Previous Page Next Page 
మిధ్య పేజి 5


    అంతా విని చంద్రశేఖరం చిన్నగా నవ్వేడు.
    "నీలో ఇంకా అతని మీద ప్రేమ చావలేదు, మహేశ్వరీ!"
    మహేశ్వరీ నిశ్చేష్టురాలై చూడసాగింది.
    'ఆశ్చర్య పడవలసింది ఏమీ లేదు ఇందులో. మనిషి ఎంతగా ప్రేమిస్తాడో అంతగానూ ద్వేషించడం సహజం. ద్వేషం, ప్రేమా తులామానం లో సరితూగే కొలబద్దలు. నువ్వతన్ని క్షమించలేకపోవడం కాదు. అతని సమక్షం లో నీ బ్రతుకు పూయదలుచు కున్నది. కానీ , వృక్షమే కాలిపోయింది. ఆ బూడిద చాటున నివురు ఉంది. దీని తాలుకూ మనిషినా మహావృక్షం మరిచి పోలేకుంది. కొన్ని నీళ్ళు పోస్తే చిగురించ గలననే ఆశ ఆ చెట్టుకి చావలేదు. దీన్నే నువ్వు పగ అనుకుంటున్నావు.
    "అరె ఏడుస్తున్నావా? నీ పట్ల నాకు దురుద్దేశం లాంటివి లేవు, మహేశ్వరీ. నీ పగ చల్లారెందుకు అన్నావే కానీ, నిన్ను శంకించే మనిషినా నేను! ఛ! తప్పు. అతన్ని ఏ పరిస్థితులు నీకు దూరం చేయించాయో ఆలోచించాలి. మనుషులం మనం. రాక్షసత్వం ప్రవేశిస్తే అది చివరికి ఏ విధమైన పర్యవసానాన్ని ఇస్తుందో గ్రహించవద్దూ? సరే, సరే! ఆ సంగతి వదిలేద్దాం. చంటి పిల్ల -- ఇదేం చేసింది నిన్ను?" అతని మాటలకి మహేశ్వరి జవాబు చెప్పలేదు. ఈ గతం వింటే అతను తన పట్ల ఏ విధమైన శిక్ష విధిస్తాడో? అందుకు తన భావి ఏమౌతుందో ననే ఊహలో ఉన్న ఆమెని అతని ఊరడింపు చిత్రవధ చేయసాగింది. "చేసింది స్వల్పమైన తప్పు అయినా శిక్ష పొందనిదే ఆత్మశాంతి ఉండదు.' మహేశ్వరీ స్వగతం గా అనుకుంది.
    ఆనాటి నుంచీ గిరిజ కి ఆ ఇంట ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. ఈశ్వర చంద్రుడు చాలాసార్లు ప్రయత్నం చేశాడు తన పిల్ల నా విధంగా పెంచి భవిష్యత్తు లో విశ్వసా విశ్వాసాల ప్రమేయం తీసుకు రావద్దని ఖచ్చితంగా చెప్పేందుకు. మహేశ్వరి అతని కా అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదు.
    పన్నెండు పదమూడేళ్ళ గిరిజ, హరి కృష్ణ, ఒకచోట పెరిగి మమతల్ని సృష్టించుకుని విడరాని స్నేహితులయేరు. పక్షవాతం వచ్చి చంద్ర శేఖరం భార్యకి తను చెప్పదలుచుకున్నది సైగలతో నే వ్యక్తం చేసి కన్ను మూశాడు. హరికృష్ణ విశాఖ పట్టణం లో చదువుకుంటూ సెలవు లకి వచ్చినప్పుడు గిరిజతో కాలక్షేపం చేయడం ఇన్నేళ్ళ వరకూ సవ్యంగానే జరిగింది.
    మహేశ్వరి గతం క్రమక్రమంగా కరిగిపోయింది. పది నిమిషాలుగా వీధి వాకిలి నానుకుని ఈశ్వర్ చంద్రుడు వడిలిపోయి నీరసించి మెడ మెట్ల మీద చతికిల బడిన మహేశ్వరి ని పరికిస్తూనే ఉన్నాడు.
    అతను నిలబడి పోవడం లో కారణం లేకపోలేదు. గిరిజ పట్ల ఆవిడ తనంతట తానూ ఆత్మ సాక్షిగా విరోధాన్ని పెంచుకున్నట్లు ఒప్పుకున్నట్లయితే తను అన్న విధంగా కాళ్ళ కి నమస్కారం చేసి మరీ వెళ్ళదలుచుకున్నాడు. మహేశ్వరి చాలాసేపటి తరువాత యధార్ధంలోకి వచ్చిన దానిలా అతని వైపు తేరిపారి చూడసాగింది. అగ్ని హోత్రావధానుల మాదిరి కనిపించే ఇతని చేష్టల అంతర్యం అవగావన కాలేదు.
    "చెప్పు , మహేశ్వరీ! గిరిజ అంటే నీకు అపేక్ష లేదనీ, అందుకే అన్ని మాట లన్నాననీ ఒక్క మాట చెప్పు. నేను వెళ్ళిపోతాను." అయన ప్రాధేయ పూర్వకంగా అడిగేడు.
    "హు." చిత్రంగా తిరస్కారంగా నవ్వింది మహేశ్వరి. "నే నన్న మాటల గురించి విన్నది చాలు. వాటి యదార్ధం గురించి నన్నెందుకు అడగడం?"
    ఈశ్వర చంద్రుడు కొంచెం అలోచించి సావధానంగా అన్నాడు: "చిన్నప్పటి స్నేహాలు, అరధనలూ ప్రేమలుగా మారి పెళ్లి అయేందుకు రూల్ పాస్ చేయలేవని. కానీ, నువ్వు....నువ్వెంత తప్పిదం చేశావో నీ అంతరాత్మ ని అడుగు. నువ్వే తప్పిదం చేయలేదంటే... దానికి నేను సమాధానం ఇవ్వలేను."    
    మహేశ్వరి మాట్లాడలేదు.
    "ఆటలాడించినది నువ్వు. ఆ రాత్రి నా ఇంట ప్రవేశించి కోడలు గానే నీ ఇంట్లోకి తీసుకు వచ్చేవు. నన్నీ చాయలకి రానివ్వకుండా నీ గుండెల్లో దాచుకుని పెంచి పెద్ద చేశావు. చివరికి రెండు పట్టాల మాదిరి ఐక్యం అయి జీవిత శకటాన్ని దోర్లించాలనే ప్రయత్నం లో పిల్లలు ఉండగా నువ్వు నిర్దాక్షిణ్యంగా ఓ పట్టాని లాగివేస్తున్నావు. గిరిజ చేసిన మహా పాపం ఏమిటి? నీలో అంతర్లీనంగా ఉన్న భావాలని మాకు తెలియనియ్యవేమి, మహేశ్వరీ?"
    మహేశ్వరి రెండు చేతుల మధ్యా మొహాన్ని దాచుకుని బావురుమంది. ఐదు నిమిషాల తరవాత తేరుకుని చూపుడు వేలితో వీధి వాకిలి వెపు చూపిస్తూ, "అక్కడే నిలుచుని మాట్లాడేవు ఇంతసేపూ. నీకు నేను ఇవ్వవలసిన సమాధానాలు వేరే ఏమీ లేవు. తక్షణం నా ఇంట్లోంచి వెళ్ళిపో." అన్నది.
    ఈశ్వర చంద్రుడు అభిమానంతో, అవమానంతో ఉగ్రుడయ్యెడు. "నాకు తెలుసు నీ ఉద్దేశం. నీ అంతస్తు కి తగిన కోడల్ని తెచ్చుకోవాలని ఉబలాట పడుతున్నావు. ఈ తూర్పు గోదావరి జిల్లాలో నీతో సరితూగగల జమిందారు లేంతో మంది ఉన్నారు. కట్నం రూపంలో వాళ్ళిచ్చే ధనంతో నీ ఆస్తిని రెట్టింపు చేసుకోవాలను కుంటున్నావు. మనిషిని కొనేది డబ్బు కాదు, మహేశ్వరీ, డబ్బు కాదు. డబ్బుతో మనుషుల అభిమానాన్ని చూర గోనలెం. ఇది శాశ్వతం కాదని నన్ను చూసైనా నువ్వు గ్రహించ లేదు. పోనివ్వు!
    "గిరిజ నీకు చేసిన అపకారం ఏమీ లేదు. అమాయకంగా నీ ఇంట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనుకుంది. అయినా నా పిచ్చి గాని పద్దెనిమీది , ఇరవై సంవత్సరాల గతం దాటుకుంటూ వెళ్లి ఆలోచిస్తే నీలో ధనవ్యామోహం ఎంత ఉందొ క్షణం లో ఆకళింపు చేసుకోవచ్చును.
    "పై చదువుల కని వెళ్లి బి.ఏ మాత్రమే చదివి ఇంటికి వస్తే నా రాక తెలిసీ మా ఇంటికి రాలేదు నువ్వు ఆనాడు. నెల తిరక్కుండానే అష్టైశ్వర్యాలతో తులతూగే అవిటి వాడిని చేసుకున్నావు. ఇదంతా త్యాగం అంటావా/ నాన్సెన్స్! అతని సుక్షేత్రమైన మాగాణీ, సిరిసంపదలు నిన్ను సమ్మోహితురాలిని చేసి స్నేహం, ప్రేమ -- వీటికి నిర్వచనాలే లేకుండా చేశాయి నీ డిక్షనరీ లో. జానే దేవ్! నెల తిరగకుండా గిరిజ కి పెళ్లి చేసి శభాష్ అని నలుగురి చేతా అనిపించుకోక పొతే నేను ఈశ్వర చంద్రుడు ని కానే కాను. ఆడపిల్లని పెట్టిన అనవసరపు ఉసురు ఊరికే పోదు. నీకు పశ్చాత్తాపమే కలిగి మనసు మార్చుకుంటే రెండు రోజుల్లో ఏ కబురూ పంపు. లేదంటావా ఇక గిరిజ పెళ్ళికి నువ్వు సాధారణంగా ఈ ఊళ్ళో ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఇచ్చే నీ సంప్రదాయ పద్దతిలో మంగళ సూత్రం పంపనవసరం లేదు. నా ఆశలు చితకగొట్టి చిన్నతనం లో నాకు కాకుండా పోయిన నిన్ను నే నెందుకు ప్రార్ధించాలి  వెర్రి గాని!" అయన గిరుక్కున తిరిగి గడప దాటగానే మహేశ్వరి అర్ధంకాని వ్యధతో దుఖితురాలై మేడ మెట్ల మీదే కూర్చుండి పోయింది.

                            *    *    *    *
    "అమ్మా!" అయన వస్తూనే గిరిజ ను సంబోధించి కేక వేశాడు. మంచం మీద కూర్చుని విచార సాగరంలో మునిగిపోయిన గిరిజ ఉలికిపడి తండ్రి పిలుపు కి వాకిట్లోకి వచ్చింది. అయన వసారా లో కుర్చీలో చేరగిలబడి అన్నారు. "మనం కలకత్తా వెళ్ళిపోదాం. సిద్దంగా ఉన్నావా, అమ్మా. అందుకు?" అని అడిగేరు.
    బిత్తర పోయింది గిరిజ. ఆ పిల్ల మనసులో ఏ భావము లేదు. మెదడంతా శూన్యం ఆక్రమించుకుని విచలితని చేయసాగింది.
    "ప్రపంచం ధనవంతులది, గిరీ. ఆవిడ నన్నే మోసం చేసింది!"
    గిరిజ ఆశ్చర్యంగా తండ్రి మొహం లోకి చూసింది. అయన ఆ తరవాత మాట్లాడలేదు. హరికృష్ణ ని చూడాలనే తలపు ఈషణ్మాత్రంగా హృదయం లో ప్రవేశించి రక్త నాళాల ద్వారా శాఖోపశాఖలుగా చీలి శరీరం అన్ని భాగాలలోకి సరఫరా కాసాగింది. ఆడిన ఆటలూ, వాగ్దానాలు, మరుపురాని కదల మాదిరి దొలిచి వేయసాగాయి. "నాన్నా!" జాలిగా ధ్వనించింది గిరిజ కంఠం.
    "ఏమమ్మా?' అయన వెనక్కి తిరిగి ప్రశ్న వేశారు.
    "రేపు బావ వస్తాడు. ఒక్కసారి చూసి వెడదాం, నాన్నా. ఆ తరవాత ఎక్కడికి వెళ్ళినా నా కేమీ బెంగ ఉండదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS