Previous Page Next Page 
మిధ్య పేజి 25


    "ముసలి వాడు నవ్వి ఫలభారంతో నేలకి కుంగి పోతున్న చెట్ల వరసల్ని చూపించి, 'అవి మా తాతలు పెట్టినవి. ఆ చెట్టు నాకు జీవనోపాధి నిచ్చేయి. అలాగే రేపు నేను పోయేక, నా బిడ్డలూ, వారి బిడ్డలూ , ఆ బిడ్డల బిడ్డలు బ్రతికేందుకూ' అనేసి తన పనిలో మునిగి పోయేడుట. దొర సిగ్గుతో గుర్రం ఎక్కి 'చల్' మనిపించేడుట కదిలి వెళ్ళిపోతూ.
    "ఈ కూడబెట్టిన ధనం నాకోసం అనుకున్నారు నా బిడ్డలు. చదువు కుని కూడా నన్ను అర్ధం చేసుకోలేక పోయేరు. సౌదామిని వచ్చి నన్ను నిలదీసి 'నేనీ ఇంటి కోడల్నీ' అని ఉంటె, పోనీ పసివాడిని పంపించి  'తాతా' అనిపిస్తే మానవత్వం కరుడు గట్టుకు పోయేదా నాది? రమేష్ నేను పోయేక వస్తాడు. ఆ సంగతి నాకు తెలుసు. ఈ భవనం లోంచి బయటికి వెళ్లేందుకు వీలులేదనీ, అది నా శాసనం అనీ చెప్పు. రమేష్ ఉండడం ఇష్టం లేని వాళ్ళు వెళ్లిపోవచ్చును.
    "మనూ పెద్ద డాక్టరవబోతున్నాడు. వాడు తన డబ్బుతో విదేశాలు వెడితే రమేష్ ని ఆదుకోమను. వాడు పరోక్షంగా ఈశ్వరుడి కూతుర్ని చదివించడం కూడా నాకు తెలుసు. కొన్ని విషయాలు తెలిసి కూడా తెలియ నట్లుండడం లోనే పెద్దరికం నిలబడుతుందని నా అభిప్రాయం. ఈశ్వరుడి చావుకి వెళ్ళినందుకు మన్మోహన్ మీద విరుచుక పడడం నిజం కాదు. సతీష్ ఎదుట అలా చేయాల్సి వచ్చింది. అపర్ణ ఆ విధంగా పెళ్లి చేసుకుని ఉండక పొతే నేను నా కోడలి గా ఈ ఇంటికి తీసుకుని వచ్చే వాడిననుకోవడం కేవలం భ్రమ. ఆ పిల్లంటే నాకు అయిష్టమేమీ లేదు. భాగ్యవంతుల్ని మరీ భాగ్యవంతుల్ని చేయడమే నాకు అయిష్టం. నేను తినకుండా కూడబెట్టానని ప్రజ అనుకుంటుంది. నాలో జీర్ణించిన వ్యాధికీ, తిండికీ సరిపడదని డాక్టర్లు ఏనాడో నిర్ణయం చేశారు. మనిషిని ఏ మనిషి ఎప్పుడూ కూడా అర్ధం చేసుకోడు. అంతవరకూ దేనికి? పెళ్లి చేసుకుని కాపురానికి కాలు మోపిన ఇన్నేళ్ళ లో నువ్వేపాటి నన్ను గ్రహించేవు?
    "మనూకి తగిన పిల్ల అని నేను గ్రహించెను. డాక్టరు తప్పకుండా డాక్టర్ నే చేసుకోవాలనే నా సిద్దాంతాన్ని నువ్వు ఒప్పు కుంటావని తెలుసు, నీ చేతుల మీదుగా ఈ పెళ్లి జరిపించు. నేను చూడలేక పోయినా నా ఆత్మ సంతోషిస్తుంది.
    "ఇక నీకేం మిగిల్చాననుకుంటావేమో! నీకొడుకులు రత్నాలు. పెద్దవాడు కోడలి వల్ల ఆ విధంగా తయారయేడు కానీ మనం చాలా అదృష్ట వంతులం. నేను వెళ్లి పోయే ముందు నీకీసుదీర్ఘమైన లేఖ వ్రాసి తృప్తి పడుతున్నాను.
                                                                                       నీ వాడిని,'
                                                                                 -- అమరేంద్ర చక్రవర్తి."
    ఉత్తరం చూసి ఎవరికి వారే దిగ్భ్రాంతులయేరు. కన్న తండ్రి ఔన్నత్యాన్ని తెలుసుకోలేని మూర్ఖులమని వాపోయేరు. సతీష్ కళ్ళ ముందు తండ్రి నిలుచుని "ఇంటికి పెద్ద వాడివి. పునాది రాయి లాంటి నీ మీద కాబోయే భవననిర్మాణం ఆధారపడి ఉంది. జేష్టుడు తండ్రితో సమానం అంటారు. నువ్వు కళ్ళు తెరిచి నీ ప్రాణ సమానంగా చూసుకొన్న నీ తమ్ముళ్ళని అభివృద్ధి లోకి తీసుకురా!' అని అజ్ఞాపిస్తున్నట్లు కనిపించింది. అతను చుట్టూ చూసేడు. తన కన్నా చిన్నవాళ్ళ అయినా ఎంతో ఎదిగి పోయినట్లున్న తమ్ముళ్ళు బేలగా "అన్నయ్యా, రక్త సంబంధం వదులు కుంటావా?" అంటున్నట్ల నిపించింది. తల్లి దుఃఖం తో చిక్కి శల్య మై స్వర్గస్థుడైన తన భర్తను గురించి చింతిస్తుంది. కుముదిని ఇంటి అజమాయిషీ చేత బుచ్చుకుని సౌదామిని వైపు చిన్న చూపు చూడడం అతడు గమనించక పోలేదు. సతీష్ వీలునామా ప్రకారం వాటాలు పంచి పెట్టెక తల్లితో, "చూడమ్మా, నాన్నగారి పెద్దకర్మలు పెద్ద పెట్టున చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది" అన్నాడు.
    తల్లి కొడుకుని నఖ శిఖపర్యంతం చూడసాగింది.
    "ఎందుకమ్మా అలా చూస్తావు? ఊళ్ళో జనాన్ని పిలిచి ఘనంగా జరిపిద్దాం."
    "కుముదిని భర్తని పిలిచి నెమ్మదిగానే అన్నది "పోయినవాడు పోనే పోయేడు. మనం చేసే ఈసంతర్పణ వల్ల ఆయనకి ఒరగాబోయేది ఏమీ లేదు. ఒట్టి డబ్బు దండగ వ్యవహారం. మీరు నోరు మూత వేసుకోండి. మన పిల్లలు పెద్ద వాళ్లౌతున్నారు. వాళ్ళ భవిష్యత్తు సంగతి ఆలోచించడం నేర్చుకోండి. ఈ భవంతిలో అడుగు పెట్టేందు కైనా అధికారం లేదని మరిదిని శాసించిన పెద్ద మనిషి మనమే ఆక్రమిస్తామని తిరిగి రప్పించేడు. మనం ఎందుకు ఆలోచించాలి ఇటువంటి విషయాలు?"
    పూర్తిగా విన్నాక సతీష్ అన్నాడు: 'అయేయా నీ మాటలు? నాన్నగారు ఎటువంటి మనిషో తెలిశాక ఇంకా నీ మాటలు వింటూ నా వాళ్ళని కాదనుకొని బంధాల్ని తెంచు కునేందుకు మూర్ఖత్వం ఇంకా నన్ను అంటి పెట్టుకుని లేదు. నీకు ఆస్తి మీద మమకారం ఉంటె మీ వాళ్ళు నీకోసం రాసి ఇచ్చింది తీసుకుని దర్జాగా పుట్టింటికి వెళ్ళు, నేను కాదనను. పిల్లల భవిష్యత్ అంటావా? పరమేశ్వరుడు పైన ఉన్నాడు. నాన్న పెద్ద కార్యం మాత్రం విఘ్నం అయేందుకు వీలులేదు."
    కుముదిని కళ'వళపడిపోయింది. తను ఈ వాస్తవాన్ని నమ్మలేక పోతుంది. తన భర్తేనా ఈ మాటలు అంటున్నది? విచిత్రంగా ఉన్నది ఆవిడకి.
    ఈ విషయం చర్చించేక తమ్ముళ్ళు ఇద్దరూ చెరో ఇరవై వేలూ ఇస్తామన్నారు. సతీష్ పాతిక వేలు ఖర్చుచేసి నగరం ఆశ్చర్యం తో మునిగి పోయే విధంగా పెద్ద ఎత్తున సంతర్పణ చేసి బ్రాహ్మణులకి గోదానం, కొంతలో కొంత భూదానం చేశాడు.
    ఇదివరకు చీలిపోయిన సంసారం తండ్రి మరణంతో సుఖంగా, సంతోషంగా కళకళ లాడుతూ కన్నుల పండువు గా ఉన్నది. ఇక వృద్దురాలి సమస్య మన్మోహన్ పెళ్లి గురించి. మంచిరోజు చూసుకుని పరమేశ్వరీ కాళికి కబురు చేయాలని నిశ్చయించింది. రమేష్, సతీష్, మనూ ముగ్గురూ ఇంటి ఆవరణ లో తోటలో కూర్చుని మాట్లాడు కుంటుంటే , కోడళ్ళు ఇద్దరూ పేకాట అడుకుంటుండగా , మనవలు బయట గోలగా సైకిలు పందేలు వేసుకుంటూ ఉంటె ఆవిడ రమేష్ చిన్న కూతురు ఆరు నెలలైనా నిండని శ్రేకాళిని ఎత్తుకోవడం లోనో, లేదా రామాయణం పారాయణం చేయడం లోనో తృప్తి ని పొందుతుంటుంది. అప్పుడప్పుడు "ఆయనే ఉంటె?" అనుకోవడం కూడా జరుగుతుంటుంది.
    "ఏం మనూ, నాన్నగారు పోయేక ఇల్లు కదల్లేదు మీరు. ఆ పిల్ల వచ్చినప్పుడు మీరు మధ్యాహ్నం నిద్రపోతున్నారు. నీ ఇష్టం తో నాకెలాగూ ప్రమేయం లేదు. ఆ పిల్ల ఇష్టాల్ని మనం కనుక్కోవాలి కద? ఒక్కసారి వెళ్లి సాయంత్రం కనుక్కుని రా. ఈరోజు చాలా మంచిది కూడా." కొడుకుని పిలిచి ఆవిడ చెప్పగానే వదిన లిద్దరూ వేళాకోళం ఆడేరు. కుముదిని నవ్వుతూ అంది: "చూడు, సుధా! ఆ పిల్లకి ఓ చెవి చాలా గుంట పోయింది. మొహం ఎంత బావుంటే ఏం? మన మరిది చంద్రబింబం అని ఉవ్విళ్ళూరుతూ తెగ మురిసి పోతున్నాడు.'సౌదామినిని ఆవిడ ఆప్యాయంగా "సుధా" అంటుంది. కాలంతో పాటు కల్మషాలు కరిగి పోయి రక్త సంబంధం పటిష్టం కావడం లో అర్ధం ఎంతైనా ఉన్నది.
    "నేను సరిగా చూడలేదక్కయ్యా. అప్పుడు చెప్పి ఉంటె ఫోటో తీసి మరిది గారికి ప్రెజెంట్ చేసేదాన్ని ఆ చంద్ర బింబాన్ని." కుముదిని తో వంత పాడింది సౌదామిని.
    ఇద్దరి మాటలకి ఆగి నవ్వుతూ సమాధానం ఇచ్చేడు మన్మోహన్: "అప్ప చెల్లెళ్ళు ఇద్దరూ ఏకం అయి అంతటి రంభ ని ప్రెజెంట్ చేస్తుంటే కాదంటావా? కానీ, వదినా , మీరు చంద్రుడి తో పోల్చి నేను మురిసి [పోతున్నా ననుకుంటున్నారు. అసలు మీకీ సంగతి తెలుసా?"
    అక్క చెల్లెళ్ళు ఇద్దరూ ఒకసారే అడిగేరు: "ఏ సంగతీ?"
    "చంద్రుడు మీరనుకున్నంత అందంగా ఉండడని."
    కుముదిని చిన్నగా నిట్టూర్చింది. "నేను చదువుకోలేదు, మరిదీ. నాకేం తెలుస్తుంది? చంద్రుడి ని మా వాళ్ళందరూ అందంగా ఉంటాడని కీర్తిస్తుంటే "ఓహో" అనుకోవడం తప్ప నాకు తెలియదు."
    "చంద్రుడి మీద మన వాళ్ళు కాలు పెట్ట పోతున్నారమ్మా. అక్కడ మీరనుకున్నంత అందం లేదు-- ఇక్కడి లాగే కొండలు, గుట్టలూ తప్ప."
    సౌదామిని అందుకున్నది" "అచ్చా! భూగోళం తిరగేసి మమ్మల్ని మభ్య పెట్టకు. నీ పెళ్ళాం బావుండదంటే బావుండదు ముమ్మాటికీ."
    మన్మోహన్ ఓడిపోయినవాడిలా వదిన గార్లకి రెండు చేతులూ జోడించి నమస్కారం చేశాడు. "బావుండదు, వదినా. ఒప్పుకుంటున్నాను. నాన్నగారు ఉత్తరం లో నా కోడళ్ళు ఇంటికి దీపాలు అని రాశారు. మీ కాంతి లో ఆవిడ నా కళ్ళకి కనిపిస్తే అంతే చాలు" అంటూ వెళ్లిపోయేడు.
    కుముదినికీ, సౌదామిని కి ఆ పిల్ల ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఉంది. అందంగా, మంచి చదువుతో మరిదికి తగిన స్థాయి లో కాబోయే తోటి కోడలు గురించి అక్క చెల్లెళ్ళు ఇద్దరూ చెప్పుకుని మురిసి పోతుంటారు.
    సాయంత్రం అయింది. చేపలు పట్టడం అంటే మన్మోహన్ కి చాలా సరదా. ఇంట్లో చేపలు వండినా అతను తినడు. ఆ వాసన అతనికి గిట్టదు. వాటిని పట్టి తీసుకు వచ్చేందుకు ఒక్కో రోజు సమయం తెలియక భోజనం కూడా మానేస్తాడు. అతన్ని ఎప్పుడైనా కలుసు కోవాలంటే గిరిజ అక్కడే కలుసు కుంటుంది. చెరువు ప్రాంతంలో వెదురు చెట్లు గుబురుగా పెరిగి మనిషిని కప్పేసే గుప్త స్థలాన్ని ఏర్పాటు చేస్తాయి. అక్కడక్కడ. అతను చెరువు దగ్గిరికి కావలసిన సరంజామా తీసుకుని సైకిలు మీద వచ్చేడు. దూరంగా అక్కడక్కడ రేవులో నీళ్ళు తీసుకు వెడుతున్నారు. చెరువు గట్టు దగ్గర రోజూ ఉండే ఆడంగులు లేరప్పుడు దేనికో. అతను చెరువులో ఎర గుచ్చిన గాలాన్ని విసిరేసి పరధ్యానంగా నీటి బిందువుల్ని చూస్తున్నాడు. అతనికి ఆలోచనలు రాసాగాయిక్రమంగా. గిరిజ ఏది? క్షణ క్షణానికి వాచీ చూసుకుంటున్నాడు.
    "నన్ను క్షమించు. నాకు ఏ విషయమూ తెలియదు. ఇన్నేళ్ళూ నీ ఆరాధనలో గడిపెను జీవితాన్ని. నువ్వు లేనిదే బ్రతకలేనేమో అనుకున్నాను. అమ్మ చేసిన పని నాకు తెలియనే తెలియదు." అది పురుష కంఠం. ఉలిక్కిపడ్డాడు మన్మోహన్. దగ్గర్లోనే వినిపిస్తున్నాయి మాటలు. అతనికి ఈ ప్రేమ పాఠాలు వినాలనే కుతూహలం రెట్టింపు కాసాగింది.
    "మాట్లాడు. నీకోసం మరి కొన్ని రోజులుండమన్నా ఉంటాను. కానీ, నువ్వు నాకు కావాలి."
    స్త్రీ కంఠం కిలకిలా నవ్వింది. ఆ నవ్వుకి చెట్ల మీదకి పక్షులు వచ్చి వాలుతున్నాయి. ఆ నవ్వు చాలా సుపరిచితమైన గిరిజది. మన్మోహన్ కి నేల కదులుతున్నట్లుంది. పరోక్షంగా పరుల మాటలు వినకూడదని మనసు చెబుతున్నా గిరిజ 'నాది' అంటుంది మనసు. అతను నిగ్రహాన్ని కోల్పోయి అక్కడే కూర్చుండి పోయేడు ఆ మాటల్ని ఆలకిస్తూ. చెరువులో విసిరిన గాలం నీటిలో కొట్టుకు పోతున్నా లక్ష్య పెట్టడం లేదతడు.
    "అబ్బ! ఇన్నేళ్ళు నువ్వు మనిషివి కావు. నీకోసం నేను దిగులు పడకుండా హాయిగా బ్రతుకుతున్నాను. నీ మీద నాకు కొంచెం కూడా అభిమానం, అనురాగం లాంటివి లేవు. చెప్పా పెట్టకుండా పారిపోయిన నీ లాంటి వాళ్ళంటే పరమ అసహ్యం నాకు."
    "నా పరిస్థితి ని నువ్వు అర్ధం చేసుకోవడం లేదు." అన్యాయంగా నన్ను దోషిని చేసి నిలబెడుతున్నావనిపిస్తోంది. ఎంత శ్రమ పడి నేను ఇక్కడికి వచ్చెనో ఒక్కసారి ఆలోచించు."
    వ్యర్ధంగా నవ్వింది చిన్నగా శబ్దం చేస్తూ. 'హు ఆలోచన. తీరికగా అలోచించినన్ని రోజులూ నీ అయిపే లేకుండా పోయింది. గుండెల్లో గుడి కట్టుకుని ఎంత పూజించేనో భగవంతుడికి తెలుసు. రేపు మీది ఆశతో చాలా రోజులు గడిపెను. ఆరేపు మరో రూపంలో అదృష్టాన్ని వెంట బెట్టుకుని రాగానే నీ నిజస్వరూపాన్ని మాటిమాటికీ మననం చేసుకోసాగెను. చివరికి నీ రూపం కూడా క్రమంగా కనుమరుగై కాలచక్రం లో నలిగి పోయింది. ఆ మాటని ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అసలు నువ్వెవరివో నాకు తెలియదు." గిరిజ ఆ మాటల్ని అని పెద్ద పెట్టున ఏడవ సాగింది.
    హరికృష్ణ నెమ్మదిగాచాలా శాంతంగా అన్నాడు: "నువ్వు నన్ను మరిచి పోలేదు. అలా చేయలేవు కూడాను. నువ్వంటే నాకెంత ఇష్టమో దానికి పదింతలు నేనంటే నీకు ఇష్టం. లేకపోతె నువ్విలా ఏడవవలసిన అవసరం లేదు. నిజం చెప్పు, నేనంటే నీకు కోపం తప్ప మరేమీ లేదా?"
    "ఛీ! నన్ను ముట్టుకోకు. నువ్వంటే కోపం కాదు, మీ అమ్మ మీద పగ, నీ మీద పగ; మీ మొత్తం వంశం మీదే పగ!"
    "గిరిజా!"
    "ఏం, ఆశ్చర్యంగా ఉందా? ఆరోజు పసి గుడ్డుని నన్ను పాలిచ్చి పెంచి పెద్ద చేసి చివరికి ఆ పాలల్లో విషం కలిపి నన్ను నిలువునా అన్యాయం చేసింది. ఆవిడ పోసిన పాలే విషంగా మారి నన్ను కలుషితం చేశాయి నీ విషయంలో. దయచేసి నువ్వు వెళ్ళిపో. నాకీ జన్మకి కనిపించకు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS