Previous Page Next Page 
నా నృషిః కురుతే కావ్యం పేజి 4

 

                                     4

    "పరిమళా! పాప కట్టుకొచ్చిన గౌను ఉతికి ఆరేశావు కదూ? అది తొడిగి పాపను త్వరగా తయారుచెయ్యి. శారదకు ఆలస్యమయిపోతోంది." వెయ్యి కడుక్కుంటూనే అన్నాడు రావు.
    నాలో ఏదో నీరసం ఆవరించింది. నాకేం కావాలో అర్ధం కావటం లేదు. కావలసింది ఎలా పొందాలో అంతకన్న అర్ధం కావటం లేదు. నా మనసు నలిగి పోతూంది. ఏదో ఆర్తితో ఘోషపెడుతూంది.    
    "ఇంత దూరం నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చి అలిసిపోయాను. కొంచెంసేపు విశ్రాంతి తీసుకుందామనుకుంటున్నాను. నే నిక్కాద్ ఉండటానికి వీల్లేదా?"
    రావు విచిత్రంగా నా వైపు చూశాడు. దాచుకోవటానికి ప్రయత్నిస్తున్నా దాగని చిరునవ్వు ఆ పెదవుల మధ్య తళుక్కుమంటూంది.
    "వీల్లేదని ఎవరు అనగలరు, శారదా! నువ్వు భోజనంకూడా చెయ్యలేదు కనక వెంటనే వెళ్ళిపోతావనుకున్నాను. ఏదైనా ఫలహారం తెప్పించమంటావా?"
    ఆ మాటలు, ఆ చిరునవ్వు నా మనసును ముక్కలుగా కోస్తున్నాయి. ఎంత నిగ్రహించుకున్నా ఆగకుండా నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
    "థాంక్స్! నా కోసం మీ రెవరూ శ్రమ పడక్కర్లేదు. పాప కోసం కాకపోతే నే నసలు వచ్చేదాన్ని కాదు. మీ రెంత అవమానించినా పాపను చూడకుండా ఉండటం నా తరం కాదు."
    దుఃఖం పొంగివస్తే రుమాలు కళ్ళకి అడ్డం పెట్టుకున్నాను. క్షణంలో పాప వచ్చి చేతులతో నన్ను అల్లేసుకుంది. పాపకూడా వెక్కి వెక్కి ఏడవసాగింది.
    "అమ్మా! ఇంకెప్పుడూ ఇలా వచ్చెయ్యను. ఏడవకు. నేను చెడ్డ పిల్లను కదూ!"
    అమాయకంగా నా కన్నీళ్ళు తన కోసమే నని నమ్మి నన్ను ఓదారుస్తున్న ఆ పసిమనసు ముందు నా మనసు విలవిల లాడిపోయింది. పాప సరిగా నాలాగే ఆలోచిస్తుంది. తన తప్పు తనే గుర్తిస్తుంది. ఆ తప్పు బహిరంగంగా ఒప్పుకోగలిగే శక్తి పాప కుంది. అందుకే ధైర్యంగా తల ఎత్తుకోగలదు. దాని మనసు ఎప్పటికీ నిర్మలంగానే ఉంటుంది. అలా ఒప్పుకోగలిగే శక్తి నాకు లేదు. తప్పు నేనే గుర్తించలేని మూర్ఖత్వమూ లేదు. అందుకే నా మనసు ఇలా వికృతమవుతూంది రోజురోజుకీ. నా చూపులు రావు చూపులతో కలుసుకున్నాయి. ఒకరి చేతులలో ఒకరం వాలి కన్నీళ్లు పెట్టుకొంటున్న మమ్మల్ని చూస్తున్న అతని ముఖంలో ఏదో జాలిలాంటి భావం కనిపించింది.
    ఇది నే నసలు భరించలేను. జాలి! రావు దగ్గిర నుండి!....వద్దు! నా కెంతమాత్రం వద్దు!
    "పాపా! త్వరగా తయారయి రా! వెళ్ళిపోదాం. పని మనిషిని ముఖం కడగమను."
    "ఇక్కడ పనిమనుష్యులు లేరు, శారదా! రా, పాపా!"
    పాప చెయ్యి జాచింది. ఆ చెయ్యి పట్టుకుని పాపను బాత్ రూమ్ లోకి తీసుకెళ్ళింది పరిమళ. అలవాటుగా వచ్చాయి ఆ మాటలు నోటినుండి. ఎప్పుడూ విపరీతంగా అలోచించి, ఆలోచించి నిజజీవితంలో, నిత్య వ్యవహారంలో ఒక అలసభావంతో అన్యమనస్కంగా మాట్లాడటం నాకు బాగా అలవాటయిపోయింది. నా రచనా లోకమూ, ఆ లోకంలో సంచరించే ప్రాణం పోసుకున్న నా పాత్రలూ నాకు ప్రధానమయిపోయి, ఈ వాస్తవ ప్రపంచమే అర్ధరహిత మయిపోతూంది.
    అప్పుడే రావు చేతులు వెనక్కి కట్టుకుని అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అంటే ఉద్రేకం నిగ్రహించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడన్నమాట! ఇలాంటి సందర్భంలోనే నా మనసు చిత్రహింస అనుభవిస్తుంది. నా మాటలకు నా ఆస్తి మితమే కారణమని చెప్పి ఎలా నమ్మించగలను రావును? అందులోనూ మా సంబంధ బాంధవ్యాలు ఇంత విషమస్థితిలో ఉన్నప్పుడు?
    మాసిపోయిన పాంటు, చివరి మడతల దగ్గిర సన్నని చీలికలు, కాలరుదగ్గిర చిరిగిన చొక్కా అతని ఆర్ధిక స్థితిని చెప్పక చెపుతున్నాయి. చెక్కిళ్ళు బాగా లోతుకు పోయాయి. కళ్ళు మాత్రం చురుగ్గా ఉన్నాయి ఎప్పటిలాగే! చిరునవ్వులో నిర్లక్ష్యంకూడా చెక్కు చెదరలేదు. నా రావును అంత దీనంగా చూడలేక పోయాను.
    "రావ్!"
    నా కంఠంలో ధ్వనించిన ఆప్యాయత నాకే ఆశ్చర్యం కలగచేసింది. రావు నా వంక ఆశ్చర్యంగా చూడటంలో వింత లేదు. కలవరపడ్డాను.
    "ఏమీ అనుకోకు! నువ్వు.... నేను... నీకు కావాలంటే....ఆహఁ! నా దగ్గిర...ఇదిగో! ఇది తీసుకో!"
    ఎలాగో గబగబ మాట్లాడి బాగ్ లోంచి నా దగ్గిరున్న రెండు వందలూ అతని ముందుకు జాపాను. రావు నా వంక, డబ్బు వంకా మార్చి మార్చి చూశాడు. నా చెయ్యి వణుకుతూంది. ఒక్క క్షణం రావు ముఖం కఠినంగా అయింది. నా ముఖం పాలిపోయింది. అది గమనించినట్లున్నాడు. అతని ముఖంలో ప్రసన్నత కనిపించింది. నా మనసులో ఆశ తల ఎత్తింది.
    "నీ దగ్గిర డబ్బు ఎక్కువగా ఉందా?" మృదువుగా అడిగాడు.
    ఆ మృదుస్వరానికి పొంగిపోయాను.
    "అవును. ఎక్కువగానే ఉంది. ఇంకా కావాలన్నా ఇస్తాను." ఒక్క క్షణం ఆలస్యం చేస్తే రావు ఎక్కడ అతని నిర్ణయం మార్చుకుంటాడో అన్నట్లు గబగబ అన్నాను.
    "అలాగా! కొంచెంసేపాగు. ఈ దారినే రోజూ ఒక ముసలి ముష్టివాడు వస్తున్నాడు. వాడికి ఇద్దువు గాని. ఆ డబ్బు నిజంగా సార్ధకమవుతుంది. దానం వల్ల పుణ్యం వస్తుందనే మాట నిజమయితే నువ్వు వ్యర్ధంగా వెతుక్కుంటున మనశ్శాంతి కూడా దొరుకుతుందేమో?"
    కొరడాతో చెళ్ళున ముఖంమీద చరిచినట్లయింది. పిండిబొమ్మనయి కళ్ళప్పచెప్పి కూర్చున్నాను.
    "నిన్ను చూస్తోంటే చాలా జాలేస్తోంది, శారదా! నా మీద నాకుకూడా జాలిగానే ఉంది, ఏ విధంగానూ నీకు సహాయపడలేని స్థితిలో ఉన్నందుకు!"
    పాప తయారయి వచ్చేసింది. ఆర్గండీమీద ఎంబ్రాయిడరీ చేసిన తన ఫ్రాక్ తొడుక్కుంది. పరిమళ కొన్న గౌను మడతపెట్టి చేతిలో పట్టుకుంది.
    "అమ్మా! ఈ గౌను నాతో తెచ్చుకుంటాను."
    పాప ఆ గౌనును అంత ఆప్యాయంగా పట్టుకోవటం, ఏదో అపురూప సంపదలా గుండెలకు హత్తుకోవటం నా మనసులో ఏ మూలనో గుచ్చింది.
    "వీల్లేదు!"

                                 
    పాప గిర్రున వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళింది. ఏదైనా నేను వద్దని చెప్పినప్పుడు పాప ఎన్నడూ వాదించదు.
    "అత్తా! ఈ గౌను నీ దగ్గిర భద్రంగా దాచి పెట్టవూ? ఇంకోసారి నీ దగ్గిరకు వచ్చినప్పుడు తొడుక్కుంటాను."
    పరిమళ చేతుల్లో అతి జాగ్రత్తగా మడతపెట్టిన గౌను పెట్టింది పాప.
    తల దిమ్మెక్కింది నాకు! ఇంతకంటే ఆ గౌను తనతో తెచ్చుకుంటానని పేచీ పెట్టినా బాగుండేది. పాప పేచీలు పెట్టదు. విధేయంగా ఉంటూనే తనకు కావలసింది సాధించుకొంటుంది.
    ఉద్రేకంతో ఎర్రబడుతూన్న నా ముఖాన్ని చూస్తూ గట్టిగా నవ్వాడు రావు.
    పాపను ఎత్తుకుని, "ఇంకోసారి వచ్చినప్పుడా? మళ్ళీ వస్తావా? మీ అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుంటుంది" అన్నాడు.    
    "పెట్టుకోదు. మా అమ్మ తెలివితక్కువది కాదు. నే నిక్కడికే వస్తానని తెలుసుకోగలదు." గర్వంగా అంది పాప.
    అచ్చు నే నన్నట్లే! పాపచేత ఏ పనినైనా చేయించడానికి నేను వాడుకునే ఆయుధాన్నే పాప నా పైన ప్రయోగించింది.
    'పాప తెలివితక్కువది కాదు. ఇప్పుడు చదువుకోవాలని దానికి తెలుసు' అంటాను నేను గంభీరంగా.
    వెంటనే పాప పుస్తకాల ముందు కూర్చునేది. ఏ మాత్రం మందలించకుండా పాపను లొంగ దీసుకొనేందుకు ఈ ఆయుధం నాకు బాగా ఉపకరించేది. కానీ, ఒకనాటికి ఇదే ఆయుధాన్ని పాప నా మీదనే పర్సుగా ఉపయోగిస్తుందని ఊహించలేకపోయాను. రావు ఓరగా నావంక చూస్తూ మళ్ళీ నవ్వాడు.
    "మీ అమ్మ బెంగపెట్టుకోదు. సరే! నిన్ను తీసుకెళ్ళడానికి రావద్దూ?"
    పాప కొంచెంసేపు ఆలోచించింది.
    "ఈలోగా నేను డ్రైవింగ్ నేర్చుకుంటాను. నేనే కారులో వచ్చి, కారులో వెళతాను అమ్మలాగ!"    
