"వద్దు, వద్దు నేను ఎవరినైనా పంపిస్తాను."
"ఓకే!"
వెంటనే ఫోన్ పెట్టేసిన చప్పుడు.
ఏదో నిస్త్రాణ ఆవహించిన ట్లయింది.
ఆరేళ్ళ పాపముందు ఎప్పటికప్పుడు నేను ఓటమినే అంగీకరించవలసి వస్తూంది. అదే స్వభావం! అచ్చు రావు వ్యక్తిత్వమే! మంచిగా, మర్యాదగా. సభ్యతగా ఉంటూనే తమ చుట్టూ తామొక గిరి గీసుకుని ఆ గిరి దాటి బయటికి రాక, ఆ గిరిలోకి ఏ ఒక్కరినీ స్వీకరించని వ్యక్తిత్వం!
'నువ్వు రమ్మన్నావని బ్రతిమాలనా?'
ఎంత సూటిగా అడిగింది పాప! ఆరేళ్ళు నిండు తున్నాయి. అన్ని విషయాలూ అర్ధమవుతున్నాయి పాపకి! మరి, నన్ను మాత్రం అర్ధం చేసుకోలేదా?
3
పాప రింగ్ విసిరింది. రావు కావాలని పట్టుకోలే నట్లు నటిస్తూ జారవిడిచాడు. పాప సంతోషంతో ఎగిరి చప్పట్లు కొట్టింది.
"గేమ్" అని అరుస్తూంది.
అంత గట్టిగా ఎప్పుడూ అరవనివ్వను నేను. ఎలా అరుస్తూందో! ఎంత హుషారు!
"నాన్నగారూ! మీ కసలు రింగ్ పట్టుకోవటమే రాదు. నేను నేర్పిస్తానుండండి. ఇదిగో! ఇలా ముందుకు రావాలి. ఇలా పట్టుకోవాలి. మళ్ళీ వెంటనే ఇలా వేసెయ్యాలి."
ఏనాడూ రింగ్ పట్టుకోవటం తెలియనివాడిలా, రింగ్ ఆడడమే తన జీవిత పరమార్ధంలా అతి శ్రద్దగా వింటున్నాడు రావు. పైగా, సందేహాలుకూడా అడుగుతున్నాడు.
"పాపా! రింగ్ వేగంగా వెనక్కి వెళ్ళిపోతుందనుకో? అప్పుడు?"
"అప్పుడు మనంకూడా తొందరగా వెనక్కి పరుగెట్టాలి. ఆ రింగ్ వే చూస్తూ పరుగెట్టాలి."
పాప ముఖం చూడాలి! ఏ ఉపాధ్యాయుడూ తన శిష్యులకు అంత శ్రద్ధగా పాఠాలు చెప్పడు. ఎలా వెనక్కి పరుగెట్టాలో, ఒక్కొక్కసారి ఎలా ఎగిరి రింగ్ అందుకోవాలో వివరించి చెపుతూంది.
అంతా విని, "అబ్బా! ఇది చాలా కష్టమైన ఆట పాపా! నాకు రాదేమో!" అన్నాడు బెంగగా రావు.
"చాలా ఈజీ, నాన్నగారూ! త్వరగా వచ్చేస్తుంది. అయితే, మీరు శ్రద్ధగా నేర్చుకోవాలి." ముఖం గంభీరంగా పెట్టి, తర్జనితో బెదిరిస్తూ అంది పాప.
అచ్చు నాలాగే! నేను అలాగే బెదిరిస్తాను. సరిగా అలాగే మాట్లాడతాను. ముఖ్యంగా పాపకు ఏదైనా చెప్పేటప్పుడు-శ్రద్ధగా నేర్చుకోవాలి!" అని నొక్కి చెపుతాను నేను.
రావు గతుక్కుమని ఒక్క అడుగు వెనక్కి వెయ్యటం స్పష్టంగా కనిపించింది నాకు.
"భయపడకండి, నాన్నగారూ! వచ్చేస్తుందిలే!" నవ్వుతూ రావు చేతులు ఊపింది.
రావు పకపక నవ్వి, పాపను రెండు చేతులతో ఎత్తి గిరగిర తిప్పాడు.
భరింపరాని ఈర్ష్యతో నా మనసు ముక్కలవుతూంది. ఈ రావుకూ, నాకూ ఎప్పుడూ పూడ్చరాని దూరం ఉండనే ఉంది. పాపనుకూడా నాకు దూరం చేస్తున్నాడు. వేషం! అంతా వేషం!
భార్యమీద ప్రేమ లేనివాడికి కూతురు కావలసి వస్తుందా?
భుజం మీద చెయ్యి పడేసరికి వెనక్కి తిరిగాను. పరిమళ!
"ఏడుస్తున్నావా? ఎందుకు?"
"నేనా? ఏడుస్తున్నానా? లేదు, లేదు."
గబగబ రుమాలుతో కళ్ళు తుడుచుకున్నాను.
"లోపలికి రా!"
"నేను... నేను...."
"నువ్వు వస్తావని ఎదురుచూస్తూనే ఉన్నాం. రావు నువ్వొస్తావని అన్నాడు. నేను అంతగా నమ్మలేదు కాని, రావు మాట కాదనలేక భోజనం తయారుగా ఉంచాను. రావు సరిగా ఊహిస్తాడు."
క్షణ కాలం నాకు మాట రాలేదు.
నేను బయలుదేరేముందు ఎంతగానో అటూ ఇటూ ఊగిసలాడాను. కారుదాకా వచ్చి వెనక్కి వచ్చేశాను రెండు సార్లు. చిట్టచివరికి బయలుదేరటానికి నిశ్చయించుకున్నాను. దారి పొడుగునా నన్ను చూసి రావు, పరిమళ ఎంత ఆశ్చర్యపోతారో, ఎలా షాక్ తింటారో -రకరకాలుగా ఊహించుకుంటూ వచ్చాను.
నన్ను చూడగానే మొదట విస్తుపోతాడు రావు. ఆ తరవాత అప్రయత్నంగా నావైపు ఒక్క అడుగు వేసి, అంతలో వెనక్కి తగ్గి, రెండు చేతులూ వెనక్కి కట్టుకొని అటు ఇటు పచార్లు చేస్తాడు. తన ఉద్రేకం నిగ్రహించు కొనేందుకు రావు ఎప్పుడూ అలాగే పచార్లు చేస్తాడు. తరవాత "నువ్వు స్వయంగా నా దగ్గిరికి వచ్చావా?" అంటాడు ఆప్యాయంగా.
పరిమళ నన్ను చూడగానే దిగ్భ్రాంతితో తల మునక లయిపోతుంది. నాకు మర్యాద చెయ్యటం కోపం అక్కడికీ ఇక్కడికీ పరుగులు పెడుతుంది.
నా ఊహలన్నీ తల క్రిందులయిపోయాయి. నేనిక్కడికి వస్తానని నిశ్చయించుకోవటానికి ముందే రావుకు తెలిసిపోయింది.
"పాపా! ఎవరొచ్చారో చూడు!" పరిమళ చేతులు తట్టి పిలుస్తూంది.
నన్ను చూడగానే పాప ముఖం ఒక్క క్షణం పాలిపోయింది. రావు చెయ్యి మరింత గట్టిగా పట్టుకుని, అతని గుండెల్లో ఒదిగిపోయి నిలుచుంది. రావు వంగి పాప చెవులో ఏదో చెప్పాడు. పాప పరుగున నా దగ్గిరకి వచ్చి నన్ను చేతులతో చుట్టేసుకుంది.
ఎంత హాయిగా ఉంది ఆ కౌగిలి!
నన్ను చూడగానే పాప నా దగ్గిరకి రాకపోవటం, పైగా రావు చెప్పాక రావటం నా మనసును కోస్తూంది. అయినా, ఆ క్షణంలో పాపను గాఢంగా అదుముకున్నాను. పాప నా కెంత ముఖ్యమో, దగ్గిర దగ్గిర ముఫ్ఫయి గంటల ఎడబాటు తరవాత ఆ క్షణంలో బాగా తెలిసివచ్చింది.
"పాపా! చెప్పు లేవీ? చెప్పు ల్లేకుండానే మట్టిలో తిరుగుతున్నావా?" మట్టి కొట్టుకుపోయిన పాప పాదాలమీద దృష్టి పడగానే కోపంగా అన్నాను.
పాప బెదురుగా నా వంక చూసి, దీనంగా రావు వంక చూసింది. రావు ఒకసారి నా ముఖంలోకి చూసి తల ఎగరేశాడు. భరింపరానంత తిరస్కారం రావు వ్యక్తం చేసే పద్ధతి అది.
నాకు ఒళ్ళు మండిపోయింది.
"వెళ్ళు! వెంటనే వెళ్ళి చెప్పులు తొడుక్కురా!"
పాప తల దించుకుని వెళ్ళిపోయింది.
రావు వంక చురచుర చూస్తూ, "చిన్నపిల్లలకి తెలియకపోతే, పెద్ధవాళ్ళకైనా బుద్ధి ఉండాలి!" అన్నాను.
రావు నవ్వాడు అతి నిర్లక్ష్యంగా.
"పెద్దవాళ్ళమైనంత మాత్రాన అందరికీ విచక్షణ జ్ఞానం రాదు."
"ఏమిటి నువ్వంటున్నది?"
"నువ్వన్న మాటలే తిరిగి చెప్పాను."
"తిప్పి చెప్పావు."'
"మాటలు ఒకటే! ఎవరి మానసిక పరిస్థితికి అనుగుణంగా వాళ్ళకి అన్వయ మవుతాయి. అందుకు మరొకళ్ళని బాధ్యుల్ని చెయ్యకూడదు."
"బాధ్యతను దులుపుకోగలిగిన వాళ్ళని ఎవరు బాధ్యులు చెయ్యగలరు?"
"తనధైన బాధ్యత వదులుకోవటం ఎంత అన్యాయమో, తనది కాని బాధ్యత పైన వేసుకోవటంకూడా అంతే అక్రమం."
రచయిత్రిగా ఎంతో పేరు ప్రఖ్యాతులార్జించు కున్నాను. కానీ, రావు ముందు నిలిచి మాట్లాడగలిగే శక్తి నాకు కలగటం లేదు.
పాప వచ్చింది. ముఖం కడుక్కుని, బట్టలు మార్చుకుంది. చెప్పులుకూడా తొడుక్కుంది.
"అమ్మా! ఈ గౌను బాగుందా? అత్త కొని పెట్టింది."
కొత్త గౌను నాకు చూపిస్తూ అంది పాప.
"వెధవ చీటీ గౌను-విప్పెయ్యి."
పరిమళ మనసు కష్టపెట్టాలని నే నా మాట లనలేదు. పాప ఒంటిమీద ఆ నాసిరకం ముతక గౌను చూడగానే ఒళ్ళు కంపరమెత్తంది అప్రయత్నంగానే ఆ మాటలు నా నోటినుండి జారిపోయాయి. ఆ మాటలు పరిమళ కెంత కష్టం కలిగిస్తాయో, రావుకూ, నాకూ మధ్య ఉన్న దూరాన్ని ఎంతగా ఎక్కువ చేస్తాయో కొంచెం ఆలోచిస్తే అనకపోదును. కానీ, ఆ సంయమనం నాకు లేదు. ఉద్రేకం అతి తేలికగా నన్ను వశపరుచుకొంటుంది.
పాప ముఖం ముడుచుకుపోయింది. ఆ పసిమనసు కేం తోచిందో, వెళ్ళి పరిమళ చుట్టూ చేతులేసి నిలుచుంది.
పరిమళ ముఖం ఒక్క క్షణం పాలిపోయినా, అంతలో మళ్ళీ యథా ప్రకారంగా తయారయింది. తన చుట్టూ అల్లుకున్న పాప చేతులను ఆప్యాయంగా నిమిరింది.
ఆ దృశ్యం చూసిన నా మనసు లజ్జతో కృంగి పోయింది. నా కన్నకూతురు ముందు నేను కుంచించుకు పోతున్నాను.
"భోజనాలకు లెండి, శారదా!" వాతావరణంలో నీరవతను చెదరగొడుతూ అంది పరిమళ.
"నాకు అక్కర్లేదు. వెళ్ళి తింటాను."
'తిని వచ్చాను' అని అబద్దమాడినా ఇంతకంటే సౌమ్యంగా ధ్వనించేది.
ఏ వ్యక్తికి కష్టం కలిగించాలని నేను ప్రత్యేకం అలా మాట్లాడానో, ఆ రావు మాత్రం ఏమీ చలించలేదు.
"పరిమళా! మనకి వడ్డించెయ్యి. శారద కోసం స్పెషల్స్ చేసినట్లున్నావు కదూ? త్వరగా వడ్డించు. పాపా! రా!"
పాప పరిమళ కూడా ఉండి కంచాలు పెడుతూంటే, ముగ్గురు కూర్చుని అన్నాలు తింటూంటే, ఎన్నడూ భోజనం ముఖం ఎరగనిదానిలా పాప ఆవురావురుమని తింటూంటే....నాలో అణువణువూ భగ్గుమంది. ఆ కంచం తీసి గిరాటెయ్యాలనే ఆవేశాన్ని అతి ప్రయత్నంమీద నిగ్రహించుకున్నాను.
* * *
