
"సర్లేండి. అసలు మానితేగా మళ్ళీ మొదలు పెట్టడానికి.
"ఆ సుగుణమ్మ కూడా చనువుగా ఉంటుందా ఈయనతో."
రాఘవులు "ఆయమ్మ చాలా మంచి మనిషేండి" అన్నాడు.
రాధకు రాఘవులు ఈ మాట చెప్పినప్పట్నించి అనుమానం? ఆ మొగుడు రోగిష్టి వాడు. ఈయన అసలే ఇలాంటి విద్యలలో ఆరితేరిన వారు. ఎక్కడ జారిపోతారోననే భయం.
చలపతి రాగానే ఆమె ఆ మాటా ఈ మాటా చెబుతూ అక్కడే కూర్చో బెట్టింది. చలపతి అక్కడ్నించి కదిలాలని ప్రయత్నిస్తుంటే ఆమెకు అనుమానం. "ఏం అంత తొందర. నా దగ్గర కూర్చోకుండా అక్కడా అక్కడా వాళ్ళతో తిరిగితే ఏం ఒరుగుతుంది అంది.
చలపతికి అర్ధం కాలేదు.
నర్సు వచ్చి టెంపరేచర్ చూసింది.
* * * *
డాక్టర్లు పరీక్షలు పూర్తీ చేసి ఇక వెళ్ళవచ్చునన్నారు. అప్పటికి ఆ ఊరు వచ్చి వారం రోజు అయింది.
ఆరోజు తమ ఆతిధ్యం స్వీకరించమని రాజారాం ఒత్తిడి చేసి చలపతి దంపతులిద్దరికి విందు చేశాడు.
"స్టేషనుకి నేను రాలేను. ఇక్కడ్నించే మీకు వీడ్కోలు ఇస్తున్నాను" అని బాల్కనీ లోనే నిలబడి చేతులు ఊపాడు రాజారాం.
బండి వీధి చివరికి వెళ్ళేవరకు రాజారాం దంపతులు చేతులు ఊపుతూనే ఉన్నాడు.
ఇంటికి వచ్చిన పదిహేను రోజులు రాధ బాగానే ఉంది. తర్వాత మళ్ళీ మామూలే. జ్వరం వచ్చింది రెండు రోజులు. మంచంమీంచి కిందకు దిగలేదు. మూసిన కళ్ళు తెరవలేదు.
చలపతి పూర్తిగా నీరు కారి పోయాడు. చేసిందంతా ఇలా పరిణమించేసరికి రాజారాం గుర్తుకు వచ్చి మళ్ళీ ఆ విశాఖపట్నం పోక తప్పదేమో అనిపించింది. అలా కన్నుమోసుకుని మంచం మీద పడుకుని ఉన్న భార్యని చూసేసరికి అతనికి జాలి వేసింది. తానె అలా అనుకుంటే ఆమె ఏమనుకోవాలి?
మందులు తెప్పించేడు. వారం రోజుల్లో మళ్ళీ కోలుకుంది. కాస్త అటూ ఇటూ తిరగటం మొదలు పెట్టింది. అయినా నమ్మకం ఏముంది? అక్కడికదే నయం. కొంపకి రాగానే కాస్త నవ్వు మొహం కనిపిస్తుంది.
రాఘవులు "ఏవిటి గురూ అప్పుడే ఇలా నీరు కారి పోయారు.' అన్నాడు.
"ఏం చేస్తాను రాఘవులు ఇంత చేస్తే అదంతా బూడిదలో పోసిన పన్నీరయింది."
"దిగులు పడకూడదండి . మంచిరోజులు తప్పక వస్తాయి."
"ఏం వస్తాయో నా ఊపిరి ఊడుతుంది."
ఇంట్లో మనశ్శాంతి కరువై పోయేసరికి చలపతికి త్రాగుడు అలవాటు బాగా పెరిగిపోయింది. ఇప్పుడు అతనికి ఇంటికి రావాలనే అనిపించటం లేదు.
"లిల్లమ్మ ఇక అసలు రానే రాదా రాఘవులూ." అన్నాడు చలపతి ఓనాడు.
"ఏమో మరి. ఆమె గురించి ఏవీ తెలియటం లేదు."
చలపతి మనశ్శాంతి కోసం లిల్లమ్మ ని కావాలని అనుకుంటున్నాడని ఇప్పుడైమెని వాంచిస్తున్నాడని అయితే ఇది కేవలం తాత్కాలికమైన ధోరణి మాత్రమే అని రాఘవులు గ్రహించాడు. లిల్లమ్మ ఎన్ని రకాలుగా అడిగినా తన చిరునామా మాత్రం చెప్పలేదు. ఒకప్పుడు చలపతి ఆమె ఆదరణని ఆప్యాయతని తిరస్కరించి అక్కడ ఉండటమే తనకి అవమానం అగౌరవం అని భావించాడు. కాని ఈనాడు ఆమె అతనికి కావాలని దూరం అయింది. ఇప్పుడు చలపతికి ఆమె ఆదరణ కోసరం మనస్సు విప్పి చెప్పుకునే మంచి మనిషి కోసం కక్కుర్తి కోసం ఆమె కావాలని అనుకుంటున్నాడు. అంతా స్వార్ధం!
చలపతి ఇంటికి చేరేసరికి బాగా పొద్దు పోయింది. రాధ మాత్రం తనకోసం ఎదురు చూస్తూ కూర్చుంది. చలపతి పూర్తీ స్మారకం కోల్పోలేదు. ఒంటి మీద స్పృహ ఉంది. తూలుతూనే వచ్చి మంచం మీద జారబడ్డాడు.
రాధ లేచి వెళ్ళి మంచం మీదకు వంగి పలకరించింది.
చలపతి ఇటు చూసి "ఏం?' అన్నాడు.
"సినిమాకి వెళ్ళారా?"
"నువ్వు లేకుండా సినిమాకి వెళ్తానా?"
"ఏం వెళ్తే! ఫర్వాలేదు మనస్సుకు ఉల్లాసంగా ఉంటుంది. వెళ్ళక పోయారా?" రేపు వెళ్తారా?"
చలపతి తల అడ్డంగా ఊపుతూ "ఒక్కడ్నే సినిమాకు వెళ్తే నాకు బాగుండదు." అన్నాడు.
* * * *
చలపతి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రయాణాలు మనశ్శాంతి లేకపోవటం, ఎక్కువగా త్రాగటం వీటన్నిటి వల్ల ఆరోగ్యం పూర్తిగా పాడయి పోయింది. అతను రెండు రోజులు మంచం దిగలేకపోయాడు. జ్వరం ముంచుకు వచ్చింది.
అయితే రాధ ఈ పది రోజుల్లోనూ కాస్త కోలుకుంది. ఇప్పుడామెకు జ్వరం రావటం లేదు. ఆమె కాస్త ఇంట్లో అటూ ఇటూ తిరుగుతోంది.
"ఇప్పుడిక దిగులు లేదు ఇద్దరం ఒకే స్థితిలో ఉన్నాం" అన్నాడు చలపతి.
"నాకేం ఇప్పుడు నేను బాగానే ఉన్నాను" అంది ధీమాగా రాధ. ఆమె ధీమాకి తగ్గట్టే ఈసారి ఆమెకు జ్వరం రాలేదు. రోజు రోజుకి ఆమె బలం పుంజుకోసాగింది. తన మంచం పగటి పూట గోడ వారకు ఎత్తేస్తుంది.
చలపతి కొద్దిగా కోలుకున్నా డాక్టర్లు జాగ్రత్తగా వుండాలని హెచ్చరించారు. త్రాగుడు మానకపోతే తనకి కూడా T.B రావచ్చని వాళ్ళు హెచ్చరించారు.
"ఈ వారం రోజుల్లోనూ నేను అస్సలు త్రాగలేదు." అన్నాడు చలపతి.
రాఘవులూ ఆ మాటే అన్నాడు. రాఘవులు చెబుతే రాధ నమ్మింది.
ఆరోజే అన్నగారికి ఉత్తరం రాసింది. "ఇన్నాళ్ళ కి నేను సాధించిన మరో విజయం అయన ఇప్పుడు పూర్తిగా మాద్యం మానేశారు. ఈ విజయం నాదే. అంటే నా మూలాన తాను అలవాటు మానుకున్నారు. నేనే లేకపోతె అలవాటు మానేవారు కారు" అని రాసింది.
"అయ్యగారు పూర్తిగా మద్యం మానేశారే? లిల్లమ్మ చెప్పింది రిజువు చేశారు" అన్నాడు రాఘవులు.
"ఏం చేస్తాం ప్రాణం మీదికి వస్తే? "త్రాగుతే గుండెలు నలిగి పోతాయని అనిపించే బాధ పెడుతుంది."
రాఘవులు "ఇక తాగనట్టేనా నిలబడతారా ఈ మాట మీద" అన్నాడు.
"నువ్వే చూస్తావుగా" అన్నాడు చలపతి ధీమాగా.
అలాగే చలపతి పట్టుదలగా ఆ మాట మీదే నిలబడ్డాడు. అయితే ఆరోగ్యం మాత్రం కుదుట పడలేదు. రెండు రోజులు మాములుగా తిరిగితే రెండు రోజులు జ్వరంతో మంచాన పడుతున్నాడు.
రాధ ఈ నెల్లాళ్ళ లోనూ ఒక్కరోజు కూడా మంచం మీద నడుం వాల్చలేదు పట్టపగలు. ఆమెకు పూర్తిగా మునుపటి ఆరోగ్యం వచ్చింది మందులూ అవీ ఇన్నాళ్ళ కు బాగా పట్టిచ్చాయి. మనిషిలో మళ్ళీ కళ వచ్చింది. పుష్టిగా, బలంగా హుషారుగా ఉంది.
వంట వంట మనిషి చేస్తుంటే ఆమె పై పనులు తానూ చూసుకుంటుంది. మళ్ళీ భర్తతో నెలకి నాలుగయిదు సార్లయినా సినిమాలకి వెళ్తుంది. బజారుకి పోయి తనకి కావాల్సినవి, ఇంట్లోకి కావాల్సినవి కొనుక్కుంటుంది.
తన ఆరోగ్యం గురించి తన వాళ్ళకి రాసింది. "ఇప్పుడు నేను మామూలు మనిషిని" అని రాసింది.
డాక్టరు కూడా ఇప్పుడామె ఆరోగ్యం బాగుందని చెప్పారు.
16
రాజారాం గారి దగ్గర్నించి వచ్చిన లేఖ చూసి చలపతి ఆశ్చర్యపోయాడు.
మిత్రులు చలపతి గార్కి,
రెండు రోజులయింది విశాఖపట్నం నించి ఇక్కడకు వచ్చి మీరు అక్కడ్నించి వచ్చినప్పట్నించి రోజుకో మారైనా మిమ్మల్ని తల్చుకోకుండా ఉండం మేం ఇద్దరం.... మీకు అటువంటి ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకు సందేహం లేదు. అందుకే మిమ్మల్ని మర్చిపోలేక పోయాను. సుగుణ కూడా రోజు కోమారైనా మీ గురించి అనుకుంటూ వుంటుంది. ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది. మీ శ్రీమతి గారి ఆరోగ్యం బాగుందని తలుస్తాను. మీ గురించి నేను అన్ని వివరాలు తెలుసుకున్నాను. అది తెలుసుకున్న తర్వాత మీరు అక్కడ ఒక్కరోజే ఉన్నారనుకొండి . అందుకే ఆరోజు నేను పుస్తకాల గురించి మీ వద్ద ప్రస్తావించలేదు. మీరు ఏమీ చదువు కొకపోయినా, మీరు ఇలాంటి పుస్తకాలు చదవక పోయినా మీరు చాలామంది కంటే ఎంతో విజ్ఞానం కలవారు. మీరు ఎంతో చదువుకున్నవారే మా దృష్టిలో - ఒక అమాయకురాలి హృదయాన్ని మీరు చదువి అర్ధం చేసుకున్నారు. ఆమె కోసం ఎన్నో ఇబ్బందులు, కష్టాలు సైతం ఓర్చి బాధలు పడ్డారు. ఇంత సంస్కారం ప్రదర్శించిన వాళ్ళు ఈ పుస్తకాలు చదివే వాళ్ళలో ఎంతమంది ఉన్నారు? ఈ ఉదాత్తత ఈనాడు కనపడడం లేదు. అదంతా మీటింగుల్లోనూ పుస్తకాలలోనూ ఉపన్యాసాలలోనూ తప్పించి జీవితంలో ఎక్కడ కనిపిస్తుంది. మీకు నా మనః పూర్వక నమస్కారాలు. మీకు నా హృదయ పూర్వకమైన అభినందనలు.....
మరొక వ్యధా పూర్తితమైన సంగతి. మనస్సు చెప్పుకొని మీకు రాస్తున్నాను. ఓనాడు మీరు చెప్పారే నా పోలికలో అక్కడ ఎవరో ఉన్నారని ఆమె ఎవరో కాదు. నాకు చెల్లెలే. సందేహం లేదు. నా తండ్రి చేసిన పాపానికి ఆమె బలయిపోయింది. పాపం నా ఆస్తి లో సగం ఆస్తి ఆమె పేరనే రాయాలని అనుకుంటున్నాను. ఇంత కంటే నేనేం చెయ్యగలను? ఇంకేదైనా చెయ్యగలిగితే మీరు సూచించండి. పోనీ అలాగే చేస్తాను. ఆమెను మీరు జాగ్రత్తగా కాపాడవలసిందిగా కోరుతున్నాను. మీ అండ ఆమెకు ఉంటె ఆమె జీవితం నిశ్చింతగా వెళ్తుంది. నేను మిమ్ములను ఈసహాయం అర్ధిస్తున్నాను."
అంటూ రాజారాం పెద్ద లేఖ రాశాడు. రాధ పక్కనే ఉంది. ఆ లేఖ ఆమెకు చూపలేదు. అందులో ముఖ్యమైన సంగతులు మాత్రం చెప్పాడు. లిల్లమ్మ ప్రస్తావన ఆమెదగ్గర తీసుకు రాలేదు.
రాజారాం కి సమాధానం రాస్తూ "మా జీవితం మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది. రాధ ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. ఆమె మునుపటి ఆరోగ్యాన్ని పొందగలిగింది. మా సంసారానికి మునుపటి నిండుదనం వచ్చింది.
పాపం లిల్లమ్మ! ఆమె ఇప్పుడు ఇక్కడ లేదు యాత్రల కంటూ వెళ్ళి హృషీ కేశం లో మకాం వేసింది. ఇక్కడకు ఆమె ఎప్పుడు వస్తుందో తెలియదు. మీరు ఆమెకు చేసిన సహాయం ఉచితంగానే ఉంది. మీ తండ్రి చేసిన పాపానికి మీరెలా బాధ్యులవుతారు? కారు. మీరు చెయ్యగలిగిన సాయం చేశారు. మీరు కోరినట్లుగా ఆమెను నేను జాగ్రత్తగా చూస్తాను. మీకే దిగులు అవసరం లేదు. ఆమె గురించి చింతపడి ఆరోగ్యం పాడు చేసుకోకండి." అని రాశాడు.
రాత్రి భర్త నిద్ర పొయిం తర్వాత రాధ మెల్లగా లేచి అతని జేబులో లేఖ తీసి చదివింది. ఆ లేఖ చదువుతుంటే ఆమెకు ముచ్చెమటలు పోశాయి. కోపంతో ఆమెకు ఆవేశం వచ్చింది. ఉత్తరం మాములుగా జేబులో పెట్టేసి మంచం మీదకు వచ్చి పడుకుంది. రాజారాం దంపతులంటే ఆమెకు అంతవరకూ వున్న గౌరవం కాస్తా పోయింది. ఈయన్ని అమాయకుడ్ని చేసి తాము చేసిన పాపానికి పరిహారంగా నాలుగు డబ్బులు పడేసి ఈయనకి ఆమెతో జత కలపాలని చూస్తున్నారు. అందుకే అంతగా పొగిడారు. ఆ పొగడ్తలకి ఈయన పొంగిపోయారు. ఆమెకు భయం వేసింది మళ్ళీ యిన్నాళ్ళ కి తన జీవితం ఓ స్థాయికి చేరుకుంది. ఈ రాజారాం డబ్బు ఎర చూపి లిల్లమ్మ ను పోషించే బాధ్యత ఈయనకి అప్పచెప్పి తన బ్రతుకు నట్టేట ముంచాలని చూస్తున్నారు వీల్లేదు. అలా జరగటానికి వీల్లేదు. ఇక ఈ మనిషితో ఆ లిల్లమ్మ కు ఏ మాత్రం సంబంధం ఉండకూడదు.
పొద్దున్న లేచేసరికి ఆమె ముఖం ముడుచుకుని కనిపించింది. అతనికి గుండెలు దడదడ మన్నాయి. "ఆరోగ్యం బాగుందా?' అన్నాడు చలపతి.
"ఏదో ఉన్నాను. ఎన్నాళ్ళు ఉంటాను లెండి. ఎప్పుడు మళ్ళీ రోగం తిరగాబెడుతుందో అప్పుడు ఈ ప్రాణం కాస్తా పొతే మీకు సుఖంగా ఉంటుంది. ఈ అడ్డు తీరటానికి ఎన్నాళ్ళో పట్టదు లెండి " అంది రాధ.
ఈ ధోరణి చలపతికి అర్ధం కాలేదు. "ఏం అలా అంటున్నావు. ఇప్పుడెం జరిగింది ?' అన్నాడు.
"ఏం జరగాలి? ఆ రాజారాం గారి పొగడ్తలకి లొంగిపోయి నాకు అన్యాయం చేస్తారా?"
చలపతి నవ్వేసి "ఓస్ ఆదా. ఆ ఉత్తరం అందుకే నువ్వు చదవకూడదని అన్నాను. మీ ఆడవారు అలాంటి ఉత్తరాలు చదవకూడదు. చదివితే ఇలాంటి అపోహలే పుడతాయి." అన్నాడు.
"ఇందులో అపోహ ఏముంది? ఉన్న మాటగా?"
"నీకు తెలిసింది అంతే. ఇప్పుడంతా నీకు వివరించి చెప్పి నిన్ను నమ్మించ లేను గాని నన్ను మాత్రం అపార్ధం చేసుకోకు. నన్ను నమ్ము లేనిపోని కలతలు పెంచుకుని మనస్సు పాడు చేసుకుని ఆరోగ్యం పాడు చేసుకోకు.'
