
నా సమస్త దుఃఖాలనూ మరిపించగలిగింది పుస్తకమేనని దానికి ఎలా చెప్పగలను? రసానందాన్ని అనుభవించగలిగే అదృష్టవంతులకు అంతకుమించిన సౌఖ్యం లేదని ఏ భాషలో చెపితే అర్ధమవుతుంది?
అయినా, దానికి చెప్పవలసిన అగత్యమేముంది నాకు?
పాప క్షేమంగా ఉంది. కానీ, పరిమళ దగ్గిర ఉంది. ఇది నేను భరించరాని వేదన - దానిని జయించలేను. మరిచిపోగలను.
పుస్తకం చేతుల్లోకి తీసుకున్నాను.
2
టెలిఫోన్ మ్రోగింది. పుస్తకంలోంచి తల ఎత్త వలసి వచ్చినందుకు విసుక్కుంటూ ఫోన్ అందుకున్నాను.
"హల్లో! నిద్రపోవటం లేదుగదా? డిస్టర్బ్ చేసినందుకు ఏమీ అనుకోకు! టెలిగ్రామ్ అందిందా?"
అత్యంత మధురమయిన కంఠం.
సంస్కారమూ, సభ్యతా, వీటితోపాటు ఏదో హుందాతనమూ ఇమిడించుకొన్న మాటలు తప్ప రావు ఆ కంఠంలోనుండి.
ఆ కంఠధ్వని వింటూనే నాలో నేను ఎందుకో సన్నగా వణుకుతాను. ఎందుకో ఎవరి మీదో చెప్పరానంత కసి కలుగుతుంది. నిజానికి ఆ కసి నా మీద నాకు. కానీ, అప్పటి కెవరు దొరికితే వాళ్ళమీద తిక్కతో విరుచుకు పడతాను.
పరిమళ నా సమాధానం కోసం సహనంతో నిరీక్షిస్తూంది. నేను సమాధాన మిచ్చేవరకూ తను తిరిగి మాట్లాడదు.
"అందింది." పొడిగా అన్నాను.
"హమ్మయ్య! పాపం, ఎంత గాభరాపడి ఉంటావో ఊహించగలను. అందుకే ట్రంక్ కాల్ చేస్తున్నాను. పాపను నన్ను తీసుకురమ్మంటావా? నువ్వు ఎవరినైనా పంపిస్తావా?"
"ట్రంక్ కాల్ చెయ్యదలుచుకున్నదానివి టెలిగ్రామ్ ఎందుకిచ్చావు? ముందుగానే చెయ్యలేక పోయావా?"
అవతలి వైపునుంచి కొన్ని సెకన్ల నిశ్శబ్దం. ఆ తరవాత ఏదో మింగుడుపడని భావం మింగేస్తున్న లాంటి నవ్వు.
"ట్రంక్ కాల్ చెయ్యడానికి డబ్బు కావాలిగా? ప్రస్తుతం నా దగ్గిర డబ్బుల్లేవు. అందుకని..."
"ఇప్పుడెలా వచ్చాయి? ఓహో! పాప ఒంటిమీద నగలున్నాయిగా!"
"శారదా!"
ఎంతో నిగ్రహంతో మాట్లాడే పరిమళ చిన్న అరుపు అరిచింది. అంతలో నిగ్రహించేసుకుంది.
"పాప తెలివయినది. ఒంటరిగా ఇల్లు బయలుదేరే ముందే నగలన్నీ తీసేసింది. నువ్వు చూసుకుని ఉండవు. ఒకవేళ పాప నగలతోనే వచ్చి ఉంటే నిస్సంకోచంగా అమ్మి నీకు ట్రంక్ కాల్ చేసి ఉందును. మాతృ హృదయానికి శాంతి కలిగించటమే అన్నింటికంటే ముఖ్యం నా దృష్టిలో!"
పరిమళ అన్నదానిలో విడ్డూరమేదీ లేదు. కానీ, చివరి వాక్యం నా మనసును గుచ్చింది. మాతృ హృదయం! అది నాకు ఉందా?
"మరి, డబ్బెలా వచ్చింది?"
"పాపను నువ్వు తీసుకెళతావా? నేను తీసుకురానా?"
"డబ్బెలా వచ్చింది?"
ఏదో విసుగును అణుచుకుంటున్నట్లు స్పష్టంగా ధ్వనించింది పరిమళ కంఠం.
"రావు ఇచ్చాడు."
చెయ్యి వణికి పట్టు తప్పి ఫోన్ జారిపోబోయింది. అంతలో పట్టుకున్నాను గట్టిగా.
"నీకు ట్రంక్ కాల్ చెయ్యమని చెప్పి డబ్బిచ్చాడు. అసలు నీకు చెప్పకుండా పాపను తీసుకొచ్చేదానిని. కానీ, నేను తీసుకొస్తే పాపను థర్డ్ క్లాస్ లోనే తీసుకురాగలను. నీకు కష్టం కలుగుతుందేమో! పోనీ, నువ్వే ఎవరినైనా పంపిస్తే..."
"ట్రంక్ కాల్ కి డబ్బిచ్చిన రావు ట్రెయిన్ ఫేర్స్ ఇయ్యలేడా?"
పరిమళ నవ్వు వినిపించింది. ఏదో చికాకును పారదోలే ప్రయత్నంలో నవ్విన నవ్వు.
"రావు దగ్గిర మాత్రం డబ్బెక్కడిది? ఈ లోకంలో నీ రచన తరవాత నువ్వు గాఢంగా ప్రేమించేది పావనని రావుకు తెలుసు. పాప లేకపోతే నువ్వు మరీ ఒంటరిగా ఫీలవుతావనీ, వెంటనే ట్రంక్ కాల్ చెయ్యమనీ చెప్పాడు. ఇంకా ఉద్యోగం దొరకలేదుగా! తన ఉంగరం అమ్మినట్లున్నాడు. అందులోంచి ఇచ్చాడు. నువ్వు త్వరగా సమాధానం చెపితే ఖర్చు తగ్గించినదాని వవుతావు."
చెళ్ళున చరిచిన ట్లయింది చివరి మాట!
ఎంతో విసిగితేనేతప్ప పరిమళ ఆమాత్రం కటువుగా మాట్లాడదు.
"అంత ఖర్చనుకొంటూ ఫోన్ చెయ్యటం దేనికి?" టక్కున పెట్టేశాను.
పెట్టాక గుర్తుకొచ్చింది-పరిమళ ఏ ప్రశ్నకు సమాధానం కోరి ట్రంక్ కాల్ చేసిందో, ఆ ప్రశ్నకు నేను సమాధానం ఇయ్యనేలేదు. పైగా, వ్యర్ధమైన మాటలతో కాలాన్ని పొడిగించాను. పాపం! రావుకి ఎంత బిల్ అవుతుందో!
రావు దగ్గిర ఒకే ఒక ఉంగరం ఉంది. అది పెళ్ళినాడు నేను తొడిగిన ఉంగరం. అది అమ్మేశాడా? పరిమళతో మాట్లాడించే బదులు తను మాట్లాడ కూడదా? ఇప్పుడు మళ్ళీ మాట్లాడతాడేమో? అవును, ఇప్పుడు మాట్లాడతాడు. తప్పకుండా మాట్లాడతాడు.
ఆ రోజు సాయంత్రం వరకూ ఫోన్ మోగినప్పుడల్లా ఆశతో ఎత్తుతూనే ఉన్నాను. అన్నీ ఏవేవో పనికిమాలిన కాల్స్. ఎవరి కంఠం వినాలని నేను ఆశతో, తహతహతో నిరీక్షిస్తున్నానో, ఆ కంఠం మాత్రం వినిపించలేదు.
పాప లేకపోతే పిచ్చెక్కుతూంది. పాప లేకపోతే మరీ ఒంటరిగా ఫీలవుతా నన్నాడట రావు. ఎంత సరిగ్గా ఊహించాడు! అవును. పాప లేని ఈ ఇరవై నాలుగు గంటల్లో నా బ్రతుకులో వెలితీ, ఎడారిలా ఆవరించు కున్న స్తబ్ధతామైక్రోస్కోప్ లోనుండి కనిపించినట్లు కనిపించాయి. మాతృత్వపు మమతతో పాప కోసం తపిస్తున్నానా? లేక పాప సాహచర్యం నా కొక రిలీఫ్ మాత్రమేనా?
రావు తలుచుకుంటే నా బ్రతుకులో ఈ వెలితిని క్షణాలలో పూరించగలడు. నిజంగా నాకు ఏం కావాలో రావుకు తెలియదంటే నమ్మను. కానీ, ఎందుకు రాడు? ఏం చూసుకుని ఈ అహం అతనికి?
అహం కాదు! రావులో అహం లేదు. మరి ఎందుకు ప్రవర్తిస్తున్నాడు ఇలా?
సాయంత్రం ఆరు గంటలకి మళ్ళీ మోగింది ఫోన్.
ఇంకా ఆశ చావలేదు. ఫోన్ అందుకుని వణికే కంఠంతో "హలో!" అన్నాను.
పాప పలికింది.
"అమ్మా! నన్ను అత్తతో రమ్మంటావా? ఎవరి నైనా పంపిస్తావా? త్వరగా చెప్పు!"
పాప నా కూతురు! అంతే కచ్చితంగా, ఖండితంగా, ధైర్యంగా మాట్లాడగలదు. తండ్రి రూపమూ, సాత్విక స్వభావమూ వచ్చినా, పాపలో చాలా వరకు నా గుణాలే! అదృష్టవంతురాలు! నాలో ఉన్న ఉద్రేకం మాత్రం లేదు.
"పాపా! అసలు నువ్వు..."
"సరే! అత్తను తీసుకుని వస్తున్నాను."
"నాన్నగారితో రాకూడదూ?"
"నాన్నగారిని రమ్మంటావా? నువ్వు రమ్మన్నావని బ్రతిమాలనా?"
