"గిరిజా!" అతని గొంతులో ప్రాదేయత స్పష్టంగా వినిపిస్తుంది.
"ఆ గిరిజ చచ్చిపోయింది. ఆ పిల్లలో అమాయకత్వం తప్ప మరొకటి లేదు. ఈ గిరిజ ప్రాజ్ఞురాలు. అన్నీ తెలిసిన వ్యక్తీ. యుక్తా యుక్త విచక్షణ జ్ఞానాన్ని జీర్ణం చేసుకుంటూ నీకన్నా చాలా ఎదిగిపోయింది. ఇప్పుడీ గిరిజ లో ఆరాధనా, కృతజ్ఞతా , అన్నీ ఒకే ఒక వ్యక్తీ పట్ల ఉండి పోయేయి. నన్ను మనసు లో కూడా నీ రూపు రానిచ్చి ఆ వ్యక్తిపట్ల ద్రోహానికి ఒడిగట్టనీయకు!"
"గిరిజా! నా సంపద నీకు తెలియనిదా? డబ్బుతో ఎన్నో కొనుక్కోగలను కానీ నా గిరిజ వీటితో రాదు. అందుకే ఇంత దూరం నువ్వు నన్ను క్షమిస్తావనే ఉద్దేశ్యంతోటే వచ్చెను. నేనేమైపోను?"
"ఆ ప్రశ్న కాలాన్ని అడుగు. నేను కఠినాత్మురాలిని. నాకు తెలుసు ధర్మం ఎటు వైపు మొగ్గాలో. నేను... ఆయనకి జన్మజన్మల కీ విదేయురాలిని. ఇప్పుడు నా మనసులో భగవంతుడనేవాడు ఉంటె బహుశా మన్మోహన్ లా ఉండి ఉంటాడనే భావన తప్ప మరొకటి లేదు. నువ్వు తక్షణం ఈఊరు వదిలి వెళ్ళిపో."
"సరే!" అతని కంఠం జీరబోయి పలుకుతుంది.
"వెళ్లేముందు నాతొ చెప్పేందుకు ఏదీ లేదా, గిరీ?"అతని అనురాగ హృదయానికి గిరిజ తొణకకుండానే జవాబు ఇచ్చింది: "ఇంకా ఇక్కడ ఉండి నన్ను లొంగ దీసుకునే ప్రయత్నం చేయకు. ఆడదంటే ఆటవస్తువు కాదనీ, ఆలస్యం కూడా విషం ఆయె ప్రమాదం ఉందనీ ఇవి రెండూ గుర్తు పెట్టుకో." గిరిజ వెక్కి వెక్కి పెద్దగా ఏడుస్తుంది. హరికృష్ణ వెళ్ళిపోయిన అడుగుల చప్పుడు ఎండుటాకుల మీద పాదాలు పడి గలగల మంటుంటే తెలుస్తుంది. గిరిజ "నా హరీ!' అంటూ ఏడుస్తుంది.
మన్మోహన్ కళ్ళు చెమర్చాయి. అతడు ఎటూ నిర్ణయించు కోలేక పోయాడు. తనపట్ల ఆ పిల్లకి ఆరాధాన ఉన్నది నిజమే. మరి హరి విషయం లో? ఆ ప్రశ్నకి సమాధానం దొరకలే దతనికి. క్షణం అలోచించేడు ముందుకో, వెనక్కో అని. ఆప్రయత్నంగా అతని కాళ్ళు వెదురు చెట్ల గుబురు మధ్య ఆగిపోయి అక్కడ మోకాళ్ళ మీద చేతులుంచుకుని ఏడుస్తున్న గిరిజ ని పరికించమని కళ్ళని అజ్నాపించేయి. అతని చేతులు ప్రేమగా గిరిజ శిరస్సు మీద ఆగాయి. తలెత్తి త్రుళ్ళి పడ్డది గిరిజ. "మీరు.....మీరెప్పుడు వచ్చేరు?"
"కంగారు పడకు. అనుకోకుండా నేను మీ సంభాషణ వినవలసి వచ్చింది."
బిత్తర పోయింది గిరిజ.
"నీ తప్పేమీ లేదు. గిరిజా. అతడంత ప్రాధేయ పడుతున్నప్పుడు నువ్వు కొంచెం శాంతంగా ఆలోచించ వలసింది."
గిరిజ మాట్లాడలేదు.
"ఒక్క విషయం అడుగుతాను, చెబుతావా?" అతను ఆధారంగా వెదురు కొమ్మని అనుకున్నాడు. సన్నని ఆకు అతడి చేతిని సుతి మెత్తగా రాసుకుని రక్తం కారసాగింది. గిరిజ ఆ ప్రాంతాన్ని నోట్లో ఉంచుకుని వెంటనే సమాధానం ఇవ్వలేదు.
"చెప్పు గిరీ. నీ కతడంటే ఎలాంటి అభిప్రాయమో చెప్పు నాతొ. నీకు ఇష్టం అయితే నేనున్నాను ఈ పెళ్లి జరిపించేందుకు."
గిరిజ తలెత్తి అతని కళ్ళలోకి చూసింది. 'కారణంతతరాల వల్ల విదిపోయెం. ప్రేమలేఖలు రాసుకోవడం, కలిసి సినిమాలకి వెళ్ళడం, డ్యూయెట్లు పాడుకోవడం లాంటివి చేయలేదు. అతడంటే ఒకప్పుడు వల్లమాలిన అపేక్ష ఉండేది. ఇప్పుడు లేదు."
"ఎందుకనీ?"
"ద్వేషం వల్ల."
"ఒకవేళ నాపట్ల నీకు ద్వేషం కలిగినా శిక్ష ఇదేనా, గిరిజా?"
నవ్వింది గిరిజ చిత్రంగా. "నాకు అపకారమే జరిగితే....అంతే !" అన్నది కాస్సేపు ఆగి.
మన్మోహన్ ఆపైన మరేమీ హరికృష్ణ విషయం లో ప్రస్తావించ లేదు. రెండు మూడు క్షణాలు మౌనం వహించిన మీదట గిరిజ తో , "అమ్మ మన ఇద్దరికీ సాధ్యమైనంత త్వరలో పెళ్లి చేయాలను కుంటున్నది. దానికి నీ ఇష్టా యిష్టాలతో ఎంతో సంబంధం ఉన్నది కనక కనుక్కుని రమ్మని పంపింది." అన్నాడు.
గిరిజ ఆశ్చర్యంగా చూసింది. తరవాత కను బొమ్మలు ముడివేసి, "ఎవరూ? అన్నది. అమ్మా? మీ అమ్మ మన పెళ్ళికి ఇష్టపడ్డారా? చాలా చిత్రంగా లేదూ?" అన్నది.
మన్మోహన్ నవ్వేడు. "చిత్రాని కేముంది? నాన్న గారి అజ్ఞ అమ్మ మీరలేదు. కానీ, నీ అనుమతి లేనిది చేయలేదు కద?"
"ఏవిటి, మీరంటున్నది? నాతొ పరిహాసం ఆడుతున్నారా? మీ నాన్నగారి అజ్ఞ ఏవిటి? నా కసలు అర్ధం కావడం లేదు."
శాంతంగా అన్నాడతను. "ఇంట్లో చాలా మార్పులు వచ్చేయి నాన్నగారు పోయేక. అయన అందరి ఊహలకి అతీతమైన మనిషి. నిన్ను నేను చేసుకోదలిచిన పక్షం లో వారికి ఎటువంటి అభ్యంతరమూ లేదు."
"అలాగా....' క్రమక్రమంగా ఆశ్చర్యం విడిపో సాగింది గిరిజ లో.
"నీ ఇష్టం చెప్పమని నేను కోరుతున్నాను."
గిరిజ వెంటనే సమాధానం ఇవ్వలేదు. మునిపంటితో పై పెదవి ని నొక్కి పట్టి తల దించుకుంది.
"నీ మౌనాన్ని నేను పొజిటీవ్ అన్సర్ గా తీసుకో వచ్చునా గిరీ?" అని అడిగేడు.
గిరిజ తల ఊపింది. సాయంత్రం దాటి చీకటి అలుముకోసాగింది ప్రపంచాన్ని. మన్మోహన్ హడావుడి చేస్తూ అన్నాడు: "పద, గిరీ. చీకటి పడే టైము కి పురుగూ పుట్రా దొర్లుతుంటాయి."
గిరిజ అతనితో ఏమీ మాట్లాడ లేకపోయిందా క్షణంలో. దారిలో మాత్రం అన్నది; "మీ దయా భిక్ష తో అనుకోకుండా నేను ఇంతటి దా న్నయెను. ఆ సంగతి నాన్నగారు రాసేవరకూ నాకు తెలియదు. ఇప్పుడు మీరు హటాత్తుగా పెళ్లి అంటున్నారు. నేను నిరుపేదను. పెళ్ళికి కావలసిన కనీసపు ఖర్చులు కూడా భరించ లేనిదాన్ని. పెద్దమ్మ ఏమంటుందో ? మీరు కనుక్కోవడం మంచిది కదా?"
మన్మోహన్ జాలిగా చూసేడు. "నువ్వే బెంగా పెట్టుకొనవసరం లేదు, గిరీ. అన్నిటికీ అమ్మ ఉంది. భరిస్తుంది. పుత్తడి బొమ్మలాంటి కోడలు ఏ ఖర్చూ లేకుండా ఊరికే రాదనీ అమ్మ ఎప్పుడో గ్రహించింది."
"మరి నా చదువు?"
"ఇంక కొన్ని నెలలే కద! నేను ఎఫ్. ఆర్. సి. ఎస్. పూర్తీ చేసి వచ్చేవరకూ నువ్వు డిస్పేన్సరీ చూస్తుండు." గిరిజ బుర్ర వంచుకుని ముందుకి నడుస్తూ కొంత దూరం వెళ్ళేక చీలిపోయింది. మన్మోహన్ మరో దారి పట్టెడు గృహోన్ముఖుడై.
ఇంటికి చేరుకొని మంచం మీద వెల్లకిలా పరుండి గతాన్ని తవ్వుకుంటుంటే నిరాశ గతాన్ని పూడ్చి వెయసాగింది. మమతల వేల్పులా మన్మోహన్ తల్లి కన్పిపిస్తుంటే వజ్రసదృశం లా హరి తల్లి కనిపించసాగింది. తన ఊహల పూల పల్లకిని కార్చిచ్చు లో తోసివేసిన తల్లి మరొకరైతే , తన పేక మేడల్ని కాంక్రీటు చేసి గాలీ ధూళి, పెను తుఫాను లకు సైతం చెదరనివ్వ కుండా ఆశా సౌధం చేసింది మరో తల్లి. పరమేశ్వరి ని పిలిచి విషయాలేవీ దాచకుండా చెప్పింది. ఆవిడ మనస్పూర్తిగా బిడ్డని ఆశీర్వదించి హృదయానికి హత్తుకుని, "అదృష్టం నీలోనే ఉంది." అన్నది నెమ్మదిగా.
పదిహేను రోజుల వ్యవధి లో గిరిజా, మన్మోహన్ ల పెళ్లి మహా వైభవంగా జరిగిపోయింది. రెండు వైపులా ఖర్చులను తనే భరించింది. అమరేంద్ర చక్రవర్తి భార్య. పెద్ద కోడళ్ళుద్దరి కన్నా మేలిమిచ్చాయ తో తను గృహ ప్రాంగణంలో అడుగు పెట్టిన చిన్న కోడలి వైపు ప్రేమగా చూసింది. కన్నతల్లి చూపుల్లో వెన్నెల కొట్ట వచ్చినట్లు కనిపించింది విద్యావంతురాలైన గిరిజ కి. పరమేశ్వరి కి వృద్ధాప్యం మీద పడ్డది. మన్మోహన్ తల్లి తమ దగ్గిర ఉండమని బలవంతం చేసినా స్వాభిమానం గల స్త్రీ కనక దూరం గానే ఉండేందుకు వెళ్ళిపోయింది. గిరిజ చదువుకి ఎటువంటి అవరోధాలు ఏర్పడలేదు. బెనర్జీ గారు అప్పు డప్పుడు వచ్చి పలకరించి వెడుతూనే ఉన్నారు. పెళ్లి అయిన తరువాత తల్లీ, అన్నగారూ, తమ్ముడూ కూర్చుని ఉండగా రమేష్ అక్కడికి వచ్చి తనూ సోఫాలో కూర్చున్నాడు. మన్మోహన్ పై చదువు గురించి మాట్లాడుతుంటే రమేష్ నెమ్మదిగా అన్నగారి వైపు తిరిగి అన్నాడు. "నువ్వు ఇంటికి పెద్దవాడి వన్నయ్యా. మన ఇంట్లో ఆడపిల్లలు లేరు. ఇప్పుడు మనల్నీ సమాజం వేలేస్తుందేమోననే భయం మనలో ఏ ఒక్కరికీ లేదు. అటువంటప్పుడు.........."
సతీష్ తమ్ముడి వైపు చూశాడు. "చెప్పు, మధ్యలో ఆగిపోయావేం? మీ ఇద్దరూ నా కన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు. లోకం తీరు మీకన్నా నా కెక్కువ తెలుస్తుందా? మీకు మంచిదని తోచింది నేను తప్పకుండా చేస్తాను."
"అమ్మ ఏ మంటుందో?' సంశాయంగా చూశాడు రమేష్.
ఆవిడ కొడుకు వైపు దృష్టి మరలించింది. "నేను ...నేనేమీ అనలేను. రమేష్. పెద్ద వాళ్ళయ్యేరు. మీ తరంలో జరిగే ఏ పనీ మా తరం లో ఎరిగి ఉండని కారణంగా ముక్కు మీద వేలు వేసుకుని గోరంతలు కొండంత లుగా వల్లించి చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు.... ఇప్పుడు కాలం మారిపోయింది. చెప్పు...నువ్వు చెప్పబోయేది కొంచెం ఊహించ గలిగెను."
"మరేం లేదమ్మా. శ్రీ కంఠంనికి ఉద్యోగం లేదు. గారాబంగా పెరిగిన మన అపర్ణ చిక్కి శల్యం అయి పోయి దారిద్ర్య దేవతని కౌగలించుకుంది. కొన్నాళ్ళు మన ఇంట ఉంచుకుందాం. ఒకవేళ మన చెల్లెలే ఇలా చేసి ఉంటె ఇంతమంది అన్నలం ఉండి నిర్దాక్షిణ్యంగా శిక్ష వేసేవాళ్ళం అంటావా, అన్నయ్యా?"
సతీష్ తల పంకించి 'అది వస్తుందంటావా?" అన్నాడు.
మన్మోహన్ పరమానందం అయింది. రమేష్ అతడి కంటే విప్లవ యోధుడిలా కనిపించ సాగెడు. సమాజాన్ని పాలిష్ చేసేందుకు అన్న లాంటి వాళ్ళు కొందరున్నా చాలు అనుకుంటున్నాడు మనసులో. పైకి "అన్నయ్యంటే దానికి చాలా గౌరవం , పెద్దన్నయ్యా. అతడినే పంపించే పిలిపిస్తే రాకపోదు." అన్నాడు. తల్లీ, వదినా, అన్నా అందరూ రమేష్ అభిప్రాయాన్ని దృడ పరిచేరు.
సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూ వస్తూ తలుపు తట్టెడు రమేష్ అపర్ణ ఇంటి ముందు ఆగి. తలుపు తెరిచి నిర్ఘాంత పోయింది. నువ్వు మా ఇంటికి తడబాటుతో గొంతులో మాటలు కరువయ్యాయి.
రమేష్ నవ్వి "నన్ను వీధిలోనే నిలబెట్టేసేవు" అన్నాడు.
అపర్ణ సిగ్గుపడి , "క్షమించు బావా! లోపలికి రా. ఇంతదూరం పనిగట్టుకుని వచ్చిన వాడికి లోపలికి మేం వేరే రమ్మనాలనుకోలేదు" అన్నది.
