Previous Page Next Page 
మిధ్య పేజి 27


    శ్రీ కంఠం మంచం మీద రోగిష్టి అక్కగారి కాళ్ళ గట్టున కూర్చున్నాడు. అతని గడ్డం బాగా మాసి పోయింది. కళ్ళు అరంగుళం లోతుకు పోయినాయి. చెంపలు రెండూ దాదాపు మధ్యకి అతుక్కునే విధంగా మారిపోయేయి. ఆతడు గీసిన పటాలు గాలికి ఊగిస లాడుతున్నాయి. ఇల్లు చిందర వందరగా కలర్ పెయింట్స్ తో, వార్నిష్ తో, బ్రష్ లతో నానా ఖంగాళీగా ఉంది. తైల సంస్కారం లేని అతని క్రాపింగ్ బాగా పెరిగిపోయి బిరుసెక్కి అతని దారిద్ర్యాన్ని నిర్లక్ష్య పెడుతున్నది. రెండు చేతులూ జోడించి నవ్వు మొహంతో నమస్కారం చేస్తుంటే శుష్కించిన కారణంగా అతని పలువరుస బయట పడుతున్నది. చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండే శ్రీ కంఠం ఇప్పుడు తిండి లేక, పస్తులతో, దిగులుతో చిక్కి శల్యం గా ఉన్నాడు. ఆస్థి పంజరం మంచం మీద కడులుతున్నట్లుంది రాజ్యలక్ష్మీ అటూ ఇటూ దొర్లుతుంటే. మాసిన చీరతో అక్కడక్కడ చిరుగుల కి అటుకులు వేసి కుట్టుకుని , చేతికి మట్టి గాజులతో , శరీరాన్ని ఆశల నీరు పోసి చిక్కకుండా చూసుకుంటున్న వ్యక్తీ అపర్ణే అనిపించింది రమేష్ కి. అతని మనసు చివుక్కు మన్నది. కళ్ళలో అప్రయత్నంగా నీరు తొణికిసలాడింది. అపర్ణ ని దగ్గిరగా తీసుకుని గుండెలకు చేర్చుకుని తలలో చేయి దూర్చేడు. అతని వక్షః స్థలానికి అనుకుని నిక్షిప్తంగా ఇన్నాళ్ళూ దాచుకున్న దుఃఖాన్ని వరద వెల్లువలా తన్నుకు వస్తుంటే ఆపేందుకు ప్రయత్నం చేసి విఫలు రాలైంది. చాలాసేపు ఏడ్చిన మీదట దుఃఖ భారం తీరి "నీకెంత దయ! నువ్వు నన్ను చూసేందుకు వచ్చేవా!" అన్నది సిగ్గు పడుతూ.
    "చూడు, తమ్ముడూ, నీకు నేను తెలుసో తెలియదో కాని నిన్ను అడపాదడపా శ్యామ్ బజారు లో చూస్తుండే వాడిని. ఆ తరవాత తరవాత ప్రతి సాయంత్రం నేను ఈవెనింగ్ వాకింగ్ కి వెళ్ళేప్పుడు చూడడం జరుగుతుండేది. నువ్వు అన్యదా భావించక పొతే అపర్ణ ని మా ఇంటికి తీసుకు వెళ్లి కొన్నాళ్ళు ఉంచుకొని పంపుతాను. నీ ఉద్యోగం గురించి దిగులు పెట్టుకోకు. పోస్టాఫీసు లో తప్పకుండా దొరుకుతుంది రెండు నెలల్లో!"
    శ్రీ కంఠం కళ్ళు కృతజ్ఞత తో మెరిశాయి. "మీరు దయతో ఆహ్వానిస్తుంటే కాదనలేను. అయినా నా ఈ దారిద్ర్య పరిస్థితిలో అపర్ణ భారం అయి పంపుతున్నానని అందరూ అనుకుంటే?' అతను మాటని మధ్యలో త్రుంచేసేడు.
    రమేష్ సానుభూతి గా అన్నాడు: "లోకానికి భయపడుతూ మనం ముందుకు రాలేం, తమ్ముడూ. సంఘాన్ని గోలీ కొట్టి చేయాలి ఏ పనైనా. పాపిష్టి సమాజం ఎప్పుడూ దేనికో ఒకదానికి అనుకుంటూనే ఉంటుంది. తాటాకుల చప్పుళ్ళు పెడచెవిని పెట్టాలి. అక్కగారికి కావలసిన సదుపాయాలు నేను చూస్తాను. నువ్వు....నా స్వంత తమ్ముడే అయితే ఇలా గాలికి వదిలేయను కదా? అపర్ణ ని చేసుకోవడం వల్ల నువ్వు మాకు దగ్గిరవాడివయ్యేవు. అపర్ణ ని ఇప్పుడే తీసుకు వెడతాను."
    శ్రీ కంఠం నెమ్మదిగా వచ్చి అతని పాదాలకి నమస్కారం చేస్తుంటే రమేష్ "ఛ! ఇదేం పని!" అన్నాడు.
    శ్రీ కంఠం గొంతు పెగల్చు కుంటూ అన్నాడు: "మీ గురించి విన్నాను. నేనూ చాలాసార్లు మిమ్మల్ని చూసేను. పెళ్ళికి ముందే మీతో ఈ విషయం సంప్రదించి సహాయం కోరదాం అనుకున్నాను. కానీ, నేను అనుకున్నది ఏదీ జరగలేదు. నా చిత్రాలు డిల్లీలో జరిగే కాంపిటీషన్ కి పంపాలను కున్నాను. పంపేందుకు కూడా డబ్బు లేని దీనావస్థలో మునిగి మరి తేలలేకున్నాను. దైవం పంపించినట్లు మీరు వచ్చేరు. దేవుడెలా ఉంటాడో నాకు తెలియదు, అందరూ చెప్పుకోగానే వినడం తప్ప. మీరు నా కంటికికనిపించని ఆ భగవంతుడి లాగే తోస్తున్నారు."
    రమేష్ హృదయం ఆర్ద్రమైంది. అతడిని లేవనెత్తి కౌగలించుకుని, "అంతమాట అనకు, తమ్ముడూ. కలకాలం కాపురం ఉండేవి కావీ కష్టాలు. సమయం అసంనమైతే దూది పింజేలా ఎగిరి పోయి ఒక్కసారి సరదాకి గుర్తుకు తెచ్చుకుందాం అనుకున్నా జ్ఞాపకం రావు. తమాషాగా అనిపిస్తుంది అలాంటప్పుడు. నువ్విలా నీరు కారిపోకూడదు. ధైర్యం తెచ్చుకోవాలి. నీకు మేం ఉన్నాము." అన్నాడు. రాజ్యలక్ష్మీ అతని వైపు తిరిగి రెండు చేతుల్నీ జోడించింది.
    అపర్ణ అతనితో బాటే ఇంటికి బయలుదేరింది. శ్రీ కంఠంనికి ఆర్ధికంగా, మానసికంగా రమేష్ తదితరులు కుడి భుజంలా అదుకోసాగేరు. కాలం పేజీల్లో అనేకమైన కాలండర్లు మారేందుకు తయారుగా ఉన్నాయి. నెలలే ప్రస్తుతం ఒకదాని వెంట ఒకటి పరుగులు పెట్టి పైకి వస్తున్నాయి. అమరేంద్ర చక్రవర్తి పోయేక ఆ కుటుంబం సుగంధ పరిమళాల్ని వెదజల్లుతున్నాయి.
    
                             *    *    *    *
    హరికృష్ణ హతాశుడై హైదరాబాదు చేరుకునే సరికి శ్యామల పెళ్లి చేసుకుని అంతకు వారం రోజులు క్రితమే విజయ కుమార్ తో కింగ్స్ వేలో కాపురం పెట్టింది. అతను బండి దిగి తిన్నగా జగన్నాధం ఇంటికి వచ్చేడు. అరుంధతి కళ్ళు వాచీ ఉన్నాయి. అతడిని చూసి బలవంతంగా పెదాల మీదికి చిరునవ్వు తెచ్చుకుని, "రండి" అన్నది ఆహ్వానిస్తూ. ఆతనికి శ్యామల పెళ్లి చేసుకున్న వార్త సూర్యనారాయణ మార్గ మద్యం లో కనిపించి చెవిన వేశాడు.
    హరికృష్ణ హృదయం క్రుంగి పోయింది. రిక్త హస్తాలతో తిరిగి రావడం అతని ఎదురు గుండెల్లో బరిసె పోటు దిగవేసినట్లు గానే ఉంది. వేదాంత ధోరణిలో తీసి పడేసేటంత తేలిక విషయం గా తోచడం లేదు. అరుంధతి అతనికి కాఫీ ఇస్తూ , "శ్యామల ఇంత పని చేస్తుందనుకోలేదు. గారాబం చేసి నెత్తిన పెట్టుకున్నాం. చివరికి దాని స్వార్ధం అది చూసుకుంది. ఈ వయసులో నాన్నగారి కష్టాన్ని అది ఆలోచించలేక పోయింది." అన్నది కంట తడి పెడుతూ.
    హరికృష్ణ పూర్తిగా విని, "ఇప్పుడు శ్యామల కాని పనేమీ చేయలేదు. మీరనవసరంగా బాధపడుతున్నారు. ఆ పిల్ల మీరనుకున్నంత అవివేకీ , పసితనం వీడనిది కాదు. మనలో ఇప్పుడిప్పుడు జరిగే శాఖాంతరాలకీ మీరిలా ఆర్భాటం చేసుకుని బెంగతో డీలా పడిపోవడం బాగులేదు. విజయకుమార్ బుద్ది మంతుడు. బాగా ఉన్నవాడు. ఈడూ జోడూ అన్నీ కలిసి వచ్చినప్పుడు వేలెత్తి వంక పెట్టలేం కద!' అన్నాడు.
    అరుంధతి అతని వైపొకసారి తేరిపార చూసింది. "మీరూ ఆయనలాగే దాన్ని సమర్ధిస్తున్నారా? ఈ పని కుటుంబానికి తలవంపులు తీసుకు రాదూ?"
    "రాదు. త్యాగాలు చేసుకుంటూ పొతే బ్రతుకులో మిగిలేది దుఃఖం అనిపిస్తోంది నాకు. చాలా మంచి పని చేసింది శ్యామల. అడ్రసు ఇస్తే నేను వెడతాను."
    అరుంధతి కిమ్మన లేదు.
    జగన్నాధం కారు దిగి లోపలికి వచ్చి నవ్వుతూ హరికృష్ణ భుజం తట్టి , "హలో! కాయా, పండా?" అని అడిగేడు. హరికృష్ణ మొహం చూశాక గంబీరంగా మారిపోయేడు. అతను శ్యామల అడ్రసు అడిగితె "నేను దింపుతాను, పద" అన్నాడు.
    అరుంధతి తెల్లబోయి, 'మీరూ వేడుతున్నారా?' అని అడిగింది.
    "ఔను" అన్నాడతను ముందుకు అడుగు వేస్తూ.
    కింగ్స్ వేలో విజయ కుమార్ రైల్వే బ్రిడ్జి కి కొద్ది దూరం లో 'హైదరబస్తీ' కి వెళ్లే సందు లో రెండతస్తుల మేడ మీద ఉంటున్నాడు. ఆ ప్రాంతం చాలా వరకూ ధనవంతులు ఆక్రమించుకున్నదే. అతడి ముసలి తల్లి కోడల్ని చూసి మురిసి పోయి ప్రొద్దుటూరు లో ఇల్లు అమ్మేసి కోడలి దగ్గిరికి వచ్చేసింది. ఇన్నాళ్ళూ నాస్తిక భావంతో ఉన్న కొడుకు అకస్మాత్తుగా ఆస్తికుడై రత్నం లాంటి భార్యని వెంట బెట్టుకు రాగానే ఆవిడ మాతృహృదయం ఉప్పెనలా ఉబికి పోయింది.
    శ్యామల కి ఇప్పుడు ఆ ఇంట మరీ గారభం. ఆవిడకి తెలుగు రాదు. మరాఠీ, హిందీ, కన్నడాలని కలగాపులగం చేసి శ్యామల కి ఇబ్బంది కాకుండా మసలుకుంటుంది.
    ఇంటిముందు కారాగి అందులోంచి బావా, హరికృష్ణ దిగగానే సంబరంగా చూసింది శ్యామల. పెళ్లి చేసుకున్న తరవాత తల్లీ, తండ్రీ, అక్కా-- ఇలా ఆత్మీయులు, రక్త సంబంధం అనుకున్న వాళ్ళూ తమకు తోచిన విధంగా కేకలు వేసేరు. కడుపున చెదబుట్టావన్నారు. మిగతా పిల్లలకి వారధి లా దాపురించేవన్నారు. అన్నిటినీ మౌనంగా భరించి కన్నీళ్ళ ని గుండెల్లో నే దాచుకుని అతనితో వచ్చేసింది. జగన్నాధం గుమ్మం లో అడుగు పెట్టగానే అంతవరకూ దాచుకున్న దుఃఖం మరి ఆగలేక కట్టలు తెంచుకుంది. జగన్నాధం ఆ పిల్లని గుండెల్లో కి తీసుకుని, "ఛ! నీకేం పిచ్చా, శ్యామూ? నువ్వు చాలా మంచి పని చేశావు. మన విజయకేం? బంగారపు ఖని. అతడిని చేసుకోవడం నీ అదృష్టం. ఇంత జరిగేక ఇప్పుడా ఏడవడం? అంత దీలాపడిపోయే మనిషి వైతే దేనికి చేసుకున్నావు? నువ్వు ఏడ్చి బాధపడి అతన్ని ఏడిపించి బాధపెత్తెందుకా? ఏదీ, నాకేసి చూడాలి. నేనున్నానమ్మా నీకు" అన్నాడు. భోజనాలు చేశాక జగన్నాధం ఇంటికి వెడుతూ, "నువ్వు విజయ రాగానే రా, హరీ! నాకు పనుంది" అన్నాడు.
    హరికృష్ణ ఎప్పుడెప్పుడు శ్యామలతో ఏకాంతంగా మాట్లాడాలా అని ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడే అతనికి వీలు చిక్కింది. శ్యామలే అడిగింది "వెళ్ళిన పని ఏమైంది? అసలేమంది?" అని.
    హరికృష్ణ నెమ్మదిగా ప్రారంభించేడు. "నేను తప్పేం చేశాను, శ్యామూ? అమ్మ అలా చేస్తుందని ఊహించి ఉంటె తప్పించుకు తిరిగే వాడినా? పగలనీ, ప్రతీకారలనీ ఇద్దరూ ఆడవాళ్ళే కదా ఎందుకిలా  పంతం పట్టాలి?"
    శ్యామల విని కొంచెం ఆగి అన్నది. "జరిగిందేదీ తిరిగి రాదు. జరగబోయేది చూసుకోవాలి. పెళ్లి కూడా అయిపోయిందంటున్నావు. పరాయి మనిషిని గురించి ఆలోచించే అధికారం కూడా నీకు లేదు. ఎవరు ఏవిధంగా చేస్తే ఏం? మధ్య నష్టపోయింది నువ్వు. ఈ నష్టాన్నీ భర్తీ చేసుకోవాలంటే వెంటనే పెళ్లి చేసుకుని స్థిరపడు. పాత జ్ఞాపకాలు కొత్త జీవితాన్ని కలుషితం చేయవని నాకు నమ్మకం ఉంది.
    "ఆ మనిషి కాదన్నాదని నువ్వు ఇలా బెంగతో క్రుంగి కృశించి పొతే లాభం శూన్యం. మీ అమ్మని ప్రయత్నం చేయమను. ఆశాశ్వతం అయిన జీవితాల్లో బ్రతుకే భగవంతుడిచ్చిన వరం కదా? ఎందుకా బ్రతుకుని నాశనం చేసుకోవాలి మనం? ప్రయత్నం చేస్తాం. జయాపజయాలనేవీ మన చేతుల్లో లేవు కడ? నా మాట విను. నువ్వు పెళ్ళాడు. గతాన్ని గురించి అసలు ఆలోచించకు."
    హరికృష్ణ చిత్రంగా చూస్తూ అన్నాడు: "ఎంత తమాషాగా మాట్లాడుతున్నావు! నేను అంత త్వరగా జీవితంలో స్థిర పడగలననే అనుకుంటున్నావా?"
    శ్యామల కి కోపం వచ్చింది. "లేదు. అలా ఎందుకనుకుంటాను? ఇప్పుడు నీ హోదా పెరిగింది. స్నేహితులూ ఎక్కువే అయేరు. నీ పరిధి మహా విశాలం అయిపొయింది. కార్లలో వెళ్లి క్లబ్బుల్లో మస్తుగా తాగి తందనాలాడు. ఛ! ఏం మనుషులో! అయినా నీ ఉద్దేశ్యం ఏం చేయాలనీ?"
    "ఇలాగే ఉండిపోవాలనుంది. ఎంతమంది లేరు ఈ ప్రపంచం లో?"
    "కాదూ మరి! చార్ మినార్ రోడ్లన్నిటినీ పావనం చేస్తూ ఒంటి నిండా రోగాలు తెచ్చుకుంటూ.....నీ ఇష్టం అదే అయితే ఇంక నువ్వు ఇక్కడికి రాకు."
    "శ్యామలా!" అతను తెల్లబోయిన వాడిలా చూశాడు.
    "ఎవరి స్వార్ధం వాళ్ళది. నేను మనిషిని . నాకు స్వార్ధం ఎంతైనా అవసరం. ఎందుకనీ అడిగితె సవాలక్ష జవాబులు చెబుతాను."
    "నీకు నా వల్ల అపకారం ఏముంది, శ్యామూ? స్వార్ధం గురించి అంటున్నావు. అసలు నీకా అభిప్రాయం ఎందుకు కలిగింది?"
    "చెప్పమంటావా?"
    "అనేగా నేను కోరేది."
    "నీకు పెళ్లి కాలేదు. నాకు పెళ్లి అయింది. నువ్వు మగ మహరాజువి. నేను ఆడపిల్లని. నీకూ నాకూ పూర్వ పరిచయం ఉంది. పోనీ, బంధువని నలుగురూ అనుకున్నా అది నిజం కాదని చాలా మందికి తెలుసు. మా అన్నయ్య వని నేను పరిచయం చేయబోయినా, పెళ్లి కాని వాడు ఆ పిల్ల దగ్గిరికి రావడం , ఆ పిల్ల అన్నయ్యా అనడం ఇదంతా గమ్మత్తు గా లేదూ" అంటుంది సంఘం. నాకు అత్త ఉంది. ఆవిడ మంచిదే అయినా కాలం కలిసి రాకపోతే కర్ర పామౌతుంది. నాభర్తకి నువ్వెవరో, నేనెవరో తెలుసు. అయినా నా జాగ్రత్త లో నేను ఉండటం మంచిది."
    "శ్యామూ!" అతను నిర్ఘాంత పోయి జాలిగా అడిగేడు: "నేను ఎప్పుడూ రాకూడదా?"
    "రావచ్చును."
    "అదెప్పుడు?' అతను ఆశగా అడిగేడు.
    "నీ పెళ్లి అయేక."
    "శ్యామలా!" అతని హృదయం  గతుక్కుమన్నది. నవనాడులూ క్రుంగి పోయిన మనిషిలా లేచి నిలుచుని "వెడుతున్నాను." అన్నాడు.
    శ్యామల కళ్ళలో నీళ్ళు తిరుగుతూ చెంపల మీదుగా జారి గుండెల్ని తడుపుతున్నాయి, "మరి రావా?" అంది ఏడుస్తూ.
    "చూస్తాను. బహుశా రానేమో!' అని నిమిషం కూడా నిలవకుండా అడుగు ముందుకు వేసి కదిలి పోయేడు. '    శ్యామల నిట్టూర్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS