"మరి మరిచిపోనూ? పెద్ద సిటీ వెళ్ళి పోతున్నాను-బీచ్ షైర్లూ-సినిమాలూ-పిక్నిక్ లూ-పార్టీలూ-అంతా ఒకటేమిటి? సిటీ మనదే!"
"తిరుగుదూ! ఇక్కడెవడూ అసూయపడటం లేదుగానీ- మరి అతగాడి అందచందాలు వర్ణించావు కావు. మన్మధుడా? నలకూబరుడా?"
"రాజకుమారుడు!"
"ఆహా! అంత అందగాడా?"
"హు! ఉత్త అందగాడా? అతిలోక సుందరుడు! జగదేక వీరుడు!"-ఫక్కుమని నవ్వుకొన్నాం. నవ్వుతూంటే పిన్ని వచ్చింది-"చూడు పిన్నీ! భాను ఎంత అడిగినా మొగుణ్ణి గురించి సరిగా చెప్పటం లేదు." ఫిర్యాదు చేశాను.
"నీ మొహం! అదేం చెబుతుందిరా! మనిషేమో చక్కగానే ఉంటాడు. వెనక చిల్లి గవ్వ ఆస్తి లేదు. ఇంట్లో కాస్త కష్టానికీ సుఖానికీ ఆడ సాయమూ లేదు. అదే నాకు ఆలోచనగా ఉంది."
"ఇంకా ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చున్నావే మిటి? మరేం ఫర్వాలేదు పిన్నీ! భాను మాత్రం తెగ మురిసిపోతూంది. షికార్లూ, సినిమాలూ, పిక్నిక్ లూ, పార్టీలూ ఝామ్మని సిటీ అంతా...బాబోయ్!"కండ ఎక్కి వచ్చేలా గిల్లేసింది. "అయిందా?" అంటూ కొరకొరా చూసింది. నోరు మూసేసు కున్నాను. పిన్ని నవ్వుకొంటూ వెళ్ళిపోయింది. పెళ్ళినాటి సాయంకాలం మగ పెళ్ళివారు వచ్చేసి విడిదిలో దిగారని తెలీగానే పందిరికి పూల బుట్టలు కడుతున్న వాణ్ణి ఎక్కడి వక్కడ వదిలేసి కిందికి దూకి పరుగెత్తాను. ఆ అతిలోక సుందరున్నీ, జగదేక వీరున్నీ చూడకపోతే ఇక ప్రాణాలు నిలవవు. విడిదిలో అంతా హడావిడిగా తిరుగుతున్నారు. పెళ్ళికొడుకైన రాజకుమారుడి కోసం వెదుక్కొంటూ బయల్దేరాను. అప్పుడే ఆ గదిలోంచి ఐదారుగురు సూటువాలాలు బిల బిల్లాడుతూ బయటికి పోయారు. బహుశా వాళ్ళంతా రాకుమారుడి చెలికాండ్రు కాబోలు-గదిలో అడుగు పెట్టాను. అతను ఒక్కడే బట్టలు మార్చుకొని కూర్చున్నాడు. గ్లాస్గోలుంగీ, తెల్లటి చొక్కాతో ఉన్నాడు. ఉన్న రెండు కళ్ళూ విప్పార్చుకొని మరీ చూస్తూ-నన్ను నేను పరిచయం చేసుకున్నాను- "నమస్తే!"
"నమస్తే! రండి."
"నేను భానుమతికి అన్నయ్యను. పేరు కేశవ రావు. మిమ్మల్ని చూడాలని."
"కూర్చోండి."
నేను మరొక కుర్చీలో కూర్చున్నాను. అతను సిగరెట్ అందించబోయాడు. "నో థాంక్స్, అలవాటు లేదు" అన్నాను నవ్వి.
"ఈ రోజుల్లో-విచిత్రమే" తను సిగరెట్ వెలిగించి కాలుమీద కాలువేసుకొని వెనక్కు వాలి దర్జాగా పొగ విడుస్తున్నాడు. ఎర్రగా సన్నగా అందంగానే ఉన్నాడు. జుట్టుకు నొక్కు నొక్కులేం లేవు. విశాలమైన ఫాలభాగమేకానీ బలిష్టమైన వక్షస్థలం కాదు. భుజకీర్తులూ పాంకోళ్ళూ గట్రా ఏం లేవు మరి. మొత్తానికి అందగాడు. భానుకు తగినవాడు. విచ్చలవిడిగా మాట్లాడటం లేదు. పెళ్ళికొడుకు దర్జా కాబోలు కొంత ప్రదర్శిస్తున్నాడు. "మిమ్మల్ని చూడాలని ఎంతో అనుకొంటున్నాను. మా చెల్లిని అడిగితే అతి లోక సుందరుడూ-జగదేకవీరుడూ అని చెప్పింది."
"జానపద చిత్రాలు బాగా చూస్తుంది కాబోలు. మరి మీ రేమను కొంటున్నారు?" అన్నాడు నవ్వుతూ.
"చంపారే! నేను ఆడపిల్లను కాదు కదండీ ఏమనుకొన్నా చెప్పెయ్యటానికి" అన్నాను. అలా సంభాషణ సరదాగా సాగింది. అతను తెలివిగా చురుగ్గా మాట్లాడాడు. ఓ అరగంట కూర్చుని వచ్చేశాను. పెళ్ళికూతురై కూర్చున్న భాను దగ్గర చేరి అంతా చెప్పాను. "భుజకీర్తులూ, పాంకోళ్ళూ లేవు భానూ! అతన్ని అడిగానుకూడాను. దాచేసుకున్నాడంటా వేమిటి?"
భానుకోపంతో మూతి బిగించింది. బుగ్గమీద దిష్టిచుక్క మరీస్ఫుటంగా కన్పిస్తూంది.
"మీరిద్దరూ బాగానే ఉన్నారు. మధ్య నామీదేమిటి నీ కోపం?" అన్నాను మూతి ముడుస్తూ.
భాను కళ్ళు దించుకు నవ్వింది. నిండు హృదయంతో కల్యాణానికి సిద్ధమయ్యే కన్య అంత సజీవంగా నవ్వగలదు కాబోలు! ఆ నవ్వులో వేయి ఊహలు! కోటి కోరికలు!
భాను మెడలో- అతను-పెళ్ళికొడుకు-మాంగల్యం ముడివేస్తూంటే నాకు కావలసినవారెవరో దూరమౌతున్నట్టూ- శాశ్వతంగా దేనినో కోల్పోతున్నట్టూ బాధ కలిగింది. ఇప్పుడు భాను నా చెల్లెలు కాదు. రాజశేఖరం భార్య! ఇక అన్నయ్యతో గంటల తరబడీ మాట్లాడ టానికీ విరగబడి నవ్వుకోటానికీ అవకాశం ఏదీ? అందరితోపాటు చేతిలో అక్షింతలు విసిరి నిశ్శబ్దంగా కళ్ళు ఒత్తుకున్నాను. అంతరాత్మ భానును దీవించింది-నా చెల్లి వెయ్యేళ్ళు చల్లగా ఉండాలి, మాతృమూర్తిగా, సౌభాగ్యవతిగా.
పెళ్ళికొడుకు కాస్తా బావగారై కూర్చున్నాడు. అల్లుడు వెళ్లేంతవరకూ నన్ను ఉండిపొమ్మంది పిన్ని, ఆ నాలుగు రోజులూ హాస్యాలతో వేళాకోళాలతో చాల సరదాగా గడిచింది. ఓసారి "మీరు చాలా అదృష్టవంతులు బావగారూ! మా చెల్లివంటి భార్య మీకు దొరికింది" అన్నాను నవ్వుతూ.
"అబ్బే! మీ చెల్లాయే అదృష్టవంతురాలు. నావంటి భర్త దొరికాడు."
"స్వంత డబ్బా వాయించుకొంటున్నారే మండీ?"
"మరి ఎవరూ లేకపోతే ఏం చేస్తారు చెప్పు?" అంది భాను. ముగ్గురం నవ్వుకొన్నాం.
అంత కొత్తలోనే బావగారు భానుకు దువ్వెన అందించమనో - చొక్కా చేతులు మడతలు పెట్టమనో బూట్లు తుడవమనో-ఏదో ఒక పని పురమాయిస్తూండేవాడు. భాను అవన్నీ అక్షరాలా పాటించటానికి సిగ్గుపడేది. ఏమాత్రం లోటు జరిగినా, ఆలస్యమైనా అతను విసుక్కొనేవాడు. కలకలలాడే భాను మొహం చిన్న బోయేది. అది అతను అర్ధం చేసుకునేవాడోలేదో కనీసం గమనించినట్టుకూడా కనిపించేవాడు కాదు. నా కేమిటో కష్టం వేసేది. భాను పరాధీన అయిపోయిందా? అన్నివిధాలా భానును శాసించగల వ్యక్తి అవతరించాడా? సున్నితమైన భాను మనసు నొప్పించకూడదనీ-భానుకు అపురూపంగా చూసుకోవాలనీ అతనికి తెలిస్తే ఎంత బావుండును!
నేను వెళ్ళిపోయేముందు భానును ఒంటరిగా కలుసుకున్నాను. "భానూ! ఇక నీ భవిష్యత్తు నిర్ణయమైపోయింది. అది అన్నివిధాలా సుఖ మయం చేసుకోవటం నీ చేతుల్లోనే ఉంది. బావగారికి కొంచెం కోపం ఎక్కువ కదూ? దానికి నువ్వు కాస్త శాంతం వహించాలి. అమ్మ మీద చిరాకు పడినట్టే అయితే బావుండదు సుమా! అన్నివిధాలా నీకు తగిన భర్తతో జాగ్రత్తతో తెలివిగా...." మరి నాకు మాటలు పెగల్లేదు. భాను తలమీద బరువైన బాధ్యతలు మోపుతున్నట్టూ- ఆడుతూ పాడుతూ తిరిగే భానును ఎవరికో అప్పగించేస్తున్నట్టూ అనిపించింది.
"అన్నయ్యా!" అంది భాను. కొన్ని క్షణాల వరకూ ఏమీ మాట్లాడలేకపోయింది.
"నాకు బావగారి గురించి ఏ శంకా లేదు అన్నయ్యా! నిజానికి నా మనసు చాలా సంతోషంగా ఉంది" అంది నేల చూపులు చూస్తూ. భాను మనసు విప్పి చెప్పితే ఇంతవరకూ అది ఒక్క నాకే. "నిజమే భానూ నీశుభలేఖ చూచినప్పుడు రాజశేఖరం అంటే ఏమిటో అనిపించింది గానీ ఇప్పుడు నాకూ సంతోషంగా ఉంది" అన్నాను. తర్వాత నా చదువు విషయం వచ్చింది. మెడిసిన్ చదవమంది భాను- "ఇప్పుడు నాకా కోరిక లేదు. భానూ! బి. ఎ. కి. వెళ్తాను" నీ కిష్టమేకదూ?. భాను మరేమీ వాదించకుండా సరే అంది.
భాను మూడోనెలలో బావగారి దగ్గరికి వెళ్ళిపోయింది. తమ కొత్త కాపురం గురించీ, బావగారి కోపతాపాలను గురించీ, తను నేర్చుకొంటూన్న పని పాటల గురించీ విపులంగా ఉత్తరాలు రాసేది. రోజులు హాయిగా గడుస్తున్నాయట. బావగారికి మాత్రం కోపం తగ్గటం లేదట. చీకటితో లేచి పనిలో జోరబడా లంటే చికాకు వేస్తూందట. ఒక్కోసారి ఈ బాదరబందీ అంతా ఏమిటా అని ఎక్కడలేని విసుగూ వచ్చేస్తూందట. మరుక్షణంలోనే ఎందుకో అమితమైన ఓర్పువచ్చి పడుతూందట. అన్నిటి కన్నా ముఖ్య విషయం తనకు నేనే ఎప్పుడూ గుర్తు వస్తున్నానట. నవ్వుకొని కొత్త సంసారంలో అనుభవంలేని చెల్లాయికి నాకు తోచిన ధైర్యం చెప్పుతూ జవాబులు రాసేవాడిని.
* * *

సంవత్సరం తిరిగే సరికి భాను తల్లి కూడా అయింది. రాజావంటి అల్లుణ్ణి చూసిమురిసి పోయాను. తల్లితండ్రుల్లో ఉన్న అంద చందాలన్నీ వాడికి వచ్చాయి. తెల్లగా సన్నగా సూర్య కిరణంలా ప్రకాశిస్తూ వాడు ఏడాది లోపునే గునగునా నడిచేస్తూంటే చూడటానికి వేయి కళ్ళు కావాలనిపించేది. భాను అదృష్టవంతురాలు! అన్ని సౌఖ్యాలూ పొంద గలుగుతూంది. ఆ రెండు సంవత్సరాలలో భాను చాలా మారింది. ఓర్పు శాంతం-నెమ్మదీ-అన్నీ అలవడ్డాయి.
"నువ్వు చాలా మారిపోయావుభానూ! మనం స్కూల్లో చదువుకున్నప్పటిలా ఎందుకులేవూ? ఇంకెప్పుడూ అలా ఉండవా?" అన్నాను బిక్క మొహం వేసుకొని. భాను అదోరకంగా నవ్వింది. "నేను మళ్ళా అలాగే ఉండాలంటే ప్రేమించే అన్నయ్య ఒక్కడే చాలడు." నాకేమిటో అర్ధం కాలేదు. "ఏమిటి భానూ!" అన్నాను. "అబ్బ! ఏం లేదు పోరా!" అనేసింది.
