ్చగా ఉంటున్న దంపతులయ్యే! వాళ్ళ ఆనందానికి నేను అడ్డు. సరిగదా నా చదువు కూడా భాను కబుర్లతో సరిగ్గా సాగదు. భాను ఎంత నిష్ఠూర పెట్టినా ఒప్పుకోకూడదు. బ్రతికాను. భాను రాసిన జవాబులో ఆ ప్రసక్తే లేదు. నారాకకోసం పుట్టెడు ఆశతో ఎదురు చూస్తూందట. నా ఒళ్ళో తలపెట్టుకొని తనని తీరా ఏడవాలని ఉందట-రాసింది. "పిచ్చి భాను!"
* * *
యూనివర్శిటీ ఫీజుకట్టి హాస్టల్లో చేరి సామానంతా గదిలో సర్ది కొంతసేపు పడుకున్నాను. సాయంత్రం లేచి అమ్మ నాకోసం చేసి ఇచ్చిన మినపసున్ని డబ్బా సంచిలో వేసుకొని బయల్దేరాను. అప్పటికి భానును చూసి కొన్ని నెలలైంది.భాను చాల చిక్కినట్టు కన్పించింది. నన్ను చూస్తూనే నవ్వుమొహంతో ఏదో పెన్నిధి దొరికినట్టే చేయి పట్టుకొంది.
"బావున్నావా? నిన్ననే వస్తాననుకొన్నాను. అసలు నీ ఉత్తరమే నాకు ఆలస్యంగా అందింది. పెద్దమ్మా వాళ్ళంతా కులాసా? అబ్బ! చాల పొడుగైపోయావే!" అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. జవాబులు వినకుండానే-"ఒరేయ్ నానీ! మావయ్య వచ్చాడురా! మావయ్య! నీకేం తెచ్చాడో అడుగు" అంటూ నడబండితో ఆడుకొంటూన్న వాన్ని లాక్కొచ్చింది.
వాడు చకచకా నడిచి దగ్గరికొస్తూంటే బుగ్గగిల్లి - "నీకేం తెలీదురా అల్లుడా!" అన్నాను.
"అల్లుడంటే అంత అలుసనుకొంటున్నావేమిటి? ఓ బిస్కట్టు ముక్కయినా తేకపోతే అది గుర్తు ఉంచుకుంటాడు సుమా" అంది భాను నవ్వి.
"అయితే నీ కొడుక్కు బిస్కట్ల కట్నం చాలంటావా?" అన్నాను టిన్ను అందిస్తూ.
"ఇప్పటికి చాలు" అంది గొప్పగా. మగవాడి తల్లి మరి! నానిగాడు బిస్కట్లు ఎన్నిక చేస్తూంటే మేమిద్దరం కబుర్లలో కొట్టుకుపోయాం. అన్నిటి మధ్యా నా పెళ్ళి విషయం కూడా ఎత్తింది భాను! నేను పెళ్ళాడబోయే ఆడది ఎవతోగాని అదృష్టవంతురాలట. ఆ అదృష్టం సుశీలకే దక్కనివ్వాలాట. సుశీల నాకు మేనమామ కూతురు. భానుకు ప్రాణ స్నేహితురాలు. సుశీల పుట్టినప్పటినుంచీ కేశవ్ పెళ్ళాంగానే చలామణీ అవుతూంది. కానీ అది నిజమో కాదో మా నాన్నకూ దేవుడంటూ ఉంటే వాడికీ తెలియాలి. నాన్న ఎప్పుడూ పైకి తేలడు. దేవుడు కనుపించను కూడా కనుపించడు. మరి తెలిసేది ఎలా? నా ఉద్దేశ్యం చెప్పమంటే మాత్రం నాకేం అభ్యంతరం లేదు. పైగా సంతోషం కూడా అయినా నేను నా పెళ్ళి గురించి ఏనాడూ ఆలోచించలేదు. చెప్తే భాను నమ్మదు. ఖర్మ!
"నువ్వు దొంగవి. నీకే ఇష్టంలేక పెదనాన్న మీదకు గెంటుతున్నావు. నువ్వు పంతం పట్టి కూర్చుంటే ఎందుకుకాదు? ఎవ్వరేం చేస్తారు?" అంది.
నేను నవ్వాను-"నేను పంతం ఎందుకు పట్టాలి? నీ సుశీల తప్పితే లోకం గొడ్డు పోయిందనా?"
"లోకం ఎప్పుడూ గొడ్డుపోదు రావుగారూ!" అంది వెటకారంగా. అంతలోనే సీరియస్ గా ప్రారంభించింది- "సుశీల దృష్టిలో నీకున్న విలువ అపారమైనది. అది మరే అమ్మాయి మనసుతోటీ పోల్చటానికి వీలులేదు. తనకు ఊహ తెలిసిన క్షణంనుంచే నిన్నే అభిమానిస్తూ.."
"నీకెంత ఫీజు యిస్తానందేమిటి?"
భాను క్షణం ఆగి నాకళ్ళలోకి చూసి నవ్వుతూ అంది-"నీ గుణం-దాని అందం-కలిసిన కోడల్ని ఇస్తానని మాట ఇచ్చింది"-భాను కళ్ళతో నవ్వుతూంటే సిగ్గుపడిపోయాను. అదేమిటో భాను ఆరిందాలా అన్ని విషయాలలోనూ సిగ్గులేకుండా మాట్లాడేస్తూంది.
"ఎవర్ని అడిగి నీకామాట ఇచ్చిందేమిటి?" అన్నాను కోపం నటిస్తూ.
"అదేమో! దాన్నే అడుగు" అనేసింది.
కొంతసేపయ్యాక-"బావగారింకా రాలేదేం?" అన్నాను. టైం ఎనిమిదికావస్తూంది. "వస్తారు" అంది ముభావంగా.
"బావ కబుర్లేమైనా చెప్పుభానూ!" అన్నాను.
"రేపటినుంచీ నువ్వే చూద్దుగానిలే" అంది నవ్వుతూ. తొమ్మిది కూడా దాటింది. ఎన్నిసార్లు అన్నానికి లేవమన్నా "బావను రానీ!" అంటూ కూర్చున్నాను. ఆయన వచ్చేసరికి మరో అరగంటైంది. రోజూ ఆయన వచ్చేవేళ అదేనట. ఈ పాడు ఉద్యోగాలకూ పెళ్ళాం బిడ్డలకూ పొత్తు కుదరదు కాబోలు.
"బావున్నారా? అప్పుడే హాస్టల్లో దిగకపోతే నాలుగు రోజులు ఇక్కడఉండి వెళ్ళకపోయారా?" అంటూ పలకరించాడు.
"స్టేషన్ నుంచి నేరుగా వెళ్ళిపోయాను బావా! సామానదీ ఇటూ అటూ తిప్పటం శ్రమకదా? మీరు కులాసానా? పది గంటలవరకూ ఏం చాకిరీ అండీ? ఇంతవరకూ ఆడవాళ్ళు ఒంటరిగా ఉండాల్సిందే!" అన్నాను.
"ఏం? మీ చెల్లి ధైర్యస్థురాలే కదూ? స్నానంచేసి వస్తానండీ!" అంటూ దొడ్లోకి వెళ్ళాడు.
భోజనాలవగానే నిద్ర ముంచుకొచ్చింది. "భాను సుఖంగా బ్రతుకుతూంది. అంతేచాలు" అనుకొంటూ నిద్రలోకి జారిపోయాను.
వారాని కోసారైనా ఏదైనా కొనుక్కువచ్చి భానుకూ, అల్లున్నీ చూసి, ఒక్కోపూట భోంచేసి వెళ్ళటం అలవాటులాగే అయింది.ఎప్పుడోగాని బావగార్ని చూడటం తటస్థ పడేది కాదు. ఆయన ఇంట్లో ఉండే కాలం తక్కువ. భాను ఒక్కతీ ఏదో చదువుకొంటూనో కుట్టు కొంటూనో కొడుకుతో ఆడుకొంటూనో ఉండేది. నన్ను చూడగానే ప్రాణం లేచివచ్చినట్టు చేయి పట్టుకు మరీ పలకరించేది-"అబ్బ! ఇంత ఒంటరితనం ఎలా భరిస్తున్నావు భానూ?" అంటే-"ఏం చెయ్యమంటావు?" అంది దిగులుగా.
* * *
రెండు మూడు నెలల్లోనే నేను గ్రహించిన దేమి టంటే-భాను అశాంతితో బాధపడుతూంది. దుఃఖంతో క్రుంగి పోతూంది. సుఖానికి దూర మైన దానిలా భారంగా రోజులు దొర్లిస్తూంది -పిడుగు దెబ్బ తిన్నట్టు అదిరిపడ్డాను. భాను-అశాంతితో బాధపడటమా? దుఃఖంతో కృంగి పోవటమా? కారణం? ఎంత ఆలోచించినా ఏమీ తోచలేదు. భానుమాత్రం చాలా మారిపోయింది. ముభావంగా ఉదాసీనంగా ఏదీ తనకు పట్టనట్టు ప్రవర్తిస్తుంది. బావ ఏదో అడుగుతాడు. అందిస్తుంది. లేదా పొడిగా జవాబు చెపుతుంది. అంతే. భార్యా భర్త లిద్దరూ కలిసి చనువుగా ఎక్కువగా మాట్లాడుకోవటం అరుదు. వచ్చీ రాని మాటలు చెపుతూ ఇల్లంతా బొంగరంలా తిరిగే కొడుకును ఇద్దరూ కలిసి ఆడించటంగానీ వాణ్ణి గురించి ముచ్చటించుకోవటంగానీ నేను చూడలేదు మరి. అసలు కొడుకును తండ్రి ఎప్పుడూ ఎత్తుకు తిరిగినట్టే ఉండదు. వాళ్ళ దాంపత్యంలో అనురాగాలు గానీ అభిమానాలు గానీ నాకేం అంతుపట్టలేదు.
ఛ! వాళ్ళను నేను అపార్ధం చేసుకొంటున్నా నేమో! వాళ్ళ సంసారంలో నేను ఊహించే భయాలు మచ్చుకైనా లేవేమో! వాళ్ళు నిర్మలంగా ప్రశాంతంగా బ్రతుకుతున్నారేమో!- అయితే ఇల్లాలి ముఖంమీద ఒక్క చిరునవ్వు రేఖ కూడా గోచరించదేం? కాంతిగా మెరిసే ఆ కన్నుల్లో దీనత్వమేదో గూడుకడుతూందేం? ఆట పాటలతో మునిగి తేలవలసిన ఇల్లు నిశ్శబ్దంతో తాండవిస్తూందేం?
భానును అడిగితే? ఏమని?
నా అనుమానం అనుమానమే అయితే?
భాను ఏమైనా అనుకొని బాధపడితే?
* * *
శనివారం సాయంత్రం నేను వెళ్ళేసరికి బావగారు ఇంట్లోనే ఉన్నారు. ఇద్దరూ ఏదో సరదాగా కబుర్లు చెప్పుకొంటున్నారు. ఎన్నడూ లేనట్టు చూస్తూ నిలబడ్డాను.
"అదేమిటండీ రావుగారూ? చోద్యం చూస్తున్నట్టు నిలబడిపోయారు?"
"ఆఁ అదే! అదే! మిమ్మల్నే..." నవ్వాను. ఆ రోజు ఎందుకో ఆయన తీరిగ్గా కూర్చున్నాడు. సందడిగా కబుర్లు చెపుతున్నాడు-"మీరు సమస్త విద్యలూ నేర్చుకొని గాని పెళ్ళి చేసుకోరేమిటండీ? మా చెల్లాయి ఎవతోగానీ సుఖపడిపోతుంది. మీ పెళ్ళికొచ్చి ఓ పదిరోజుల పాటు జల్సా చేద్దామంటే ఏమిటండీ మీరు....."
"దానికేం భాగ్యం? ఓ వంద రూపాయలు మనవికావనుకొంటే విసుగెత్తే వరకూ హోటల్ వాడు విందులుచేస్తాడు. అంతేకదూ అన్నయ్యా?" అంది భాను.
"అన్నయ్యా కాదు. అక్కా అని పిలు. నీ అన్న కూడా ఒక మగవాడే అనుకొంటున్నా వేమిటి?"
"మీరు మీ జాతిని బాగా పోల్చగలరు సుమండీ?"
"చమత్కారమంతా మీ అన్నా చెల్లెళ్ళ స్వంతంకాదు గానీ నీ అన్నగారికున్న డబ్బు నాకె వుంటేనా? చూస్కో-మేడలోకాలుకారులోనే..."
"కారులో కాలు క్లబ్బులోనే."
"లేకపోతే నీ అన్నలాగ ఆడపిల్లలాగ కబుర్లాడుకొంటూ కూర్చుంటారనుకొన్నా వేమిటి?" వాదనలతో ఓ గంట గడిచింది. "రేపెటైనా పిక్నిక్ వెళ్దామేమిటి?" అన్నాడు.
భానులో సంతోషం నాకు స్పష్టంగా కన్పించింది. వెంటనే నేనూ ఒప్పేసుకున్నాను. ఎక్కడి కెళ్ళేదీ-ఎన్ని గంటలకు బయల్దేరేదీ-ఏమి టేమిటి తీసికెళ్ళేదీ-ఎప్పటికి తిరిగి వచ్చేదీ- అన్నీ కూలంకషంగా చర్చించి పారేశాం. జావ గారికి పులిహోర కావాలట. నేను బొబ్బట్లు చెయ్యమన్నాను. భానుకు కొబ్బరి హల్వా మహాప్రాణం! మూడూ కొంచెం కొంచెం చెయ్యాలని నిర్ణయించాం. పక్కలమీదికి చేరేవరకూ మాటలు పెరుగుతూనే ఉన్నాయి. నేను ఆలోచిస్తూ పడుకున్నాను. అదేమిటో వాళ్ళు హాయిగా నిర్మలంగా అన్యోన్యంగా బ్రతుకుతున్నారంటే ఎంతైనా నా మనసు ఒప్పుకోలేదు.
భాను తెల్లవారుఝామున మూడు గంటలకే లేచింది కాబోలు. పొయ్యి అంటించి ఏమిటేమిటో చేస్తూంది. లైటువేసి నా మంచం పక్కనుంచి తిరుగుతూ అలమారలోంచి సామాను లేవో పట్టికెడుతూంది. నాకు మెలుకువ వచ్చేసింది.
