తెల్లవారు ఝామున నీళ్ళ చప్పుడు విని చటుక్కున లేచి కూర్చుంది అరుంధతి. భర్త ఇంకా నిద్రలోనే ఉన్నాడు. అరుంధతి తలుపు తెరచుకుని బయటికి వచ్చి మెడ వేపు చూసింది. మేడ మీద గదిలో శ్యామల వెలిగించిన బెడ్ లైటు సన్నగా వెలుగుతుంది. అరుంధతి మొహం మీదికి క్షణం సంతోష రేఖలు తాండవించి వెంటనే మటుమాయం అయేయి. హరికృష్ణ యధావిధిగా పూర్వం స్నానం చేసే సమయంలో వల్లించే మంత్రాలు కంఠం విప్పి పలుకుతున్నాడు. క్షణం తటపటాయించిన మీదట మేడమీదికి వెళ్లి చెల్లెల్ని కుదిపి కుదిపి లేపింది. చిన్నతనంలో అంటే తను స్కూలు ఫైనల్ చదివే రోజుల్లో చెల్లెళ్ళ ని నిద్దర్లోంచి లేపి వాళ్లతో పేచీ పడేది. ఆ తరవాత పెళ్లి కావడంతో ఒక విధమైన నిర్వేదం ఆవహించి అరుంధతి కి ఉత్తేజం కలిగించే సంఘటనలు కనిపించినా, ప్రసన్నం చేయలేక పోయినాయి. ఈవేళ చెల్లెలి ఘన విజయం పట్ల సంతోషాతిశాయాలు హృదయం లోంచి ఉప్పొంగి చాలాకాలం తరవాత మామూలు మనిషిని చేశాయి.
శ్యామల బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ కళ్ళు నులుముకుని చూసి నమ్మలేకపోయింది. ఏడాది కాలంలో ఇలా జరగలేదు. అక్క మోహంలో ఆనందాన్ని చూడగానే దాని వెనక అంతర్యాన్ని చదివేందుకు ప్రయత్నం చేసి విఫలు రాలైంది. తెల్లవారుతూనే అక్క ఏవో మంచి కబురు తెచ్చింది అని మాత్రం సరిపెట్టుకుంది. "ఎండుకక్కా లేపావు?' అంది మళ్ళీ ముడుచుకు పోయి మంచం మీద వాలిపోతూ.
అరుంధతీ లేవదీసి కూర్చో బెడుతూ "బుద్దిగా కూర్చో. నీకో మంచి కబురు తెచ్చాను ప్రొద్దుటే" అన్నది.
"నాకు నిద్దరోస్తోందక్కా ప్లీజ్! డిస్టర్బ్ చేయకు!"
"చూడు, శ్యామూ , మీ శిష్యుడు బుద్ది మంతుడయేడు."
"నా శిష్యుడా?" ఆశ్చర్య పడ్డది శ్యామల.
"ఆ నీ శిష్యుడే కాకపొతే నా శిష్యుడను కొమంటావా? అదెలా? చూడు, క్రింద స్నానం చేస్తున్నాడు. ఏం ఉపదేశించేవు? తారక మంత్రం లా పని చేసింది!"
"నిజంగానా , అక్కా!"
"ఒట్టు."
"అయితే దారిలో పడ్డాడన్న మాట. నన్ను నిద్ర పోనివ్వక్కా" అన్నది ఆవలిస్తూ.
అరుంధతి క్రిందికి వెళ్ళిపోయింది. అతను టవల్ గట్టుకుని నాయర్ అందిస్తున్న కాఫీని పుచ్చుకుని లోపలికి వెళ్ళిపోయాడు. జగన్నాధం ఇంకా లేవలేదు నిద్ర లోంచి. అరుంధతి కుదిపి కుదిపి లేపింది. అప్పుడు బద్దకంగా లేచాడు అతను కూడా.
"అతను లేచి స్నాన పానాలు ముగించు కున్నాడు. మీరేమిటి ఈ వేళ ఇంతసేపు నిద్రపోయేరు?"
జగన్నాధం విప్పారిత నేత్రాలతో చూశాడు. "ఎవరూ , హరా? ఇంత ప్రొద్దుటే లేచి ఏం చేస్తున్నాడు?' అరుంధతి చేతిని అందుకుని మంచం మీద కూర్చో బెడుతూ , "మనుషు లందరి లోనూ చెడు ఉంటుంది,అరుంధతీ. ఒక చెడు లేనిదే వాడిని మంచివాడనలేరట. కాలేదట కూడా. శ్యామును గురించి నువ్వు అపోహ పడ్డావు. ఆ పిల్ల ఏదో అని ఉంటుంది. లేకపోతె అతను ఇంత త్వరగా మారతాడంటవా? మేము ఎంతో మందిమి ఎన్నో విధాల నచ్చ జెప్పాం. విన్నాడు కాడు. ఏదైతే నేం? మనిషి మాటలతోనే ఎదుటి మనిషి లోని చెడుని తీసెయ గలడని తెలిసింది. ఇదంతా శ్యామల అతని పట్ల చూపిన దయ కాదంటావా?' అని అడిగేడు.
అరుంధతి చిన్నగా నవ్వి ఊరుకుంది.
పొద్దుటే లేవడం, పది గంటల వరకూ తన కార్యక్రమాల్లో మునిగిపోవడం , భోజనం చేసి తన గదిలోకి వెళ్ళడం, సాయంకాలం మూడు గంటల తరవాత కాఫీటిఫిన్ అందుకుని మొహం కడుక్కుని తోటలో కూర్చుని చీకటి పడ్డాక ఇంట్లోకి వచ్చి భోజనం చేసి అరుంధతి కీ, శ్యామల కి, బాబుకీ గుడ్ నైట్ చెప్పడం-- ఇదీ హరికృష్ణ దినచర్య. జగన్నాధం తో సంప్రదింపులు ఆదివారం తప్ప మరో రోజు జరిపేవాడు కాడు. విజయ కుమార్ తో చేతులు కలిపి సుల్తాన్ బజార్ లో మహేశ్వరీ మెడికల్ సిండికేట్ తెరిచాడు. ఇప్పుడు హరికృష్ణ అన్ని క్లబ్బులలో మెంబరు.
చిన్నగా ప్రారంభించిన అతని వ్యాపారం త్వరలోనే లాభాలు తెచ్చుకుని పెద్ద బిల్డింగ్ లోకి మార్చబడింది. జగన్నాధం ఓ రోజున హరికృష్ణ ని పిలిచి అన్నాడు: "ఇంట్లో కూర్చుంటే నాకు అభ్యంతరం లేదు కానీ పరులను నమ్మి వ్యాపారం చేయడం అంత మంచిది కాదు. నీకన్నీ విషయాలు స్టూలంగా తెలుసును. ఆఫీసులో కూర్చుంటే వేలు చూసే నువ్వు లక్షలు చూడవచ్చు. ధనాశ చేత అలా అంటున్నాననుకోకు. నీ రాత మంచిది. నువ్వు బాగుపడి ఇలా వ్యాపారంలో అడుగు పెడతావని నేననుకోలేదు.
"అలాగే" అని ఊరుకున్నాడు హరికృష్ణ.
ఆఫీసుకు వెళ్ళడం ప్రారంబించేక సమయం ఎలా గడిచి పోతున్నదీ అతనికీ తెలిసేది కాదు. రివాల్వింగ్ చైర్ లో సీలింగ్ ఫాన్ కింద ఫైళ్ళ మధ్య తల దూర్చిన మనిషి సాయంత్రం క్లర్స్, టైపిస్ట్ , రేప్రజేంటేటివ్ స్" "గుడ్ నైట్, సర్" అంటుంటే తలెత్తి "గుడ్ నైట్" అనే వరకూ తీరుబడి ఉండేది కాదు. ఒక్కోసారి ఫైళ్ళ లో తల దూర్చగానే "హరీ, ఇక్కడున్నావా? వెతికి వెతికి చాలా అలసి పోయాను. చూడు నా కాళ్ళు ఎలా వాచేయో" అన్న మాటలు ఆలాపనగా వినిపించేవి. అతను పరికించి చూసేవాడు. ఆ స్థానం లో గిరిజ తాండవం చేసేది. ఫైలు మూసేసి ఆఫీస్ రూఫింగ్ వైపు చూసేవాడు. అప్రయత్నంగా నిలదొక్కుకున్నా అతనితో ప్రమేయం పెట్టుకోకుండా కన్నీటి బిందువు ఒకటి జారి పడేది.
"ఆడదాని కోసం విలపించే మగవాడంటే నాకు భలే అసహ్యం, సర్!' శ్యామల ఎగతాళి అతన్ని కుదిపి సరిగా కూర్చోబెట్టేది. వెంటనే అతను లేచి నిలుచుని కారు స్టార్టు చేసి కాలేజీ వైపు పోనిచ్చేవాడు. నాలుగు గంటలకే శ్యామల అతని కళ్ళకి బస్సు స్టాపు లో కనిపించేది ఒక్కోసారి. శ్యామల కి దగ్గరగా తీసుకు వెళ్లి "ఎక్కు" అనేవాడు. శ్యామల మారు మాట్లాడకుండా వెనక తలుపు తెరుచుకుని సీట్లో మరీ వెనక్కి వాలి కూర్చునేది.
హరికృష్ణ మనసు బాగుండనప్పుడు ఇలా చేస్తాడని శ్యామలకి తెలుసు. శ్యామల అతన్ని ముందున్న అద్దం లోంచి చూస్తూ ప్రశ్నించేది: " ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ కారు ఆపి ఎక్కించుకు వస్తారు. లోకం ఏమంటుందో ఆలోచించరేం , సర్?"
అతను మాట్లాడే వాడు కాదు. ఆరు నెలలు గడిచి పోయేయి. శ్యామల ని తీసుకుని ఎక్కడికి వెళ్ళినా అరుంధతీ, జగన్నాధం అడ్డు చెప్పేవారు కారు. హరికృష్ణ పట్ల విశ్వాసం, శ్యామల పై నమ్మకం చాలు వాళ్ళకి.
టాంక్ బండ్ మీద నుంచి చాలా నెమ్మదిగా పోతుంది అతని కారు. సాయంత్రం అయిపోయి కొద్ది సేపు అయింది. అప్పుడే సంధ్య ప్రపంచాన్ని ఆక్రమించుకుంది. చల్లని గాలి ఈ చెవి లోంచి ఆ చెవిలోకి వస్తున్నది.
శ్యామల మేలిముసుగు వేసుకుని వెనక సీట్లో కూర్చుంది. లేక్ లిడో దాటిపోయింది. హుసేన్ సాగర్ క్లబ్బు దగ్గరికి వచ్చి కారు ఆగింది. శ్యామల అతని వైపు ప్రశ్నర్దాకంగా చూసింది. అతను నెమ్మదిగా కారుని లోపలికి పోనిచ్చి పార్కు చేశాడు. శ్యామల అతని వెనకే నడిచి వెళ్ళింది. హుసేన్ సాగర్ పూర్తిగా కనిపించే స్థలం లో కుర్చీలు వేయించి హరికృష్ణ కూర్చుని శ్యామల కి చోటు చూపించేడు. కాస్సేపు ఇద్దరి మధ్యా నిశ్శబ్దం తాండవం చేసింది. శ్యామల దిక్కులు చూస్తూ ఆలోచిస్తున్నది. హరికృష్ణ అడిగేడు. "నీకేం తెప్పించ మంటావు?"
శ్యామల మనసు మరిగి పోతుంది. ఏ ఆధారంతో అతను తన మీద ఇన్ని అధికారాల్ని పెంచుకున్నాడో అవగాహన కావడం లేదు. మగవాడు ఆడదాన్ని ఎంత తేలికగా అర్ధం చేసుకుంటాడో ఆలోచిస్తుంటే అరికాలి మంట శిరస్సు కెక్కుతుంది. క్షణం ఆగి తనని తానె ప్రశ్నించు కుంది. "అతను కారు ఎక్క మనగానే ఆ ఇంద్ర జాలి శక్తులు ఆవరించి తనని విచలితని చేశాయి? కారు ఎక్కని పక్షంలో ఇన్ని ప్రశ్నలకీ, అనుమానాలకీ ఆస్కారం లేదే?"
"నిన్నే, శ్యామలా, ఏం కావాలి నీకు?"
"నాకేమీ వద్దు."
"ఏదైనా నీకు సాప్టు డ్రింక్ తెప్పిస్తాను."
"అంటే మీరు మరేదో త్రాగుటారా?' శ్యామల కళ్ళలో నిస్సహాయ స్థితిలో మెదిలే కన్నీరు గిర్రున తిరిగింది. పెదాల మాటున బలవంతంగా అదిమి వేస్తూ "మీ పక్కన మరో ఆడది ఉండగా మీరు తాగడం అదో డిగ్నిటీ అయితే మీరు పెట్టె ఖర్చులో నాలుగో వంతు పెట్టినట్లయితే మీతో కాలక్షేపం చేసి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మరో రకం ఆడవాళ్ళున్నారు, సర్. నేనే మీకు ఆయుధంగా లభించానంటే అది చాలా అసహ్యకరం అయిన సంగతి. విలస పురుషులకి వంట ఇంట్లో భార్యా ఉత్తమ ఇల్లాలైతే పడకటింట మరోస్త్రీ, డిన్నర్ల కీ, క్లబ్బు లకీ, పార్టీలకీ -- ఇలా వెరైటీ కో మనిషి నీ వినియోగించుకునేందుకు భగవంతుడు మీకు చాలా డబ్బే ఇచ్చేడు. నన్ను ఇంటికి తీసుకు వెళ్ళండి." అంది.
"శ్యామలా!" అతని మొహంలో రక్తం పేరుకున్నట్లయింది: "నువ్వు నన్ను ఇదా అర్ధం చేసుకున్నది?"
"మిమ్మల్ని అర్ధం చేసుకోవాల్సిన అవసరం, ఇంటరెస్టు నాకు లేవు. నేనెవరినో రోజుకు పది సార్లు తర్కించు కుంటూనే ఉంటాను. ఇంతదూరం అనవసరంగా తీసుకు వచ్చేరు."
"శ్యామలా! అయితే?.... అతను అర్దోక్తి లో ఆగి ఆ పిల్ల మొహం వైపు పరిశీలనగా చూడసాగాడు. ఆడదాన్ని ఎక్కడో తాచుతో పోలిస్తే చదివాడు. ఈ వేళ ప్రత్యక్షంగా చూస్తున్నాడు. అతనిలో మంచితనం ఇంకా నిద్ర పోలేదు. తోక తొక్కకుండా జాగ్రత్త పడ్డాడు. "పద, వెళ్ళిపోదాం." అన్నాడు. అతని ఆలోచనలకీ, మనసులో చెలరేగే సంఘర్షణ కీ తట్టుకోలేక అతని చొక్కా తడిసి పోసాగింది. శ్యామల వెనక్కి వాలి కారులోనే నిద్రపోయింది.
పది రోజుల తరవాత శ్యామల అతని గదిలోకి వెళ్లి అతని ఎదురుగా కూర్చుని "మిమ్మల్ని ఒకటి అడుగుతాను , సర్" అన్నది.
"ఏమిటదీ?' ప్రశ్నించేడు హరికృష్ణ.
"మరేం లేదు. అసలు గిరిజ కి పెళ్లి అయిందో లేదో తెలుసుకోకూడదా?"
అతను పేలవంగా నవ్వేడు. "రాజమండ్రి వదిలేసి చాలా కాలం అయింది. అమ్మని చూడాలని పించినా నాకు వెళ్లాలని లేదు."
"దేనికి?"
"పాత జ్ఞాపకాలు నన్ను బ్రతక నివ్వవు!'
"నాన్సెన్స్! ఒకసారి వెళ్లి చూసి రాకూడదూ?"
"లాభం లేదు, శ్యామలా. ఆ పిల్లకి అప్పుడే ఏళ్ళు మించి పోయేయని తండ్రి బాధపడుతుండేవాడు!"
శ్యామల అన్నది: "మనిషిలో ఒక్కోసారి లీలా మాత్రంగా కొన్ని ఊహలు చెలరేగుతుంటాయి. అప్పుడప్పుడవి నిజంగా జరగడం కూడా నేను విన్నాను. నాకెందుకో గిరిజ పెళ్లి కాలేదను పిస్తుంది. మీరు ట్రై చేయకూడదా?"
"నీ దంతా భ్రమ!"
"భ్రమే అని ఎందు కనుకోవాలి? కాలం తో పాటు మనుష్యులూ మారి ఆ పిల్ల ఇంకా ఏ చదువు లోనో, ఉద్యోగం లోనో ఉంటె?"
హరికృష్ణ శ్యామల చేయి చటుక్కున అందుకుని, "చూడు శ్యామలా, రేపు మీ బావని అడిగి మనం ఇద్దరం రాజమండ్రి వెడదామా?' అన్నాడు.
