
"ఇంకా నా మీద కోపం పోలేదా, తల్లీ? నేను చేసింది తప్పని ఒప్పుకుంటూనే ఉన్నాను. నా కొడుకు బ్రతుకుతాడనే ఆశ లేకుండా పోయింది. గుండెని జరిపి ఆపరేషన్ చేస్తే ఆ మనిషి మీద ఎంత ప్రాణం పెట్టుకో గలను! నువ్వు రాకపోతే వాడు నా మొహం చూడడు. నీకు పుణ్యం ఉంటుంది." మహేశ్వరి ప్రాదేయపడుతుంటే గిరిజ మనసు చిత్రంగా నవ్వింది. "ఏం మనుష్యులు , అనుకుంటూ. "బావ వచ్చేక చెప్పి వస్తాను. మీరు ఇక్కడే ఉండండి." అన్నది.
మహేశ్వరి కళ్ళలో కోటి మేర్క్య్యురీ లైట్లు ఒక్కసారిగా వెలిగేయి. హరికృష్ణ చావు బ్రతుకుల గురించి మదన పడుతున్న ఆవిడ మనసులో అంతర్గతంగా ఏదో శక్తి కొడుకు మృత్యువు ని జయిస్తాడని చెబుతుంది. సౌదామిని విషయం విని వచ్చింది. మహేశ్వరి కి నమస్కారం చేసి, "ఇప్పుడే గిరిజ చెప్పింది. నేను చెప్పినా, అయన చెప్పినా ఒకటే, వెళ్లి రమ్మంటుంటే వింటున్నది కాదు. అయిదు నిమిషాల్లో వచ్చేస్తారు. భోజనం కూడా సిద్దమయింది. పూర్తీ చేసి వేడుదురు గాని" అన్నది స్నేహపూర్వకంగా.
మాటలోనే రమేష్ వచ్చేడు. పరిచయాలు పూర్తీ అయేక గిరిజ వైపు తిరిగి, "పని పూర్తయి పోయింది కనక వెంటనే వచ్చేయ గలిగెను. ఒకవేళ....ఈ రాత్రి రాకపోయినా నా కోసం వెళ్ళకుండా ఉండి అక్కడ పేషెంట్ ని నిర్లక్ష్యం చేసేదాని వేనా?" ఈ విషయం లో కూడా నా అనుజ్ఞ కావాలా?" అన్నాడు.
శ్యామలా, మహేశ్వరీ, గిరిజా భోజనాలు పూర్తీ చేసి బయలుదేరారు.
చాలా ప్రమాద కరమైనదే ఆపరేషన్. హరికృష్ణ బ్రతుకుతాడో లేదో? గిరిజ మనసులో పరిపరి విధాల ఆలోచనలు బయలుదేరుతున్నాయి. ఒకవేళ హరికృష్ణ కే ఏదైనా......'భగవంతుడా! అలా జరుగనివ్వకు!' అని కోటి దేవుళ్ళ కి మొక్కు కుంటుంది. హరికృష్ణ దిగజారి పతనం అయిపోయేందుకు కారణం తనే. మనస్సాక్షి లేచి నిలుచుని గిరిజ ని అసహ్యించు కుంటుంది. అంతరాత్మ దిగంతాలకి జారిపోయి ద్రిగ్గుళ్ళీపోతుంది. "నువ్వే కారణం' అంటూ అదృశ్య శక్తి ఎత్తి పొడుస్తుంది. హరికృష్ణ రూపం జాలిగా అర్ధిస్తుంది. ప్రేమగా ప్రాధేయపడుతుంది. అనురాగాన్ని కళ్ళలోకి చొప్పించి ఆరాధిస్తూ కనబడుతోంది. గిరిజ పరుగెడుతున్న కారుకన్నా తీవ్రంగా గతంలోకి పరుగులు పెడుతుంది. ఏనాటి స్నేహం! స్నేహం ద్వేషంగా ఎలా మారగలిగింది?........
'నువ్వు మాట్లాడాలి. లేకపోతె నేను ఆడను. నీతో జత ఉండను!" హరికృష్ణ సపోటా చెట్టు క్రింద ముడుచుకుని కూర్చున్న గిరిజ ని అడుగుతున్నాడు.
గిరిజ మరింత బిగుసుకు పోయింది.
"నీకేం జరిగింది? నిన్నెవరేమన్నారు? వాళ్ళని ఉండేల్ దెబ్బతో "టా" అనిపిస్తా! పద్నాలుగైనా నిండని హరికృష్ణ రాతీ మీద చేయి వేసుకుని స్త్రీ ఎదుట పురుషుడు భరోసా ఇచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఫక్కుమని నవ్వింది గిరిజ.
'దేనికి నవ్వుతావు?" అతడు అడిగేడు ఉలిక్కిపడి.
"భలే! పెద్ద మొనగాడు బయలుదేరాడు. ఉండేల్ దెబ్బ పిట్టకు కూడా సరిగా తగల్దు గానీ!' క్రింద పడి నేలమీద పొర్లుతూ నవ్వుతుంటే చిరాకు పడుతూ జడ పట్టుకుని లేవదీసి కూర్చోబెట్టి , "ఏది , మళ్ళీ అను. పిట్టలకి తగలవూ నా రాళ్ళు?" అన్నాడు ఉడుక్కుంటూ. "ఒక్కసారి కాదు, చాలాసార్లు అంటాను. నీ రాళ్ళు తగలవు, తగలవు, తగలవు.'
అతను ఉండేల్ కర్ర క్రింద పడేసి "మరోసారి ఆ మాట అన్నావంటే నిన్ను తన్ని తగలేస్తాను, జాగ్రత్త!' అనేసి వెళ్లిపోయేడు.
సాయంత్రం కాగానే తండ్రితో ఒంటరిగా వెళ్ళింది తోట వైపు. అక్కడ నిశ్చలంగా కూర్చుని ఉన్నాడతను. మామూలుగా అయితే ఆ సమయంలో అక్కడ తను కూడా ఉండేది. కంటికి కనిపిస్తే తన్ని వెళ్ళ గోడతాడెమోననే భయంతో ఆ ప్రాంతానికే వెళ్ళింది కాదు. తనని చూడగానే పరుగున వచ్చి చేయి అందుకుని బయలుదేరాడు....
ఒంటరిగా గిరిజ ఎన్నడూ ఎక్కడికీ వెళ్ళలేదు. హరికృష్ణ తోడూ కాగా అతని నీడలో నడిచేది. కానీ కాలం తారుమారు చేసింది. రాతలు వేరయ్యేయి. బ్రతుకు బాటలో చీలిపోయేరు. గిరిజ కారు కుదుపు ఇవ్వగానే తాత్కాలికంగా మేలుకుంది. వెనువెంటనే జారిపోయింది గతించిపోయిన కమనీయ స్మృతులలోకి..........
గిరిజ ముందు నడుస్తుంది, చేతినిండా ఇసక పోసి అందులో నాలుగైదు పుల్లలు గుచ్చి, అతను వెనకే నిలుచుని కళ్ళు మూసి నడుస్తున్నాడు. మరో అడుగు పడిందంటే తిన్నగా పుట్ట మీద పడగ విప్పిన నాగేంద్రుడి మీదప్ పడేది. ఒక్క విసురుతో గిరిజ ని వెనక్కి తోసేశాడు. గిరిజ తిడుతూ ముళ్ళ కంపల్ని విదిలించు కుంటుంటే అతను మౌనంగా తిట్లన్నీ భరించేడు. గిరిజ ఉక్రోషంతో ఏడుస్తుంటే దగ్గరగా వెళ్లి ఎదురుగా పడగ విప్పి నాట్యం ఆడుతున్న నాగుపాము ని చూపించి, "ఒక్క అడుగు ముందుకి వేస్తె ఎంత పని జరిగేదో చూడు' అన్నాడు శాంతంగా.
అప్పటి ఆనందం లో అతని మెడ చుట్టూ చేతులు వేసి అక్కడ ప్రేమగా పెదాల్ని ఆన్చి "నువ్వెంత మంచి వాదివి౧' అన్నది....
గిరిజ మరో కుదుపు కి లేచి యదా లోకం లోకి వచ్చింది. ఆనాడు ప్రాణభిక్ష పెట్టినందుకైనా ఈవేళటి రోజున అతని ప్రాణం కాపాడే అవకాశం భగవంతుడిస్తే ఎంత బాగుండును! అనుకుంటుంది పదేపదే. కారు ప్రయాణం లో ఎవరూ మరొకరితో మాట్లాడేందుకు సాహసం చేయలేదు. గిరిజ కంట తడి పెట్టడం లేదు. మనసూ, శరీరమూ ఏకం అయి అక్రోశిస్తుంటే కన్నీళ్ళ తో పని లేకపోతుంది.
శ్యామలా, మహేశ్వరీ ఉండి ఉండి కళ్ళనీళ్ళు తుడుచు కుంటున్నారు. కారు ఆగకుండా సాగిపోతూనే ఉంది.
* * * * *
నిద్రలోంచి మేలుకుని ఎదురుగా కూర్చున్న శ్యామలనీ, తల్లినీ చూసి తల దించుకున్నాడు హరికృష్ణ. అతను మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ గొంతు పెగిలి పెదాలు దాటి రానివ్వడం లేదు మాటల్ని. మనసు మరిగి పోతుంది. ఒక్కసారి......ఈ అంతిమ యాత్రా సమయంలో ఒకే ఒక్కసారి కరువు తీరే మాదిరిగా చూస్తె చాలు గిరిజ ని. అతను వెంటనే నవ్వుకున్నాడు. చనిపోబోయే ముందు లేనిపోని ఆశలు దేనికి? ఋణవిముక్తి ఏనాడో జరిగిపోయింది. గిరిజ రాకపోవడం మంచిది. మెడలో పసుపుతాడూ, నల్ల పూసలు పరాయిదని స్పష్టం చేస్తుంటే ఏ దిక్కు లేని ద్పౌర్భాగ్యపు మనసు తన ఏ విధంగా ఒత్తిడి చేస్తున్నదో అతనికి అంతు చిక్కడం లేదు. 'గిరిజ నాది కాదా?" బేలగా ప్రశ్నిస్తుంటే అంతరాత్మ మనసు మీద అసహ్య పడింది.
