Previous Page Next Page 
మిధ్య పేజి 22


    మన్మోహన్ కిటికీ కి దగ్గిరగా కూర్చుని గతం లోకి వెళ్లి అపర్ణ ని కలుసుకున్నాడు. ఆరోజు..... అంటే సుమారు రెండేళ్ళ క్రితం అపర్ణే అతడిని కలుసుకుంది. 'మనం అలా వెడదాం రా, బావా!' అన్నది పిలిచి. అదివరకు అపర్ణ కీ, ఇప్పటి అపర్ణ కీ ఎక్కడా పోలిక లేదు. సామాన్యం అయిన వాయిలు చీర కట్టుకుని ఒక జడ వేసుకుని నుదుట ఎరుపు రంగు గుండ్రటి బొట్టు పెట్టుకున్నది. చేతులకి జత గాజులు తప్ప మరేం లేవు. అతను ఆశ్చర్యపోయి తేరిపార చూడసాగేడు. ఉండబట్టలేక 'చాలా మారిపోయేవు!" అన్నాడు.
    అపర్ణ నవ్వింది చిన్నగా "సహజం కదూ" అంటూ.
    "అయినా నీ లోనా ఇంత మార్పు?"
    'ఆశ్చర్యం ఏముంది, బావా! "ఏ ఎండకు ఆ గొడుగు పట్టే మనుషులం మనం."
    "పిలిచేవెం, అపర్ణా?" అతను నెమ్మదిగా అడిగేడు.
    "నీతో ఓ ముఖ్య విషయం చెప్పాలని పిలిచెను. ఇది నీతోనే దాచుకోవాలి."
    "అలాగే!' అతను చనువుగా ఆ పిల్ల కుడిచేతిలో చేయి వేశాడు.
    "నేను నిన్ను పెళ్లి చేసుకోను!"
    "అలాగే!'
    "అయితే నామీద నీకు కోపం లేదా?"
    "కోపం దేనికి, అపర్ణా?"
    "నువ్వు నన్నే పెళ్లాడదలుచుకున్నావని అందరూ అంటున్నారు!"
    "లోకం కదా!"
    "నేను శ్రీ కంఠన్ని పెళ్లి చేసుకో బోతున్నాను."
    'అపర్ణా!"
    "నీకు కోపం వచ్చిందా బావా?"
    "నాకు కోపం దేనికి?"
    "నిన్ను చేసుకోవడం లేదని?"
    "నో. అలాంటి దేమీ లేదు. నువ్వు చేయబోయే పని చాలా సాహసంతో కూడినది. ఇది....తలుచుకుంటే మగవాడి నైన నాకే గుండెలు జారిపోతున్నాయి..."
    "పిచ్చి బావ!' అపర్ణ స్వచ్చంగా నవ్వింది. "అదో రకం మందు మనసులో ప్రవేశించి మెదడు ని పూర్తిగా వశం చేసుకుంటుంది. అప్పుడు వేయి ఏనుగుల బలం వచ్చి పర్వతాన్ని సైతం దోలిచేయగలం అనిపిస్తుంది."
    మన్మోహన్ ఆ మందేమిటో వెంటనే తెలుసుకున్నాడు. 'అయిదేళ్ళు మెడిసిన్ చదివి, ఓ ఏడాది హౌస్ సర్జన్ చేసినా మాకు అర్ధం కాదు. నువ్వు చెప్పిన మందు చాలా విచిత్రంగా ఉంది. కాని, అపర్ణా, అతనేలాంటి వాడో ఏమో?"    
    "నీటిలో మునిగే ముందు నీటి లోతు చూడరు. చావుకు సిద్దపడే వాళ్ళు విషం తియ్యగా ఉంటుందో, చేదుగా ఉంటుందో ఆలోచించరు. ఈ స్థితిలో ఏ వ్యక్తీ అయినా ఇంతకూ మించి మంచి జవాబు చెబుతాడంటావా, బావా?"
    "శ్రీ కంఠం యోగ్యుడని పోనీ నా తృప్తి కోసం చెప్పు, అపర్ణా!" మన్మోహన్ కి అపర్ణ పట్ల జాలి కలిగింది. రక్త సంబంధం అతడిని వివశుడిని చేస్తుంది.
