Previous Page Next Page 
ఉన్నతశిఖరాలు పేజి 3

                        

    ఆ సాయంత్రం వక్తృత్వ పోటీల్లో నిరంజన్ వాళ్ళ కాలేజి తరఫున మాట్లాడి గెల్చాడు. ప్రేమకు చాల సంతోషం వేసింది.
    సుధాకర్ కు ఎక్కడో ఓ మూల హృదయంలో చిన్నపోటు ప్రారంభమైంది దాన్ని అసూయ అంటారంటే- అతను ఒప్పుకోడు.
    తర్వాత మరో సంఘటన.
    అవి దీపావళి పండుగ రోజులు.
    ఒక రోజు సాయంత్రం ఆడపిల్లలంతా ఇళ్ళకు వెళ్ళటాని కుద్యుక్తులయ్యారు. నిరంజన్ ఎక్కడనుంచో గబుక్కున వచ్చాడు.    
    అందరు ఆగిపోయారు. గుంపుగా .
    "మీరంతా రేపు సాయంత్రం పార్టీకి రావాలి .. నాలుగ్గంటలకు మీకంతా వీలైతే- అదే- నిర్ణయించుకుందాం."
    వాళ్ళంతా విస్తుపోయి క్షణం మౌనంగా చూస్తుండిపోయారు.
    ఎవరో అడిగారు. "కారణం- మీ పుట్టినరోజా?"
    నిరంజన్ హాయిగా నవ్వేశాడు.
    నా పుట్టిన రోజు చేసుకొని పది సంవత్సరాలు దాటిపోయాయి.ఊరికే పార్టీ అయితే రాకూడదా మీరు?.... మనమంతా ఒకే క్లాసు వారం సంవత్సరాలు కలిసి చదవబోయేవారం. ఓ కప్పు కాఫీ యివ్వటానికి కూడా కొన్ని కారణాలుండాలన్నమాట..." అతను జవాబు కోసం అందరి దెస చూచాడు. వాళ్ళు ఒకరినొకరు చూచుకోవటంతో సరిపోయింది. ఎవరి అనుమానాలు వారివి. ఎవరి ఆలోచనలు వారివి?
    నిరంజన్ వారి హృదయాన్ని చదివినట్లు మళ్ళా ప్రారంభించాడు. "మా చెల్లెలుంది చూచారూ- చాల ముద్దుచేసి చండికలా తయారు చేశామనుకోండి. ఇరవై సంవత్సరాలు నిండుతాయి రేపు, పార్టీ చేయాలని, హడావిడిగా వి. ఐ. పి. లా ఆ రోజు తిరగాలనీ ఆమెకు ఒక కోరిక వుంది. ఆ కోరిక ఎప్పుడూ నెరవేరేది. ఇక్కడ తనకు స్నేహితులెవరు లేరు. సీనియర్ కేంబ్రిడ్జి పాసయింది! ప్రస్తుతం ఇంట్లోనే వుంది. పెళ్ళి చేయాలని చూస్తున్నారనుకోండి. పోయిన ఏడాది మా హడావిడిలో తన పుట్టిన రోజులు జరుపుకోలేకపోయింది. ఈ సంవత్సరం అలా జరగటానికి వీల్లేదు. ఆమెకు నిరాశ కల్గించటం మా కిష్టంలేదు. నా తమ్ముడు తనతో చదివే అమ్మాయిలను పిల్చాడు. నేను మిమ్మల్ని రమ్మని ప్రార్ధిస్తున్నాను. ఆమెకిది చిన్న సర్ ప్రైజ్. రేపు మూడు గంటలవరకు అంతా రహస్యంగా వుంచాలని మా అభిలాష... మీరంతా ఆలోచించుకుని....
    అతని మాటలను పూర్తిచేయనివ్వకుండానే గీత చటుక్కున అంది.
    "మీరంతగా అడగాలా! తప్పక వస్తాము అడ్రస్ ఇవ్వండి."
    అందరు రాసుకున్న తర్వాత అందరికీ తన కృతజ్ఞతలు తెచ్చి హుషారుగా వెళ్ళిపోయాడు నిరంజన్.
    నిరాశావాది సుమలత మూతి తిప్పింది- "ఇదొక ఎత్తు... చెల్లెలి పుట్టినరోజునే పేరుతో పిలుస్తున్నాడు....అక్కడి కెళ్తే వాళ్ళ చెల్లి ఓమూల కూచుని వుంటుంది... ఇతను పెద్ద హడావిడి చేస్తాడు కాబోలు! మిగతా అంతా నవ్వేశారు.
    గీత సీరియస్ గా ముఖం పెట్టింది "సంఘంలో పెద్దమనుషుల్లా చలామణీ అవటానికిలాంటి పార్టీలు అత్యవసరం. జూలియన్ సీజర్ కు సంవత్సరంలో ఎన్నో జన్మదినాలు వచ్చేవిట. ఎందుకో తెలీదా! ... అంత ఇదిగా ఆహ్వానిస్తే కాదనలేకపోయాం మరి ... అదీ కిటుకు!"
    ఇంకొకళ్ళు చేతులు కళ్ళూ త్రిప్పుతూ అన్నారు "ఎల్లుండి నుంచి ప్రతివాడు మనల్ని వాళ్ళ అక్క పుట్టినరోజునో. లేక వాళ్ళబామ్మ జన్మదినమనో పిలుస్తాడమ్మాయ్?"
    "ఇకనేం - పార్టీలకేం తక్కువలేదు. కొన్నాళ్ళవరకూ పాకెట్ మనీ ఖర్చవదు."
    సుమలతకు వెళ్ళడం సుతరామూ ఇష్టంలేదు. "ఎల్లుండి క్లాస్ లో మనమంతా వాళ్ళింటికి వెళ్ళామని గొప్పగా అందరికీ చెబుతాడు కాబోలు ....నిన్నగాక మొన్న వచ్చినా నా శక్తి చూడండి. అంటాడేమో వాళ్ళంతా కళ్ళు కుట్టుకోవాలని ఏమైనా చెబుతాడు."
    సుమలతకు నచ్చచెప్పేసరికి తాతలు దిగొచ్చారు.
    మరుసటి రోజు నాల్గు గంటలకు టాక్సీ నిరంజన్ వాళ్ళ యింటి గుమ్మంలో ఆగింది టాక్సీ నిరంజన్ వాళ్ళ యింటి గుమ్మంలో ఆగింది టాక్సీ ఆగిన వెంటనే నిరంజన్ బైటికొచ్చాడు.
    ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. "అదొక నాటకమనలేదూ! అన్నట్లు సుమలత ధీమాగా అందరివైపూ చూసింది.
    వాళ్ళనందర్నీ సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకొనివెళ్ళాడు. సోఫాలో కుర్చీలలో కూచున్నారు. ఎక్కడా సందడిలేదు. సుమలత ఏదో అనబోయింది. కానీ ఎవరో వస్తున్న చప్పుడు విని మౌనందాల్చింది.
    తెర తొలగించుకొని ఒక ఇరవై సంవత్సరాల అమ్మాయి వచ్చింది. చేతిలో వెండిపళ్ళెం. దాన్లో సన్నజాజులూ, కనకాంబరాలూ వున్నాయి. ఆమె హడావిడిగా వచ్చి పళ్ళెం స్టూల్ మీద పెట్టి అందరికీ నమస్కరించింది.
    తలంటుకున్న జుట్టు - పట్టుకుచ్చుల్లా గాలికి సుకుమారంగా అస్నిగ్ధ లావణ్య పాలభాగంపై నాట్యం చేస్తున్నాయి. పసిమి ఛాయలో మిలమిలా మెరిసిపోయే ఆమె- రవ్వలదుద్దుల్లోని తళుకును సైతం వెల వెల పోయేలా చేయగల ఆ నేత్రద్వయపు కాంతి రాగరంజితమైన సన్నని పెదిమలపై హృదయ రంజికంగా నాట్యమాడే చిరునవ్వు. శిల్ప కారునిచే మలచబడ్డ పాలరాతి కంఠంలాంటి అందమైన మెడలో మంచి ముత్యాల సరులు ధరించిన ఆమె నీలవురంగు టెరిలిన్చీరలో మేఘాల పొరల్లోంచి బహిర్గతమైనపూర్ణ చంద్ర బింబంలా భాసిస్తోంది.
    ఆమె మాట్లాడటానికి నోరు తెరచింది ఎర్ర గులాబి సుకుమారంగా నిచ్చుకున్నట్టు భ్రమ!
    "అంతా హడావిడి! అన్నయ్యలు చాల ఆలస్యంగా చెప్పారు....ఏమీ సిద్ధంగా లేదు.....క్షమించాలి."
    ఆమె ఒకరి ప్రక్క కూచుంది.
    గీత అంది "ఫరవాలేదు. మీకు సర్ ప్రైజ్ కల్గించాలని మాతో చెప్పారు... పూలు నేనూ కడ్తాను... గీత పూలు కొన్ని తన ఒడిలో వేసుకొంది.
    అందరివైపు ఇబ్బందిగా చూస్తూ అంది "నా పేరు సరళ. మీరంతా మిమ్మల్ని పరిచయం చేసుకోలేదు."
    సుమలత చాల మారిపోయింది. విసుగుతో చిటపటలాడిన ఆమె ఇప్పుడు విశ్రాంత హృదయంతో అందర్నీ పరిచయం చేసింది. వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో నిరంజన్ తల్లితండ్రులు వచ్చారు.
    వారిరువురికి అందర్నీ పరిచయం చేశాడు.
    తండ్రి ఆరడుగుల పొడవు- స్ఫురద్రూపి..... కొద్దిగా బట్టతల. బంగారు ఫ్రేము కళ్ళజోడు పెట్టుకుని చూపరులకు అత్యంత భక్తి భావం గౌరవం కల్గించేలా వున్నారు. తల్లిని పోత పోసుకుని పుట్టింది కూతురు ఆయన ఒక కుర్చీలో కూచుని అన్నారు.
    "మీరంతా రావటం ఎంతో ఆనందదాయకం. ఏదో సరదాగా కొంత కాలక్షేపం అవుతుంది.... మీ రాకతో మా తల్లి హృదయం ఆనందంతో పరిపూర్ణం చెందాలని మా ఆశ..."
    ఆయన యింకా మాట్లాడాలనుకుంటున్నారు. రెండవ టాక్సీ రావటంతో తండ్రి కొడుకులు బైటి కెళ్ళారు. కొంతసేపటికి ఎనిమిది మంది అమ్మాయిలు బిల బిలమంటూ లోపలికొచ్చారు, అందరు అపరిచితులే.     
    అన్నదమ్ములిద్దరూ అందర్నీ పరిచయం చేశారు.
    నిరంజన్ ను - తమ్ముడిని అందరు వింతగా చూస్తున్నారు.
    గది సందడిగా వుంది. సన్నని పరిమళంతో ఆ గది నిండివుంది.
    తండ్రి హెచ్చరికతో అందరూ మౌనం దాల్చారు.
    "ఇది మీ పార్టీ స్పగృహం అనుకోండి..... కడుపునిండా తిని ఆనందించి మమ్మానందింపజేయండి. మీరంతా వచ్చినందుకు చాల థ్యాంక్స్. ఏం.... ఇక మన పనైపోయింది. ఇది లేడీస్ పార్టీ కదా! వస్తామమ్మా ఎంజాయ్ యువర్ సెల్వ్స్..."
    మగవాళ్ళు ముగ్గురు నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు.
    అక్కడ మిగిలిన వారంతా ఆడవాళ్లే.
    ఐరావతమ్మ ఇప్పుడే వస్తానంటూ లోపలి కెళ్ళిపోయింది.
    పూలమాల కడుతున్న కొద్ది సరళ చిన్న ముక్కలుగా త్రుంచి వాళ్ళ జడల్లో తురుముతోంది. ప్రేమ వంతు వచ్చింది. ఆమె పొడవైన జడకు తానుపెట్టిన పుష్పమాల సరిపోలేదని గ్రహించి సరళ మరికాస్త దండ తెచ్చి ఆమె తలలో పెట్టింది. ఆ పూలను సరిజేస్తూ అంది.
    మీది అందమైన జడ. పైనించి క్రిందిదాకా ఒకే మోస్తరుగా వుంది. జడఅంటే ఇలా వుండాలి.... ఏమంటారు." ప్రేమ థాంక్యూ- అంది.
    జడలమీదా - జుత్తు అందంమీదా సంభాషణ సాగింది.
    అంతలో తల్లి పిలవడంతో అందరు లేచారు. లోపలికి వెళ్ళారు. ఇంటి వెనుకభాగంలో చాలపెద్ద తోటవుంది. అన్నీ చిన్నచిన్న మొక్కలు ఒకవైపంతా కూరగాయల పొదలున్నాయి. పూలమొక్కలు చిన్న చిన్న మొగ్గ బు తొడిగున్నాయి. ఆతోట బాల్యదశలోనే ఉన్నప్పటికీ అది కొన్నాళ్ళకు నందనవనమే కాగలదన్న నమ్మకం కల్గుతుంది. పూలమొక్కల మధ్యలో చిన్నలాన్. అందమైన పచ్చని గడ్డి...ఆకుపచ్చ పట్టుతివాచీలా నిగనిగ లాడుతోంది. సరళ ఆ గడ్డిమీద పెద్ద జంపకానా పరచింది. అంతా సుఖాసీనులయ్యారు.
    "తోట అందంగా వుంది...... మీ హాబీ కాబోలు" - తోటపని ఇష్టమేనండి - కానీ కొంతపక్షపాతం కూడా వుంది. ఆ హాబీ పరిమితి ఈ పూలమొక్కలు లానుకు సంబంధించినంతవరకే. మిగతాపని అన్నయ్యలు. నాన్నగారు చూసుకుంటారు. అమ్మకు ఇంకా పక్షపాతం- కరివే పాకు మొక్క, తులసి మొక్క ఆమె కల్పవృక్షాలు, ఆవుంటే చాలు, ఆ రెండింటితో ఆమె తోట పూర్తయినట్లే..."
    సరళ మాటలకు నవ్వకుండా వుండలేక పోయారు.
    సరళకు మళ్ళీ పిలుపొచ్చింది. ఆమె వెళ్ళి ట్రేతో ప్రత్యక్షమైంది. ప్రేమ, గీత మరిద్దరులేచి వెళ్ళి అందుకున్నారు. అందరికీ వంచిన తర్వాత ప్రేమ కాఫీ కోసం కప్పులు తేవటానికి వెళ్ళింది.
    వంటగదిలో మాటలు విని ఉలిక్కిపడింది. వెనుదిరగక ముందు నిరంజన్ వెనుకభాగం ఆమెకు స్పష్టంగా అగుపించింది. అతను కాఫీ పొడిడబ్బా తెరుస్తున్నట్లు చూడగల్గింది. ఆశ్చర్యంతో నాలుగడుగులు వెనక్కు వేసి నుంచుండిపోయింది. పాలు, పంచదార తెస్తున్న సరళ ప్రేమను చూసి సన్నగా నవ్వి వాటినందిచ్చింది, ప్రేమ వాటిని తీసుకొని వెళ్లిపోయింది. రెండవసారి లోపలి కెళ్ళకుండానే ఇవతలి గదిలో ఆగిపోయింది. కాఫీపాట్స్ లో డికాక్షన్ పోసి ఇవతలికొచ్చిన నిరంజన్ ప్రేమను చూచి చటుక్కున ఆగి పోయాడు. తమాయించుకుని మందహాసం చేస్తూ ఆమెకు వాటినందిస్తూ అన్నాడు "ఇకమీరు కూచోండి. ఈసారి ఖాళీ అయితే సరళవచ్చి నింపుకుని వెళ్తుంది... మీకు శ్రమ కల్గిస్తూన్నాము.
    "ఫరవాలేదు" అంటూ ప్రేమ దాటిపోయింది. కానీ ఆమె అతడిని గూర్చి ఆలోచించటం మానలేదు.
    కాఫీ త్రాగుతూ చాలా బావుందన్నారు.
    సరళ గర్వంతో అందరివైపు చూస్తూ "మా చిన్నన్నయ్య చేశాడు" అన్నది.    
    "అదేమిటి- ఎక్కడికో వెళ్ళిపోయారన్నారే?"
    "లేదే.... ఇంట్లోనే వున్నారు.... లేకపోతే ఇవన్నీ అమ్మ ఒక్కత్తే అమర్చలేదే? ఇద్దరు అమ్మకు సహాయం చేస్తేనే ఇంత ఆలస్యంగా అయినా ఈ ఏర్పాటైంది".
    "ఆలస్యమేమీ అవలేదు....."
    "ఐతే మీ అన్నయ్యలు పాకశాస్త్రంలో దిట్టలన్నమాట.
    "ఊ. హూ- తప్పుగా తలుస్తున్నారు. పెద్ధన్నకు కేక్ వెయ్యటమే చేతనౌనుగానీ అది ఇంట్లో వండటానికి వీలుపడదు. రెండో అన్నయ్యకు కాఫీ మాత్రం వచ్చు. ఈ రెండింటిలో చెరొకరూ నిపుణులైతే- దాన్ని పాక ప్రావీణ్యమంటే నేనేమీ అనలేను..." అందరూ నవ్వుకున్నారు.
    "పోనీ ఆయన్ని పిలవరాదూ - ఇక్కడ కూచుంటారు!"
    "అహఁ- వీలు పడదు- వాళ్ళు వి. ఐ. పి. లై పోతారు. ఈ రోజుకు నేనే ల్రైమ్ లైట్ లో వుండాలి మమా! బుంగమూతి పెట్టింది. సరళ నా విధంగా జూస్తుంటే ముద్దొస్తోంది.
    "అన్నయ్యలకు దృష్టి తగుల్తుందని భయం కాబోలు"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS