"ఆమెతో ఎలాంటి సంబంధం పెట్టుకోనని నాకు మాట యివ్వండి. నేను నిశ్చింతగా ఉంటాను."
చలపతి అందుకు సిద్దంగా లేడు అతను మాట మారుస్తూ "నీకేవీ అన్యాయం జరగనివ్వను రాధా." అన్నాడు.
ఆమె అతను వెళ్ళగానే జుట్టు పీక్కుని మంచం మీద పడి గింజుకుని ఏడ్చి ఏడ్చి పడుకుని నిద్తపోయింది.
17
ఓనాడు ఉదయం చలపతి ముఖం బరువుగా దిగులుగా మార్చుకుని బట్టలు సర్దుకుంటున్నాడు. అతని ముఖం బాధగా ఉంది. అతను కన్నీరు కారుస్తూ తనకి కనబడకుండా తుడుచుకుంటూన్నాడు.
రాధ భర్త ఇలా పూర్తిగా అదుపు తప్పిపోయి ఎందుకలా బాధ పడుతున్నదీ అర్ధం కాక "ఎక్కడి కండి ప్రయాణం?" అని అడిగింది.
"నేను వారం పది రోజుల వరకూ రాను. జాగ్రత్తగా వుండు. రాఘవులు కావల్సినవి తెచ్చి ఇస్తాడు." అన్నాడంతె.
"రాజారాం గారి వద్దకు వెళ్తున్నారు కదూ?"
"కాదు."
"మరెక్కడికి నాతొ చెప్పకూడదా?"
"పని వుండి వెళ్తున్నాను."
అంతకుమించి ఎన్ని విధాల ప్రయత్నించినా ఆమె సమాధానం పొందలేక పోయింది. అతను రాజారాం దగ్గరకే వెళ్తున్నాడని నిశ్చయించుకుంది.
చలపతి వెళ్ళిపోయాడు.
ఆమె మంచం మీద పడుకునే కుమిలిపోయింది.
రాఘవులు వచ్చి చెప్పాడు "లిల్లమ్మ గారి దగ్గర్నించి ఉత్తరం వచ్చిందండి. ఆమెకు జబ్బుగా ఉందట వెళ్ళారు." అని అతను చెప్పేవరకు ఆమె వదల్లేదు. తీరా చెప్పిం తర్వాత ఆమె భరించలేక పోయింది. ఆమె దుఃఖం ఆపుకోలేక పోయింది.
"ఆ రాజారాం దంపతులు ఏం మనుష్యులు రాఘవులూ, ఈయన్ని అమాయకుడ్ని చేసి వాడుకోవాలని చూస్తారా? నా బ్రతుకు ఇలా బండలు చేస్తారా?' అంది.
"ఏం జరిగిందమ్మా?"
"వాళ్ళు డబ్బు గలవాళ్ళు. వెధవ పనులు చేసి జీవితాలు పాడు చేసింది చాలక తమ అక్రమాలకి అన్యాయాలకి ఇలాంటి అమాయకుడ్ని పొగిడి బలి పెడతారా? నా సంసారం బాగుపడటం ఆయనకి ఇష్టం లేదు. మీ అయ్యగారు అయన వలలో పడ్డారు."
"ఇంతకీ ఏం జరిగిందమ్మా?"
"ఆ లిల్లమ్మ ని మీఆయ్యగారు జాగ్రత్తగా కట్టుకున్న పెళ్ళాం కన్నా ఎక్కువగా చూసుకుంటూ వుండాలిట. అయన తండ్రి గారు చేసిన పాపానికి పరిహారంగా సగం ఆస్తి ఆమెకు రాస్తారట. ఇప్పుడు చెప్పు రాఘవులూ ఆమె జబ్బు అంతా మోసం కదూ."
రాఘవులు కూడా సందిగ్ధంలో పడ్డాడు. ఆ జాబు గురించి చలపతయ్య తనకు చెప్పలేదు. అతనికి అనుమానం వచ్చింది. రాధమ్మ కు అతనేవీ చెప్పలేక ఊరుకున్నాడు.
అప్పటికప్పుడు ఆమె తన బట్టలన్నీ పెట్టెలో పెట్టుకుని తలుపులు తాళం వేసి "పద రాఘవులూ " అంది.
"ఎక్కడికమ్మా?"
"ఎక్కడ్నించి వచ్చామో అక్కడికే?"
"అంటే?"
"పుట్టింటికి పోతున్నాను రాఘవులు. ఇక్కడ నాకు స్థానం లేదు. ఇలాంటి చోట నేను ఉండకూడదు. కట్టుకున్న పెళ్ళాం ఉండగా ఈయనకి ఆ లిల్లమ్మ ఎక్కువైందన్నమాట. నేను కావాలని అయన అనుకున్నప్పుడే వస్తాను. నేను కావాలో ఆమె కావాలో ఎవరు కావాలో అయన నిర్ధారించుకున్న తర్వాతనే నేను వస్తాను. ఎవరో ఒకరినే అయన ఎన్నుకోవాలి?' అంది రాధ ఉద్రేకంగా. ఆమె ముఖం బాగా జేవురించి ఉంది.
'అతను ఏమీ చెప్పలేక "అయ్యాగారితో ఏమైనా చెప్పమంటారా?" అన్నాడు.
"ఇక రాననిమాత్రం చెప్పు,కావాలంటే పైన చెప్పిన శరతులకి ఒప్పుకుంటే ఆయన్ని రమ్మను. ఇప్పుడు నాకేం తక్కువ. నా ఆరోగ్యం నాకు వచ్చింది. ఎక్కడయినా ఉద్యోగం చేసుకుని అయినా బ్రతుకుతాను." అంది.
* * * *
వెళ్ళిన అయిదో నాడే తిరిగొచ్చాడు చలపతి. రాఘవులు సినిమా హాలు దగ్గర కలిశాడు. రాఘవులు ఆతృతగా అడిగాడు "ఏమయింది?' అని.
"నేను వెళ్ళేసరికి ఆమె పోయింది." అన్నాడు చలపతి.
రాఘవులు కొయ్యబారి పోయి నోరు మెదపలేక పోయాడు.
"నాకు జాబు వచ్చిననాడే పోయిందిట."
"ఏమిటి జబ్బు?"
"రెండు రోజులు జ్వరం వచ్చిందట. భయపడి ఉత్తరం రాయమందిట తన పేర. ఇలా జరుగుతుందని వాళ్ళు అనుకోలేదుట. ఆమె తాలూకు వస్తువులు నన్ను తీసుకెళ్ళ మన్నారు కాని అక్కడే ఉంచేశాను. జ్ఞాపకంగా ఆమె చేతి మట్టి గాజులు మాత్రం తీసుకొచ్చాను. జ్వర తీవ్రతలో ఆమె చేతి గాజులు తీసేసి దిండు కింద పెట్టిందట. లిల్లమ్మ నోటికి వచ్చినట్లల్లా తిట్టి పోసిందట. రెండు రోజుల్లో రెండో రోజుకో సంధించింది.
రాఘవులు దుఃఖం ఆపుకోలేకపోయాడు.... చలపతి కన్నీరు పెట్టుకుంటే అతను తల రెండు కాళ్ళ మధ్య ఇరుకించుకుని బాధపడుతున్నాడు.
* * * *
రాఘవులు ఇంటి తాళం తీస్తూ "అమ్మగారు పుట్టింటికి వెళ్ళి పోయారండి." అన్నాడు.
చలపతి నివ్వెరపోతూ "ఇప్పుడు ఎందుకు?' అన్నాడు.
"మీ మీద కోపంవచ్చి. లిల్లమ్మకు జబ్బుగా ఉందని వెళ్ళారంటే ఆమె నమ్మలేదండి. అనుమానంతో ఆవిడ చాలాసేపు ఏడ్చి గోల చేసి ఇహ రానని కావాలంటే మిమ్మల్నే రమ్మనమని చెప్పి వెళ్ళిపోయారండి" అన్నాడు రాఘవులు.
"ఇప్పుడు నాకు ఓపిక లేదు రాఘవులూ. చాలా అలసిపోయాను." అన్నాడు చలపతి.
ఆ మర్నాడు అతనికి జ్వరం ముంచుకు వచ్చింది. మంచం మీంచి లేవలేక పోయాడు.... రెండు రోజులైనా జ్వరం తగ్గలేదు.... రాఘవులే కాస్త జావ కాచి ఇచ్చాడు. డాక్టర్ని తీసుకొచ్చి చూపించాడు. అయన రాసిన మందులు తెచ్చి వేశాడు.
చలపతికి భార్య పుట్టింటికి పోయిందనే ధ్యాస బొత్తిగా లేదు. ఇప్పుడతను అస్తమానం లిల్లమ్మ గురించే బాధపడుతున్నాడు. ఆమెతో తన సాంగత్యం అంతా గుర్తుకు వస్తుంది. ఆమె అభిమానం, అనురాగం , ఆమె సేవా. గుర్తుకు వస్తున్నాయి. రాధ ఈ అనుబంధాన్ని ఎలా అర్ధం చేసుకోగలదు? తనేం అర్ధం చేసుకోగలిగాడు గనక? ఆమెతో చాలా కాలం తిరిగి ఆమె సేవలు పొందిన తనే ఆమెను అర్ధం చేసుకోలేక పొతే ఆమె ఏం అర్ధం చేసుకోగలదు?
రాఘవులు అన్నాడు "చలపతయ్య లిల్లమ్మ కట్టుకున్న భార్య ఎలాంటి స్థానంలో ఉంటుందో ఆమె ఎలాంటి గౌరవం పొందుతుందో అలాంటి గౌరవం కోసరం.... తంటాలు పడిందండి. నేను ఎన్ని రకాలుగా చెప్పినా మీరు అర్ధం చేసుకోలేదు. చెప్పి చెప్పి విసిగెత్తి ఊరుకున్నాను అన్నాడు.....
చలపతి "రాఘవులు ఇక ఊరుకో" అన్నాడు. ఆ మాటలు అతనికి రంపపు కోతలా వున్నాయి.
నాలుగు రోజులు పొయిం తర్వాత 'అమ్మగారికి ఉత్తరం రాశానండి. ఆమె వస్తుందండీ తప్పకుండా వస్తారు" అన్నాడు.
చలపతి మంచం మీద లేచి కూర్చుని "ఎందుకు రాశావు? నన్నడక్కుండా ఎందుకు రాశావు?" అన్నాడు కోపంగా. అతనికి పౌరుషం గా ఉంది. ఆమె కోసరం తాను ఎంత చేశాడు ఆఖరికి తన ప్రాణం సయితం లక్ష్యం చేయకుండా ఆమె కోసరం తాపత్రయపడ్డాడు. కాని ఈనాడు ఆమె తనని ఏం అర్ధం చేసుకో గలిగింది? ఏవిటి గౌరవం మర్యాద చూపించగలిగింది? ఆమె స్వార్ధం ఆమె చూసుకుంది. అలాగే ఒకనాడు తన స్వార్ధం తాను చూసుకుని ఉంటె అమెజీవితం ఏమయి ఉండేది? ఈ మనుష్యులు మంచితనాన్ని, అసమర్ధతగా భావించి లోకువ చేస్తారు. పశుత్వాన్ని రాక్షసత్వాన్ని అర్ధం చేసుకున్నట్టుగా వాళ్ళు మానవత్వాన్ని మంచి తనాన్ని అర్ధం చేసుకోలేరు నిజాయితీ ని, నిస్వర్ధాన్ని గౌరవించలేరు. ఒకరి చేత చెప్పించుకునే అవకాశం ఇవ్వకుండా తాను అంత హుందాతనం చూపిస్తే ఈనాడు నలుగురిలోనూ నగుబాటు చేసి వెళ్ళిపోయింది. కనీసం ఒ ఉత్తరం అయినా ఆమె రాయలేదు. రాధ తన లాగ అమాయకురాలు కాదు గడుచు మనిషి. ఆమె వెంట పడి బ్రతిమిలాడి ఆమెను తీసుకు వస్తానని ఆమె అభిప్రాయం కాబోలు. ఏమైనా ఈసారి తాను వెళ్ళకూడదనే అనుకున్నాడు చలపతి.
రాఘవులు ఇలా ఉత్తరం రాశాడంటే చలపతి అభిమానం దెబ్బతింది. అతనికి పౌరుషం వచ్చింది. కోపంగా అతను రాఘవులు మీద విరుచుకు పడ్డాడు.
'అలా కోపగించుకోకండి అయ్యగారు. ఆమెకి యెంత చేసారు మీరు? అంత సేవ, ఇలాంటి మనస్సుతోనే చేశారా? ఎంతో పెద్ద మనస్సుతో చేశారు. ఆ మనస్సు మార్చు కోకండి. రాధమ్మ గారి మనస్సు అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే. ఆమె ఎప్పుడూ ఒకే మనస్సుతో ఉంది. రాజారాం గారితో మీరు చనువుగా ఉంటె ఆస్పత్రి లో ఆవిడ అనుమాన పడింది. లిల్లమ్మ ప్రస్తావన ఎప్పుడు తెచ్చినా అనుమాన పడింది. ఆమె ఎప్పుడూ మామూలు మనిషే. మళ్ళీ ఆమెతో మీరు సంబంధం పెట్టుకుంటారేమో తన జీవితం ఏమయిపోతుందో అని భయపడి ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎవరు గారంగా చూస్తె మ్మనుష్యులు వాళ్ళకే ఎక్కువ బాధపడతారు. మారాం చేసి మీరు అంత పెద్ద మనస్షు మార్చుకుని ఎందుకిలా దిగజారి పోవాలి. రాజారాం గారు రాసినట్టు మీరు నలుగురితోబాటు మనుష్యులు కారు. అంతకంటే పైస్థాయి మరి. ఆ స్థాయి మీరు ఎప్పుడు అలాగే కాపాడుకోవాలి. రాధమ్మ మామూలు మనిషే."
రాఘవులు ఇంతగా చెప్పిం తర్వాత చలపతి మనస్సు కాస్త శాంతించింది.
అంత జ్వరంలోనూ అతను మంచం మీద పడుకునే మంచం వారగా గోడకి వున్న తెలుగు కేలండరు చూశాడు.
రాత్రి పది గంటలయింది.
ఎవరో తలుపు తట్టిన చప్పుడు! చలపతి దుప్పటి ఒత్తింగించి మూలుగుతూ ముక్కుతూ మెల్లగా వెళ్ళి తలుపు తీసేసరికి రాధ గుమ్మం దగ్గర తలవంచుకుని నిలబడి ఉంది.
అతని మాసిన గడ్డం అతని వంటికే గుచ్చు కుంటోంది.
రోడ్డు మీద బండి వాడితో పేచీలు పడుతున్న ఆమె అన్నగారి గొంతు వినిపిస్తుంది.
చలపతి నీరసంగా మూలుగుతూనే తూలుతూ వెళ్ళి లైటు వేశాడు.
(సమాప్తం)
