
శశి కఠినంగా నవ్వింది. "మగవాళ్ళు మీరు. ఏది చేసినా చెల్లుతుంది. పువ్వులాంటి ఆడదాని మనసు మీరు ఎప్పుడూ అర్ధం చేసుకోలేరు. మీ పాదాల క్రింద రేకుల్నీ నిర్దాక్షిణ్యంగా త్రోక్కేస్తారు. మీపట్ల కూడా ఆ నిజం వెల్లడి అయింది. అయినా నాకేం దిగులు లేదు. నేను ఇంక ఈ ఆఫీసులో పనిచేయను."
"శశీ!" అతను మరోసారి తెల్లబోయేడు. తేరుకుని, "నేనీ బ్రతుకు లో పెళ్లి చేసుకోవడం జరగదు, శశీ. అయినా నా గత చరిత్ర నేను తవ్వుకో దలుచు కోలేదు. నీకు ఇష్టం ఆయె నాతొ బాటు వస్తున్నావను కున్నాను. ఈ ఉద్యోగం మానేస్తే .....ఒక్కసారి తీరికగా ఆలోచించు. ఇల్లు అల్లకల్లోలం చేసుకోకు. నామాట విను. నీకు చెడు కలిగే పనులు నేను ఏవీ జరగనివ్వను." అని ఆతను హామీ ఇస్తున్నట్లుగా అన్నాడు.
శశి అతని వైపు కృతజ్ఞత గా చూస్తూ తడి కళ్ళతో అన్నది: "నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోమన్నానని అపార్ధం చేసుకోకండి. ఆడదాని మనసు అర్ధం చేసుకుంటారనే మాటకి అన్నాను."
శశి వెళ్ళిపోయాక కుర్చీలో కూర్చుండి పోయేడు దిగాలుగా. చిత్రంగా ప్రారంభమైంది నాటకం. ఎన్ని పాత్రలు వస్తున్నాయి! ఎన్ని పాత్రలు నిష్క్రమిస్తున్నాయి ! మహా ప్రవాహం లాంటి ఈ నదీ జీవితంలో ఎన్ని ఉపనదులు, ఎన్నెన్ని నదులు కలిసి విడిపోయి సాగర గర్భంలో కలిసి పోతున్నాయి! దీనికి అంతు ఎక్కడ? ఏమై పోతుందీ బ్రతుకు? చివరికీ అంకం ఏ విధంగా పరిసమాప్తి అవుతుంది? ఈ ప్రవాహం ఏ మహా సముద్రం లో కలుస్తుంది? అన్నీ ప్రశ్నలే. జవాబులు లేవు వాటికి. అతను తల వాల్చి టేబిల్ మీద మోచేతుల మధ్య ఉంచుకున్నాడు. కన్నీరు చారికల్లా కట్టి టేబిల్ మీదికి చుక్కలు చుక్కలుగా పడసాగింది. ఉన్నట్టుండి టెలిఫోన్ మోగసాగింది. అతను తలెత్తి ఎడం చేత్తో రిసీవర్ అందుకున్నాడు-- "హలో!" అంటూ.
"నేనూ, శ్యామల ని."
"నువ్వా?!" అతను ఆశ్చర్యంగా అడిగేడు.
"డిస్కనెక్ట్ చేయకు. నువ్వు చేస్తున్న పని నాకు కాదు, ప్రపంచానికే బాగులేదు. ఉచ్చమూ, నీచమూ ఆలోచించాలి. పుష్కలంగా డబ్బుండి విమానం లాంటి కారు ఉండడం కాదు ప్రధానం."
"నేనేం చేశాను?"
"ఏం చేశావో నీకు తెలియదా! ఆ పిల్లని వెంట వేసుకుని సెక్రెటరీ అంటూ తిరిగితే అది నీ ప్రాణానికే డిగ్నిఫిడ్ గా ఉంటుంది. లోకం ఏమంటుందో ఒక్కసారి ఆలోచించు."
"..............."
"నువ్వు మాట్లాడ్ లేవని నాకు తెలుసు. పెళ్లి చేసుకున్న ప్రతి మనిషీ ఒక వ్యక్తితో సరిపెట్టు కోవాలి. కానీ , నీకేం/ డబ్బున్న పెద్ద మనిషివి, ఎంత మందైనా .."
"శ్యామలా!"
"కోపం దేనికీ? ఉన్నమాటంటే అందరికీ ఉలుకు ఉంటుంది. ఛ! నీ కన్నా ఆ దేవదాసీ నయం!'
హరికృష్ణ ఫోనులో హాయిగా నవ్వేడు. అతని కళ్ళలో నీళ్ళు గరగర లాడుతున్నట్లు గొంతులో విచిత్రమైన శబ్దం రాసాగింది. అతను రిసీవర్ లో నెమ్మదిగా కంఠంన్ని అదుపులోకి తెచ్చుకుంటూ, "నా, శ్యామూ....ఎన్నాళ్ళ కి మళ్ళీ ఆ భాగ్యుడి పేరు ఎత్తేవు! నువ్వే నా పక్కన ఉన్నా....." అన్నాడు.
శ్యామల అపర కాళిలా సమాధానం ఇస్తుంది. "సిగ్గులేకపోతే సరి! ఇంకా నా మీద నువ్వా అభిప్రాయం పెట్టుకున్నావా? ఇదేమైనా రిపేరు కి వచ్చిన వాచీ అనుకున్నావా? సమయాన్ని బట్టి చెల్లెలనీ, తరవాత నా పక్కన ఉంటె అనీ, అయినా నీలాంటి చపలచిత్తుడి కి ఫోను చేయడం నాదే పొరపాటు. అయన నీ అకౌంటు చూపించేరు. అది చూసి ఫోను చేశాను. నీ గురించి నాకు అనవసరం. గంగలో దిగి చచ్చిపోయినా నాకేం బెంగ లేదు. ఛీ! నీ బ్రతుకేం బ్రతుకు?" శ్యామల ఏడుస్తుందని హరికృష్ణ గ్రహించేడు. రక్త సంబంధమే కానక్కరలేదు అధికారాన్నీ, అనురాగాన్నీ మరో వ్యక్తీ పట్ల చూపిందుకు. ఉన్నట్లుంది శ్యామల ఫోను పెట్టేసింది. హరికృష్ణ నిట్టుర్చేడు. తీరని బాధలే తీయని తలపులుగా అతడి మనో వీధిలో నిలబడి అతడిని మాటిమాటికీ నిద్ర లేపుతున్నాయి. గిరిజ, శ్యామల , శశి అందరూ స్త్రీలే. ఏ స్త్రీ తనకు కాకుండా పోయింది. గిరిజ ను వదులుకోలేక పోయినా శ్యామలతో రాజీ పడవచ్చుననుకున్నాడు. కానీ.. శ్యామల పరాయిదే కాకుండా తనని తోబుట్టువు గా ప్రేమిస్తుంటే ఆ అనుబంధానికి కళంకం తీసుకు రాలేదు. సిండికేట్ నిండా రకరకాల మందులున్నాయి. ఎన్నో నిషాలు ఉన్నాయి. గుక్కెడు ప్రాణం తీసుకుందుకు మార్గం వెతుక్కో నవసరం లేదు. కానీ ఏదో ఆశ. తన భవిష్యత్ పూల పల్లకి లా మారుతుందనే అతని తాపత్రయం. ఏదో ఒకరోజున తన ఇంటి దీపం వెలిగించిందుకు -- హరికృష్ణ తల విదిల్చేశాడు . ఛ! అదెలా సాధ్యం?" అనుకున్నాడు తన మీద తనే చిరాకు పడుతూ. చీకటి పడగానే అతను కారు తీసుకుని బయలుదేరాడు. సూర్యనారాయణ కులాసా మనిషి. అతను పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని తరిచి చూస్తాడు. ఈ మధ్యనే అతడికి పత్రికా ప్రతినిధుల ప్రశంశలు వచ్చాయి. అతడు వ్రాసిన నవల 'తిరస్కృతి' అశేషాంద్ర ప్రజానీకానికి నచ్చింది. హరికృష్ణ కి ఫోను చేసి మార్గ మధ్య లోనే కలుసుకున్నాడు. "నిన్నోచోటికి తీసుకు వెడతాను వస్తావా నాతొ?" సూర్యనారాయణ అడిగేడు.
హరికృష్ణ కి అర్ధం కాలేదు. రోజూ సూర్యనారాయణతో కలిసి ఎక్కడి కో ఓ చోటికి వేడుతుండడం జరుగుతూనే ఉంది. ఈ వేళ ప్రత్యేకం అడగడం లో అర్ధం స్పురించ లేదు.
"ఎక్కడికి?" అని అడిగేడు.
"వస్తానంటే తీసుకు వెడతాను. స్వర్గానికి, సరేనా?"
హరికృష్ణ నవ్వేడు. "స్వరం రుచి చూసేందుకు వేరే చోటికి వెళ్ళాసిన పనిముంది. సూర్యనారాయణా! నా బీరువా నిండా స్వర్గానికి దారులు ఉన్నాయి, మనం మా ఆఫీసుకే వెడదాం"అన్నాడు.
అపర్ణ ని కొన్నాళ్ళు ఉంచుకుని ఖరీదైన బట్టలతో పసుపు కుంకుమ లిచ్చి శ్రీ కంఠనికి ఉద్యోగం రాగానే సారే పెట్టి పుట్టింటి ఆడపడుచును పంపినట్లే పంపేడు ఇంటికి పెద్దవాడైన సతీష్. ఇల్లు ఇప్పుడు ప్రశాంతి కి నిలయం లా ఉంది. రమేష్ పిల్లలూ, సతీష్ పిల్లలూ ఆడుకుంటూ ఉంటె ఇంక 'మా మనూ ఒక్కడూ మిగిలెడు' అనుకుంటుంది వృద్దురాలు.
చాలా రాత్రులు గడిచేక ఆ రాత్రి మన్మోహన్ బార్యని అడిగేడు. "నువ్వు అతడి పట్ల మరీ నిర్దాక్షిణ్యంగా ఉన్నావు. మనిషి లో పగా ప్రతీకారాలకి కూడా హద్దు ఉండాలి. నువ్వు నీవైపు నుంచే అలోచించేవు కానీ ఒక్కసారి అతని పరిస్తితు ల్నేందుకు ఊహించుకో లేవు?"
చిత్రంగా నవ్వింది గిరిజ : "మీరు అతడిని వెనకేసుకు వస్తున్నారా? నేనెటు వెళ్ళేనో, ఏ విధంగాతనని అరాధించేనో, తెలుసుకోవల్సిన కనీసపు బాధ్యతని అతను మరిచిపోయేడు. ఈవేళటి రోజున నా అవసరం గుర్తుకు రాగానే రెక్కలు కట్టుకుని వచ్చేడు. ఇందులో అతనిది పూర్తిగా స్వార్ధమే. ఆడపిల్లననీ, నేను చేయగలిగినది ఏమీ లేదని తెలిసి కూడా అతను అన్నాళ్ళు అజ్ఞాతంగా ఉండి పోవడాన్ని నేను క్షమించను."
"మనిషిలో కొంచెం మానవత్వం ఉండాలి, గిరి. నీ బాధ గ్రహించెను నేను. అతను ఇంతదూరం పని పెట్టుకుని వచ్చినప్పుడు నువ్వు ప్రేమగా మాట్లాడ లేకపోతె స్నేహ ధర్మం గానైనా మాట్లాడి నన్ను చేసుకుంటున్న సంగతి నెమ్మదిగానే అతని చెవిన వేసి ఉంటె, అతడు మరీ అంత క్రుంగి పోయేవాడు కాదు. మన వాళ్ళు ప్రేమలో త్యాగం ఉంటుందంటారు . కానీ -----నీ ప్రవర్తన ఆనాటిది తలుచుకుంటే దాని నిర్వచనం పగేనేమో అనిపిస్తోంది."
గిరిజ కళ్ళల్లో నీళ్ళు ఊరుతున్నాయి. "మీరు జరిగిపోయిన విషయాల్నీ నాకు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రేమా, ఆరాధనా -- ఇలాంటి వన్నీ మరిచి పోయెను. ఇప్పుడు నాకు మీ పట్ల కృతజ్ఞత, గౌరవం, భక్తీ ఉన్నాయి. భార్య స్థానం లో ఉన్న నేను అతడిని గురించిన ఆలోచనలు పెట్టుకోదలుచుకోలేదు. మీకు పుణ్యం ఉంటుంది. ఆ విషయం మరిచిపోయి నన్ను మరిపించేయండి." అతని కాళ్ళ మీద చేతులు ఉంచి ప్రాధేయ పూర్వకంగా అన్నది.
మన్మోహన్ భార్యని లేవదీసి గుండెలకు అదుముకుంటూ అన్నాడు; "నేను అమెరికా వెళ్లేముందు నీతో ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఈ దూర భార ప్రయాణం లో మనం మళ్ళీ ఎప్పుడు కలుసు కుంటామో దేవుడికి తెలుసును. నీ వల్ల మరో ప్రాణి ప్రపంచం లో దుఃఖ పడుతూ ఉంటె అది నీకు సంతోషంగా అనిపిస్తుందా?"
"ఏమండీ!" గిరిజ అతని కళ్ళలోకి చూసింది.
అతని కళ్ళు దివ్య జ్యోతుల్లా ఉన్నాయి. ఆ కళ్ళలో నిష్కల్మషత్వం , నిరాడంబరత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని గుండెల మాటున దయాధర్మాలు మొహం ద్వారా వ్యక్తమవుతున్నాయి. నిలువెత్తు ఆజానుబాహువు అయిన అతడు మూర్తిభవించిన భగనృత్య రూపం లా కనిపిస్తుంటే గీతా బోధ వినీ సమయంలో పార్ధుడి మాదిరే అయిపొయింది.
"నీకు మద్రాసులో దొరికిన ఉద్యోగం చాలా మంచిది. డబ్బు కోసం ప్రాకులాడే తత్త్వం కాదు నాది. ఆ ఉద్యోగం లో నువ్వు ఉంటె కొంతలో కొంత నేను లేని లోటు కనిపించదు. నీకు తోడుగా అమ్మని తీసుకు వెళ్ళే అవసరం లేదు. అన్నయ్య కి అక్కడికే ట్రాన్స్ ఫర్ అయింది. నాకన్నా నీకు అన్నయ్య, వదిన లు ముందు నుంచీ తెలుసును. వాళ్ళ దగ్గర ఉంటె నీకు కష్టం కలగదు."
"మీరు....' గిరిజ మాటలకి అతను అడ్డు వచ్చేడు.
"జీవితంలో అతడే కనిపిస్తే ఒకళ్ళ నొకళ్ళు క్షమించడం నేర్చుకోండి. ఇంతకంటే నేనేం చెప్పను. ఈ రాత్రి ఈ దేశంలో ప్రస్తుతానికి చివరి రాత్రి. అందుకే నా మనస్సు విప్పి నీతో చెబుతున్నాను." అంటూ భార్యని గాడంగా కౌగలించు కుని తృప్తిగా నిద్రపోయేడు.
మరునాడే అతను వెళ్లిపోవాలి. అతను తిరిగి ఏడాది వరకు రాడనే భావం ఇంటిల్లి పాదికి బాధగానే ఉంది. వెళ్ళే రోజు పది పన్నెండు గంటల కాలంలో కాస్సేపు నిలిచింది. అతను అందరి తోటీ నవ్వుతూ, త్రుళ్ళుతూ కాలక్షేపం చేశాడు. భార్యని ధైర్యంగా ఉండమన్నాడు. తల్లినీ, వదినల్నీ బెంగ పెట్టుకోవద్దన్నాడు. అన్నలకీ, భార్య బాధ్యత అప్పగించేడు. కాలం పరుగు పెట్టగానే అపర్ణ దగ్గరా, భార్య దగ్గరా కూడా సెలవు తీసుకున్నాడు. మన్మోహన్ పై చదువులకి అమెరికా వెళ్లిపోయేడు.
రమేష్ కి మరో వారం లో మద్రాసు బదిలీ అయింది. వెంటనే భార్యని, పిల్లలనీ, తీసుకు వెడుతూ గిరిజ ని కూడా తీసుకు వెళ్ళాడు. మద్రాసు చేరుకున్న పదిహేను రోజులకి గవర్నమెంటు హోస్పిటల్లో ఉద్యోగం లో చేరింది.
భర్తని గురించిన ఆలోచనలు కలవర పెట్టినా తల్లి తండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమించే రమేష్ దంపతుల ఆదరణ లో భర్త అనురాగాల్ని పొందు పరిచి వ్రాసే ఉత్తరాల్లో రోజుల్ని క్షణాలుగా గడిపి వెయ సాగింది.
ఉదయం పది గంటల ప్రాంతం లో తన గదిలో కూర్చున్నది గిరిజ. ఆ వేల ఆఫీసులకీ, స్కూళ్ళ కీ సెలవు ఇచ్చేరు. రమేష్ పని మీద చెంగల్పట్టు వెళ్ళేడు. సౌదామిని వంట ఇంట్లో సతామతమౌతుంది. గిరిజ దీర్ఘంగా పుస్తకాలు చదువుతుంది. పి.హెచ్. డి (గైనకాలజీ) చేయాలని తాపత్రయం. రమేష్ గూడా తగిన ప్రోత్సాహం ఇచ్చేడు.
నౌకరు వచ్చి "అమ్మా!" అని రెండు సార్లు పిలిచి, మూడోసారి పిలవ బోతుంటే తలెత్తి, "ఏమిటి. రాముడూ?" అని అడిగింది.
"మీకోసం ఎవరో వచ్చేరమ్మా!" అన్నాడు.
గిరిజ మనసులో లక్ష సందేహాలు బయలుదేరాయి. పేషెంట్లు తప్ప తన కోసం ఎవరు వస్తారు అనుకుంటూ, "లోపలికి రమ్మను" అన్నది.
రెండు నిమిషాల తరవాత స్వింగ్ డోర్ తెరుచుకుని వచ్చిన ఆమెనీ, ఆవిడ నీ చూసి తెల్లబోయింది. నోట మాట రానిదానిలా, అయిదు నిమిషాలు అప్రతిభురాలై స్థాణువు లా నిలుచుండి పోయింది. శ్యామల తనను తాను పరిచయం చేసుకున్నాక గిరిజ తేరుకుంది. శ్యామల వెనుక నిలుచున్న ఆవిడ మహేశ్వరి. మహేశ్వరి మొహం లో విషాదం గూడు కట్టుకున్నది. "కూర్చోండి." అన్నది గిరిజ. అప్పటికీ ఆ పిల్ల నిస్త్రాణ తో ఉండటం వల్ల మరో లోకం లో నుంచి వచ్చినట్లుంది మాట.
మహేశ్వరి కూర్చో కుండానే గిరిజ కి దగ్గరగా వచ్చి ఆమె చుట్టూ చేతులు వేసి గుండెల్లో కి చేర్చుకుని "నాకన్నా చాలా చిన్నదానివి. నిన్ను క్షమించమని కోరుకునేందుకు వచ్చెను. పాపిష్టి దాన్ని, కన్నా కడుపుకే చిచ్చు పెట్టుకుని చిత్రవధ అనుభవిస్తున్నాను." అంది.
"అత్తయ్యా!' గిరిజ కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లెయి.
"వాడు...వాడు ఈ ఊళ్ళో నే ఉన్నాడు. తెగ తాగడం వల్ల ఊపిరి తిత్తులు చెడిపోయి...." ఆవిడ మాట్లాడడం ఆపేసి ఘోల్లు మన్నది.
శ్యామల చెప్పింది ; 'చాలా రోజుల్నించి దాచి పెట్టుకున్నాడు. ఇప్పుడు చేయి దాటి పోయింది. మదనపల్లి తీసుకు వెళ్ళమన్నారు. మద్రాసు లో మీరు ఉంటున్నట్లు ఈ మధ్యే మన్మోహన్ ఉత్తరం రాశారు. మీరు మా వెంట ఉంటె అన్నయ్య బ్రతుకుతాడే మోనని ఆశ."
గిరిజ ఆశ్చర్యంగా చూసింది క్షణం. అంటే ఆ పిల్ల మహేశ్వరి కోడలేమో అని భ్రమ పడింది. కానీ శ్యామల "అన్నయ్య' అనగానే తనను తాను నమ్మలేని దానిలా క్షణం మహేశ్వరి వైపు మరోసారి శ్యామల వైపు మార్చి మార్చి చూడసాగింది.
"అన్నయ్య మిమ్మల్ని కలుసుకోవద్దని మాతో అన్నాడు. కానీ, మన్మోహన్ గారే విపులంగా రాశారు మీరు దగ్గరుంటే మంచిదని. విషయం విన్నాక అన్నయ్య కూడా ఒప్పుకున్నాడు."
గిరిజ పూర్తిగా విని మౌనంగా ఊరుకుంది.
