Previous Page Next Page 
పేక మేడలు పేజి 20

   
    "పన్నెండు వందలా?"
    "నేనుమాత్రం అలాగ ఆశ్చర్యపోలేదు. పన్నెండు వందలేనా? అని నాకు ఆశ్చర్యంవేసింది. ఒక గుమాస్తా క్లబ్బులోనే కాపురం పెట్టాడంటే తాహ తెక్కడి దనుకొన్నావు? అయినా ఆయన ఎన్ని ఊళ్లు తిరిగారనుకొన్నావు? అవసరంలేక పోయినా ఇంటర్వ్యూలకు దరఖాస్తులు పెట్టటం, వాళ్ళు టి. ఎ. ఇస్తారని మరో యాభై, వందా అప్పు చేసుకొని బయల్దేరటం!
    'ఎందుకిలా అప్పులపాలై ఊళ్ళు తిరగటం? ఈ అప్పులు తీర్చే తాహతు మనకు ఉందా?' అంటే, 'ఇలా కాకపోతే జీవితంలో మరోవిధంగా దేశం చూడలేను. అప్పులు అవే తీరుతాయ్!' అనేవారు.
    ఆ దేశం చూడాలనే కోరిక నాకు లేదూ? నీ స్వార్ధం నువ్వు చూసుకొంటే నాకు దిక్కు ఏదీ? పది ఊళ్లు నువ్వు ఒక్కడివే చూడక పోతే ముఖ్యమైన రెండు మూడు స్థలాలకు ఇద్దరం కలిసి వెళ్ళకూడదూ?
    సిమ్లాలో ఇంటర్వ్యూ వచ్చినప్పుడు రెండు వందలు అప్పుచేసి బయలుదేరారు. నిజానికి నాకూ కాశ్మీర్ చూడాలనిపించింది. తాజ్ మహల్ జీవితంలో ఒక్కసారి చూడాలంటారు. కనీసం ఆ ఒక్కచోటికైనా నన్ను తీసికెళ్తే.....నాకు నా భర్త కాకపోతే ఎవరు చూపిస్తారు? నాకోసం ప్రత్యేకంగా బయలుదేర మనలేదే! ఎలాగూ ఆయన వెళ్తున్నారు కదా అని అడిగాను. దానికేం జవాబు వచ్చిందో చెప్పటం అనవసరమనుకో. పన్నెండు వందలు అప్పు అయిందా అని నువ్వు ఆశ్చర్యపడితే చెప్తున్నాను."
    "సరే! ఏమైంది? నిన్ను డబ్బు అడిగారా?"
    "పూర్తిగా విను. 'నాకేమీ పాలుపోవటం లేదు భానూ! తలుచుకొంటే గుండెలు బద్ధలౌతున్నాయి. ఈ బెంగతో నా ఆరోగ్యం కూడా పాడై పోయేలా ఉంది. ఏం చెయ్యమంటావు చెప్పు?' అదీ లౌక్యం!
    ఎంత చిత్రమైన పరివర్తన! డబ్బుకోసం మానవుడు ఎంత హీనస్థితికి దిగజారగలడు! ఎంత నైచ్యానికి పాల్పడతాడు! అన్నిటినీ మించి ఎదుటి వ్యక్తిని ఊదితే ఎగిరిపోయే గడ్డిపరకగా భావించటం, మరీ విచిత్రంకదూ?
    'ఏమిటి ఆలోచిస్తున్నావు? నన్నేం చెయ్యమంటావో చెప్పు భానూ!'
    'అది నన్ను అడగటం అనవసరం. మీరు అప్పుచేసిన ఏ ఒక్క రూపాయికీ నా సలహా అడగలేదు. అది తీర్చుకోవలసిననాడు కూడా నా అవసరం లేదు.'    
    'అలా అనకు భానూ. ఇప్పుడు వాదించినా అప్పుతీర్చాలి కదా? నా దగ్గర ఉందా చెప్పు?'
    'మీ దగ్గర డబ్బు ఎప్పుడు ఉంటుందని, ఎలా తీర్చగలరని అప్పుచేశారు?'
    'అప్పుడంత ఆలోచించ లేని వెర్రివాన్ని అయ్యాను.'
    'అసలు ఇంట్లో భరించలేని వెర్రివాణ్ణి అయ్యాను.'
    'అసలు ఇంట్లో భరించలేని ఖర్చులేం ఉన్నాయని అంత అప్పు అయింది? ఇప్పటి వరకూ నాకు మావాళ్ళే బట్టలు కొంటున్నారు. పని మనిషైనా లేకుండా పనులు చేసుకొంటున్నాను. సినిమాలూ, షికార్లూ ఏనాడో మానుకున్నాను. నెల నెలా నూటయాభై రూపాయలు వస్తోంటే...?'
    'అవన్నీ ఆరాలు తియ్యకు భానూ! ఇప్పుడు నువ్వు ఎన్ని అంటే ఏంలాభం? నా కష్ట సుఖాలు నీకు అవసరంలేదా? ఈ సంసార బాధ్యతలు నీకు మాత్రం లేవా?'
    నేను ఎన్నో విషయాలు ఒక్కసారి గుర్తు వచ్చి బాధగా నవ్వాను. 'కష్టసుఖాలు! నిండు నెలలతో పుట్టెడు జ్వరంలో సోడా తాగాలంటే ఒక్క అర్ధణా లేక ఏడిచానే! మీకు తెలుసా? కాలు బెణికి స్నానానికి నీళ్ళు పెట్టలేనంటే చెంపలు పగలగొట్టారే! గుర్తు ఉందా? నేను సరదాపడి అగరవత్తుల చెట్టుకొంటే ఆ హక్కు ఎవరిచ్చారని అడిగారు. మరిచిపోయారా? బామ్మ గారికి అరిటాకు కోసి ఇచ్చానని కుళ్ళి కుళ్ళి ఏడ్చేలాతిట్టారు. జ్ఞాపకం లేదా? ఇలా ఎన్ని ఏకరువు పెట్టమంటారు? ఈ సంసారంలో నేనెంత సుఖం అనుభవిస్తున్నానో నాకు తెలీదా? ఏనాడూ నాకులేని కష్టసుఖాలూ, సంసార బాధ్యతలూ ఈనాడు ఎలా వచ్చాయి? ఎందుకొచ్చాయి? ఎంతకాలం ఉంటాయి? ఏది చెప్పినా తోసిపుచ్చి, ఏనాడూ అంటనివ్వకుండా చేసి, పేడపురుగు కన్నా హీనంగా చూశారు. మరిచి పోయావా? మీరు ఎన్ని చెప్పండి, అసలు చెప్పటం మానండి. అనవసరం. కంఠశోష! నా దగ్గరి నుంచి చిల్లిగవ్వ రాదు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ డబ్బు మీకు ఇవ్వను. నా తర్వాత కూడా మీకు దక్కనివ్వను. ఇంతే నేను చెప్పేది?'    
    ఆయన చాలాసేపు మౌనంగా కూర్చున్నారు. 'భానూ! నిజంగా నేను చాలా పొరపాట్లు చేశాను. ఇప్పుడు ఆలోచిస్తూంటే నిజం అనిపిస్తూంది. నన్ను క్షమించలేవా?'
    'పొరపాట్లూ, క్షమాపణలూ అంటే నాకూ అసహ్యమే.'
    'భానూ, నీ ఇష్టంవచ్చినట్టే చెప్పు. కాని నన్ను క్షమించు. నేను కోపంలో అన్నమాటలన్నీ మరిచిపో నాకోసం.'
    'ఇంత తొందరగా వచ్చిన పరివర్తన ఇంత తొందరగానూ పోతుంది. దేనికైనా పునాది బలం అవసరంకదూ?'
    'మారిపోయినా నమ్మనంటావ్. నీమీద నాకు ప్రేమ లేదని అనుకొంటున్నావు కదూ? అదంతా నీ భ్రమ భానూ!'
    'భ్రమించేది నేనుకాదు, మీరు! ఇంకా నన్ను నమ్మించగలనని భ్రమపడుతూన్న మీరు!'
    'భానూ! ఒక్కటి చెప్పు. నిన్ను నేను స్వయంగా చూసి ఇష్టపడి పెళ్ళి చేసుకున్నానా? ఎవరి బలవంతంమీదనైనా చేసుకున్నానా?'
    'పెళ్ళాం అంటూ ఒక ఆడది కావాలి కాబట్టి కంటికి నచ్చగానే అంగీకరించారు. కానీ పెళ్ళిళ్ళు చేసుకున్నవాళ్ళంతా తోటి వ్యక్తుల్ని ప్రేమిస్తారనే హామీ లేదుగా?'
    'ఏమో భానూ! ఇదివరకు నువ్వు చాలా మంచిగా ఉండేదానివి. ఎందుకో చాలా మారిపోతున్నావు.'
    'అదే అవసరమవుతూంది. మీరు చెప్పిన దంతా నిజమనీ, చేసినదంతా మంచి అనీ నమ్మి నన్నాళ్ళూ, కళ్ళుతెరిచి చూడనన్నాళ్ళూ, అనుమానించటమే తెలీనన్నాళ్ళూ మంచిగా, చాలా మంచిగా ఉన్నాను. కానీ ఇక మీరు చేయగలిగిందేమీ లేదు. నన్ను సుఖపెట్టనూ లేరు, దుఃఖ పెట్టనూ లేరు. నేను దేనికైనా సిద్దంగా ఉన్నాను. అద్దం పగిలితే అతుక్కోదు. అద్దం కన్నా సున్నితమైన మనసు విరిగితే బాగుపడదు.' కొన్నిక్షణాల మౌనం! 'సరే, భానూ! నీదయ! నేనేమీ చెయ్యలేను. ఎప్పటికైనా నీ మనసు బాగుచెయ్యగలిగితే అదృష్టవంతుణ్ణి!' అది ఆఖరి అస్త్రం!
    నాకు చిరాకువేసింది. ఎటువంటి పరిస్థితులు రానీ, ఒక వ్యక్తి తనని తానే ఖూనీ చేసుకోవటమా?
    'మీరు దయచేసి అంత దిగజారిపోకండి. ఆడదాన్ని పోషించి, ఆడదాన్ని రక్షించి, ఆడదాన్ని పాలించే పురుషుడు ఒక ఆడదాన్ని ఇంత దేవిరించటమా? నేను భార్యనే కావచ్చు. ఆడదాన్ని! మీ వ్యక్తిత్వం మీరు కాపాడుకోవాలనే నా కోరిక.'    
    ఆయన ముఖ కవళికలు క్రమంగా మారుతున్నాయి. అణిచి పెట్టుకొన్న కోపం, అభినయించిన శాంతం, భంగపడిన అభిమానం, పొంగులెత్తిన ఆవేశం-అన్నీ కలగలుపుగా ప్రస్ఫుట మౌతున్నాయి.
    గంభీరంగా అన్నారు:'ఆ డబ్బు ఏం చేస్తావు?'
    'ఏదో చేస్తాను. ఏమీ చెయ్యలేనప్పుడు తగల బెడతాను. మీకు మాత్రం......'
    నా చెంపలు అదిరిపోయాయి. కళ్ళు చీకట్లు కమ్మాయి. తూలి పడిపోయాను.
    'డర్టీ క్రీచర్! ఎంత పొగరు! కట్టుకొన్న మొగుడు కాళ్ళావేళ్ళాపడి దేవిరిస్తే నీతులు వల్లిస్తావా? డబ్బు తగలబెడతావా? నువ్వూ తగలబడతావా? చూస్తాను. ఆ డబ్బు నా చేతికి ఎలారాదో నేనూ చూస్తాను.'
    'ఇదేనా మీలో వచ్చిన పరివర్తన!'
    'నోర్ముయ్! నువ్వు నన్ను శాసిస్తావా?'
    'లేదు. మీరు చాలా మారిపోయాననీ, నన్ను ప్రేమిస్తున్నాననీ చెప్తే అవునో కాదో తేల్చుకుంటున్నాను.'
    'అవసరంలేదు. ఆ అవకాశం నువ్వు పోగొట్టుకున్నావు. నేను అన్నివిధాలా మారిపోదామనుకున్నాను. కాని వీసమెత్తు విలువలేకుండా చేశావు. నీకు ఇప్పుడు బుద్ధిరాదు. నేను ఇంకా, ఇంకా నాశనమై తాగి, తందనాలాడి దేన్నో వెంట వేసుకుని కొంపకొస్తే-అప్పుడు...'
    'ఎంత అర్ధంలేకుండా మాట్లాడుతున్నారు! నామీద కోపంతో మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటారా? ఆజ్ఞాపించి క్షమ సంపాదిస్తారా? ఒక వ్యక్తి సుగుణాలు కలిగి ఉండటం ఇతరుల కోసమా?'
    'ఛీ! నీతో నాకు మాట లేమిటి? నువ్వు సంసారివా? కట్టుకున్న వెధవ అప్పులపాలై కుళ్ళి చస్తే నగలు సింగారించుకుని ఊరేగుతావా? అప్పులవాళ్ళంతా కలిసి నీ మొగుణ్ణి జైల్లోకి తోయిస్తే నువ్వు రూపాయల పక్క పరుచుకు పవ్వళిస్తావా? నీకు ఇప్పుడు బుద్ధిరాదు. ఆరోజు..ఒకనాడు...'
    చెప్పేదేముంది? అసలే కోతి! కల్లు తాగింది! నిప్పుతొక్కింది! తేలుకుట్టింది! గంతులెయ్యదూ?
    నాన్నకు జవాబు రాశాను: 'డబ్బు బ్యాంకులో వెయ్యండి. బాబు చదువుకు పనికి వస్తుంది' అని. కానీ ఆ ఉత్తరం రాసి ఎంత ఏడ్చానో తెలుసా?
    ఆ డబ్బుకంటే నా భర్త విలువ చాలా చాలా తక్కువ. ఆ వ్యక్తి అప్పులపాలై ఉన్నా, సిగ్గు విడిచి దేవిరించినా, ఆకోరిక తీర్చలేకపోయానంటే, ఆ డబ్బుకోసం అతని తిరస్కరించానంటే, కారణం ఎంత బలమైనదై ఉండాలి? ఈ సంసారం సక్రమంగా సాగిననాడు ఆ డబ్బు నేను కన్నెత్తి చూడగలనా? ఈ కాపురంలో అనురాగ బంధమే ఉన్ననడు ఎవరి కష్ట సుఖాలు వారివే అవుతాయా? తండ్రి సమర్దుడైతే కొడుకు చదువుకోసం తల్లి తాపత్రయపడవలసి వస్తుందా? భగవంతుడా! ఈ వేదనకు అంతులేదా? ఈ కన్నీటికి విలువలేదా? అంటూ ఏడ్చాను. అదీ ఈ మధ్య జరిగిన విషయం. బావ నాతో మూడు రోజులనుంచీ మాట్లాడటం లేదు" అంది భాను.
    "బావుంది. ఏవో గొడవలు వినాల్సి వస్తుందనే నా కిక్కడికి రావాలంటే భయం. పోనీ బావ మారిపోతానన్నప్పుడు నువ్వు అప్పెందుకు తీర్చకూడదు?" అన్నాను.    
    "నీకేం మతిపోయిందేవిటి? డబ్బుకోసం మారే మనిషిని నమ్మమంటావా? ఆయనకు ఈ సమయంలో డబ్బు ఇవ్వటం ఇంకా ప్రోత్సహించటం అన్నమాట. తన ప్రవర్తనలో లోటు పాట్లేమిటో ఆయనకు తెలిసిరావాలి. ఆయన మనసా పశ్చాత్తాపపడాలి. ఆనాడు ఏ సహాయం చెయ్యటానికైనా నేను సిద్దమే."
    నాకూ అది నిజమనిపించింది.
    భాను అంది: "కొన్నాళ్ళుపోయాక ఒక రేడియో కొనాలి. అది నాకు తీరని కోరికగా ఉండిపోయింది."
    "ఇన్నాళ్ళూ నాకు నువ్వెందుకు చెప్పలేదు?"
    "లేదు. నన్ను ప్రేమించే నువ్వు, నాకోసం ఏదైనా తెచ్చి ఇవ్వగలిగే నువ్వు ఉన్నవని నాకు తెలుసు. కానీ ఆ ప్రేమను నేను అన్నిటికీ విని యోగించను. అది మహోత్క్రుష్టమైనది. ఏ సోదరికీ లభించనిది. దాని విలువ దానికి ఉంది."
    "భానూ, నీతో మాట్లాడటం భయంగా ఉంది. నా ఊహకి అందకుండా పోతున్నావు."
    భాను నవ్వింది. "మరో కొత్త విషయం వింటావా? ఈమధ్య ఒక రచయిత్రి ఎక్కువగా కథలు రాస్తూంది. నీకూ తెలిసే ఉంటుంది. ఆవిడ రచనలన్నీ ఊహలు! పాత్రలన్నీ దేవతలు! కథా వస్తువులన్నీ దాంపత్య బంధాలు! అన్నీ సుఖాంతాలు! ఆవిడ రచన ఏది తీసుకో-స్త్రీ పురుషుల మధ్య ప్రేమలూ, మమతలూ, అనురాగాలూ, అభిమానాలూ జీవనదుల్లా ప్రవహిస్తూ ఉంటాయి. భార్య కాలికి ముల్లు గుచ్చుకొంటే భర్త మూర్చపోతాడు. భర్తకి తల నొప్పి వస్తే భార్యకి స్పృహ తప్పుతుంది. వాళ్ళు రాత్రింబవళ్ళూ విహరించేది స్వర్గసీమలలోనే! పవ్వళించేది పూలపరుపులలోనే! ఆ పూలు కూడా ఘుమఘుమలాడే మల్లెరాసులే కాని వాసనలేని బంతి పూలు కూడా కావు. వాస్తవికతను మరుగుపరిచే ఇటువంటి రచనలు చేయటం గానీ, చదవటంగానీ ఆరోగ్యప్రదం కాదు. నాకు ఆమె రచనల మీద ఏమాత్రం నమ్మకం లేదు. అయినా ఆలోచించాను. నా ఊహలే పొరపాటు కాకూడదా? భార్యా భర్తలలో అనురాగభావమే కరువయిందా? ఆమె అనుభవిస్తూన్న విషయాలే రాయటం లేదుకదా? అందుకే ఆవిడకు ఉత్తరం రాశాను. మీ రచనలు నేను చాలా చదివాను. ఎందులో చూసినా అపారమైన అనురాగం, అంతులేనిసంతోషం నిండి ఉంటాయి. ఇవి మీరు వాస్తవికతను ఆధారం చేసుకొనే రాస్తున్నారా? లేక కేవలం దాంపత్య జీవితాలను ఊహించి చిత్రిస్తున్నారా? మీ రచనలలోని అందాలన్నీ మీరు నూటికి నూరుపాళ్ళూ అనుభవిస్తున్నారా? లేక అలా అనుభవిస్తూన్న జంటలని చూస్తున్నారా? దయచేసి మనస్ఫూర్తిగా జవాబు ఇవ్వండి' అని జవాబు వచ్చింది. అది చూస్తే నాకు నవ్వు వచ్చింది. 'నేను చాలావరకు ఊహలనే ఆధారం చేసుకొని రాస్తున్నాను. కొంతవరకూ చుట్టూ ఉన్న సంసారాలను చూస్తున్నాను. ఎక్కడా నాకు, నా ఊహలకు వ్యతిరేకమైన వాస్తవికత కన్పించ లేదు. ఉంటుందని కూడా నేను అనుకోను. ఈనాటి మనుషులంతా అతి సున్నితమైన వారు. వారి ప్రవర్తనలో ఎన్నడూ కాఠిన్యం గోచరించదు. ఏది ఏమైనా నా రచనలలో అందాలు నేను అనుభవించిమాత్రం రాయటం లేదు. ఇంకా నేను అవివాహితను.'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS