పరమేశ్వరి గిరిజ ను గుండెల్లోకి తీసుకుని, "నీ బ్రతుకు ఇంత త్వరగా ముగిసిపోతుందనుకోలేదు. మీ నాన్న ఆశలు పెట్టుకుని మురిసి పోయినన్ని రోజులు పట్టలేదు. నీ మురిపెం" అన్నది పెద్ద పెట్టున ఏడుస్తూ.
అందరికీ మౌనంగా కన్నీళ్ళ తోనే సమాధానం ఇచ్చింది గిరిజ. ఎవరి దారిన వాళ్ళు రైలెక్కి వెళ్లిపోతుంటే వైరాగ్యం గా భర్తని తలుచుకుని మోకాళ్ళ మధ్య తల దించుకుని కుళ్ళి కుళ్ళి ఏడ్చేది గిరిజ.
* * * *
హాస్పిటల్ లో పని ముగించుకుని ఇంటికి రావడం, సౌదామినికి వంట పనుల్లో సహాయపడటం , రమేష్ తో సాయంకాలం పూట కొద్ది సేపు రాజకీయాల గురించీ, లోకం పోకడ గురించీ, మాట్లాడడం, అతని పిల్లలతో ఆటలాడటం , రాత్రి కాగానే పుస్తకాలు ముందు వేసుకోవడంతో కళ్ళెం లేని గుర్రాల్లా రోజులు టకటక గడిచిపోసాగినాయి. మన్మోహన్ తో వివాహం కేవలం కల మాదిరిగానూ, అతనితో గడిపిన జీవితం భ్రమ మాదిరిగానూ కరిగి కరిగి కాలప్రవాహం లో కొట్టుకు పోయింది. గిరిజ కి అంతరంగం లో ఎప్పుడైనా మన్మోహన్ కదులుతుంటే అతనెక్కడ? దేవుడితో సమానం అయిన మనిషి. అందుకే అందకుండా అంతరిక్షం లోకి ఎగిరిపోయేడు' అనుకునేది.
గిరిజ కళ్ళలో దుఃఖం లేదు. ఆమె మనసు మన్మోహన్ గురించి ఆలోచనలు వచ్చినప్పుడు "నేను ఆయన్ని తలుచుకునేందుకు కూడా అనర్హురాలిని ' అనుకుంటుండేది.
దాదాపు ఏడాది కాలం ఏ సంఘటనా, ఏవిధమైన ప్రాముఖ్య మిచ్చే కనీసపు రోజుని కానీ చూపించకుండా గడిచిపోయింది. గిరిజ దినచర్య లో మార్పు లేదు. చిన్న వయసు లోనే భర్తను పోగొట్టుకున్న ఆ పిల్ల వెడుతుంటే రమేష్ హృదయం మీద విచ్చుకత్తుల్ని విసురుతున్నట్లు అనిపించేది. రమేష్ మొదటి నుంచీ సమాజాన్నీ, లోకాన్నీ ఖాతరు చేయకుండా పెరిగేడు. అతనికీ అభాగ్యపు స్త్రీ పట్ల యెనలేని సానుభూతి అంకురార్పణ జరిగి ఇంతింతై అన్న వతులో పెరిగి వటవృక్షం మాదిరిగా ఎదిగి అతని నవనాడుల గుండా ప్రవహిస్తూ నానాటికీ ఏపుగా పెరిగి ఊడల సహా అతనిలో సానుభూతి తాలూకు చిహ్నాలు పాతుకు పోసాగినాయి. అతను తీరిక దొరికినప్పుడల్లా ఆవిడ గురించే ఆలోచించే వాడు. ఏ ముల్లోకాలు ఎదురు తిరిగినా, బ్రహ్మణ్యం తన పై ధ్వజం ఎత్తినా చెక్కు చెదర కూడదనే పట్టుదలతో చివరికి గిరిజ కి పునర్వివాహం చేయదలిచేడు.'
ఆ సమయం లోనే ఒకానొక శుభ ముహూర్తం లో హరికృష్ణ వ్రాసిన ఉత్తరం అతడికి అందింది. రమేష్ హృదయ సంస్కారం ఎరిగిన హరికృష్ణ ధైర్యం చేసి అతడికే ఉత్తరం వ్రాశాడు.
"శ్రీ రమేష్ చక్రవర్తి కి,
హరికృష్ణ హృదయ పూర్వక నమస్కారతులతో వ్రాయునది. నేనెవరో మీకు ఇదివరకే తెలిసినా వివరాలతో వ్రాయడం నా ధర్మంగా తోచి అలాగే వ్రాస్తున్నాను.
నేనూ, గిరిజా చిన్ననాటి స్నేహితులం. పెద్దేనిమిది పందౌమ్మిదేళ్ళు వచ్చేవరకూ ఇద్దరం విడిపోకుండానే బ్రటుకుదాం అనుకున్నాం. కానీ, కధ మధ్యలో అడ్డం తిరిగింది. మా అమ్మ ఏదో అనడం, నేను పారిపోయి హైదరాబాదు రావడం, గిరిజ తో మామయ్య కలకత్తా వెళ్ళిపోవడం క్షణాల మీద జరిగిపొయినాయి.
గిరిజ ను వెతుక్కుంటూ కలకత్తా నేను వచ్చేసరికి శ్రీ మన్మహన్ తో అప్పటికే ఆవిడ వివాహం స్థిర పడటం కలిసి రాని విధంగా మరోసారి బ్రతుకు చీలిపోయింది. గిరిజ భర్తను పోగొట్టు కోవడం అది నా పాలిట అదృష్టంగా భావిస్తున్నానని అపోహ పడ్డది ఈ ప్రపంచం. అందుకు క్షంతవ్యుడిని. నూరేళ్ళ జీవితం ఇలా బూడిద పాలు కావడం మీవంటి సహృదయుల విశాల దృక్పధంతో ఆలోచిస్తారు కనక మీకీ ఉత్తరం వ్రాస్తున్నాను, మీకు ఇష్టం అయి, గిరిజ అనుమతి అయితే నేను గిరిజని చేసుకునేందుకు సిద్దంగా ఉన్నాను.
ఇందులో నేనేమైనా అతిక్రమించి వ్రాస్తే అందుకు మీరు స్నేహపూర్వకమైన అనురాగంతో నన్ను క్షమించమని కోరుకుంటున్నాను.
ఇట్లు,
--వేముల హరికృష్ణ.
ఉత్తరం ఒకటికి రెండు సార్లు చదివేడు రమేష్. అతని మనసు సంతోషంతో తేలిక కాసాగింది. తనమీద ఇన్నాళ్ళూ ఉన్న బరువు ఏదో ఒక్కసారిగా దించినట్లు అయింది. అతను భార్యకి చదివి వినిపించగానే ఆవిడ కూడా ఆనంద పడ్డది.
సాయంత్రం గిరిజ రాగానే కాఫీ అందించి చిన్నగా నవ్వింది సౌదామిని. చాలా కాలం తరవాత గిరిజ ని చూసి స్నేహంగా ఆవిడ నవ్వగానే గిరిజ సందేహంగా చూస్తూ "మీవాళ్ళు ఎవరైనా ఉత్తరం రాశారా, అక్కయ్యా?" అని అడిగింది.
సౌదామిని మరోసారి నవ్వి తల ఆడించి, "ఆ మా మరిది రాశారు' అన్నది ఖాళీ కప్పు అందుకుంటూ.
గిరిజ కనుబొమ్మలు ముడి పడి పోయేయి. అనుమానం గానే అడిగింది, "అయితే మీకు అప్పచేల్లెళ్ళు ఎంత మంది?" అని.
సౌదామిని వెళ్ళిపోతూ , "చూడు , గిరీ, మీ బావ గారు నిన్ను మేడ మీదికి పంపించ మన్నారు. మొహం కడుక్కుని వెళ్ళు" అన్నది గిరిజ అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండానే.
గిరిజ అయోమయంగా చుట్టూ చూస్తుండి పోయింది చాలాసేపు. రమేష్ పెద్ద కొడుకు వచ్చి పిలవగానే తెప్పరిల్లి మేడ మీదికి బావగారు ఉన్న గది లోకి అడుగు పెట్టింది బితుకు బితుకుగా.
ఎదురుగా ఉన్న కుర్చీ చూపించి చాలాసేపు మౌనంగా ఉండిపోయేడు రమేష్. అతనికి ప్రళయాన్ని ఎదుర్కోగలనా? అన్న సందేహం ఏర్పడ్డది. గిరిజ అహో రాత్రులు శ్రమించి చదువుతున్నదంటే తనని తాను మరిచి పోయేందుకే అని అతడు గ్రహించక పోలేదు. ప్రేమానురాగాల కన్నా ఎన్నో రెట్లు విలువైన ఆరాధన ముందు ఏ శక్తీ నిలవలేదని అతడు గిరిజ ని చూసినప్పుడు గ్రహించేడు. అంతర్లీనంగా నేనీ మాట అంటే గిరిజ ప్రచండ రూపం దాల్చదు గదా' అనుకున్నాడు కూడా. టేబిల్ కి దగ్గరగా ఉన్న రివాల్వింగ్ కుర్చీ లో అతడు కూర్చుని బల్ల మీద గాజు పేపర్ వెయిట్ లో రంగుల్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు నటిస్తూ ఆలోచిస్తున్నాడు. నిశ్శబ్దాన్ని భంగ పరుస్తూ "మీరు పిలిచేరుట" అన్నది గిరిజ "ఎందుకూ?" అన్న ప్రశ్న ధ్వనించేటట్లు.
అతను తలెత్తి ఆమె మొహం లోకి వాత్సల్యంగా చూశాడు. "ఔనమ్మా, పిలిచెను. నీతో ముఖ్య విషయం ఒకటి మాట్లాడేందుకు రమ్మని కబురు చేశాను. వింటావా?"
అతని కంఠం లో సౌమ్యత గిరిజ ని కుదేసి కుర్చీలో కూర్చో బెట్టింది. అతని మమత ఆ పిల్లకి స్వతంత్యంగా ఆలోచించే శక్తి లేకుండా చేసింది. "చెప్పండి" అన్నది నెమ్మదిగా.
"హరికృష్ణ ఉత్తరం రాశాడు గిరీ!' రమేష్ ఈ మాట అని గిరిజ మొహం లో భావాలు చదివేందుకు ప్రయత్నించసాగెడు. ఆవిడ మొహం లో కత్తి వాటుకు నెత్తురు చుక్క లేదు.
'చెప్పమ్మా, హరికృష్ణ ఉత్తరం నువ్వు చూస్తావా?"
గిరిజ రెండు చేతుల మధ్యా మొహాన్ని దాచుకుని బావురుమంది. రమేష్ బిత్తర పోయిన వాడిలా లేచి నిలుచుని గిరిజ కి దగ్గిరగా వచ్చి ఆమె తల మీద చేయి వేసి, "ఇప్పుడే మైంది , తల్లీ! నిన్ను నేనేమీ అనబోవడం లేదు. పూర్తిగా విను." అన్నాడు ఓదారుస్తూ.
గిరిజ కొంచెం సేపటికి ఉపశమనం పొందిన దాని మాదిరి దుఃఖాన్ని దిగమింగేసింది. క్షణం తరవాత చెక్కిళ్ళ మధ్య అన్నది: "మీరు నన్ను ఏ విధంగా అర్ధం చేసుకున్నారో నాకు తెలియదు కానీ నేను.... నేనే పాపం ఎరగను. హరీ, నేనూ ఇరుగు పొరుగు పిల్లలం. పైగా, ఒకప్పుడు స్నేహితులం. బాల్యం లో ఏదో అనుకున్నాం. పెద్దయిన తరవాత జరిగిన దానికి నేనెన్నడూ విచారించ లేదు. ఆయన్ని ద్రోహం చేయాలన్న చింత నాకెప్పుడూ కలగలేదు. నన్ను క్షమించి నా మాట నమ్మండి!'
రమేష్ స్థానం లో మరో స్వార్ధం నింపుకున్న పురుషుడే ఉన్నట్లయితే గిరిజ జీవితం వక్రమార్గం లోకి మళ్ళిపోయేది. కానీ, అతను అందరి లాంటి మనిషి కాడు. వంగ దేశంలో చాలాకాలం ఉండి మహా రచయితల గ్రంధాల్ని క్షుణ్ణంగా చదివి స్త్రీ స్వాతంత్ర్యం పట్ల, స్త్రీ బాగోగుల పట్ల కూలంకుషంగా తన అభిప్రాయాల్ని జోడించి విప్లవాన్ని తీసుకురావాలన్న తలంపుతో ఉన్న మనిషి అతడు.
"నేను నిన్ను నమ్మేను. గిరీ. నువ్వు చెప్పే విషయాల్నీ నేనే నమ్మలేకపోతే ఈ పాపిష్టి సమాజం నమ్ముతుందనుకోకు. నీకు ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది.' అని ఆగి, తిరిగి ప్రారంభించేడు; "భగవంతుడు దయామయుడు. ఒక్కోసారి ఆయనెందు కిలా చేస్తాడో అర్ధం కాదు. ఈలోకం ఉన్నది చూడు, తల్లీ, విష నాగులున్న పాము పుట్ట లాంటిది. సమయం చూసి కాటు వేయాలను కుంటుంది. ఆడది ఆబల అని బాగా తెలిసి ఉండడం వల్ల అణగదోక్కేయాలని ప్రయత్నిస్తుంటుంది. అందులో నువ్వు అందమైన దానివి. ఇలా చెప్పాల్సి వచ్చినందుకు నాకు కష్టం గానే ఉంది. అయినా తప్పదు. తండ్రికి కూతురి సౌందర్యం పట్ల ఉన్న సద్భావం తప్ప నాలో మరో దురుద్దేశ్యం లేదు. నిన్ను ఈ సమాజం హయిగా బ్రతక నివ్వదు. మన వ్యవస్థ చాలా మారింది. మారుతున్న వ్యవస్థ లో తప్పనిసరిగా చదువుకున్న మనం కూడా మారాలని నా ఉద్దేశం.