    చిన్నగా నవ్వింది అపర్ణ. "బంగారం గురించి వేరే చెప్పనవసరం లేదు ఎవరికీ. కంచు నీ, ఇతర లోహాలని గురించి ప్రజలని మోసపుచ్చే ప్రయత్నం లో తెగ పొగడవలసి వస్తుంది."
    అతను అసహనంగా చూశాడు. 'వేదాంతం మాట్లాడకు, అపర్ణా. ఇందులో ఏది నువ్వనేది? అందులో అతను ఏ బాపతు మనిషి?"
    మరోసారి నవ్వి ఊరుకుంది.
    మన్మోహన్ తల దించుకున్న అపర్ణ శిరస్సు మీద చేయి వేసి, "విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్, మే గాడ్ బ్లెస్ యూ!" అని కదిలి వెళ్లిపోయేడు. ఆ తరవాత అపర్ణ ఇంటికి వెళ్ళడం తగ్గించేడు. మేనత్త ఊరికి వెళ్ళిపోతున్న రోజున తిరిగి ఆ గతాన్ని త్రవ్వుకుని ఆవిడతో బాటు కొంత దూరం వెళ్లి వెనక్కి వచ్చేడు.
    మన్మోహన్ ఇప్పుడు తండ్రి పెట్టుబడితో చిన్న డిస్పెన్సరీ తెరిచేడు. అతని కా ఊళ్ళో మంచి రాబడి లభించింది. హౌస్ సర్జన్ పూర్తీ చేసి ప్రాక్టీసు పెట్టిన కొడుకుని అయన అణా పైసలతో కిమ్మత్తు కట్టి ఒక్కోసారి 'అబ్బే, సరిపోలేదు. రేపు చూసుకోవచ్చును!' అనుకునేవాడు. నానాటికీ బజార్లో సరుకుల ధర మందిపోతున్నట్లే ఇక్కడ అమరేంద్ర చక్రవర్తి మహలు లో మన్మమోహన్ ధర ఆకాశాన్నంటుకుంటుంది. ఆడపిల్లల తాలుకూ తల్లి తండ్రులు పిల్లడు బుద్ది మంతుడనీ, స్థితి పరుడనీ, మంచి చదువులు చదివిన వాడనీ రావడం, వెనుతిరిగి నిరాశతో తిరుగు ముఖం పట్టడం-- ఇలా జరుగుతుంది.
    మన్మోహన్ కి ఇరవై ఎనిమిదేళ్ళు దాటిపోతున్నా తండ్రి నిర్లక్ష్యం చేస్తున్నాడని పించేది తల్లికి. ఒక్కోసారి తగువు వేసుకుని ఒడి పోయేది. మన్మోహన్ డిస్పెన్సరీ కి వెళ్ళే ముందు, వచ్చే ముందు , గిరిజ దారిలో కనిపిస్తుంటుంది. అతను ఆ పిల్ల వైపు క్షణం చూసి భవిష్యత్తు ని గురించి లక్ష్యం లేనివాడిలా కదిలి వెడుతుంటాడు. గిరిజ హౌస్ సర్జన్ చేస్తున్నది ఇప్పుడు. అతని మనసులో అజ్ఞాతంగా పెరిగే తృప్తీ అతడికి రాబోయే నిరాశా నిస్పృహల కి సైతం వెరవని మనో బలాన్ని ఇస్తుంది.
    గిరిజ అప్పుడప్పుడు రమేష్ చక్రవర్తి ఇంటికి వెళ్ళేది. అలా వెళ్ళమని ఈశ్వర చంద్రుడే చెప్పేడు. మొదట్లో సౌదామిని బిడియపడేది -- మెడిసిన్ చదివే ఈ పిల్లకి గర్వం ఉండక పోతుందా అనే భ్రమ లో . రోజులు గడుస్తుంటే సౌదామిని గిరిజ ని చూడకుండా ఉండలేక పోయేది. ఆ పిల్ల రాకపోతే కొంగు పట్టుకుని తిరిగే పిల్లాడు తప్పిపోయినట్లు పదేపదే చూసుకునేది.
    హౌస్ సర్జన్ లో అడుగు పెట్టేసరికి రమేష్ తో గిరిజ అనుబంధం పదిరెట్లు పెరిగింది. సౌదామినిని స్వంత అప్ప చెల్లెలి మాదిరిగా చూసుకునేది.
    "ఇప్పటి కైనా మించిపోయింది లేదు, బావగారూ. నాకు ఇంత సహాయం చేసిన అతనెవరో చెప్పండి. నేను వెళ్లి కృతజ్ఞతలు తెలుపు కుంటాను. లేకపోతె నా చదువుకి అర్ధం లేదు. జీవితాంతం మనసు పీడిస్తూ అశాంతితో బ్రతకవలసి వస్తుందని నా భయం. అయినా మనుష్యులకి ధర్మం అంటూ ఒకటి ఉన్నది కదా! ధర్మాన్ననుసరించి అయినా అతడికి కృతజ్ఞతలు వెల్లడి చేసుకోకపోతే మనుగడ కి అసలు నిర్వచనం ఏముంటుంది చెప్పండి?"
    రమేష్ ఎప్పటి విధంగా చిరునవ్వే సమాధానంగా ఇచ్చేడు."
    "మీరు నన్ను బాధ పెడుతున్నారు. ఇది అంత తేలికైన విషయం కాదు. ఒక్కసారి అతని పేరు చెప్పండి, చాలు!" గిరిజ ప్రాధేయపడసాగింది.
    రమేష్ మరోసారి నవ్వి, "నేనేం చేయను, గిరిజా? అతను ముందే నా దగ్గర ప్రమాణం తీసుకున్నాడు-- తన పేరు బయట పెట్టద్దని. కావాలంటే మీ అక్కయ్య ని అడుగు" అన్నాడు.
    సౌదామిని మెల్లగా గిరిజ భుజం మీద చేయి వేసి, "ఇందులో అబద్దం లేదు, అతను అంటుంటే నేనూ విన్నాను." అన్నది.
    'అప్పుడు నీతో అతను ప్రమాణం చేయించు కున్నాడా?' గిరిజ ప్రశ్నించింది.
    సౌదామిని "ఆ" అన్నది.
    రమేష్ చక్రవర్తి ఏమరుపాటున కూడా గిరిజకి సహాయం చేస్తున్నది తమ్ముడు అని చెప్పలేదు. గిరిజ మామూలుగానే నిరాశతో ఇంటి మొహం పట్టింది.
    ఈ మధ్య వారం పది రోజులుగా ఈశ్వర చంద్రుడు అస్వస్థతగా ఉన్నాడు. వయసు ఏమంత మించి పోయింది కాకపోయినా దిగులుతో అతనికి ఉన్న వయసు రెట్టింపు అయింది. ఎదిగిన కూతురు ఎంత చదివితే మాత్రం ఏం? ఎదమీది కుంపటి లా కళ్ళలో నలకలా కదులుతుంటే అతనికి దిగులు కాక మరేమిటి? మంచం మీద నిస్త్రాణ గా పడి ఉన్న ఈశ్వర చంద్రుడి పక్కనే కూర్చుని పరమేశ్వరి విసన కర్రతో విసురుతూ అతన్ని ఒదార్చ సాగింది. "నువ్వు దిగులు పెట్టుకోకు , ఈశ్వరా! కానున్నది కాకమానదు. అమ్మాయి పెళ్లి సంగతి అంటావా? ఇంకా ఈ పెద్దమ్మ గొంతులో ప్రాణాలు ఉన్నాయి. వెనకేసిన అయిదు వేలూ ఎవరి కోసం దాచి పెట్టాలి కనక! నువ్వు అమ్మా అని పిలిచిన రోజునే నా బిడ్డ వయ్యావు. నీ బిడ్డని చూస్తూ చూస్తూ అన్యాయం చేసి నా కడుపులో మంటలు రేపు కుంటానా పిచ్చి గాని! మంచి సంబంధం దొరకనీ-- నేను ప్రతిజ్ఞ చేసుకున్నానంటే ఆ పని అయేవరకూ పచ్చి మంచినీళ్ళు ముట్టను."
    ఈశ్వర చంద్రుడు వ్యర్ధంగా నవ్వేడు. "నువ్వు ఆడదానివి. నీకే ఆధారం లేదు. నీ అంత్య కాలంలో తులసీ తీర్ధం పోస్తానన్నాను. చివరికి నేనే నీ నెత్తిన కొండంత బరువును ఉంచి ముందు వెళ్ళిపోతున్నాను."
    "ఛ! అంత మాట అనకు. నీకు ఇప్పుడు ఏళ్ళు ఏం మించి పోలేదు. మనసులో బెంగతో జీర్ణించుకుని పోతున్నావు. కొంచెం తెరిపిగా ఉండడం అలవాటు చేసుకుంటే దార్ధ్యం దానంతట అదే వస్తుంది."
    "అంతా నీ భ్రమ! ఏరు పొమ్మంటుంది ఇటు నుంచి. కాడి పిలుస్తోంది నన్ను ప్రేమగా. ఎలా తప్పించుకోగల నీ రాతని? నాకేమీ బెంగ లేదమ్మా. నేను పొరపాటు చేశా ననిపిస్తుంటుంది అప్పుడప్పుడు.
    "అదేమిటో చెప్పి ఉపశమనం పొంద కూడదా? దేనికిలా మనసులోనే పెట్టుకుని వ్యధ చెందడం?
    "గిరిజని పిలమ్మా. దాని ఎదుటే చెబుతాను."
    పరమేశ్వరి గిరిజ ను పిలుచుకు వచ్చి సరసన కూర్చో బెట్టుకుంది. అతనికి కావలసిన మందులేవో తనే ఇస్తుంది. రెండు రోజులుగా మన్మోహన్ స్వయంగా వచ్చి ఇంజక్షన్లు ఇస్తున్నాడు. సాయంకాలం దాటిపోయింది. గిరిజ తండ్రి పక్కన పరమేశ్వరి మధ్య కూర్చుండగానే మన్మోహన్ వచ్చేడు. నాడి  చూసి మరో ఇంజక్షన్ ఇచ్చి, "మీరు బెంగ పెట్టుకోవద్దు. మావయ్యా. మీ మనసులో బాధ చెప్పండి. మేమంతా లేమా?" అన్నాడు. సరిగా అదే సమయానికి బెనర్జీ గారు వచ్చేరు. ఈశ్వర చంద్రుడు కలకత్తా కి వచ్చిన రోజు నుంచీ అతను అడపాదడపా ఆర్ధికంగా సహాయం చేస్తున్నాడు మూడో కంటి వాళ్లకి తెలియనీయ కుండా . పరమేశ్వరి టీ తయారు చేసేందుకు లోపలికి వెళ్ళింది. పది, పదిహేను నిమిషాల తరవాత టీ తీసుకు వచ్చి మన్మోహన్ కి , బెనర్జీ కి ఇచ్చి ఈశ్వర చంద్రుడిని లేవదీసి కూర్చోబెట్టి పట్టించింది. ఇప్పుడాయన లేవలేని స్థితిలో ఉండిపోయేడు. చుట్టూ చూసి గిరిజ వైపు చూడగానే దుఃఖం పెల్లుబికి వచ్చింది. బెనర్జీ గారు కేకలు వేశారు. "నీకేం మతి పొయిందేమిటి, తమ్ముడూ! అప్పుడే నీకు ఏళ్ళు ముంచుకు పోయినట్లు ఆడదానిలా డీలా పడిపోవడం బాగాలేదు. నీకిప్పుడెం కష్టం వచ్చిందని? నీ కన్నా ముందు పోవలసిన వాళ్ళం ఇంకా  జవసత్వాలతో తిరగడం లేదూ ? నువ్వే కావాలని ఏదో రోగం తెచ్చి పెట్టుకుని తీరి కుర్చుని ఒంటికి పట్టిస్తున్నావు. పుట్టిన మనిషికి బ్రతుకు మీద మమకారం ఉండి తీరాలి. ఆశ ప్రాణాన్ని పోస్తుంది. నువ్వెందు కా ఆశ పెట్టుకోలేక పోతున్నావు? చూడబోతే వట్టి మూర్కుడి లా కనిపిస్తున్నావు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS