Previous Page
మిధ్య పేజి 33


    "మగవాడికి రెండో పెళ్లి చేసి అభినందించే లోకం ఆడదాన్ని అలుసు చేస్తుంటే నాకు ఏం చేయాలో తెలిసేది కాదు. సంఘాన్ని మరామత్తు చేయబోయే ముందు అది మన ఇంట్లోంచే ప్రారంభిస్తే మంచిదిగా తోస్తోంది.
    "హరికృష్ణ కన్నా యోగ్యులుంటారని నేను అనుకోను. అతనికి అన్ని విషయాలూ బాగా తెలుసును. నీ చరిత్ర తెలుసుకుని సానుభూతి తో నిన్నాదరించబోయే ఆ మనిషి కాదనడం కన్నా అవివేకం మరొకటి ఉంటుందనుకొను. నువ్వతన్ని వివాహం చేసుకోవడం లో తప్పేం ఉందీ?" రమేష్ కంఠ నాళాలు ఆవేశంతో ఉబ్బి ఉన్నాయి. అతడు ఉపన్యాస ధోరణి లో చెప్పుకు పోతుంటే గిరిజ వింటూ కూర్చుంది. ఆమె మనసు ప్రశాంతంగా పారే జల ప్రవాహం లా ఉంది. అందులో ఏ అలజడీ లేదు.
    "నువ్వు ''ఊ' అంటే నేను స్వయంగా నా చేతులతో జరిపిస్తా నీ పెళ్లి. నీకే ఓ అన్నయ్య ఉన్నా అతను ఇలాగే చేసేవాడు. హరికృష్ణ ని రమ్మని రాశాను ఈ వేళ. రాముడు పోస్టు చేస్తున్నాడు. నీ అంగీకారం కోసం ఆగేను. పోస్టు చేయడం విషయం మాట ఎలా ఉన్నా నీకు ఇష్టం అవునో కాదో పదిహేను రోజులు అలోచించి చెప్పు." అన్నాడు.
    దీపాల వేళ కాగానే సౌదామిని మెడ మీదికి వచ్చి దీపం వేసి భర్తకి నమస్కారం చేసింది. అక్కగారి వెనకే గిరిజ కూడా వెళ్ళిపోయింది క్రిందికి.
    రాత్రింబవళ్ళు ఆలోచనల్లో చిన్ననాటి స్నేహం, విధి విడదీయడం, మన్మోహన్ తోటి మూడు నాళ్ళ ముచ్చటైన బ్రతుకు, శాశ్వతంగా సౌభాగ్యాన్ని కోల్పోవడం -- సినిమా రీలు మాదిరిగా మనసులో తిరుగుతుంటే ఇదామిత్తం గా ఏ విషయానికి ప్రాముఖ్య మివ్వాలో అర్ధం కాలేదు. మారుతున్న వ్యవస్థ కోసం తను మన్మోహన్ ని మరిచి పోయి హరికృష్ణ తో ఐక్యం అయిపోగలదా? రమేష్ మనిషి  కాకుండా దైవత్యాన్ని నింపుకుని తన శ్రేయోభిలాషి గా తీర్పు చెబుతుంటే అతని పై ఏమని నింద వేయగలదు?
    రోజులు గడిచిపోతుంటే తను మాత్రం ఏ విషయం తేల్చుకోలేక పోతుంది.
    ఆ సాయంత్రం సతీష్ తల్లితో ఇంట్లోకి రాగానే గిరిజ తో బాటు రమేష్ , సౌదామిని లు కూడా అప్రతిభులయేరు. భోజనాలు పూర్తీ చేసుకుని హల్లో కూర్చున్న తరవాత సతీష్ తమ్ముడి వైపు తిరిగి గంబీరంగా అన్నాడు: "నువ్వు మంచి కోసమో, ప్రగతి కోసమో చేస్తున్న పనులు వ్యక్తిగతం అయినవి కావు, రమేష్ ఒక మనిషి చేయబోయే మంచి చెడులు పూర్తిగా ఆ కుటుంబానికి, ఆ వంశానికి తరతరాల కీ నిలిచి పోతాయి. చేసే ఏ పనైనా ముఖ్యంగా అది చెడు అయితే అది జీడి మరకలా శాశ్వతంగా ఉండి పోతుంది. మన కుటుంబం గురించి ఇప్పటికే కలకత్తా పూర్తిగా న్యూనతగా మాట్లాడుకోవడం నేను విన్నాను. నువ్వు సంస్కారం అనీ, మరేదో పునరుద్దరణ అనీ చేస్తే అవి అంత మంచి ఫలితాలు ఇవ్వవు. నాకు ఎదిగిన పిల్లలు ఉన్నారు. వాళ్లకి పెళ్ళిళ్ళు కావు. నువ్వు దీన్ని స్వార్ధం అంటావు. కానీ...నేనలా అనను. రమేష్, గిరిజ కి నువ్వు మళ్ళీ పెళ్లి చేయడం ధర్మం కాదు."
    "అన్నయ్యా!' రమేష్ తేరుకుని అన్నాడు: "మనూతో ఆ పిల్ల ఎన్నాళ్ళు కాపురం చేసిందో నీకు తెలీదా, అన్నయ్యా? పందిట్లో పెళ్లి భూనభొంతరాలు దద్దరిల్లేటట్లు చేశాం. చేసినంత సేపైనా ఆ పిల్ల సౌభాగ్యం నిలవలేదు. ఇదే మన చెల్లెలయితే ఊరుకునే వాళ్ళమా?"
    "ఊరుకోక ఏం చేస్తాం? మన సంప్రదాయ విరుద్దం అయిన పనులు చేస్తూ కూర్చుంటే మనకీ, పాశ్చాత్యులకీ, భేదం ఏముందీ? వాళ్ళు డైవోర్సు అని ముద్దుగా పేరు పెట్టుకున్నారు. నాదృష్టి లో దీనికీ, వ్యభిచారానికీ   చాలా సంబంధం ఉంది. " సతీష్ ఆవేశంగా అంటుంటే రమేష్ శరీరం లో రక్తం ప్రవాహం లా విజ్రుంభించసాగింది. "ఎంత పొరబడుతున్నావు! దీనికి, వ్యభిచారానికీ సంబంధం ఉన్నదంటావా? అదెలా గన్నయ్యా?"
    సతీష్ అన్నాడు: "భర్తతో తప్ప మరొకరితో తిరిగి సంసారం చేయడం సంప్రదాయ విరుద్దం అది ధర్మం కాదు."
    రమేష్ సాలోచనగా అడిగేడు: "ఏ ధర్మ శాస్త్రం నీకలా బోధించిందో తెలుసుకోవాలనున్నదన్నయ్యా."
    "మన పూర్వికులే మనకి పాఠాలు చెప్పేరు తమ్ముడూ. ఈవేళ ఏటి ఎద్దడి లా విదేశీ అలవాట్లూ, సంస్కారమూ మనల్ని కప్పదాటు వేయనిస్తున్నాయి కానీ ఇది నీతి ధర్మం కాదనీ, పాతివ్రత్యం కాదనీ ఒకళ్ళు చెప్పాలా!"
    చిత్రంగా శబ్దం చేస్తూ నవ్వేడు రమేష్ , "పూర్వికులు అంటున్నా వన్నయ్యా. అది మన తాత ముత్తాతల కి మరి కొంత ముందుకు వెళ్ళడం కాదు. గ్రంధాలు యేమని చెబుతున్నాయి? తార పతివ్రత కాదంటావా? వాలి పోయేక సుగ్రీవుడి తో ఉండి పోలేదా? మరి మండోదరి మాటేమిటి? విభీషణుడు చేసుకోలేదనే అంటావా? ద్రౌపది ఐదుగుర్ని చేసుకునీ లేశ మాత్రంగా కర్ణుడి ను మనసులో ఆరాధించటం పాతివ్రత్యం కాదంటావా? ఇందులో ఏది నీతి, ఏది అవినీతి?"
    "వాళ్ళంతా దేవతా మూర్తులు, రమేష్. నువ్వు తర్కానికి దిగకు."
    "అచ్చా! దేవతలే మనకి దారి చూపిస్తుంటే ఇందులో తర్కానికి వితర్కాలకి ప్రసక్తి లేదన్నయ్యా. ఒక్క మాట. ఈ శతాబ్దం లో మనం ఇంత ముందంజ వేసిన సమాజం లో బ్రతుకుతూ కూపస్థ మండూకాల మాదిరి బ్రతకడం న్యాయం కాదు. ఆడపిల్ల హద్దులు దాటిందంటే అందుకు కారణం మనమే. కొంత వయసు వచ్చి కాపురం చేసి అవినీతి వైపు దారి తీస్తున్నదంటే ఆ పిల్ల కట్టుబాట్ల లోపం అంటాను నేను. మనమేమీ అరణ్యాలలో ఉండడం లేదన్నయ్యా ఋషి పుంగవుల మాదిరి ముక్కు మూసుకుని కూర్చుందుకు. ఉప్పూ కారం తింటున్నంత కాలం శరీరవసరాలు గుర్తించడం న్యాయం. నా దృష్టి లో నేను చేస్తున్న పనిలో అవినీతి కనిపించడం లేదు. మీరు ఈ విషయంలో ఇంకా మాట్లాడదలుచుకున్నా నా అభిప్రాయం మారదు. అమ్మ నీతో రావడంతో అర్ధం ఇప్పుడు గ్రహించెను." అంటూ సిగరెట్ వెలిగించి పొగలు పోగలుగా వదులుతూ సంభాషణ ఆపేశాడు.
    "అయితే ఎప్పుడో తెగిపోయి అతికిన ఈ బంధం ఈ వేళ శాశ్వతంగా తెంపుకోవాలను కుంతున్నావా, రమేష్? అపర్ణ వైష్ణవుడి ని చేసుకుంటే ఇంటికి తీసుకు వస్తే కాదనలేదు మేము. కానీ, ఈసారి......ఇందంత మామూలు విషయం కాదు విదుల్చుకునేందుకు." తల్లి కొడుకు వైపు సూటిగా చూస్తూ అనగానే రమష్ లేచి నిలుచున్నాడు. "నా జీవితమే చిత్రం అయింది. మీకు రావాలని ఉంటె నేనెన్నడూ కాదనలేదు. తెంపుకు'న్నా తెగేవి కావు ఈ బంధాలని నాకు తెలుసు. తల్లితండ్రులూ, కొడుకులూ -- వీటికి మీరు ఎప్పుడూ ప్రాముఖ్యం ఇవ్వలేదు. మీరుగా మీరు కావాలనుకుని తెంచుకునే బందాల్నీ నేనెలా కలపగలను?"
    "నీమాటే కాదు మేము వినాల్సింది. గిరిజ ని కనుక్కోవాలి !" సతీష్ అన్నాడు.
    "కనుక్కోవలసింది ఏమీ లేదు. నా ఇష్టాన్ని ఆ పిల్ల ఎన్నడూ కాదనదు. మీరు ఇందుకే వచ్చినట్లయితే ఇంక సెలవు" అన్నాడు రమేష్.
    గిరిజ ముందుకు రాబోతుంటే సౌదామిని బలవంతంగా లోపలికి తీసుకు వెళ్ళింది. వచ్చిన వాళ్ళు ఇద్దరూ మరో క్షణం కూడా ఉండకుండా వెళ్లి పోవడంతో తాత్కాలికంగా వాన కురిసి వేలిసినట్లయింది.
    గిరిజ అన్నది: నావల్ల మీరు కుటుంబం లోంచి వేరు కావడం , నాకు కష్టంగా ఉంది. మీరెందు కిలా చేశారు?' నేను కలకత్తా వెళ్ళిపోయే దాన్నే!"
    రమేష్ నిశితంగా ఆమె వైపు చూసి, "కలకత్తా వెళ్లి ఏం చేయ దలుచు కున్నావు, గిరీ? నీ బ్రతుకు సవ్యంగా కాలూ చేయీ ఆడినంత వరకే అక్కడికి వెళ్లినట్లయితే. నీ పేర ఉన్న ఆస్తి పాస్తుల్ని అన్నయ్య తన పిల్లల్ని దత్తత చేయించి రాబట్టుకోవాలని చూస్తున్నాడు. మనూ ఉంటె ఆ దారి వేరు. ఇప్పుడు నువ్వు డబ్బు మనిషివి. ఎవరు నిన్ను ఆదుకోవాలని చూసినా అందులో స్వార్ధం ఉండి తీరుతుంది. అందుకే నిన్ను ఓ ఇంటి దాన్ని చేసి మరొక వ్యక్తీ చేతిలో ఉంచితే  ఆ దారి వేరు. హరికృష్ణ ధనవంతుడు. నీ డబ్బుతో అతనికి ప్రమేయం లేదు" అంటూ అపేడు.
    గిరిజ మారు మాట్లాడలేదు. హరికృష్ణ మరో రెండు రోజులలో వస్తున్నాడంటే ఎంతో దిగులుగా, మరెంతో సంబరంగా ఉన్నది. ఇంటిపనీ, బయట పనీ రమేష్ చేసుకు పోతున్నాడు. హరికృష్ణ కోరిక ప్రకారం పెళ్లి హైదరాబాదు లో నిరాడంబరంగా రిజిష్ట్రారు సమక్షంలో జరిపేందుకు రమష్ కూడా మనస్పూర్తిగా ఇష్టపడ్డాడు.
    రెండు రోజులు గడిచేందుకు ఎంతో సేపు పట్టనట్లు అనిపించింది. హరికృష్ణ ఆసాయంకాలం టాక్సీ లోంచి దిగగానే గిరిజ తన కళ్ళని తానె నమ్మలేక పోయింది. ఎత్తుగా, బలంగా , ఆజానుబాహువైన అతడు హరికృష్ణ స్థానం లో ఉన్న మనిషిగా పోల్చుకోలేక పోతున్నది. అతడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడిప్పుడు. దానికి తోడు అతని అంతరంగం ఇప్పుడు చిన్ననాటి దేవేరి జీవిత ప్రాంగణం లో అడుగు పెట్టి తనని అలరిస్తుందన్న తలంపు అతడిని మామూలుకన్నా ఆరోగ్య వంతుడిని చేసింది.
    రమేష్ సాదరంగా ఆహ్వానించెడు. అతను హరికృష్ణ ని కౌగలించుకుని అభినందించేడు.
    వారం రోజుల కాలంలో హరికృష్ణ, గిరిజ ల మధ్య స్నేహం పటిష్టమై పోయింది. హరికృష్ణ సమక్షం లో సర్వమూ మరిచిపోయి సుఖ సంతోషాలని కౌగాలించు కునేది. ఈ రోజులు శాశ్వతం కావలనుకునేది. మన్మోహన్ గుర్తుకు రాగానే నీరుకారి పోయేది.
    శ్యామల టెలిగ్రాం పంపింది గిరిజ కి అభినందన లతో. మహేశ్వరి ప్రేమగా ఉత్తరం వ్రాసింది.
    మద్రాసు రైల్వే స్టేషన్ జనంతో కిటకిట లాడి పోతుంది. ఎవరికి వారే రైలు రాక కోసం ఎదురు చూస్తున్నారు. రమేష్ కళ్ళలో ఆనందానికి సరిహద్దులు కనిపించడం లేదు. సౌదామిని చెల్లెలికి దగ్గరగా నిలుచుని పరిహాసంగా ఏదో అంటుంది. రైలు పెద్దగా కూత వేసుకుంటూ దడదడ లాడుతూ మలుపు తిరిగి పట్టాల మీదికి వస్తుంది. హరికృష్ణ లాలనగా చేయి అందుకున్నాడు.
    ఆ క్షణం లో గిరిజ మనో వీధి లో మన్మోహన్ కదిలినట్లు అరమోడ్పు కనులు స్పష్టం చేశాయి. మిధ్యావస్థలో ఉన్నదానిలా ఆగిపోయింది అతని చేతిలో చేయి ఉంచి.
    ఇంతవరకూ చెప్పి లక్ష్మీ కాంత్ ఎదురుగా ఉన్న తన క్లబ్సు మేట్స్ తో అన్నాడు:"ఇది మా నాన్నగారు బెనర్జీ చెప్పిన అక్షరాల జరిగిన కధ. ఆ తరవాత ఆవిడ రైలు ఎక్కిందో లేదో ఆయనకి కనిపించలేదు. ఈ కధ వింటుంటే అప్పుడప్పుడు వాళ్ళందర్నీ చూడాలని ఉంటుంది!" అతని కళ్ళు అశ్రుపూరితా లయేయి. "వింటుంటే నాకైతే బాదే అనిపించింది సుమా. మీకెలా ఉంది?' అన్నాడు కర్చీఫ్ తో కంట తడి తుడుచుకుంటూ.
    అతను కళ్ళలో నలుసు మిషతో చేతిని అడ్డం వేసుకుని, "కధ చాలా బావుంది" అన్నాడు.
    "మీ నాన్నగారు చూశారా?' అన్నాడు తిరిగి అతనే.
    "ఆ కొన్ని సంఘటనలు ప్రత్యక్షంగా, మరికొన్ని పరోక్షంగా చూశారు. నాకు చెప్పేరు. కధ కామెడీయో , ట్రాజెడియో తెలియకుండా మిధ్యగా మిగిలిపోతే ఏమనిపిస్తుంది?' అని ప్రశ్నించాడు.
    అతను తలెత్తి లక్ష్మీ కాంతం వైపు చూసి "నువ్వు చాలా చిన్నవాడివి అయినా నిజం ఇలా ఉన్నదున్నట్లు చెబుతుంటే మూడు గంటలు బోర్ అనిపించలేదు సుమా! ఆ అన్నట్లు నేను.....నేనెవరో మరిచిపోయావా?" అన్నాడు లేచి నిలుచుంటూ.
    లక్ష్మీ కాంత్ నోరు తెరిచేసుకున్నాడు క్షణం. 'అయితే హారికృష్ణ ....మీరు...మీరే నన్న మాట! అయితే గిరిజ....ఆవిడ....ఆవిడ ఏమయ్యేరు? మీతో రాలేదా?"
    అన్నిటికీ సమాధానంగా అతను నవ్వాడు . అంతే.

                                 (సమాప్తం)


 Previous Page

WRITERS
PUBLICATIONS