Previous Page Next Page 
మిధ్య పేజి 24


    ఈ ప్రపంచంలో అనుకున్నవి ఎప్పుడూ కావు. అనుకోని సంఘటనలే హటాత్తుగా జరిగి పోతుంటాయి. బాగా బ్రతక గలం అనే ధీమాలో ఉన్నవాళ్ళు రెండు రకాలు. ఒకటి ధనిక వర్గం, రెండు అవినీతివర్గం. కాలం సవాల్ చేస్తున్నప్పుడు మాత్రం ఏ వర్గం అయినా లొంగి పోక తప్పదు. కొందరికి భోజన పదార్ధాలు ఎక్కువై అజీర్ణమైతే మరికొందరికి ఆకలి దప్పులకి అల్లల్లాడి పోయే జీర్ణవ్యాదేదో సంక్రమిస్తుంది. క్రింద ఆసరా చూసుకోకుండానే కొంతమంది ఆకాశాని కి నిచ్చెనలు వేస్తుంటారు. ఇవన్నీ మామూలుగా నిష్కల్మషంగా బ్రతికే ఏ ఒక్కరికీ అనువర్తించవు. అమరేంద్ర చక్రవర్తి గల్లా పెట్టె ముందు , ఇనుప బీరువా ముందు కుర్చుని ;లెక్కలు బేరీజు వేసుకుంటూ తాదాత్మ్యం చెందుతూ పైసాకి పైసా కూడగానే ఉబ్బి ఉప్పొంగి తనని తాను మరిచి , సర్వం మరిచి , అన్నాహరాలు మాని త్రిశంకు స్వర్గం లో విహరిస్తుండగానే హటాత్తుగా అతడికి వైద్యుల కే అంతు చిక్కని విచిత్రమైన వ్యాధి సంక్రమించింది. అతడు మొదట్లో డీలా పడిపోయేడు. అయినా మంచాన్ని బీరువాకీ, గల్లా పెట్టెకి దగ్గరే వేయించుకుని కొంతలో కొంత తృప్తి పడ్డాడు.
    ఈశ్వర చంద్రుడు పోవడం అతనికి తెలుసును. అయినా అతను దార్ధ్యం లో ఉన్నా పరామర్శకి వెళ్ళలేదు. సాధారణంగా పేదవాడు చనిపోతే కొంత ధనం చందా మూలంగా రాబట్టగలుగుతారు ఆత్మీయులు. ఈశ్వరుడు మరీ అడుక్కుతినే దశలో పోలేదని గ్రహించలేక పోయేడు అమరేంద్ర చక్రవర్తి. అతడి చావుకి రమేష్ వెళ్ళడం, బెనర్జీ గారు కర్మకాండ పూర్తీ చేయడం తెలుసుకొని ఇంట్లో నాలుగు గోడల మధ్య రమేష్ ని అప్రాచ్యుడిని చేస్తూ నానా దుర్భాష లాడాడు పెద్ద కొడుకు సతీష్ అందుకు మద్దతు ఇచ్చేడు. అతను చిందులు తొక్కుతున్న సమయం లోనే సతీష్ కుముదిని తను గది ద్వారం దగ్గర నిలుచుని కుముదిని బలవంతంగా తోస్తుంటే సతీష్ ఉండబట్ట లేక , భార్య భయం వల్లనో, మన్మోహన్ వైద్యం చేసిన సంగతీ, ఆ రోజు అక్కడే ఉన్న సంగతీ వెల్లడి చేశాడు. దానితో అతడు నిప్పు తొక్కిన కోతి మాదిరే అయేడు. మన్మోహన్ గడప లో కాలు పెట్టగానే కడుపు నిండి పోయేటట్లు చివాట్లు పెట్టేడు. ఆ తరవాతే అతనికి అంతు చిక్కని వ్యాధి సంక్రమించింది.
    సతీష్, భార్యా ఇద్దరూ తండ్రికి తగని సేవ చేస్తున్నారు. చనిపోయే మనిషి ద్వారా పొందబోయే లాభాన్ని బేరీజులు వేసి మరీ అతడికి ఉపచర్యలు చేస్తున్నారు.
    తల్లి మన్మోహన్ ని చేరబిలిచి అన్నది: "ఇదంతా వట్టి నటన అనీ, ఈ సేవలో అంతర్యం డబ్బు అనీ అయన గ్రహిస్తే ఎంత బాగుండిపోయేది! గొర్రె కసాయి వాడిని నమ్ముకున్నట్లుంది వరస. కడుపు చింపు కుంటే కాళ్ళ మీద పడుతుంది. చేతి వ్రేళ్ళు అన్నీ సమానంగా ఉండనట్లే అందరూ తలో దారినా పుట్టేరు. ఇప్పుడని పిస్తుంది-- ముగ్గురు మొగపిల్లల బదులు ఆ భగవంతుడు ఒక్క ఆడపిల్ల నిచ్చినా బాగుండి పోయేదని!"
    ఆవిడ కన్నీటిని మన్మోహన్ కొనగోటి తో మీటి, "నీకు ఇప్పడు తక్కువేం జరిగిందమ్మా? నీకే లోటూ రానివ్వము మేము. ఎవరి స్వభావాలు వారివి. దానికి నువ్వెందు కమ్మా బాధపడడం?' అన్నాడు.
    ఆవిడ చిత్రంగా నవ్వి, "రెండు కాళ్ళ మీది బరువు సమానంగా అన్చుతాం, నాయనా. ఒకే కాలుకి సుఖాన్నిచ్చిందుకు శరీరం ఒప్పదు కదా?' అన్నది.
    "నాకు అర్ధం కాలేదమ్మా!"
    "మీలాంటి వాళ్ళకి అర్ధం కావు, సుమా. రెండో వాడు వెళ్లిపోయేడు. ఏం తింటున్నాడో, ఎలా ఉంటున్నాడో! పెద్ద వాడి సంగతి చూస్తూనే ఉన్నాం కదా? గోతి దక్కర నక్కాలా కూర్చుని తండ్రి చావుకి వ్రేళ్ళు లెక్క పెట్టుకుంటున్నాడు. నువ్వౌ పని చేయరాదా?"
    తల్లి ఆసక్తి ని అతను శ్రద్దగా గమనించి, "ఏం చేయమంటావమ్మా?" అని ప్రశ్నించేడు.
    "మరేం లేదు. రమేష్ దగ్గరికి వెళ్లి ఈ సంగతి చెప్పు. ఆస్తి పాస్తులకి ముగ్గురూ సమాన హక్కు దారులే. మంచి లాయరు తో సంప్రదించి...." ఆవిడ మాటలు పూర్తీ కానే లేదు. అమరేంద్ర చక్రవర్తి పెద్ద కేక పెట్టాడు అదిరిపోయేలా. భవంతి ఒక్కసారి కదలలేదు కదా అనిపించిందా క్షణం లో. ఆవిడ పరుగు పరుగున భర్త దగ్గరికి వెళ్ళింది. అప్పటికే అతనికి ఊపిరి క్రింద మీద అవుతున్నది. చెప్పదలుచుకున్న విషయాల్ని గొంతు లోంచి రానివ్వడం లేదు భగవంతుడు. అతని మాట పడిపోయింది. తలగడ క్రింద ఉన్న కాగితాలు తీసి భార్య చేతిలో ఉంచేడు. అంతా క్షణాల మీద జరిగిపోయింది. భర్త శవం మీద పడి ఆవిడ భోరున విలపించసాగింది. ఆవిడ శోకం పూర్తీ కాకమునుపే అయన జీవం లేని శరీరాన్ని కొడుకులు ముగ్గురూ కాటికి పంపించి కర్మకాండ పూర్తీ చేసి ఇంటికి వచ్చేరు.
    తండ్రి పోయిన వార్తా విని రమేష్ పరుగుపరుగున వచ్చేడు. సతీష్ చూపుల్లో నిప్పులు చేరుగుతున్నాయి.  అతడిని ఆపే అధికారం ఇంటి పెద్ద కొడుకుగా తనకి ఉన్నదని భ్రమించేడు. కానీ లాయరు చదివిన ఆస్తి పంపకాలు విని నిర్వీన్నుడైపోయేడు.
    బ్రతికి ఉన్నన్ని రోజులూ కుడి చేతి మెతుకులు కాకికి విడల్చడన్న కీర్తిని ఆర్జించుకున్న ఆ మహాశయుడు చచ్చిపోయేక చేసిన పనికి ఊరూ వాడా నిర్ఘాంత పోయేరు.
    "నా ఆస్తిని నాలుగు భాగాలుగా చేసి మూడు భాగాలు నా కొడుకుల కీ, ఒక భాగం నా భార్య కి చెందేటట్లు చూడవలసింది. నా భార్య అనంతరం ఆవిడకి చెందిన భాగం అనాదాశ్రమానికి ఇవ్వబడును. ఇది నేను స్వహస్తాలతో బుద్ది పూర్వకంగా వ్రాసిన వీలునామా!"
    అయన కొడుకులకి కూడా విడిగా వ్రాసేడు. సతీష్ ఉత్తరాన్ని చదువుకుని మండిపడ్డాడు. రమేష్, మన్మోహన్ తాపీగా వాటిని భద్రంగా తమ బీరువాల్లో దాచుకున్నారు. అయన భార్య ఉత్తరం లో ఇలా వ్రాశాడు:
    "బ్రతికి ఉండగా కాకాలు పట్టి డబ్బుని స్వాహ చేసే మనుష్యు లంటే నాకు పరమ అసహ్యం. నా ఎదుట నువ్వు ఇంద్రుడి వీ, చంద్రుడు వి అని  కీర్తించి నేను పోయేక నా విషయంలో దుర్భాష లాడే ఈ మనుష్యుల్ని నేనెప్పుడూ నమ్మను. నాకోసం సతీష్ , భార్యా చాలా శ్రమ దానం చేశారు. కానీ నేనేం చేయగలను ఇందుకు? డబ్బు కోసం వాళ్ళు చేసే సేవలకి కిమ్మత్తు కట్టడం నా వల్ల కాలేదు. అందుకే కృతజ్ఞతలు తెలుపు కుంటాను. కొడుక్కూ, కోడలికీ కృతజ్ఞతలేమిటి? అనవచ్చును. అంతకుమించి నేను ఏమీ చేయలేను కనక.
    "రమేష్ బుద్ది మంతుడని నాకు తెలుసు! 'తప్పు చేశాను, క్షమించు' అని నా దగ్గరికి వస్తే నే నంత మూర్ఖుడి నా దండించేందుకు? ఇష్టమైన పిల్లతో నా బిడ్డ సుఖ పడుతుంటే ఆ తృప్తి వాడి కన్నా  నాకే పది రెట్లు ఎక్కువని ఎలా తెలుస్తుంది? అన్నట్లు వాడికి మగపిల్లవాడే కద. ఆ పిల్లడు పెరిగేక వాడి సుఖం చూస్తూ తను ఆనందం పొందుతుంటే ఈ నిర్భాగ్యుడైన తండ్రి గుర్తువస్తే అంతే చాలు. డబ్బుని నేను పోతూ పోతూ తీసుకు పోను కద? ఆ పిల్లల కళ్ళకి తండ్రి పిసిని గొట్టు గానే కనిపిస్తాడు. తండ్రి అంతరంగం వీళ్ళ కేలా తెలుస్తుంది? వెనకటికి ఓ ఇంగ్లీషు దొర పల్లెల్నీ తనిఖీ చేసేందుకు వెళ్ళాడట. ఓ చోట వృద్దుడొకడు నేల తవ్వి చదును చేసి మామిడి మొక్కలని ఒంటి మీద బట్టసైతం లేకుండా అతడు పడుతున్న అవస్త్జ చూస్తె దొరగారికి జాలి వేసి, "చూడు తాతా! నేనిలా అంటున్నందుకు బాధపడకు. నీ జీవిత కాలం అయిపోయింది కదా? నువ్వెందు కింత శ్రమ పడుతున్నావు? ఈ చెట్టు పెరిగి పెద్దదై కాయలు కాచి నీకు ఫలితాన్ని ఇచ్చేవరకూ ఉంటావనే నమ్మాకం ఉందా?" అని అడిగేడుట.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS