ఆ జవాబు నాకు ఎంతో హాయినిచ్చింది. నాకు ఆమె మీద జాలి కూడా వేసింది. తిరిగి ఉత్తరం రాశాను.
'అనుభవంలేని రచయిత్రీ! చెల్లీ!
జీవితంలో అడుగే పెట్టని నీకు, ఆ జీవితానుభవాన్ని ఒక సోదరిగా, శ్రేయోభిలాషిణిగా బోధపరచాలని నా కోరిక. ఇకనుంచి అయినా కళ్ళు తెరిచి ఊహాలోకాలు విడిచి వాస్తవ జీవితాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించు. వాస్తవికతను మరుగు పరిచే నీ రచనలవల్ల ఇంకా జీవితంలో అడుగు పెట్టని అమాయకుల్ని భ్రమపెట్టటం, భవిష్యత్తులో వారి ఊహలు దెబ్బతిన్నప్పుడు ఎటువంటి సంజాయిషీ ఇచ్చుకోలేకపోవటం తప్ప మరో ప్రయోజనం లేదు. నీ ఊహలు ఊహలే ననీ, నీ కలలు కల్లలనీ, నీ ఆశలు నిరాశలనీ, నువ్వు ఒట్టి అబద్దమనీ తెలుసుకున్ననాడు నీ వేదన వర్ణనాతీతం సుమా! జీవితంలో పరాజిత నైన నేను చెప్పే ఏ మాటలు ఒకనాడు నీకు గుర్తు వస్తాయి. వాటి అవసరమూ వస్తుంది. కారణం నువ్వు స్త్రీవి! రచయిత్రిగా పవిత్ర మైన స్థానంలో ఉన్న నీపై బరువైన బాధ్యత ఉంది. ఎన్నడూ వాస్తవికతను దాచకు. పాఠకులకు భ్రమలు కల్పించకు. ఈనాటినించీ నువ్వు నిజాలు తెలుసుకొని ఉంటే, రేపు ఎదుర్కొనే పరిస్థితులు నిన్ను ఏమీ చెయ్యలేవు. ఇది అనుభవ పూరితమైన సలహా సోదరీ!'
"ఎలా ఉంది?" అంది భాను నవ్వుతూ.
"గొప్పగా లేదు. మనం అనుభవిచని వన్నీ అసంభవాలనుకోవటం బుద్ధిపొరపాటు. సంసార జీవితంలో సౌఖ్యం లోపించిననాడు వివాహాలే జరగవు. మనం అనగా ఎంత? మనం చూసిన లోకమెంత? భానుమతి ఇంటిపక్కనే సరోజాదేవి కాపురం చేస్తూంది. మానవుల్లో వైవిధ్యం ఎప్పుడూ ఉంటుంది. అవునా?"
భాను మాట్లాడలేదు. నవ్వింది.
"అది సరేగానీ స్నానం చెయ్యాలి భానూ. తుండు తెచ్చిపెట్టు. తర్వాత మాట్లాడుకో వచ్చు" అంటూ లేచాను.
స్నానంచేసి వచ్చేసరికి బావ వచ్చాడు.
చూస్తూనే పలకరించాను: "బావున్నారా, బావగారూ?"
"ఊ" అనేసి విసురుగా వెళ్ళిపోయాడు. నాకు చాలా సిగ్గువేసింది. బాత్ రూంలోంచి తువ్వాలు కోసం కేక పెట్టాడు. భాను నా దగ్గర తువ్వాలు తీసికెళ్ళి అందించింది. అందుకొంటూనే దాన్ని విసిరికొట్టాడు. "తడిగుడ్డ పడేస్తే ఎలా తుడుచుకుంటానని నీ గర్వం? అడ్డమైన వెధవలూ చేరి.....సిగ్గులేని వెధవలు!"
నేను నిర్ఘాంతపోయాను. సిగ్గుతో చితికి పోయాను. అభిమానంతో కుంచించుకుపోయాను. అతను సూటిగా నన్నే తిడుతున్నాడు. నేను ఇంకా అతని గుమ్మంలో నిలబడి ఉన్నానంటే సిగ్గులేని వాణ్ణికానూ? గబగబా బట్టలు వేసుకున్నాను. అతని గదిముందుకు వెళ్ళి, "క్షమించండి బావ గారూ, ఇన్నాళ్ళూ నా రాకపోకలతో మిమ్మల్ని కష్టపెట్టాను. అయినా ఎదుటి వ్యక్తిచేత అవమానింపబడాల్సినంత నీచమైన వాణ్ణి మాత్రం కాదు. వెళ్తాను" అని వీధి గుమ్మంకేసి నడిచాను.
"అన్నయ్యా!"
భాను లోపలి గడపలో నించుని ఉంది. కళ్ళవెంట నీళ్ళు కారుతున్నాయి.
"మరేమీ అనుకోకు చెల్లీ! వెళ్తాను" అనేసి బయటపడ్డాను. రోడ్డుమీద నడుస్తూంటే ఏడుపు ముంచుకొచ్చింది. భానుకు ఏ సహాయమూ చెయ్యలేకపోగా కంటి చూపుకు కూడా దూరమవుతున్నాను. భాను వెక్కి వెక్కి ఏడుస్తూంది. నాకు తెలుసు. నేనేం చెయ్యను?
భాను భర్త! ఆనాడు నేను విడిదికి పరుగెత్తుకు వెళ్ళి చూసి వచ్చిన రాజశేఖరం! ఏమి చూసి అంత మురిసిపోయాను? ఈ కళ్ళతో చూసి తెలుసుకోగలిగిన సంగతులు అతి స్వల్పం కాదా?
* * *

వారం దాటింది. నా మనసు ఏమీ బావుండటం లేదు. రాత్రుళ్ళు సరిగా నిద్ర పట్టటం లేదు. ఏమీ తిన బుద్దికావటంలేదు. అస్తమానూ భాను జ్ఞాపకం వస్తూంది. కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
ఆరోజు రాత్రి నిద్ర పట్టేసరికి ఏదో పీడ కల వచ్చింది. భాను పగలబడి నవ్వుతూంది. త్రుళ్ళిపడి లేచాను. ఏదో భయం ముంచుకొచ్చింది. భాను ఏడుస్తూందేమో? ఈ అర్ధరాత్రి.......ఒక్కతీ.......చాలసేపు చీకట్లో ఆలోచిస్తూ కూర్చున్నాను. ఒక్కసారి వెళ్ళివద్దామా అనిపించింది. అంత అర్ధరాత్రి వెళ్ళితే అతనేమంటాడో అని జడిశాను. కాని, అప్పుడే తెగించి వెళ్ళి ఉంటే భాను బ్రతికేది. నా భానును చేతులారా జారవిడిచాను. భగవంతుడా! నా భాను నన్ను విడిచి వెళ్ళిపోయింది. తల్లిలేని ఈ పసివాణ్ణి నేను ఏం చెయ్యను?
భాను శాశ్వతంగా దుఃఖం నుంచి విముక్తి చెందింది. అనంత సాగరగర్భంలో, నిత్య నూతన ప్రవాహంలో, ఎగిరెగిరి పడే కెరటాలలో ఎక్కడో-ఎక్కడో-జీవాలు విడిచి, సర్వం మరిచి వెళ్ళిపోతూంది. అయ్యో, చెల్లీ!
* * *
భాను కొడుకును పిన్ని చేతులకు ఎలా అప్పగించానో నాకు తెలీదు. పిన్ని స్పృహతప్పి పడిపోయింది. ఒక్కసారి ఇల్లంతా శోక సముద్రంలో మునిగిపోయింది.
"అమ్మా! భానూ! నిన్ను కని పెంచి పెద్ద చేసిన అమ్మ చచ్చిపోయిందనుకున్నావా, తల్లీ! గర్భశోకం ఎరగని అమ్మకు ఆరని చిచ్చు పెట్టావా తల్లీ! నీ కష్టం నాకు చెప్తే నిన్ను కడుపులో పెట్టుకోనా అమ్మా! నీ పసి కందుని అప్పగించి వెళ్ళిపోయావా, తల్లీ! భానూ! నిన్ను నే నెలా మరిచిపోనమ్మా! ఏ కెరటాలలో కలిసి పోయావు తల్లీ!"
పిన్ని స్పృహ రాగానే నేలమీద దొర్లి దొర్లి ఏడవటం ప్రారంభించింది. ఆ దుఃఖంలో నన్ను కూడా తిట్టిపోసింది. భాను సంసార విషయం నేను ఎప్పుడూ తనకు చెప్పలేదనీ, మాట మాత్రమైనా చెప్పిఉంటే ఈ అఘాయిత్యం జరిగేది కాదనీ బావురుమంది. అదీ నిజమే. ఎన్నడైనా పిన్నికి చెప్పిఉంటే ఇలా జరిగేది కాదేమో! ఇక ఇప్పుడు చెయ్యగలిగింది ఏముంది?
చీకటి పడింది. ఎవరూ లేచి దీపం పెట్టలేదు. ఇల్లు స్మశానమైంది. ఆ ఇంటిలో భాను ఒక్కతే లేదు. పిన్ని మళ్ళా పెద్ద పెట్టున ఏడుస్తూంది. కళ్ళు తుడుచుకొని నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. నా చేతులు పట్టు కుని ఏడవటం మొదలుపెట్టింది. నేనూ తమాయించుకోలేక వెక్కి వెక్కి ఏడిచాను.
"బాబూ! కేశవ్! భాను బ్రతికి ఉండదంటావా?"
"పిన్నీ! నన్ను క్షమించు పిన్నీ! భాను ఇంత పని చేస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడూ ఇలా చెయ్యనని కూడా చెప్పింది. నాకు ఉద్యోగం రాగానే భానుని వేరే తీసికెళ్దామని అనుకున్నాను. ఇంతలోనే....."
భానుకొడుకు అక్కడికి వచ్చాడు. వాణ్ణి కౌగలించుకొని ఘొల్లుమంది పిన్ని.
"పిన్నీ! బాబు గురించి నువ్వు బెంగ పెట్టుకోవద్దు. వాడి భారమంతా నాది. వాణ్ణి నేను పెంచి పెద్ద చేస్తాను. కావలసినంత చదువు చెప్పి స్తాను. తల్లీ తండ్రీలేని లోటు తీరుస్తాను. నన్ను నమ్ము పిన్నీ!"
"నీకు తెలియదు నాయనా! ఇంట్లో ఆడదానికి ప్రేమ ఉండాలి బాబూ! నా బిడ్డ నాకు భారం కాదు. నేను రాలిపోయేవరకూ కడుపులో పెట్టుకుంటాను. ఆ తర్వాత వాడి గతి...." అంటూ పెద్దగా ఏడిచింది. పిన్ని భయం నాకు అర్ధమైంది. నిజమే. ఆ భావం ఎవరికైనా కలుగుతుంది. కాని భాను కొడుకును భానులాగే ప్రేమించే వ్యక్తి లేకపోలేదు. ఆమె సుశీల! సుశీల నా భార్య అయిన నాడు బాబు విషయంలో ఏ భయమూ అవసరంలేదు.
"పిన్నీ! అవసరం కాబట్టి నీకు చెప్తున్నాను. నేను సుశీలని పెళ్ళి చేసుకుంటాను. ఈ నిర్ణయానికి తిరుగులేదు. సుశీలమీద నీకు నమ్మకం ఉందా? చెప్పు పిన్నీ!"
"బాబూ! కేశవ్...." పిన్ని కళ్ళెత్తి ఆశ్చర్యంగా చూసింది. "సుశీలా? భాను తల్లి కబురు విని అది ఎంతగా ఏడుస్తుందో నాకు తెలుసు బాబూ! భాను కొత్తగా కాపురానికి వెళ్ళిన నాడు బావురుమని ఏడ్చింది. అన్నం తినటం మానేసింది. దాని చేతుల్లో బాబు పెరిగితే నాకు దిగులు లేదు. అయినా ఈ పసివాడి కీ పాట్లెందుకు రావాలి? భగవంతుడా!" పిన్ని ఏడుస్తూనే ఉంది.
నా మనసు ఒకరకంగా శాంతించింది. లేచి బయటికి నడిచాను. చీకట్లో మెట్లు ఎక్కి వస్తూ సుశీల తారస పడింది.
"సుశీలా!" అన్నాను అప్రయత్నంగా. సుశీల నిలబడిపోయింది. "భాను నీకు కూడా ఉత్తరం రాసింది." జేబులో కాయితాలు తడిమి చిన్న కాగితం తీసి ఇచ్చాను.
"భాను......నిజంగా చచ్చిపోయిందా?" సుశీల గొంతు భారంగా ఉంది. "నాకు కూడా ఎప్పుడూ ఏమీ చెప్పలేదు." తల దించుకొంది.
"అది మన దురదృష్టం! చచ్చిపోయిందని అనుకోవద్దు. భాను ఎక్కడో సుఖంగా ఉంది" అన్నాను కళ్ళు తుడుచుకొంటూ.
"నువ్వు ఉండికూడా ఇంత పని జరగనిచ్చావు."
"నిజమే సుశీలా! నేను భాను దగ్గర ప్రమాణం తీసుకోవలసింది. అంతదూరం ఆలోచించలేకపోయాను. నన్ను క్షమించు. నీవు చేయవలసిన కర్తవ్యం-చాల భారమైంది- ముఖ్యమైంది-మరొకటి ఉంది. ఈ నిమిషం నుంచి ఉదయుడు నీ కొడుకు. ఆ బాధ్యత మన యిద్దరిమీదా ఉంది."
"బావా!" సుశీల విస్తుపోయినట్టు కంఠం ధ్వనించింది. తల ఎత్తింది.
"నిజమే సుశీ! నువ్వు లోపలికి వెళ్ళు. పిన్నిని ఓదార్చు."
నేను చరచరా మెట్లు దిగి చీకట్లో సపోటా చెట్టు క్రిందికి వెళ్ళి కూర్చున్నాను. భానుతో ఆడుకున్న ఆ బండరాయి అలాగే ఉంది. లేచి వెళ్ళి రాతిని చేతితో నిమిరాను. "భాను చచ్చిపోయింది" అన్నాను. వంగిఉన్న సపోటా కొమ్మను చేతితో తడిమి, "భాను నీకూ తెలుసు కదూ? రాత్రే చచ్చిపోయింది" అన్నాను. నూతి గట్టుమీద కూర్చుని, "నువ్వూ భానుని ఎరుగుదువు కదూ? ఇప్పుడు లేదు. సముద్రంలోపడి పాపం! చచ్చిపోయింది" అన్నాను. నా కేమిటో కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. ప్రతి మొక్కకూ, ప్రతి రాయికీ, ప్రతి జీవికీ భాను చచ్చిపోయిందని చెప్పాలనిపిస్తూంది. నాకు ఏడుపు రావటం లేదు. మనసు బండబారిపోయింది. ఒకవేళ నాకు మతి చలిస్తూం'దేమో! పిచ్చి ఎక్కుతుందేమో! లేక పోతే ఏడుపెందుకురాదు? చాలాసేపు బండరాతి మీద కూర్చున్నాను. భాను ఉత్తరం ఇంకా చదవలేదు. అంతవరకూ చదవటానికి మనస్కరించలేదు. అవకాశమూ చిక్కలేదు. భాను క్రిందటి రాత్రి బ్రతికి ఉంది. ఇంకా చచ్చిపోయి ఇరవై నాలుగు గంటలు కాలేదు. అసలేం వ్రాసింది? లోపలికి వెళ్ళి వసారాలో ఒక మూల కూర్చుని ఉత్తరాలు తీశాను.
'అన్నయ్యా!
అనుకోకుండా నీ కీ ఉత్తరం రాయవలసి వచ్చింది. నేను చేస్తున్న పనికి నువ్వు ఎంత ఏడు స్తావో నాకు తెలుసు. ఊహించగలను. కానీ ఇది నాకు తప్పలేదు. ఇటువంటి దుర్దినం ఎప్పుడూ రాకూడదనీ, ఎంత దుఃఖాన్నయినా భరించి ప్రాణాలతో ఉండాలనీ, నా బాబుని ఈ చేతులతో పెంచి ప్రయోజకుణ్ణి చెయ్యాలనీ అనుకున్నాను. ఎన్నోసార్లు అఘాయిత్యాలకు పాల్పడుతున్న మనస్సుని మందలించుకున్నాను. ఆవేశపడుతూన్న హృదయాన్ని హెచ్చరించుకున్నాను. కాని, అన్నయ్యా! నేను కోరుకున్నది జీవించటాన్ని కానీ నటించటం కాదు. ఏ క్షణమూ శాంతిలేని ఈ మనసుని, ఏ నిమిషమూ సుఖంలేని ఈ తనువుని ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని సంవత్సరాలు మభ్యపెట్టను! వీసమెత్తు విలువలేని ఈ శరీరాన్ని ఎవరికోసం బ్రతికించుకోను?