    పాప మాటలు నా కెంత కష్టం కలిగించినా, 'అమ్మలాగ' అనేటప్పుడు పాప కళ్ళలో కనిపించిన మెరుపూ, నన్ను చూసే పాప చూపులలో ఆరాధనా భావమూ నా మనస్సును గర్వంతో నింపేశాయి. చేతులు జాపి, "రా!" అన్నాను.    
    పాప వచ్చి నా చెయ్యి పట్టుకుంది. వెనక్కి తిరిగి, "వెళ్ళొస్తాను, అత్తా! నాన్నగారూ! టా! టా!" అంది.
    నేను నేరుగా వచ్చి కారులో కూర్చున్నాను. రావు, పరిమళ నన్నే చూస్తున్నారని గ్రహించినా, ఇద్దరిలో ఎవరివంకా నేను చూడలేదు.
    
                                    5

    నేను చేసిన పెద్ద పొరపాటు పెళ్ళి చేసుకోవటం! గృహిణిగా గృహనిర్వహణ భాద్యత మీద వేసుకోగలిగే ఓపిక నాకు లేదు. నా లాంటివాళ్ళు పెళ్ళి చేసుకో కూడదు. అంతా నా ఇష్టప్రకారమే జరిగి ఉంటే ఎప్పటికీ కుమారిగానే ఉండిపోదునేమో! కానీ, రావు అలా జరగనివ్వలేదు. తప్పు చేసింది నే నైనా, బాధ్యత అతను స్వీకరించాడు. షాధారణంగా వినపడే ప్రేమకథలకు పూర్తిగా విభిన్నమైనది మా గాథ. గట్టిగా చెప్పాలంటే పెళ్ళయ్యేవరకూ అసలు మేము ప్రేమికులమే కాదు. అయ్యాక అసలు కాదు. నా జీవలక్షణమై, ఆయా సందర్భాలనుబట్టి గుణంగానూ, దోషంగానూకూడా పర్యవసించే ఉద్రేకమే నా వివాహానికికూడా కారణం.
    ఆ రోజు నా ఒళ్ళో మత్తుగా కళ్ళు తెరిచి, "నా మీద నీ కింత ప్రేమ ఉందని నే నెన్నడూ ఊహించ లేదు, శారదా!" అన్నాడు రావు.
    పకపక నవ్వాను నేను.
    "ఇప్పుడెలా ఊహించావు, మరి?" అల్లరిగా అన్నాను.
    "ఇప్పుడింక ఊహలతో ప్రమేయం లేదు స్పష్టంగా తెలిసిపోయింది."
    మళ్ళీ నన్ను తన ఒళ్ళోకి లాక్కుంటూ అన్నాడు.     
    ఆవేశంతో అతని పెదవులపై నా పెదవులొత్తి ముద్దు పెట్టుకుంటూ ఉండిపోయాను. పావు గంట గడిచిపోయినా నేను లేవలేదు. రావు విడిపించుకో లేదు. కిలకిల నవ్వుతూ ఎప్పటికో నేను లేచిన తరవాత, అరమోడ్పు కన్నులతో నా వక్షంపైన శిరస్సు వాల్చి, "ఈ అధర సుధలో మాధుర్యం చెప్పింది. నీ మనసులో ప్రేమనంతా! వెల్లువలా పొంగే ఈ ప్రేమను ఇంత చిన్న గుండెలో ఎలా దాచుకున్నావు ఇన్నాళ్ళూ?" అన్నాడు.
    నేను సమాధానం చెప్పలేదు. పకపక నవ్వాను. చెప్పేందుకు నా దగ్గిర సమాధానం లేదు.        
    ఏ భావంలోనా మనసు రసిస్తుందో ఆ క్షణంలో తదనుగుణమైన ఉద్రేకం పొంగి నా అస్థిత్వాన్ని ఆవరించేసుకుంటుంది. ఆ భావం శృంగార సంబంధమే కానక్కరలేదు. క్రోధము, ఈర్ష్య, ఆవేదన, పశ్చాత్తాపము- ఏదైనా అంతే!
    ప్రశంసాపూర్వకమైన రావు చూపులు నన్ను అనేక సార్లు తడిమాయి. కళ కాంతులు గల ముఖమూ, లావణ్యం తొణికిసలాడే శరీరకాంతీ, తీర్చి దిద్దిన అంగసౌష్టవమూ పొందగలిగిన నేను, ఇతరుల మెచ్చికోలు చూపులకు బాగా అలవాటుపడిపోయాను. అందుకే రావు చూపులు ప్రత్యేకంగా నన్ను స్పృశించలేదు. రావులో నాకు ప్రత్యేకమైన ఆకర్షణా లేదు. అసలా రోజు వరకు రావు గురించి నేను ఆలోచించనే లేదు. అతడు చక్కని విమర్శకుడు. నా రచనలు విమర్శిస్తూంటే లోలోపల చివుక్కుమన్నా, అతని మాటలన్నీ నిజమని అంగీకరించేది నా అంతరంగం. అతని విమర్శలు నా అభివృద్దికి బాగా ఉపయోగపడగల ననిపించింది. అందుచేత అతనంటే గౌరవం ఉండేది. అంతే! ప్రేమ కథలు చాలా వ్రాశాను. ప్రేమ కోసం ప్రేయసీ ప్రియులు చేసే త్యాగాలుకూడా చాలా ఐడియల్ గా వర్ణించాను. కానీ, నేను మాత్రం ఎన్నడూ ఎవర్నీ ప్రేమించలేదు. ఆ సంబంధమైన ఆలోచనలే నాకు రాలేదు.
    ఆ రోజు తలంటిపోసుకుని, తలనిండా జాజులు తురుముకుని, నా తలలో జాజుల పరిమళం నాకే ఏదో మైకం కలిగిస్తూంటే వరండాలో నిలబడి సూర్యాస్తమయంలో ఎరుపు తిరిగే నీలిమేఘాలను చూస్తున్నాను. నా మనసంతా ఏవేవో తీపితలపులతో నిండిపోయింది.
    సరిగ్గా అలాంటి సమయంలోనే వచ్చాడు రావు. అతని చూపులు నా ఆపాదమస్తకమూ ఒక్కసారి స్ప్రుశించి అంతలో పక్కకు తిరగటం గమనించి నాలో నేను నవ్వుకున్నాను.
    ఎప్పటికప్పుడు తన ఉద్రేకాలు నిగ్రహించుకుని గంభీరంగా కనబడటానికి ప్రయత్నిస్తాడు రావు.
    "ఏమిటి చూస్తున్నావు అలా?" చిరునవ్వుతో అడిగాను. నా చిరునవ్వులో అతనికి నా మనసులో మైకం కొంత కనిపించి ఉండాలి.
    ధైర్యంగా - "ఈవేళ నువ్వు చాలా బాగున్నావు" అన్నాడు.
    "అంటే? రోజూ అందంగా కనపడటం లేదా?"
    "ఈవేళ నీ అందంలో ఏదో ప్రత్యేకత కనిపిస్తోంది."
    "ఏమిటో ఆ ప్రత్యేకత?"
    "చెపితే నీకు కోపం వస్తుందేమో!"
    "రాదు. చెప్పు."
    "ఈ వేళ నీ కళ్ళు..."
    "ఊఁ! నా కళ్ళు...?"
    "ఆహ్వానిస్తున్నట్లుగా ఉన్నాయి."
    చప్పున అనేసి చూపులు వాల్చుకున్నాడు. పకపక నవ్వాను, అతని బిడియానికి! నా ఆకర్షణకి లొంగిపోతున్న మనస్సుని అదుపులో పెట్టుకోవటానికి శక్తినంతా వినియోగించి ప్రయత్నిస్తున్న రావు, ఆ క్షణంలో ఎంతో అందంగా కనిపించాడు నా కంటికి.
    "నేను ఆహ్వానిస్తున్న వ్యక్తి వచ్చేశాడుగా! ఇంకా నా కళ్ళు ఆహ్వానిస్తున్నట్లుగానే ఉన్నాయా? చిలిపిగా నవ్వుతూ అడిగాను.
    "శారదా!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS