Previous Page Next Page 
నా నృషిః కురుతే కావ్యం పేజి 5


    గబుక్కున తలఎత్తి ఒక విధమైన దిగ్భ్రాంతి తో నా ముఖంలోకి చూశాడు రావు. మెరుస్తూన్న అతని కళ్ళు నా మాట లతని కెంత ఆనందం కలిగించాయో చెపుతున్నాయి.
    చటుక్కున ముందుకు వంగి అతని భుజాలమీద రెండు చేతులూ వేసి, అతని ముఖంమీద ముఖం పెట్టి కళ్ళలోకి చూస్తూ, "చెప్పు" అన్నాను, అదే చిలిపినవ్వుతో.
    అంతే! ఇంక రావుని ఆపటం నా తరం కాలేదు. ఆపాలని నేను గట్టిగా ప్రయత్నించనూలేదు.
    చేతిరుమాలుతో ముఖం తుడుచుకుంటూ, "సారీ, శారదా! ఎక్స్ ట్రీమ్లీ సారీ!" అన్నాడు రావు.
    వింతగా అతని ముఖంలోకి చూశాను.
    "నే నిలా ఉద్రేకానికి లొంగిపోతానని ఎప్పుడూ అనుకోలేదు. పరిమళకు పెళ్ళయ్యేవరకూ నేను చేసుకో కూడ దనుకున్నాను."
    "పరిమళకు పెళ్ళయ్యాకే చేసుకో! ఇప్పుడు తొందరేం వచ్చింది?" నిశ్చింతగా అన్నాను.
    ఈసారి విస్తుపోవటం అతని వంతయింది. రెండు క్షణాలు నా ముఖంలోకి నిదానించి చూపి నవ్వటానికి ప్రయత్నిస్తూ, "నువ్వు నాలో ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకుంటాను" అన్నాడు.
    నిర్లక్ష్యంగా నవ్వాను.
    ఆ రోజునుంచీ రావు పరిమళకు పెళ్ళి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అయితే ఈనాటి హిందూ సంఘంలో ఆడపిల్లకు పెళ్ళి కావటం అంత తేలిక కాదు. ఎప్పటికప్పుడు రావు తన ఇబ్బందులన్నీ నాతో చెపుతూనే ఉన్నాడు.
    అన్యమనస్కంగా వినేదాన్ని.
    నేనూ, రావూ మాత్రం భార్యాభర్తల మయి పోయినట్లే వ్యవహరించేవాళ్ళం.

                                    6

    కళ్ళు తిరిగి పడిపోతున్న నన్ను పట్టుకుని, "ఏమిటి, శారదా!" అన్నాడు రావు.
    కొన్ని రోజులుగా నాకు బద్ధకంగా ఉంటూనే ఉంది. అయినా, నిర్లక్ష్యంగా తిరుగుతున్నాను.
    "ఏం లేదు. వారం పదిరోజుల నుంచి ఇలాగే ఉంది. తిండికూడా సహించటం లేదు" నీరసంగా నవ్వాను.
    "పద! లేడీ డాక్టర్ ని కన్సల్ట్ చేద్దాం!" ఆందోళనగా అన్నాడు రావు.
    "ఇంతమాత్రానికే డాక్టరా?"
    "అలా అశ్రద్ధచెయ్యకు. నడు."
    నన్ను బ్రతిమాలి, బలవంత పెట్టి డాక్టర్ దగ్గిరకు తీసుకెళ్ళాడు రావు.
    కారణాలు వేరయినా, డాక్టర్ చెప్పినది వినగానే మా ఇద్దరి మనసులూ ఆందోళనతో నిండిపోయాయి.
    నేను గర్భవతిని!
    ఇంత చిన్న వయసులోనే పిల్లల తల్లిని కావటం, భాధ్యతలతో ఉక్కిరి బిక్కిరి కావటం నా కిష్టం లేదు.
    పెళ్ళి కాకుండానే నేను గర్భవతిని కావటానికి తను బాధ్యుడయినందుకు రావు బాధపడుతున్నాడు. ఇంటికి రాగానే, "మనం వెంటనే పెళ్ళి చేసేసుకోవాలి, శారదా! అన్నగా పరిమళకు అన్యాయం చేస్తున్నాననే బాధ ఉంది కాని, తప్పదు" అన్నాడు.
    "అంత బాధపడవలసిన అవసర మేమొచ్చింది? పరిమళకు పెళ్ళయ్యాకే మనం పెళ్ళి చేసుకుందాం."
    "అలా అనుకునే ఇన్నాళ్ళూ ఆగాం! కానీ, ఇప్పుడెలా? నువ్వు...."
    "డాక్టర్ వి కన్సల్ట్ చేద్దాం! బహుశః నేను మళ్ళీ మామూలు శారద వైపోతాను."
    "ఏమంటున్నావు నువ్వు?"
    "అబార్షన్ చేయించుకుంటాను."
    "శారదా!" కోపంగా మందలిస్తూన్నట్లు అన్నాడు రావు.    
    "ఏం, చేయించుకుంటే? పిల్లా పాపాతో నీ సంసారం నీకు తయారయితే, మీ పరిమళ పెళ్లెలా చేస్తావు? నీ సుఖం నీదే కాని, మీ చెల్లెలు సంగతి పట్టించుకోవా?"
    అతని మనసులో అతి సున్నితమైన ప్రదేశంలో కొట్టాను.
    పారిపోయిన ముఖంతో క్షణం నా ముఖంలోకి చూసి, చేతులు వెనక్కి కట్టుకుని అటు ఇటు పచార్లు చేశాడు. చివరకు ఒక్క మాట లేకుండా, నాతో ఏమీ అనకుండా వెళ్ళిపోయాడు. నేను చాలా సంతోషించాను.
     ఆ సాయంత్రం పరిమళ నా దగ్గిర కొచ్చింది. ఆప్యాయంగా నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, "అన్నయ్య నా కంతా చెప్పాడు" అంది. రావుమీద లోలోపల చిరాకు పడ్డాను. చెయ్యదలుచుకున్న దేదో గుట్టుగా చెయ్యక అందరికీ చెప్పటం దేనికి?
    "నా కోసం నువ్వింత త్యాగం చెయ్యటం నేను భరంచలేను." చెమ్మగిల్లిన కళ్ళతో అంది పరిమళ.
    తెల్లబోయాను నేను.
    "నీ కోసం నేను త్యాగం చేస్తున్నానా?"
    "మామూలు త్యాగంకూడా కాదు. లోకంలో ఏ ఆడదీ చెయ్యలేని త్యాగం! అబార్షన్ కు సిద్ధపడుతున్నావు."
    తలక్రిందులయిపోయాను. ఏడవాలో, నవ్వాలో అర్ధంకాలేదు. కానీ, మనసులో ఏ మూలనో కలుక్కుమంది.
    "నేను ఇందుకు ఎంతమాత్రం ఒప్పుకోను."కచ్చితమైన స్వరంతో అంది పరిమళ.
    కంగారుపడిపోయాను.
    "పరిమళా! ఇందులో నీ కోసం చేస్తున్నదేం లేదు."
    "ఊరుకో, శారదా! నేనూ ఆడదాన్నే! ఆ మాత్రం అర్ధం చేసుకోలేనంటావా? మీ అంత గొప్పదాన్ని కాకపోవచ్చుకాని, నాకూ మనసుంది. నా సౌఖ్యం కోసం ఓ పసికందు ప్రాణాలు బలి తీసుకోగల నను కున్నవా?" వెక్కి వెక్కి ఏడవ సాగింది పరిమళ.
    మూఢురాలిలా చూస్తూ నిలుచున్నాను.
    కొంతసేపటికి పరిమళ తనను సమ్మాళించుకుని, "నువ్వూ, అన్నయ్యా వెంటనే పెళ్ళి చేసుకోండి, శారదా! అన్నయ్య ఈ వార్త చెప్పిన దగ్గిరనుండీ రాబోయే ఆ చిట్టిపాపాయి కోసం ఎంత ఆశగా ఎదురు చూస్తున్నానో తెలుసా?" అంది.
    "వద్దు, పరిమళా! నా కిష్టం లేదు." ఖండితంగా అన్నాను.
    "ఏమిటి నీ కిష్టం లేదు, శారదా? అన్నయ్యతో పెళ్ళి ఇష్టం లేదా? పండులాంటి పాపాయికి తల్లి కావటం ఇష్టం లేదా?"
    "ఇప్పటినుంచీ బాధ్యతల్లో ఇరుక్కోవటం ఇష్టం లేదు. నాకు రచయిత్రిగా పైకి రావాలని ఉంది. నా జీవితంలో నేను గాఢంగా కోరుకునేది అదొక్కటే! ఒకటీ అరా నా కథలు పత్రికల్లో వస్తున్నా, నా కింత వరకూ ఎలాంటి గుర్తింపూ రాలేదు. నాకు చాలా అశాంతిగా ఉంది. రచయిత్రిగా రాణించాలనే నా కోరిక నెరవేరేవరకూ నాకు నిద్ర పట్టదు."
    'దానికీ, దీనికీ ఏం సంబంధం, శారదా? రచయిత్రు లందరూ పెళ్ళి చేసుకోవటం మానేస్తున్నారా?"
    "నాకు తెలియదు, పరిమళా! కలం పట్టుకోగానే అద్భుతమైన రచన వెలువడే అదృష్టవంతుల సంగతి నాకు తెలియదు. నా సంగతి వేరు. నేను వ్రాసింది నాకే సంతృప్తి కరంగా ఉండటంలేదు. అలాగని వ్రాయటం మానలేకపోతున్నాను. వ్రాయాలనే కాంక్ష ఎంత ఉందో, వ్రాయవలసిన రీతిలో వ్రాయటం లేదన్న అసంతృప్తీ అంత ఉంది. ఎన్నెన్ని కాగితాలు వ్రాసి, చింపి పోగులుపెడతావో నాకు తెలియదు. ముందు నే నిధి సాధించాలి. సాహిత్యలోకంలో సుస్థిర మైన స్థానాన్ని పొందాలి. అదొక్కటే కావాలి నాకు. పెళ్ళి లేకపోయినా ఫరవాలేదు."
    నన్ను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న దానిలో నా ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది పరిమళ.
    చాలా సేపటి తరవాత నిదానంగా ఉన్నా, గంభీరంగా ఉన్న స్వరంతో అంది: "ఇవన్నీ ముందే ఆలోచించు కోవలసింది, శారదా! ఇప్పుడేం చెయ్యటానికీ లేదు."
    'ఎందుకు లేదూ? అబార్షన్..."
    "ప్లీజ్! ఆ మాట ఒకటికి పది సార్లనకు. అయినా, నీ సమస్య కది అంత సులభపరిష్కార మవుతుందనుకొంటున్నావా? అబార్షన్ కు ప్రయత్నించటం వల్ల ప్రాణాలే పోయిన కేసు లెన్నో ఉన్నాయి. ప్రాణాలు పోయినా అబార్షన్ కాకపోగా, కాలో కన్నో పోగొట్టుకున్న శిశువు జన్మించవచ్చు. గత్యంతరం లేనివాళ్ళు మాత్రమే ఇలాంటి నైచ్యానికి పూనుకుంటారు."
    భయంతో పాలిపోయింది నా ముఖం. సర్వాంగాలూ వణికాయి.
    నా ముఖంలోకి ఒకసారి చూసి, "అన్నయ్యతో పెళ్ళి ఏర్పాట్లు చెయ్యమని చెపుతాను" అంది.
    నే నేం మాట్లాడలేదు. మరొక్కసారి నా ముఖం లోకి చూసి పరిమళ వెళ్ళిపోయింది. వచ్చినప్పుడు నా పట్ల పరిమళ చూపిన ఆదరభావం వెళ్ళే సమయంలో లేదని గ్రహించాను. వెళుతూ వెళుతూ పరిమళ నన్ను చూసిన చూపుల్లో అణుచుకోవటానికి ప్రయత్నిస్తున్న తిరస్కారం ఉందనికూడా గ్రహించాను.
    నెల తిరక్కుండానే రావుతో నా వివాహం జరిగి పోయింది. పరిమళ మనసులో ఏముందో తెలియదు. మనోభావాలను గుప్తంగా దాచుకుని, సంస్కారమూ, సభ్యతా ఉట్టిపడేలా ప్రవర్తించడంలో రావుకు తగిన చెల్లెలు పరిమళ. అతి సామాన్యమైన తమ అద్దె ఇంటి వాటాలోకి నన్ను సాదరంగా ఆహ్వానించి, "ఇంక ఈ ఇల్లు నీదే, వదినా! మేమంతా నీ వాళ్ళం!" అంది చిరునవ్వుతో చిన్న వంటిల్లు, ఒక మోస్తరు హాలు, దాని నానుకొని చిన్న పడకగది-ఆ ఇల్లు చూడగానే నాలో ఏదో నిరాశ పాటమరించింది. అందుకు కారణం నేను శ్రీమంతురాలిని కావటం కాదు. ఐశ్వర్యంపట్ల నాకు తెలియకుండానే నా మనసులో చిన్నతనంనుండీ ఉన్న కాంక్ష!
    నేను ఎంతో అందంగా ఉంటానని నన్ను చూసిన ప్రతివారూ అనేవారు. నాకు పదహారేళ్ళు వచ్చినప్పటి నుండీ ఎవరో అందమైనవాడూ, బాగా డబ్బున్న వాడూ నన్ను ప్రేమించి, పెళ్ళి చేసుకుంటాడని కలలు కనేదాన్ని. ఈ పగటికలలకు ప్రేరణ నాలో అణగి ఉన్న అంతులేని ఐశ్వర్యకాంక్ష అని అప్పట్లో నాకు తెలియదు. నేను కన్న పగటి కలలకు పూర్తిగా విరుద్ధ మైన నిజ జీవితంలోకి ప్రవేశించినప్పుడు, నా మనసులో నూతన వధువుకు ఉండవలసిన ఉత్సాహం ఏ కోశానా లేదు. అందుకు బదులు ఏదో అసహనమూ, అశాంతీ ఆవరించాయి. అయితే, రావు ప్రేమపూర్వకమైన కౌగిలిలో మాత్రం సమస్తమూ మరిచిపోయాను.


                                   *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS