Previous Page Next Page 
పేక మేడలు పేజి 22


    ఈ ఇంట్లో జీవిస్తూన్న ఇద్దరు వ్యక్తులూ ఒకళ్ళకి ఒకళ్ళు ఏమీ కారు. బంధువులూ కారు; స్నేహితులూ కారు; కనీసం పరిచయస్థులూ కారు. తోటి ప్రయాణికులూ కారు. శత్రువులు! ఒకర్ని ఒకరు ద్వేషించుకొనే, ఒకరి నీడ ఒకరు అసహ్యించుకొనే, ఒకరి ఉనికి ఒకరు దూరం చేసుకొనే దౌర్భాగ్యులు! కల్యాణ వేదిక అనబడిన ఆ బలిపీఠం ఎక్కకముందు ఒకరికి ఒకరు ఎంత దూరమో-ఇప్పుడు దానికి వేయిరెట్లు! ఆనాటి మత్తునీ, ఆనాటి కోరికలనీ, ఆనాటి ఊహలనీ, సర్వాన్నీ పోగొట్టుకొని, కళకోసమే కళ అన్నట్టు, బ్రతుకు కోసమే బ్రతుకుతూన్న దురదృష్టవంతులు.
    ఇద్దరు వ్యక్తుల్ని, రెండు శరీరాల్ని కలపాల్సిన ఈ మానసిక బంధం వీగిపోయింది. నవ జీవితంలో చిగిర్చి సాగిన ఆ అనురాగ లత వాడి పోయింది. ఇక ఈ ఇద్దరూ ఒకరికి ఒకరు ఏమీకారు. రెండు పాషాణాలు ఒకేచోట మెసిలితే వాటికి సంఘర్షణ తప్పదు. సుడిగుండాలలో చిక్కుపడిన ఈ సంసార నావ తలక్రిందులు కాక మానదు.        
    ఒకసారి నువ్వు అన్నావు-ఇక నీ కొడుకే నీకు ఆశాజ్యోతి భానూ!-అని. కాని అది నేను సహించలేకపోయాను. నా ఉద్దేశ్యం చెప్పాలనిపించినా చెప్పలేకపోయాను. ఇంకా నాకు బావమీద ఆశ ఉంది అన్నయ్యా!-అంటే నువ్వు నవ్వుకొంటావని సిగ్గుపడ్డాను. నిజానికి బావని నేను ఎంత ద్వేషించినా, ఎంత విమర్శించినా నాలో ఎక్కడో ఎందుకో ఒక ఆశారేఖ లీలగా మెరుస్తూ ఉండేది-ఒకనాటికి ఆయనలో పరివర్తన కలుగుతుంది; తనకు భార్య ఉందనీ, కొడుకు ఉన్నాడనీ గుర్తువస్తుంది; ఆ సుదినం తప్పక వస్తుంది-అని.
    నిజానికి దారితప్పి నడిచేది ఎవరుకానీ కొన్నాళ్ళకి దారి తెలుసుకుంటారు. మనిషి చేసిన తప్పులు తెలుసుకోకుండానే ఎప్పుడూ జీవితం ముగిసిపోదు. అలా జరిగితే అది ప్రకృతికే విరుద్ధం! నా ఓర్పు నశించేవరకూ ఆయనలో మార్పు రాలేదు. కాని తప్పక వస్తుంది. ఒకప్పటికి! నేను అనుభవించకుండా పోయేటప్పటికి! ఈ జీవితంలో నేను సరిదిద్దుకోలేని పెద్ద పొరపాటు ఉంది. భర్త కుంటివాడుగానీ, గుడ్డివాడు గానీ,  అనామకుడు గానీ, అసమర్ధులు గానీ, దౌర్భాగ్యుడు గానీ, దుష్టుడుగానీ ఎటువంటివాడైనా భార్య ఆ వ్యక్తిని ప్రేమించి గౌరవించాలనీ, అతని అడుగుజాడల్లో నడవాలనీ మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కానీ శాస్త్రాల ఘోష నేను వినను. నా ఘోష శాస్త్రాలు అసలే వినవు. నేను నా భర్తని ప్రేమించ లేకపోవటం, ఆయనకోసమే నా సర్వస్వం అర్పిస్తూ బ్రతకలేకపోవటం మహాన రాధమే! ఆ శాస్త్రాలనే చదువుకున్న యమధర్మరాజు నన్ను నిలవేస్తాడు కాబోలు.        అత్తయ్య పోలికలు నాకు అన్ని విధాలా వచ్చాయి. తృప్తిలేని ఈ బ్రతుకు ఇక నేను సాగించలేను. దానివల్ల నా లక్ష్యం కూడా దెబ్బ తినవచ్చు. నా ఏకైన లక్ష్యం దెబ్బ తిన్నవాడు నేను నిరర్ధకం కాదా? సంతోషమే కరువైన ఈ ఇంటిలో, అనురాగం తెలీని తల్లితండ్రుల మధ్య పెరిగే కొడుకు ఎంత సున్నితమైనవాడు అవుతాడు? ప్రయోజకు డెలా కాగలుగుతాడు? అందుకే నా బాబు మరొకచోట, శాంతి నిలయంలో, ప్రేమ సదనంలో పెరుగుతాడు. నేను తప్పుకుంటాను. ఇదే నా లక్ష్యమైతే నేను చావ నవసరం లేదంటావా? అది నామీద నీకు ఉన్న అపారమైన అనురాగం. అంతే. ఒక ఆడది తెగించి ఒంటరిగా జీవించే తాహతుకి మనసమాజం పెరగలేదు. మనం అంత పురోగ మించలేదు. అయినా సమాజపు స్థాయి నాకు ఎప్పుడూ అవసరంలేదు. నేను ఎప్పుడైనా ఇదే చేస్తాను. ఇది ఆవేశమే అయితే ఇదే నాకు విముక్తి ఇస్తుంది.
    బ్రతికి ఉంటే నాకు అంతులేని ప్రేమ కావాలి. ఒకరిలో ఒకరు ఐక్యమైపోయే, ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ధారపోయగలిగే, ఒకరి కోసమే ఒకరు జీవించి ఉండే ప్రేమవాహిని ప్రవహించాలి. అదే నిజమైన జీవితం! ప్రాణాలతో ఉంటే నాకు అదే జీవితం కావాలి.
    పరిస్థితులు ప్రతికూలిస్తే సహించగలిగే ఓర్పు నాకు లేదు. మొదటినుంచీ నాలో లోపం అదే. భగవంతుడు నన్ను సహనంలేని స్త్రీ కావాలని శపించాడు. మరి ఆ భగవంతుడూ పురుషుడే కదా? ఒక స్త్రీకోసం ఏ పురుషుడు మాత్రం ప్రేమదానం చేస్తాడు?
    చూడు అన్నయ్యా! నా బాబు, తండ్రి ఆదరణే తెలీని నా కొడుకు, తల్లిని కూడా కరువు చేసుకుంటున్నావని తెలీక అమాయకంగా నిద్రపోతున్నాడు. వాడు ఇక జీవితంలో అమ్మని చూడడుకదూ? నేను వెళ్ళిపోయాక వాడు లేచి ఏడిస్తే, వాళ్ళ నాన్నగారికి నిద్రాభంగమై చిరాకు పడి కొడితే, గది బయటపడేసి తలుపులు మూసుకుంటే, ఆ చీకటిలో వాడు అమ్మా! అమ్మా! అని భయంతో విలపిస్తోంటే-భగవాన్! మాతృ హృదయాన్ని ఇంత నిర్దయగా సృష్టిస్తావా? తల్లి కడుపులో కాఠిన్యం నింపుతావా? నా బాబుని నువ్వు బుజ్జగిస్తావా? నా కళ్ళు చెరువులౌతున్నాయి. అక్షరాలు చెదిరిపోతున్నాయి.
    అన్నయ్యా! ఫర్వాలేదు కదూ? ఈ సంగతి తెలియగానే నువ్వు వస్తావు. బాబుని తీసికెళతావు. అమ్మకి అప్పగిస్తావు. కాని కేశవ్! ఆ బాధ్యత అమ్మది కాదు. నీది! నేను నా బిడ్డని నీకు ఇస్తున్నాను. నా హృదయాన్ని, నా శరీరంలో శరీరాన్ని, నా కొడుకుని, నా ఉదయున్ని నీకు ఇచ్చివేస్తున్నాను. నువ్వు వాడికి తల్లివి. తండ్రివి. దేవుడివి. సర్వస్వానివి. నాలో బలీయమైన ఈ నమ్మకాన్ని ఎన్నడూ వమ్ముచేయవు కదూ?
    బాబు చదువు విషయంలో నా కోరిక ఒకటి! వాడిని వైద్యం చదివించు. విదేశాలు పంపించు. అది నా కాంక్ష! కాని బాబు డాక్టర్ కావటానికి విముఖత చూపిస్తే ఎప్పుడూ ఒత్తిడి చెయ్యకు. వాడి యిష్టప్రకారం, వాడు వాంఛించే, అభిమానించే విద్య నేర్పించు. వాడికి బట్టలుకుట్టాలనే కోరిక ఉంటే టెయిలర్ కానీ! వాడికి కుండలు చెయ్యాలనే కోరిక ఉంటే కుమ్మరి కానీ! తప్పు లేదు. కానీ వాడు ఆ విద్యలో నేర్పరి కావాలి. అది ముఖ్యం!
    తర్వాత నీ పెళ్ళి విషయం-నువ్వు సుశీలని పెళ్ళి చేసుకో. అనుక్షణమూ నిన్నే ధ్యానించే ఒక వ్యక్తి ఉందంటే అది నీ భాగ్యం కదూ? ఊహ తెలిసిన ఘడియనుంచీ నిన్ను అభిమానిస్తూ, నిన్ను ఆరాధిస్తూ గడిపే వ్యక్తికీ నువ్వు ఎంతైనా ఋణపడి ఉన్నావు. అది తీర్చుకోనినాడు నువ్వు కృతఘ్నుడివి కూడా అవుతావు.
    పెదనాన్న మూర్ఖత్వం నాకు తెలియనిది కాదు. అందుకే నీకు ఇంతగా బోధపరుస్తున్నాను. జీవితలక్ష్యం డబ్బు సంపాదించటమే కాదనీ, పరస్పరం కాంక్షించే రెండు హృదయాలను కలపటంలో పుణ్యం, విడదీయటంలో పాపం కలుగుతాయనీ ఏనాటికైనా పెద నాన్నకు తెలిస్తే ఎంత బావుండును! అయినా నువ్వు పురుషుడివి. స్వతంత్రుడివి. ఆలోచించు. తల్లి తండ్రులకు బిడ్డలు ఎప్పుడూ విధేయులై ఉండాలి. నిజమే. అది తమ జీవితాలను బలి పెడుతున్నప్పుడు కాదు. పెద్దలైన స్వార్ధాలకు దాసులైనప్పుడు కాదు. సుశీలతో నీవూ, నీతో సుశీలా జీవితాలను పరిపూర్ణంగా తీర్చిదిద్దుకో గలరు. మీవంటి తల్లితండ్రులు! నా ఉదయ్ అదృష్టవంతుడు! నా కళ్ళు చెమర్చుతున్నాయి. వాడు ఇంకా నిద్రపోతున్నాడు-పక్కలో నేను ఉన్నాననుకొని ప్రశాంతంగా నా చేయి వణుకు తూంది. కలం సాగటం లేదు. ఇక ముగించనా?
    నేను ఈ జీవితంనుంచి, దుఃఖంనుంచి, కన్నీళ్ళనుంచి, అశాంతినుంచి, ఆలోచనలనుంచి, ఆవేదననుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. పారిపోతున్నాను. ఇది ఎంత సుదినం! అన్నయ్యా, నాకు పగలబడి నవ్వాలనిపిస్తూంది. విరగబడి నవ్వాలనిపిస్తూంది. నేను జీవితంలో ఓడిపోయాను. ఇది భంగపాటు కాదు. పరాజయం! ప్రతి ఆడదీ ఒక భానుమతి కాకపోవచ్చు. అయినా ఈనాటి సమాజంలో వేలాది భానుమతులు ఉన్నారు. మన సాంఘిక వ్యవస్థలో తీవ్రమైన మార్పులు వస్తున్న దశ ఇది. ఈ పరిణామ క్రమంలో  ఒకవైపు పురోగమనం! మరోవైపు తిరోగమనం! మేల్కొంటున్న     
    స్త్రీజాతిచైతన్యం, కరడుగట్టిన సమాజంతో ఢీకొంటున్నది. తరతరాలుగా స్థిరపడిఉన్న పురుషుని ఆధిక్యం క్రింద స్త్రీ చైతన్యం నుగ్గు నుగ్గు అవుతున్నది. అయినా ఈ తిరుగుబాటు నీకోసం, నా కోసం ఆగదు. ఇది ఉపద్రవమైన వరదవంటిది. దానికి ఎదురీదటానికి ప్రయత్నించిన వాడు కొట్టుకుపోతాడు. ఆరోజు కోసమే కొంతమంది భానుమతులు బలి కావాలి.
    తర్వాత-నా బాబు కేదో పిచ్చి పిచ్చిగా ఒక ఉత్తరం రాశాను. అది జాగ్రత్తగా దాచిఉంచి, నా బాబు పెరిగి పెద్దబాడి స్వయంగా దాన్ని అర్ధం చేసుకోగలిగే శక్తి వచ్చినప్పుడు ఇస్తావు కదూ?
    మరి నేను వెళ్తాను. బాబు నిదలేస్తే ఏమీ చెయ్యలేను.
    నీ హృదయపూర్వకంగా నాకు బహూకరించిన వాచీ నాతోనే తీసుకు వెళ్తున్నాను. అది నా శరీర భాగమే. నాతోపాటు ఎన్నో అపహాస్యాలు అదీ భరించింది. శాశ్వతంగా నిన్నూ, నా బాబునీ, నా సర్వస్వాన్నీ గోల్పోతూన్న దౌర్భాగ్యపు చెల్లి-భాను! భానుమతి!'
    ఉత్తరం ఒడిలో పెట్టుకొని మోకాళ్ళలో తల దూర్చికుళ్ళి కుళ్ళి ఏడ్చాను. నా మనసు హెచ్చరిస్తూంది. భాను కోరిక  కోరిక కాదు. శాసనం! మీరటానికి వీలులేదు.
    భాను నాకన్నా చిన్నది. నాతో కలిసి చదివింది. ఆడింది. పాడింది. నేను నేనులాగే ఉన్నాను. భాను ఇల్లాలు అయింది. భార్య అయింది. తల్లి అయింది. చివరికి అంతంకూడా అయింది. నాకు జీవితంలో ఏ వైవిధ్యమూ లేదు. భాను సుఖించింది; దుఃఖించింది; సంతోషించింది; విచారించింది; అనుభవించింది; విరక్తి చెందింది. సమస్తం వాంఛించింది; చివరకు సర్వం కోల్పోయింది.
    నేను బ్రతికి ఉన్నాను. భాను చచ్చిపోయింది. అలా ఎంతసేపు కూర్చున్నానో నాకు తెలీదు. పెద్దక్కయ్య వెదుక్కొంటూ వచ్చింది. "భాను కొడుకు అన్నం తిననని ఏడుస్తున్నాడు. చూడు కేశవ్!" అంది. వెంటనే లేచి వెళ్లాను. బాబు తలుపుదగ్గర నించొని "అమ్మా! అమ్మా!" అని పెద్దగా ఏడుస్తున్నాడు. నాకు దుఃఖం పొర్లుకొచ్చింది. "నానీ! దామ్మా!" అని ఎత్తుకొని భుజాన వేసుకున్నాను.
    "మామయ్యా! అమ్మ......."
    "వస్తుందమ్మా! ఊరు........వెళ్ళింది. ఇప్పుడే రైలుబండిమీద వస్తుంది. నువ్వు......అన్నం తింటావా? నేను తినిపిస్తాను."
    "ఉహూ! అమ్మ......మా అమ్మ......"
    "అమ్మ వచ్చేసరికి ఎంచక్కా నువ్వు అన్నం తినేసి ఉంటే అమ్మ ఎన్నో బొమ్మలు తెస్తుంది నీకు. బూరాలు కూడా తెస్తుంది. మనంఇద్దరం ఆడుకుందాం."
    "మా అమ్మ ఎక్కలి కెల్లింది?"
    "ఊరు వెళ్ళింది బాబూ! అప్పుడు నువ్వు నిద్రపోతున్నావు."
    "ఊ. ఊ. నన్నూ తీసికెల్లలేదేం?" అంటూ తిరిగి ఏడుపు ప్రారంభించాడు. నా మనసు రంపాల మధ్య నలుగుతూంది. వానిని గుండెలకు హత్తుకున్నాను.
    "అమ్మ..... గమ్ముని వచ్చేస్తుంది. అందాకా నన్ను చూడమని చెప్పింది. నిజం నానీ! ఏం మరి అన్నం తింటావా? నేనూ తింటాను."
    "నువ్వూ తింటావా?"
    "నేనూ, నువ్వూ ఎంచక్కా ఒక్క పళ్ళెంలోనే తిందామా?"
    "మలి మా అమ్మ ఎక్కల తింతుంది?"
    "అమ్మ చుట్టాల ఊరు వెళ్ళింది కదూ? అక్కడ అమ్మకి వాళ్ళు అన్నీ పెడతారు తింటుంది."
    "పెలుగు వేత్తారా?"
    "ఆ పెరుగు వేస్తారు. నెయ్యి వేస్తారు. అన్నీ వేస్తారు. నువ్వు కూడా పెరుగు వేసుకు తినకూడదూ?"
    ఓ గంటసేపటికి ఎన్నోప్రశ్నలువేసి ఎన్నో సమాధానాలు విని, అమ్మ ఆనక వస్తుందనినమ్మకం పెట్టుకొని అప్పుడు అన్నం తినటానికి ఒప్పుకున్నాడు. పది కావచ్చింది అన్నంకలిపే సరికి. సాయంత్రం అంతా దిగులుతో కూర్చున్నారు. ఎనిమిది గంటలవేళ పక్కింటి ముసలమ్మ ఎవరోవచ్చి కొంచెం అన్నం వండి పడేసింది. పెద్దక్కయ్య లేచి పిల్లలకు అన్నాలు కలిపింది.
    నానితోపాటు నేనూ నాలుగైదు ముద్దలు తినవలసి వచ్చింది. అన్నం తినిపించి బుజం మీద వేసుకు తిప్పి నిద్రపుచ్చాను. వాడు నిద్రపోయాక లేచి గదిలోకి వెళ్ళాను.
    అర్ధరాత్రి ఇల్లంతా నిశ్శబ్దంతో భయం కొల్పుతూ ఉంది. పిన్ని ఉండి ఉండి పెద్ద పెట్టున ఏడుస్తూంది. పిన్ని కడుపు తరుక్కు పోతూంది. నేను గదిలోనికి వెళ్ళి లైటువేసి భాను కొడుక్కు వ్రాసిన ఉత్తరం తీశాను. నాకు భాను మాట్లాడుతూంటే అలా వినాలని ఉంది. ఉత్తరం ద్వారానైనా భానుతో మాట్లాడాలి. ఉత్తరంలో చాల చోట్ల అక్షరాలు చెరిగిఉన్నాయి.
    'నాన్నా!
    ఉదయా! నా చిరంజీవీ! నిన్ను ఏమని పిలువను? మూడు సంవత్సరాల నిన్ను, సరిగా మాటలే రాని నిన్ను, పాతిక సంవత్సరాల పురుషుడు గా, సర్వం తెలుసుకున్న పెద్ద మనిషిగా ఊహిస్తూ, నీకు ఉత్తరం వ్రాయాలంటే నాకు ఏమీ తోచటం లేదు బాబూ! నీకు నేను ఈ కడసారి ఘడియల్లో ఏదో చెప్పాలి. ఏదో బోధించాలి. ఎన్నో నీకు అర్ధం అయ్యేటట్లు చెయ్యాలనీ, నా మనసు నీముందు విప్పి పెట్టాలనీ తపించి పోతున్నాను. ఇప్పుడు నేను నీ పక్కలోనే కూర్చున్నాను. నువ్వు గాఢంగా నిద్రపోతున్నావు. మధ్య మధ్య నవ్వుతున్నావు. నిన్ను ముద్దు పెట్టుకోవాలని ఆత్మ కొట్లాడుతోంది. కాని అది ఇప్పుడు నేను చెయ్యకూడదు. నీది సున్నితమైన మనస్సు. ప్రతి చిన్న చప్పుడికీ లేచిపోతావు. ఇప్పుడు నువ్వు ఇస్తే నేను ఏమైనా చెయ్యగలనా? నువ్వు చెయ్యనిస్తావా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS