Previous Page Next Page 
మిధ్య పేజి 23


    అన్న మాటల్నీ శాంతంగా విన్నాడు ఈశ్వర చందుడు. కూతురి శిరస్సు మీద చేయి వేసి, "యుక్త వయసు వచ్చినా పెళ్లి చేయలేక పోయెను. తండ్రి మీది కోపంతో తప్పాటడుగు వేశాను. కులాన్ని చెడ గోట్టుకుని అయిన వారందరికీ కానివాడనయ్యాను. తెప్ప మీద కాలు, గట్టు మీద కాలు వేసి ప్రయాణం ఎగుడు దిగుడు గానే సాగించెను. మమత చంపుకోలేక పుట్టిన ఊరు వెళ్లాను. నీలో ప్రేమని రగిలించెను. మహేశ్వరి ఒప్పుకుని  ఉంటె సుఖంగా ఉండక పోయేదానివా , అమ్మా?" అన్నాడు.
    గిరిజ తండ్రి వైపు పరిశీలనగా చూసి, "నీ బాధ ఇదా, నాన్నా? అత్త ఎందుకు కాదన్నది?' అని అడిగింది. చాలా కాలంగా ఈసమస్య తలెత్తి ఈ వేళ కార్యరూపం లోకి వచ్చింది.
    "మహేశ్వరీ , నేనూ ఆదుకుని పెరిగి పెద్దవారమయ్యెం. ధనం మనిషి కళ్ళకి తెరలు కప్పి అంధుడిని చేసింది. నా తండ్రి మహేశ్వరి ని ఆనాడు నిన్ను మహేశ్వరి అన్న మాటలే అని అవమానించేడు. నాకు అవకాశాన్ని ఇవ్వకుండా కట్టుకధ అల్లి చెప్పేడు. తరవాత అమ్మ ద్వారా నిజం తెలుసుకునే సరికి చేయి దాటి పోయింది. మహేశ్వరి పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయింది.
    "నేను  మిలిటరీ లో చేరాను. కర్నల్ నందన్ లాల్ కూతురి గౌరీ ని చేసుకున్నాను. కులభ్రష్టుడినయ్యేనని వెలి వేశారు. నేను శాఖాంతరం కూడా చేసుకోలేదు ఆ మాటకి వస్తే -- అదేదో జరిగిపోయింది. ఆ పగతో ప్రతీకారం తీర్చుకుంది మహేశ్వరి. హరికృష్ణ అమాయకుడు."
    "పోనీలే, నాన్నా, ఇప్పుడవన్నీ ఎందుకు. నాకసలు ఆ విషయాల్లో అంత శ్రద్ధ లేదు!' గిరిజ పెదాలు వణికేయి. మనసులో అపురూపంగా చిత్రించుకుని ఆరాధిస్తూ వచ్చిన ఆ పటాన్ని అంత తేలికగా మాటల తోనే తీసి వేయగలిగింది అని గ్రహించేడు ఈశ్వర చంద్రుడు.
    "అన్నయ్యా!" భారంగా వస్తున్నాయి అతని మాటలు. "నువ్వు ఇన్నాళ్ళూ నాకు చేసిన సహాయానికి కృతజ్ఞుడిని. నేను పోయేక ఇది చదువుకో, తల్లీ. మన్మోహన్! చిన్నవాడివి అయినా నీకు భగవంతుడు పెద్ద బుద్ది ఇచ్చేడు. నాకు ఇప్పుడు ఏమీ చింత లేదు. హాయిగా ఉంది ప్రాణం!" ఈశ్వరచంద్రుడు వాగ్దోరణి ని ఆపే ప్రయత్నం చేయడం లేదు. గిరిజ వైపు చూస్తుంటేనే అతడి కళ్ళల్లో గట్లు తెంచుకుని ఉద్రిక్తంగా తరలి ప్రవహిస్తుంది కన్నీటి వరద.
    "మావయ్యా!" మన్మోహన్ గిరిజ పక్కన కూర్చోగానే అందరూ నిర్ఘాంత పోయేరు. ఈశ్వరచంద్రుడు బలవంతంగా కళ్ళు తెరిచేడు రెండు నిమిషాలకి. "నీ బెంగ నాకు తెలుసును, మావయ్యా! గిరిజ గురించే కద? నా మీద నమ్మకం ఉంది కద?"
    ఆయన తల ఊపాడు ప్రగాడ విశ్వాసంతో.
    "గిరిజ ను నేను పెళ్లి చేసుకుంటాను."
    "మనూ!' ఈశ్వర చంద్రుడు ఆశ్చర్యంగా నోరు తెరిచేడు. "మీ నాన్న....అన్నయ్యా!" అతని మాటలు అసంపూర్తిగా ఉన్నాయి.
    బెనర్జీ గారు ఈశ్వర చంద్రుడి చేతిని అందుకుని, "ఈ అన్నదమ్ముల్లో మాట తప్పని వాళ్ళు వీళ్ళిద్దరే, తమ్ముడూ. నీకు అంత భరోసా ఇస్తుంటే ఇంకా దిగులు దేనికి? ఆ తరవాత సంగతి అంటావా? నీ పిల్లకి కష్టం రాకుండా నేను చూసుకుంటాను!' అన్నాడు.
    ఈశ్వర చంద్రుడి మొహం లో సంతోష రేఖలు నృత్యం చేస్తున్నాయి. ఈశ్వర చంద్రుడికి సమయం ఆసన్న మయింది. వార్త విని భార్యతో వచ్చేడు రమేష్. అతని తల వైపున నిలుచున్న భార్యా భర్తలని తృప్తిగా చూశాడు ఈశ్వరుడు."తమ్ముడు మనూ ఏమన్నాడో విన్నావా..."
    "ఆ అంతా విన్నాను. మీరు బెంగ పెట్టుకోవద్దు. గిరిజ మాస్వంత బిడ్డ లాంటిది." రమేష్ హామీ ఇస్తున్నవాడిలా చేయి అందుకుని అయన చేతిలో తన చేతిని ఉంచేడు.
    అయన ఏదో చెప్పాలని ప్రయత్నం చేశాడు. లాభం లేకపోయింది. తలగడ కింద దాచిన కవరు పదిలంగా కూతురికి ఇచ్చేడు. అయన మాట అప్పటికే పడిపోయింది. గుండెలు శర వేగంతో కొట్టుకుంటున్నాయి. ఎగశ్వాస తో తల ఎగర వేస్తుంటే మన్మోహన్ తులసి తీర్ధం గొంతులో పోశాడు. ఋణ దాత వైపు చూస్తుంటే అయన కన్నుల్లో నీరు ఉబికింది. చెవుల్లో శాశ్వతంగా ఘడియలు పడిన కాస్సేపటికి కళ్ళు మూతలు పడ్డాయి. ఆ తరవాత తలపుల తలుపులు బంధైపోయినాయి. అతని హృదయ కుహరం లో ప్రాణి బిగుసుకు పోయి రెక్కల్ని విదిపించ లేక ఉక్కిరి బిక్కిరి కాసాగింది. కొంత సేపయేక నోరు తెరుచుకుంది ఆప్రయత్నంగా. అందులోంచి విహంగం ఎగిరి వినువీదుల్లోకి పారిపోయింది. గిరిజ చూస్తుండి పోయింది. ఇంతసేపు అప్రతి భూరాలై . తండ్రి పోయేడనితెలియగానే  అయన హృదయం మీద పడి పెద్ద పెట్టున ఏడవ సాగింది.
    కొంతసేపు ఏడ్చేక కన్నీరు ఆవిరి అయిపొయింది. ఏడ్చి ఏడ్చి అలిసిపోయిన గిరిజని పరమేశ్వరి ఏడుపుని ఆపేసి ఓదార్చ సాగింది. ఆ రాత్రి మన్మోహన్ తప్ప తక్కిన పరివారం అంతా శవాజాగరణ చేయసాగేరు.
    బ్రతికి ఉన్నప్పుడు మరి కాస్సేపు కూర్చోమని తొందర చేసిన మనుషులే చచ్చిపోయేక త్వరత్వరగా పంపించేందుకు సిద్దపడతారు. బెనర్జీ గారే క్రతువు ప్రారంభించి ముగించేందుకు శ్మశానం వైపు బయలు దేరారు. బ్రాహ్మణులూ కనక కొంతమంది శ్మశానం వెళ్ళేరు. అగ్ని హోత్రుడి కి ఒప్పగించి స్నానాలు ముగించి తరలి వెళ్ళిన వారంతా గృహోన్ముఖులయేరు.
    గిరిజ పదిహేనురోజుల దాకా ఎటూ వెళ్ళలేక పోయింది. ఏమిటి చేయడం?ఇప్పుడు తమకి దిక్కు ఎవరు? అనే ఆలోచనలతో సతమతమవసాగింది..... మన్మోహన్ మాటల మీద నమ్మకాన్ని ఉంచుకోలేక పోతుంది. హరికృష్ణ ఎన్ని వాగ్దానాలు చేశాడు? చివరికి చెప్పకుండానే వెళ్ళిపోతే తనేం చేయగలిగింది? జీవితంలో నిరాశ కే ఎక్కువ అవకాశాలు ఉన్నప్పుడు ఆశలు అల్లుకోవడం దేనికి? అనుకోసాగింది. పరమేశ్వరి గిరిజని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్నది.
    ఆ రోజు కాలేజీ కి వెళ్లి తిరిగి వచ్చి తండ్రి తనకు ఇచ్చిన ఉత్తరాన్ని విప్పి చదవ సాగింది. ఈజీ చైయిర్ లో వెనక్కు వాలి ఉత్తరాన్ని చదువుతుంటే కన్నీటి బొట్లు మంచు బిందువుల్లా చెంపల్ని తడుపుతున్నాయి.
    "అమ్మా....గిరీ!...."
    ఆయనకి ప్రేమ ముంచుకు వచ్చినప్పుడు అలాగే సంబోధించే వాడు.
    ".........ఈ ఉత్తరం పూర్తిగా చదివేక నీ నిర్ణయం లో సబబుగా ఏది తోస్తే ఆ విధంగా చేయి. "ఆకాశంబున నుండి....గంగా కూలంకష' ప్రవాహం లాగే అయిందేమో నా జీవితం అనిపిస్తుంది. విధిని ఎవరూ తప్పించలేరు. జరిగిందేదో తిరిగి రాదు. హరికృష్ణ ఎప్పటి కైనా నిజం తెలుసుకుంటే ఈ ఊరు తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. గతం గురించి రకరకాలుగా తీయని కబుర్లు వినిపిస్తాడు. అతని తప్పు లేదనుకో. అయినా న్యాయం, ధర్మం అంటూ ఇంకా ప్రపంచం లో ఉన్నాయి కద?
    నిన్ను ఎవరు చదివించేరో అంతా ఆశ్చర్యంగా ఉంది. నేను ఆ రోజు రమేష్ ఇంటికి వెళ్లాను. చిత్రం! నేను అక్కడ మన్మోహన్ ని చూసేను.... వీధి వరండా లో ఆగిపోయెను....'నిజం చెప్పు, తమ్ముడూ నువ్వా పిల్లకి ఎందుకు సహాయం చేస్తున్నట్లు?" రమేష్ తమ్ముడిని అడుగుతున్నాడు.
    ",మనింట్లో ధనం మూలుగుతుందన్నయ్యా . సరి అయిన సంరక్షణ , ఆలనా పాలనా లేకపోతె ధనలక్ష్మీ కోపంతో వెళ్లి పోతుందిట. మనకి అవసరం లేని డబ్బు మరోకళ్ళ కి పనికి వస్తుంటే ఇవ్వడం లో తప్పేం ఉందన్నయ్యా?"
    "చూశావా, అపర్ణ ఎంత మంచి పని చేసిందో! నీ గురించి ఆలోచిస్తే నీకపాటి ధైర్యం కూడా లేదని పిస్తుంది.'
    మన్మోహన్ నవ్వాడు. "నాలుగు గోడల మధ్య బిగిస్తే పిల్లి ఏం చేస్తుందో విడమరిచి చెప్పాలా, అన్నయ్యా?"
    "నీకు మంచిదిగా తోచిన ఏ పని కైనా నేను అండగా ఉంటాను."
    మన్మోహన్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, "వస్తానన్నయ్యా. వదిన వస్తాను.' అన్నాడు.
    తెప్పరిల్లి నేను ముందికి అడుగు వేశాను. ఇన్నాళ్ళూ ఏ వ్యక్తో సహాయం చేశాడను కున్నాను. నిన్ను వృద్ది ;లోకి తీసుకు వచ్చింది మన్మోహన్, తల్లీ. ఆ పిల్లాడిని భగవంతుడు చల్లగా చూడాలి. నువ్వూ ప్రజ్ఞారాలి వయేవు. నిన్ను ప్రేమించిన వ్యక్తిని చేసుకోవడం లో ఉన్న సుఖం నువ్వు ప్రేమించే వ్యక్తీ ద్వారా లభించదు. నాకు సమయం ఆసన్న మయింది. మృత్యు దేవత కనుచూపు మేరలో రెండు చేతులా చాపి ఆహ్వానిస్తుంది. ఒకరి వల్ల నష్టపోయిన జీవితం మరొకరి ద్వారా బాగు పడితే ఎవరికి కృతజ్ఞురాలి వై ఉండాలో ఇంతకూ మించి నేను విశదీకరించి చెప్పనవసరం లేదను కుంటాను.
    నిన్నీ పాపిష్టి స్వార్ధపు ప్రపంచం లో ఒకే ఒక మిణుకు మిణుకు మనే ఆశ జ్యోతికి వదిలేసి వెళ్ళిపోవడం బెంగే అనిపించినా తప్పదు మరి. జాగ్రత్త , తల్లీ! విష నాగులున్న చోట తప్పించుకుని మెలుకువతో మసలుకో.
                                                                                   ప్రేమతో నీ తండ్రి,
                                                                               -----ఈశ్వర చంద్రుడు."
    గిరిజ నిర్ఘాంత పోలేదు. అప్రతిభురాలై పోలేదు. డంగై పోలేదు. తను వేసుకున్న అంచనా నూటికి నూరు పాళ్ళూ నిజం అయేసరికి పొందే అనుభూతి నీ, ఆనందాన్నీ పొందింది. పరమేశ్వరీ భోజనానికి పిలవగానే లేచి వెళ్ళింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS