భువనేశ్వరీ నిశ్చింతగా దీర్ఘంగా నిశ్వాస విడిచింది.
తను అనుకున్న పని దుర్గా రాం వెంటనే చెయడ అనేది ఎన్నడూ ఎరగడు. అతని ఊహలు ప్రణాళిక మధ్య పదిహేను రోజులు గడిచి పోయేయి. ఆయ గుమ్మం దాటి ఎదురింటి వైపు వెళ్ళడం కానీ, ఇన్సూరెన్సు డబ్బూ, ఇల్లు తనఖా పెట్టాలనుకున్న డబ్బూ ఏకం చేయడం కానీ, అసలా ఊహే ఉన్నట్లు కానీ మహేశ్వరీకి తోచలేదు.
గాడంగా పెనవేసుకున్నా ననుకున్న మహావృక్షం నేలకూలి పోయినప్పుడు తీగ దారి కింద పడినా, మరో ఆధారం చేసుకున్నా ఫలితం చెప్పుకోతగినదిగా ఉండదు. ఎదురింటి తలుపులు శాశ్వతంగా మూసి వేయబడి నాయని మహేశ్వరి అంతరాత్మ కి తప్ప ఆ ఇంట ఉన్న మరో రెండు జీవాలకి తెలియనే తెలియదు.
మహేశ్వరీ సందు మళ్ళీ రెండు ఇళ్ళు దాటి తన స్నేహాన్ని , కష్టాన్ని, సుఖాన్నీ పంచుకుంటూ తనతో పాటు పెరిగి కాపరానికి వెళ్లి వచ్చిన విశాలాక్షి ని చూసేందుకు వెళ్ళింది.
విశాలాక్షి తల్లి కామేశ్వరి వీధి లోంచే మహేశ్వరి ని ఆహ్వానించింది సాదరంగా. ఆవిడ తను కన్న బిడ్డ విశాలాక్షి కెంత ప్రేమని వంచి పెట్టిందో అంతకు మించిన అభిమానాన్ని మహేశ్వరినట. పెంచుకుంది. ఆవిడ నవ్వుతూ అన్నది: "ఇన్నాళ్ళూ కంటికి నల్లపూస వైపోయేవు. మీ నేస్తం వస్తే కానీ గడప తొక్క దలుచుకోలేదేమిటి, మహేశ్వరి! అంతా బావున్నారా? అమ్మ బావుందా?' అన్నది ప్రశ్నలు కురిపిస్తూ.
అన్నిటికీ సమాధానం ఇచ్చి అప్పటికి వచ్చి ఎదురుగా నిలుచున్న విశాలాక్షి మెడ చుట్టూ చేతులు వేసి పరికించి చూడసాగింది. విశాలాక్షి పుట్టింటికి వచ్చిందన్న వార్త విన్నప్పటి నుంచి పరుపరుగున రావాలనే ప్రయత్నం చేసింది. తల్లీని, తండ్రినీ చూసిందుకు వచ్చిందనుకున్నది కానీ ఇలా,....... మహేశ్వరి కే ఆశ్చర్యంగా ఉంది. తనతో ఆదుకుని తన సరసన పెరిగిన ఆ పిల్లలో మార్పు చిత్రంగా అనిపించింది మహేశ్వరి ప్రాణానికి. అందంగా ఉన్న విశాలాక్షి మాతృత్వాన్ని పొందబోతుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ వరం ఆమె పాలిట మరింత కళని ప్రసాదించింది.
"సాయంత్రం వస్తానని చెప్పావా ఇంట్లో?' విశాలాక్షి అడిగింది.
"ఆ" అన్నది మహేశ్వరి. కళ్ళలో "మేమున్నాము ' అనే కను పాపలతో , చాలా రోజులుగా నిద్రాహారాలు లేనట్లు స్పష్టంగా కనిపించే మొహాన్ని, సంస్కారం లేని తల వెంట్రుకలనీ అలక్ష్యం చేసి నవ్వుని అభినయిస్తున్న మహేశ్వరి ని ఇట్టే పసిగట్టింది విశాలక్షి పది గంటలకి భోజనాలు పూర్తీ చేశాక తన గదిలోకి తీసుకు వెళ్లి తలుపులు చేరవేసి చింత గింజలు నేల మీద పోసింది.
"ఇంకా నీకు ఓపిక ఉందా, విశాలా? నేనైతే ఆడలేను" అన్నది మహేశ్వరి.
విశాలాక్షి నవ్వింది. "నీకు ఓపిక ఉందొ లేదో నవ్వు స్పష్టంగా చెప్పనవసరం లేదు. నీ మొహమే చెబుతోంది. అసలేం జరిగింది?" అన్నది గంబీరంగా మారిపోయి.
మహేశ్వరి దాచుకోవాలని ప్రయత్నం చేసినా ఫలించలేదు. కన్నీరు సుళ్ళు తిరిగి చెంపల మీద చుక్కలు చుక్కలుగా రాలి పడసాగింది.
విశాలక్ష్మీ దగ్గరగా జరిగి మహేశ్వరి భుజం మీద చేయి వేసి అడిగింది. "మోసం చేశాడా నిన్ను? పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా అన్నాడా? కారణం చెప్పకుండా యేడుస్తే ఎలా?"
మహేశ్వరి తలెత్తింది: "నేనసలు ఇంతవరకూ అతడిని చూడనే లేదు."
"అయితే ఏడుపు దేనికి? చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో తిరుగుతున్నావు ఒక కులం వాళ్ళు. అయినప్పుడు బెంగ దేనికి?"
వాడిన పువ్వులా నవ్వింది మహేశ్వరి. "అతను రేపు వస్తాడనగా మామయ్యే నన్ను రావద్దని ఖచ్చితంగా చెప్పాడు."
"మామయ్యా!" విశాలాక్షి ఆశ్చర్యపోయింది. "అలా ఎందు కన్నాడు?"
"పేదవాళ్ళం కనుక."
విశాలాక్షి ఇంటువంటి విషయాలకి అంత ప్రాముఖ్యం ఇవ్వదు. బ్రతికే మూడు రోజులూ హాయిగా, సుఖంగా దర్జాగా గడిపిస్తే చాలంటుంది. విషయం పూర్తిగా చెప్పక ముందే, "పోనీలే, అదంతా మన మంచికే. నీకో సంగతి చెబుతాను. ఏమీ అనుకోవుగా?' అని అడిగింది.
మహేశ్వరి కళ్ళు పైకెత్తి ఆమె మొహంలోకి చూసింది "ఏమిటన్నట్లు.
"చూడు, మహేశ్వరీ , నువ్వు నా కంటికి ఇప్పుడు మరీ చిన్న పిల్లలా కనిపిస్తున్నావు. సుఖంగా బ్రతకాలంటే మనిషి కొన్నిటిని సహించాలి."
"అంటే?"
"నేను చెప్పినది సావధానంగా వింటావా, మహేశ్వరీ? నువ్వు నాకేం విరోదివి కావు. నీ మేలు కోరే మనుష్యుల్లో నన్నూ జమ వేసుకో. కాలం ఒక్క తీరున ఉండదు. ఓడలు బళ్ళూ, బళ్ళూ ఓడలూ ఆయె రోజులు ముందున్నాయి. నీ దారిద్ర్యానికి నువ్వా కారణ భూతురాలివి! అయినా మరేం బిచ్చం ఎత్తుకుని బ్రతకడం లేదే! ఈ మాటలన్నీ అడిగి ఆయన్ని తూర్పార పట్టవలసింది. నీకు ఈశ్వర్ ని చేసుకోవాలనుందా?' అన్నది కొంచెం ఆగి.
"ఈశ్వర్!" నిట్టూర్చింది మహేశ్వరి. "నాపట్ల అతను కనీసపు బాధ్యత చూపించ లేకపోయేడు, విశాలా. ఇన్నాళ్ళు అయింది, ఒక్కసారి వస్తాడేమో అనుకున్నాను. అతనెందుకు వస్తాడు! ధనం మనుషుల్ని చిత్రంగా మార్చి వేస్తుందేమో మరి. నేను వాళ్ళ ఆస్తి పాస్తులు చూసి మా నాన్న మద్దతు తో గాలం వేశానుట.... నేనలాంటి దాన్నా?" అమాయకంగా అడిగింది మహేశ్వరి.
విశాలాక్షి కళ్ళు కొంత చెమ్మ గిల్లాయి. తెగించి ఆడపిల్లలు ధైర్యంగా చేసుకునే నిర్ణయాలని ఆమె ఎప్పుడూ ఆమోదించదు. బ్రతుకు నరక ప్రాయంగా చేసుకునే వలపు తలపులంటే విశాలాక్షికి గిట్టవు. కన్న తల్లి తండ్రులు బిడ్డల భవిష్యత్తు తమ అందుబాటు లో ఉన్నత వరకూ పూల పల్లకీ కావాలని, బంగారు కలశం లా జీవించాలని చూస్తారనే నమ్మకం ఎప్పుడూ చెడగొట్టుకోదు. అనుభవం లేని పిల్లలు తల్లితండ్రులు తమ కేదో అన్యాయం చేస్తున్నారని వాపోవడం తప్ప నిజానిజాలు తెలుసుకోగలిగే వివేకాన్ని సంపాదించలేరనే విషయాన్ని హేతువాదంతో ఆలోచిస్తుంది. అయినా ఈ సమయం లో మహేశ్వరి కళ్ళలో కారే కన్నీటికి సానుభూతి చూపలేని మానవాతీతురాలు కాలేకపోయింది.
"నువ్వు వట్టి అమాయకురాలివి, మహేశ్వరీ . లోకాన్ని నువ్వు చూశావా?"
".........."
"చూడలేదు. కూపస్థ మండూకం లా ఈ పొలిమేరలు దాటలేదు. వడ్డించిన విస్తరి లాంటి జీవితాన్ని నీకు చూపించనా?"
"..........."
"పోనీ, అతన్నే పెళ్లి చేసుకోవాలనుందా నీకు?"
అప్పటికీ మాట్లాడలేదు మహేశ్వరి.
"మనసులేని మనువు ఎందుకొచ్చిన విషయం చెప్పు? నీకేం తక్కువ! అందాల బొమ్మవి . నిన్ను చూస్తె ఎవరైనా వట్టి చేతుల్తో వెళ్లేందుకు సిద్ధ పడతారంటావా?"
"అది కాదు, విశాలా.....అమ్మా నాన్నా కూడా ఈ ప్రయత్నం లోనే ఉన్నారు. ఆ గడప ఎక్కి అవమానం పాలు కావలసిందే కానీ ప్రయోజనం లేదని వీళ్ళ కేలా తెలుస్తుంది?"
"ఒక విషయం చెప్పనా?"
"ఏమిటది?' ప్రశ్నార్ధకంగా చూసింది మహేశ్వరి.
"పల్లెటూర్లో లేని వార్తలు ఘుప్పు మంటాయి, మహేశ్వరీ. ఎదిగిన ఆడపిల్ల సంఘం కళ్ళలో నలక లా కేలుకుతుంటుందేమో . నీకింకా పెళ్లి కాలేదంటే నువ్వూ, ఈశ్వర్ ప్రేమించు కున్నరనీ, అందుకే అవివాహితగా ఉండిపోయేవనీ అంటున్నారు."
ఆశ్చర్యంగా చూసింది మహేశ్వరీ. 'ఈ విధంగా అనుకుంటున్నట్లు నాకు తెలియదే!"
"పిచ్చిదానా! నీ ముందు చెప్పుకుంటారా వాళ్ళు! నీమీదే ఈశ్వర్ కి ప్రేమ ఉంటె నిన్ను చూసేందుకు రాకపోయేవాడా? మీ నాన్న అంతస్తు నీకు తెలుసును. నీకీ జీవితంలో అయన పెళ్లి చేయగలరనే నమ్మకం నాకు లేదు. అది అయన తప్పు కాదు. మొదటి నుంచీ సూటిగా, నిక్కిచ్చిగా మాట్లాడడం నాకు అలవాటు. మా మరిది -- అంటే ఆయనకి పెద తండ్రి కొడుకు ఉన్నాడు. చాలా ఆస్తి పరుడు. నువ్వు చేసుకుంటే తప్పేం ఉందీ?"
"నేనా?"
"ఆస్తిని నీకు ఎరగా చూపిస్తున్నాననుకోకు, మహేశ్వరీ. చాలా అందగాడు. కానీ........అతనికి భగవంతుడు లోటు చేశాడు. అతను అవిటి వాడు."
మహేశ్వరి మాట్లాడలేదు. గతం, వర్తమానం, భవిష్యత్ ఆ పిల్లని ఆలోచించుకునే శక్తిని కూడా ఇవ్వడం లేదు. నీటిలో మునిగిన మనిషి బ్రతకాలనే ప్రయత్నం లో తను పట్టుకున్నది గడ్డి పోచో, లేక నీటి పామో తెలుసుకోలేదు. బ్రతుకు మీది మమతతో ఆశగా చుట్టూ కలియ జూసి అందిన దేదో అమృత భాండమే అనుకుంటాడు. మహేశ్వరి మౌనం విశాలాక్షి చేత పెత్తనానికి పురమాయించింది.
వెల తిరగ కుండానే మహేశ్వరి తో ప్రమేయం లేనట్లు పెళ్లి పనులు చకచకా జరిగిపోవడం, పెళ్లి అయిపోయి సవారీ వీధిలో ఉండగా క్షణం. ఎదురింటి మేడ వైపు చూడడం, ఆ తరువాత గుండె నిబ్బరం చేసుకుని తన జీవిత ప్రాంగణం లో అడుగు పెట్టిన వరుడుని చూసి ఆ తరవాత అతని కనుసన్నల్లో ప్రేమ వాహిని లో కొట్టుకు పోవడం జరిగినా మహేశ్వరీ లేత హృదయం లో అంతర్గతంగా పెంచుకున్న ఆరాధనా, ప్రేమా మొదలైన అమృతకలశం లో ఈశ్వర్ తండ్రి చల్లిన కాలకూట విషం తాలూకు చినుకులు పడి అది కలుషితం అనగా దోహదం చేసిన ఈశ్వర్ పట్ల అప్పటి ప్రేమా, మమతా ద్వేషంగా మారి నిరంతరం ప్రజ్వరిల్లే అగ్ని శిఖలా తయారై పగగా రూపొందడం కాలం వేసిన పరుగుల్లో త్రుటి లా జరిగిపోయింది.
