Previous Page Next Page 
మిధ్య పేజి 16


    హరికృష్ణ తీవ్రంగా అన్నాడు: "మీరు చాలా అపోహ పడుతున్నారు. మా అమ్మ అటువంటిది కాదు. మీరన్నట్లు అసలేమీ జరగలేదు. డబ్బుకి ఆశపడి గిరిజ తండ్రి ఎవరో సంపన్నుడి కిచ్చి పెళ్లి చేస్తున్నాడని మా అమ్మ చెప్పింది."
    "మీరు ఆ విషయం వివరంగా తెలుసుకున్నారా?"
    "చెప్పింది మా అమ్మ కనక తెలుసుకోవాల్సిన పని లేదు."
    "ఓహో!" అని కొంచెం ఆగి మళ్ళీ అన్నది. "హైదరాబాదు వచ్చే ముందు మీరా అమ్మాయిని కలుసుకున్నారా?"
    "లేదు."
    "ఎందుచేత?"
    "తనతో ప్రమేయం లేకుండా ఆ పిల్ల తండ్రి ఇంత దూరం తీసుకు వస్తాడనేది అబద్దం కనక!"
    "అయితే మీరు నిరాశ చేసుకున్నారన్న మాట!"
    "ఒక విధంగా అంతే!"
    "మరి ఈ త్రాగడం దేనికి?"    
    "మనశ్శాంతి కి!?"
    "నిరాశ చేసుకున్నాక ఇంక మనశ్శాంతి అంటూ వేరే ప్రశ్న బయలుదేరదే మరి! త్రాగడం ఫాషను నుకుంటున్నారా? లేకపోతె ఎంత త్రాగితే అంత గోప్పతనం అనుకుంటున్నారా?"
    హరికృష్ణ కనుబొమ్మలు చిట్లించి అన్నాడు. "మీరు మాటిమాటికి అతడెవరో అతనితో పోల్చి నన్ను వేళాకోళం చేస్తున్నారన్న మాట!'
    "పొరబడ్డారు మీరు. శరత్ బాబు సాహిత్యం లో నాకు నచ్చినది ఎక్కువ ఆ పుస్తకమే. దేవదాసు తాగాడన్నా, తందానా లాడాడన్న ఆ పాత్ర సృష్టించిన శరత్ బాబు మీద అపారమైన గౌరభిమానాలు ఒక్క నాటికి పోవు. అసలు దేవదాసు అందుకే పుట్టినా నాకేమీ అభ్యంతరం లేదు. ఇక పొతే మీలాంటి వాళ్లుంటారా? నక్క వాత పెట్టుకున్న విధంగా కనిపిస్తారు నా కళ్ళకి. దేవదాసు చంద్రముఖి ఇంటికి వెళ్ళినా, వేరే చోటికి వెళ్ళినా అతని స్థానం సాహితీ ప్రపంచంలో చాలా గొప్పదని నా అభిప్రాయం. మీలాంటి వాళ్ళు రోజుకు పదిమంది కనిపిస్తారు , సర్, నాకు రోడ్డు మీద."
    "శ్యామలా!" హరికృష్ణ మొహం ఎర్రబడి పోయింది.
    "కోపం దేనికండి, ఉన్న మాట అంటే? డబ్బుంది కదా అని ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటే సంఘం ఊరుకోదు. మీరు పక్కా త్రాగుబోతు , వ్యభిచారి అని టాం టాం చేస్తుంది. భయపడకండి. నేను అనడం లేదీ మాటలు. ఒక మాట అడుగుతాను, చెబుతారా?"
    "అలాగే ."
    "మీకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యం ఉందా, సర్?"
    హరికృష్ణ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. "మీరు నవ్వులాట గా తీసేస్తున్నారు. గిరిజని ఇప్పట్లో మరిచిపోవడం సాధ్యం కాదని పిస్తోంది."
    శ్యామల గంబీరంగా అంది" 'అంత మరిచిపోలేని వాళ్ళు చేతకాని వాళ్ళలా కూర్చోరండి. అసలు విషయాలు కూపీ తీసి సాధిస్తారు. మీరు చేతులు ముడుచు కుంటే కార్యసాధన కాదని తెలియదా?"
    హరికృష్ణ నెమ్మదిగా అన్నాడు." "నామీద మీకింత అధికారం ఎవరిచ్చారు? నేను మీకు  బంధువుని కూడా కానే? నేనంటే మీకెందు కంత అపేక్ష?"
    "ఏమో, నాకదంతా తెలియదు. నాకు తెలిసిందీ తోంచింది చెప్పాను. అపేక్ష, అనురాగం అంటూ మీరు ఉత్ప్రేక్షలు మాట్లాడుతున్నారు. అవంటేనే నిర్వచనం తెలియని దాన్ని నేను."
    "అలా అంటే ఒప్పుకోను నేను."
    "ఎందుకని?"
    "ఒక ఆపరిచిత వ్యక్తీ ని ఇంత విమర్శిస్తారని నేను అనుకోను."
    "అపరిచితమా? అప్పుడే మీరు వచ్చి రెండు నెలలై పోయింది."
    "అయినా ఇప్పటి వరకూ మీరు మామూలుగా మాట్లాడేందు కైనా అయిదు నిమిషాలు కూర్చోలేదు . ఈ వేళ నా మీద ద్వజం ఎత్తేరు. మీ మాటలు నన్ను ముగ్దుడ్ని చేశాయి."
    'సంతోషం , సర్, నేను వస్తాను మరి. అక్క నా కోసం ఎదురు చూస్తుంటుంది."
    "మీరు నన్ను "సర్" అని పిలవడం బాగులేదు. పేరు పెట్టి పిలవండి!"
    "ఏం? సర్ అంటే తప్పిలేదే?"
    "నాకు ఎలర్జీగా ఉంది ఆ మాట!"
    శ్యామల పకపక నవ్వింది. "భలేవారే! మాటలు కూడా ఎలర్జీగా ఉంటాయన్న మాట. నాకువావి వరుస లతో పిలవడం ఇష్టం లేదండి. టెంపరరీ గా అన్నయ్యా అనడం, మావయ్యా అనడం' ప్చ్' నాకు నచ్చదు. ఇక పొతే పేరు పెట్టి పిలవడం అంటారా.... రెండు రోజులు కానివ్వండి. అలాగే పిలుస్తాను.' శ్యామల లేచి వెళ్లి పోతుంటే హరికృష్ణ రెప్ప వేయకుండా చూస్తుండి పోయేడు ఆ దిక్కుగా. ఎంత సంచలనం కలిగించింది పిల్ల! పద్దెనిమిది ఏళ్ళకే ఎంత ఎదిగి పోయింది! ఇంత సూటిగా, నిర్మొహమాటంగా మాట్లాడే మనషుల్లో కల్మషానికి చోటు ఉండదు. ఎంత  తెల్లని వెన్నేలో కనిపిస్తుంది! హృదయం అంతకన్నా మెరిసిపోతూ కనిపిస్తుంది చీకట్లో. తాగేవాళ్ళ పట్ల అసహ్యాన్ని చాలా చిత్రంగా వెళ్ళదీసింది. త్రాగడం.....హారికృష్ణ ఆలోచనలు ఆగిపోయాయి. వేలకు వేలు ఆకాశం మీద నుంచి భూమి మీదకి పడుతున్నాయి కుప్పలు కుప్పలుగా . అవి నీటితో తడిసి క్రమంగా ఆ ప్రవాహం లో కొట్టుకు పోతున్నాయి. పరికించి చూస్తె అవి మామూలు నీళ్ళు కావు....మత్తు పానీయాలు.
    అతను ఆలోచనల్లోంచి తప్పుకున్నాక , చాలా కాలంగా దీర్ఘ వ్యాధితో మంచాన పడి అతుక్కుపోయిన మనిషి కొంచెం స్వాస్థ్యం చేకూరాక పధ్యం తింటే ఆ సమయంలో రోగపు సమయం కన్నా ఎక్కువగా నిస్త్రాణ కలుగుతుంది. నాడులు పని చేయనట్లూ, శరీరం అధీనంలో లేనట్లూ, గాలిలో తేలిపోయి కాళ్ళూ చేతులూ ఊగి సలాడుతున్నట్లూ అనిపించినట్లు అనుభూతిని పొందసాగాడు. శ్యామల రేపిన ఝుంఝు మారతపు ధాటికి అతను వేళ్ళతో సహా పెకిలి వచ్చే ప్రయత్నం లో గడగడ కొట్టుకుంటున్న వృక్ష మహారాజుల అయిపోయేడు. ఆమె లేపిన తుఫానుకు తను సముద్రుడై భీకరంగా ఘోష పెడుతూ ఆకాశాన్నీ భూదేవి ని ఏకం చేసే నిమిత్తం లో తల్లడిల్లి పోయేడు. ఆమె ప్రళయ కాలపు రౌద్ర మూర్తి గా విజ్రుంభించగా అతడు దరిదాపులగు పించని చుక్కాని లేని నావవలె ఒడుదుగుకులకు నిలదొక్కు కోలేక వెర్రిగా కాళరాత్రిలా కనిపించే నిశీధి లోకి చూస్తుండి పోయేడు. కుర్చీలోంచి లేవలేని స్థితిలో అలాగే వెనక్కు వాలి నీరసించి పోయి అరమోడ్పు కనులతో బరువుగా భారంగా ఉచ్చ్వాస నిశ్వాసాలు తీయసాగాడు.
    జగన్నాధం కారు హరన్ అతని రాకని తెలియజేసింది. అతను కారుని లోపల గెరేజ్ లో పెట్టి లాన్ మీద కుర్చీలో ఉన్న హరికృష్ణ వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఈవేళప్పుడు అతడు ఇంటి పట్టున ఉండడం అతనికి మహదానందంగా ఉంది. దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేసి, "హరీ!" అని పిలిచేడు. అతను కళ్ళు పైకెత్తి "ఆ" అన్నాడు నీరసంగా.
    "లోపలికి పద!" జగన్నాధం చేయి అందించేడు.
    ఆ చేతిని ఆసరాగా చేసుకుని అతని వెనకే యాంత్రికంగా కదిలి వెళ్ళేడు. అరుంధతి చెల్లికీ, భర్తకీ, హరి కృష్ణ కీ తనే వడ్డించింది. "ఏం, ఈ వేళ విశేషం కనిపిస్తోంది ఇంట?" అన్నాడు జగన్నాధం నవ్వుతూ.
    "అయన ఎక్కడికీ వెళ్ళలేదు. మీరూ త్వరగా వచ్చేరు. చాలా రోజులైంది నా చేతి భోజనం తిని మీరు. ఈవేళ మనసు పుట్టింది" అన్నది అరుంధతి.
    శ్యామల మాట్లాడకుండా భోజనం చేస్తుంటేజగన్నాధం ఆశ్చర్యపోయేడు. "అంత మాట్లాడే దానివి ఈరోజు మౌనంగా ఉన్నావెం, శ్యామూ?" అని అడిగేడు.
    శ్యామల మాట్లాడకుండా నవ్వి ఊరుకుంది. రాత్రి భోజనాలు ముగిశాక ఎవరి గదుల్లో వారు నిష్క్రమించేరు.
    అరుంధతి భర్త సరసన నిలబడి పందిరి మంచం కమ్మీని పట్టుకుని నేల వైపు చూస్తూ నెమ్మదిగా అన్నది. "ఈ వేళ శ్యామలా, అతనూ వాదించుకున్నారు. ఇదివర కేన్నోసార్లు చెప్పెను అతనితో నీకేమిటి అని. వినిపించుకున్నది కాదు. ఈవేళ అతన్ని నానా మాటలూ అన్నానని నాతొ చెప్పింది. ఇది ఎంత వరకూ పోతుందో నన్న భయంగా ఉంది. మీరు మా శ్యామల ని అపార్ధం చేసుకోవద్దు. అది చిన్న పిల్ల. అమాయకంగా వాగడం తప్ప మరొకటి తెలియదు. రేపు మీ మిత్రుడు ఏదైనా మీతో ఫిర్యాదు చేస్తే ముందు నా చెల్లెలి గురించి నేను విన్న వించుకోవడం న్యాయం . అది....మామూలుగా పద్దెనిమిదేళ్ళకి ఊహలు పెంచుకునే ఆడపిల్ల కాదు.
    "మీరు మమ్మల్ని దయతో చూడాలి!" అన్నది అతని పాదాల దగ్గిర చటుక్కున కూర్చుండి పోతూ.
    జగన్నాధం భార్యని లేవనెత్తి హృదయం లోకి తీసుకుని, "నేను పాపం చేసెను, అరుంధతీ. నీపట్ల నేను చేసిన అన్యాయానికి భగవంతుడు నన్ను క్షమిస్తాడను కొను. శ్యామల నీ చెల్లెలు. కానీ....ఆ పిల్ల నాకు కూతురు కన్న మించిపోయింది. నువ్వు బెంగ పెట్టుకోకు. మిమ్మల్నే నిర్దయగా చూస్తె నాకు వేరే నరకం సంప్రాప్తం అవుతుందను కొను.' అన్నాడు. అప్పటికే అతని గొంతు గాద్గాదికం అయి కన్నీళ్ళ పొరలు ఆశ్రయించు కోవడం అరుంధతి గమనించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS