
శ్యామల మౌనంగా ఉండిపోయింది.
మరునాడు జగన్నాధం రాగానే హరికృష్ణ అతని గదిలోకి వెళ్ళాడు. జగన్నాధం తలెత్తి ప్రశ్నార్ధకంగా చూశాడు. హరికృష్ణ కుర్చీలో కూర్చుని నెమ్మదిగా అన్నాడు. "రేపు నేను రాజమండ్రి వెళ్ళాలను కుంటున్నాను. వెంట శ్యామల ని పంపిస్తావా?"
జగన్నాధం స్వచ్చంగా నవ్వాడు. "నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది, హరీ. మన సంఘం మన పట్ల కొన్ని ఆంక్షలు విధించింది. క్లబ్బుల్లో, పార్టీల్లో తిరుగుతూ పాశ్చాత్యనాగరికత ని ఒంట బట్టించుకున్న నేను శ్యాము నీతో ఎక్కడికి వచ్చినా అభ్యంతరం పెట్టలేదు. శ్యామల తండ్రి నిప్పులు కడిగే శ్రోత్రియుడు. లేమితో బాధపడుతున్నారని చూస్తూ చూస్తూ అవినీతికి పాలుపడరు ఎవరూ. మన సంప్రదాయాలు మన అణువణువున ప్రవహిస్తున్నాయి. వాటిని కాదనలేం. శ్యామలా, నువ్వు కలిసి పొరుగూరు వెళ్లేందుకు నిరభ్యంతరంగా మన సమాజం ఒప్పుకోదు. చిలవలు పలవలు అల్లి ప్రచారం చేస్తుంది.
"ఒక్క మాట. ఈ ఊళ్ళో నే నీ వెంట శ్యామల వచ్చినందుకు నలుగురూ నాలుగు రకాలుగా అనుకోవడం నేను ఎరుగుదును. వినివిననట్లు ఊరుకున్నాను. మన స్నేహాన్ని, ఆ పిల్ల పట్ల వాత్సల్యాన్ని వదులుకోలేను నేను. స్త్రీ గురించి సంఘం చేసే నిందారోపణలకి కారణం లేకుండా నేను విని ఊరుకోలేను. శ్యామలని నీకు తీసుకు వెళ్లాలని మనసు గట్టిగా నొక్కి చెబితే నేను కాదనను. ఇందుకు వాళ్ళ వాళ్ళ అవసరం కూడా లేదు!"
"అవును, జగన్నాధం . శ్యామల లేకుండా నేను అంత దూరం ప్రయాణం చేయలేను." హరికృష్ణ చాలా గుంభనంగా మాట్లాడేడు. "అమ్మతో విషయం చెప్పి పిల్లని చూపించాలని." హరికృష్ణ దగ్గరగా వచ్చి అతన్ని కౌగలించు కున్నాడు జగన్నాధం.
"నిన్ను నేనెప్పుడూ అపార్ధం చేసుకోలేదు హరీ. శ్యామల ని నీ వెంట పంపించటం నాకు అభ్యంతరం కాదు. కానీ.... నీ కన్నా యోగ్యుడు దొరుకుతాడని నేననుకోలేను. మన స్నేహాన్ని ఇంతకన్నా పటిష్టం చేయగల మార్గం మరొకటి లేదు. నిన్ను వదులుకోవాలని లేదు, హరీ. రాజమండ్రి లో నిన్ను చూసినప్పుడే శ్యామల గుర్తు వచ్చింది నాకు. నిన్ను దారిలో పెట్టి సక్రమంగా నడిపించగలదనే నమ్మకం తోనే నీతో స్నేహాన్ని పెంచుకుంటూ వచ్చెను."
హరికృష్ణ మనసు క్షణం గతాన్ని తొంగి చూసింది. ఆ రాత్రి అతను ఫస్టు క్లాసు కంపార్టు మెంటు లో మొట్టమొదటి సారిగా జగన్నాధాన్ని చూశాడు. తాగి మంచి నిషాలో ఉండగా టికెట్ కలెక్టర్ చెప్పే మాటలు వినిపించుకోకుండా ఎక్కడో అగాదాల్లోంచి లీలగా వినిపిస్తుంటే సమాధానం ఇవ్వలేని స్థితిలో జగన్నాధం అప్ర్తుడులా ఆదుకుని ఇంటికి తీసుకు వచ్చేడు. అ తరవాత తెలిసింది అది సూర్యానారాయణ ఉంటున్న ఇల్లని, అతను ఆజన్మ బ్రహ్మచారిగా లంకంత ఇంట్లో కాలం వెళ్ళబుచ్చుతున్నాడని. క్రమంగా జగన్నాధం తనని విడవ కుండా అంటి పెట్టుకోవడం, తరవాత విజయ కుమార్ తో పార్టనర్ షిప్ ఇప్పించి పైకి తీసుకు రావడం గుర్తుకు వచ్చేయి.
ఆ తరవాత అతను నెమ్మదిగా తన గదిలోకి వెళ్లి పోయేడు.
ఆ రాత్రి అరుంధతి అడిగింది భర్తని" "మీరు నన్ను అపార్ధం చేసుకోవద్దు. మా చెల్లిని అతని వెంట పంపితే పది మంది ఏమంటారు?"
అతను భార్య వైపు ప్రశాంతంగా నవ్వుతూ చూశాడు.
"మీరు మాట్లాడడం లేదు. అది చిన్నపిల్ల. అతను అందగాడు. పరాయి మగవాడిని గురించి అలా ప్రశంసించే పరిస్థితి రావడం నా దురదృష్టం. అతను మంచివాడో, కాదో అనవసరం. కీడెంచి మేలేంచడం ధర్మం కాదంటారా?
"మీరే ఆజ్ఞాపించి మా చెల్లెల్ని పంపుతే కాదనను. కానీ....' అరుంధతి చిట్టి బాబు తల మీద చేయి వేసి ఆగిపోయింది.
"ఇదే మీ బిడ్డ అయితే పంపెవారా అని అడుగుతావు. ఖచ్చితంగా చెప్పాలంటే పంపను. కానీ, శ్యామల నా బిడ్డ కాదు. అందుకే హరికృష్ణ తో పంపదలుచుకున్నాను."
"ఏమండీ!" అరుంధతి కంగారుగా చూసింది అతని వైపు.
"శ్యాము నా బిడ్డ కన్నా ఎక్కువే, అరుంధతీ. హరికృష్ణ నాతొ అన్నాడు తను పెళ్లి చేసుకుంటానని."
అరుంధతి తల దించేసుకుంది. జగన్నాధం పట్ల క్షణం క్రితం మెదిలిన త్రునీకారభావానికీ, ఇప్పుడు ఈ క్షణం లో కలిగిన పూజ్య భావానికీ సామ్యం కుదరక సిగ్గు పడిపోయింది.
మరునాడు సాయంకాలం రాజమండ్రి వెళ్లేందుకు శ్యామల సిద్దపడింది. బావ ఇష్టపడి పంపుతుంటే అందులో తను సందేహించవలసిన అవసరం లేదు. ఇంతే తెలుసును ఆ పిల్లకి. హరికృష్ణ హుషారుగా బెడ్డింగ్ సర్దుతూ, పెట్టె సర్దుతుంటే చిన్న పిల్లలు జ్ఞాపకం రాసాగారు. స్టేషన్ వరకూ వెళ్ళింది అరుంధతి భర్తతో. చెల్లెలూ, హరికృష్ణ రైలులో దూరం అవుతుంటే ఆమె మనసు ఆనందంతో ఉరకలు వేయసాగింది. తన తండ్రి స్థితినీ,తన పరిస్థితి ని తెలుసుకున్న అరుంధతికి చెల్లెలు సరైన ఈడూ జూడు కలిసి, ఐశ్వర్యాన్ని కౌగలించుకున్న మన్మధుడి లాంటి భర్తని పొంద గలిగినందుకు ఉప్పొంగి పోయింది. "మీ ఋణం ఈ జన్మకి తీరేది కాదు. మీరు ఎంత మంచివారు! దేవుడు ఎక్కడో ఉన్నాడనుకునేదాన్నిఇన్నాళ్ళూ. కానీ, ఇప్పుడు ఇక్కడే మీలో కనిపిస్తున్నాడు.' అన్నది భర్త భుజం మీద వాలుతూ.
అతను కారుని మలుపు తిప్పుతూ ఎడం చేయి భార్య శిరస్సు మీద వేశాడు. అతని హృదయం లో ఘన పదార్ధాలు కరిగిపోయి అతన్ని మనిషిని చేశాయి. ఆడపిల్ల కన్నవారికే కాదు, కొంతవరకూ బాధ్యత ఉన్న ప్రతి మనిషి కీ గుండెల మీది కుంపటే. ఆతను భార్యకి నిర్లిప్తంగా జవాబు చెప్పాడు: "ఇందులో నాదేమీ లేదు. అరుంధతీ. పసిపిల్లాడికి తల్లిని మరిపించేవు. స్త్రీ ని అనిపించుకున్నావు. మీరెంత త్యాగశీలురో ప్రతి నవలా చదివి చూడు. మన సమాజంలో ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబీకుల్లో పెరిగి కోరికల్ని ఎదుటి వ్యక్తుల కోసం చంపుకున్న ప్రతి స్త్రీ ఎంతటి మహోన్నుతూరాలో ఆలోచిస్తే మగవాడెందుకు పనికి వస్తాడోయ్! దైవం....దైవం ఆడదాన్ని సృష్టించి తన రూపాన్ని కొంత ధారపోసి మగవాడికి ఏమీ లేకుండా చేశాడు. నువ్వు అనవసరంగా నన్ను ఆకాశాని కేత్తుతున్నావు."
"లేదు. నాకదంతా తెలియదు. మీరు మాత్రం మామూలు మనిషి కాదు. "రోజులు గడుస్తున్న కొలదీ అరుంధతి జగన్నాధానికి మరింత దగ్గిర కాసాగింది. పెళ్లి అయిన కొత్తలో కలిగే భయభీతులు ఇప్పుడంతగా లేవు. హరికృష్ణ , శ్యామలా ఆ ఇంట ప్రవేశించాక భార్యాభర్త లిద్దరూ ఆత్మీయులుగా , స్నేహితులుగా ఒకరి నొకరు విడరాని బంధాలుగా కనిపించ సాగేరు. కారు మరో మలుపు తిరిగి ఇంటి దగ్గిర ఆగింది.
* * * *
మూడేళ్ళు దాటిపోయేక ఇంటి ముందు మహాలక్ష్మీ లాంటి పిల్లతో కాలు పెట్టిన కొడుకుని చూసి మహేశ్వరి ఉబ్బి తబ్బిబ్బై పోయింది. తన కొడుకు, తన గారాబాల పంట వెంట మరో శ్రీదేవిని తీసుకు రావడం ఆవిడ అంతరంగం లో సంతోషం సాగర మధనం చేయసాగింది. ఆవిడ ఎవరీ పిల్ల అని అడగలేదు. రెండు చేతులూ చాపి, "రా, తల్లీ!' అని ఆహ్వానించింది. శ్యామల నిశ్శబ్దంగా ఆవిడ చేతుల్లో ఇమిడిపోయింది. హరికృష్ణ తల్లిని చాలా కాలం తరవాత చూసి ఆవిడ బెంగతో, బాధతో ద్రిగ్గుల్లి మానసికంగా వ్యాధిని కొని తెచ్చుకుని కొంత శరీరానికి ఒప్పగించిందనీ , అందుకే ఉన్న ఏళ్ళకి మరో పదేళ్ళు ఎక్కువగా ఉన్నట్లు అగుపిస్తున్నదనీ గ్రహించి లోపలికి వచ్చేక తల్లి పాదాల దగ్గర కూర్చుండి పోయేడు. రోజులు గడవడం, మనుష్యుల మధ్య రాకపోకలు అవరోధాలు ఏర్పడడంతో ఈవేళ ఒకరి కొకరు కొత్తవారిగా గతంలో ముఖ పరిచయం ఉన్న వ్యక్తులు తిరిగి తారస పద్దట్లుగా తోస్తున్నారు. మహేశ్వరి కళ్ళ నీళ్ళతో శ్యామల వైపు తిరిగి ఫిర్యాదు చేసింది. "చూడు, తల్లీ. ఆవేశం లో వెళ్లిపోయేడు కానీ నేను కారణం కాదు కదా దీనికి? నన్ను చూసేందుకేం ? వేడిని పెంచి పెద్ద చేసి ఎందులో లోటు రానిచ్చేనని నామీద అలక పూని ఇటు రావడం మానేశాడు? న్యాయం ఉన్నదా ఇందులో? కన్నతల్లినే నేను!"
శ్యామల తల్లి వైపూ, కొడుకు వైపూ మార్చి మర్చి చూడసాగింది. మహేశ్వరీ కన్నుల్లో దాగని రహస్యం అస్పష్టంగా మెదులుతుంటే నెమ్మదిగా అన్నది. "ఇక్కడ హరికృష్ణ గారి స్నేహితురాలు గిరిజ ఉండేదిట. మీకు చాలా డబ్బున్నది కదా? మీరే ఆ పిల్లకి డబ్బుని ఎందుకు ఇవ్వలేక పోయేరు?"
మహేశ్వరి ఉండేలు దెబ్బ తిన్న మదిరి అయిపొయింది. గురి చూసి విసిరిన ఇనుప గుండు బలంగా వచ్చి గుండెల్లో దూరినట్ల యింది. రెప్ప వేయకుండా శ్యామల వైపు చూస్తుండి పోయింది.
"మీ దగ్గర డబ్బు లేదను కునేందుకు ఆస్కారం లేదు. మీరు అతనికి నెలనెలా పంపే డబ్బుని ఇన్నేళ్ళుగా చూస్తూనే ఉన్నాం. మీరా పిల్లని ఒడిలోకి తీసుకుని మరీ పెంచేరు. ఆ పిల్ల తండ్రితో దేనికి మాట్లాడేరు కాదు?"
దానికీ జవాబు చెప్పలేదు మహేశ్వరి.
