అన్నయ్యా! ఈ క్షణంలో నా శిరస్సు సిగ్గుతో వంగిపోదేం? ఈ మనసు విరిగి ముక్క చెక్కలై పోదేం?
నేను ఊహించినదంతా ఊక! కల్ల! వాటికీ నేటికీ ఎటువంటి పరివర్తనా జరగలేదు. స్త్రీ జీవితంలో అభ్యుదయ మేదీ అవతరించలేదు. పురుష లోకంలో మానసికమైన ప్రగతి పొడచూపలేదు. స్త్రీకి ఈ సమానత్వం, ఈ హక్కులూ, ఈ చట్టాలూ-అంతా దగా! మోసం! లాంఛనప్రాయం! ఉపన్యాసాలకే పరిమితం! కాగితాలకే అంకితం! అనుభవంలో, నిజ జీవితంలో కాదు. నేను అత్తయ్యకన్నా అంగుళం పురోగమించలేదు."
భాను కొంచెంసేపు ఆగి తిరిగి మాట్లాడసాగింది. "మామయ్య సానికొంపల వెంట తిరిగితే అత్తయ్య తెలివితేటలు లేక ఊరుకొందనీ, బాబాయి పేకాడుతూనే బ్రతికితే పిన్ని సిగ్గులేక సహించిందనీ, మొగుడు హోటల్లో కాపురం పెడితే పెళ్ళాం ప్రేమలేక వదిలేసిందనీ, ఆనాడు భార్యలే మూర్ఖంగా భర్తల్ని చెడగొట్టారనీ, వ్యసనాలకు ప్రోత్సహించారనీ, క్షమ సహనం పాతివ్రత్యాల పేరిట అర్ధంలేని పరిస్థితులు అనుభవించారనీ-ఎన్ని అనుకున్నాననీ!
అలా వాళ్ళెందుకు చేశారో, చెయ్యకపోతే దారి ఏమిటో ఒక్కసారైనా ఆలోచించానా? స్త్రీకి ఎన్ని ఆశలుండనీ, ఎన్ని ఆశయాలుండనీ, ఎంత అభిమానం వుండనీ, బలీయమైన వ్యక్తిత్వం వుండనీ నీచాతి నీచంగా నిలబడే ఘడియ ఎప్పుడో ఒకసారి వచ్చి తీరుతుంది. లోకం చేత గౌరవించబడే ఆడది భర్తకు తేలికౌతుంది."
భాను చాల గట్టి నిర్ణయాలు చేసుకొంది. భాను ఆలోచనలు నాకు సమంజసమనిపించలేదు. "భానూ! నేను ఒక పురుషుడుగా మాట్లాడుతున్నాను. నీ దాంపత్యం అనేక దాంపత్యాలకన్నా భిన్నమైంది. నీ భర్తలో పొరపాట్లు ఉన్నాయి. అవి నీకు అంతులేని బాధ కలిగిస్తాయి. కానీ ప్రత్యేకమైన నీ అనుభవంతో పురుష జాతి మీదే ఒక ద్వేషాన్ని పెంచుకోకు. జాతి కంతకూ ఒక అభియోగాన్ని అంటగట్టకు. నువ్వు కోరిన ప్రగతి నూటికి నూరుపాళ్ళూ జరుగకపోయినా చాలవరకు మాత్రం నిజం. దానికి నిదర్శనం నీకు ఇన్ని విషయాలు అర్ధం కావటమే. అన్నయ్య నైనా ఒక పురుషుడితో నువ్వు వాదించగలగటమే. పూర్వం నీ ఆడది ఇన్ని విషయాలు మాట్లాడ గలిగింది? నువ్వు అన్నట్టు ఇంకా పూర్తిగా మాత్రం మన మనసులు వికసించలేదు. భానూ! కొన్ని వందల సంవత్సరాలనుంచీ పారుతోన్న ఈ సనాతన రక్తం ఎప్పటికీ అంతరించిపోవాలి? దానికీ కొన్ని తరాలు కావాలి. అభివృద్ది కాంక్షిస్తున్న స్త్రీ వేగంగా మారుతోంది. అదె వేగంతో అధికారం వదులుకోవలసిన పురుషుడు మారలేకపోతున్నాడు. అందుకే ఈ మానసిక సంక్షోభం."
"అన్నయ్యా! నేను కసికొద్దీ కొంత అతిశయోక్తిగా మాట్లాడాను గానీ, న్యాయం అంగీకరించటానికి పురుషుడు ఎందుకింత మూర్ఖం చేస్తాడు? వివాహమనే కార్యానికి అసలు అర్ధమేమి టంటావు? ఈ సృష్టిని ముందు తరాలకుపెంచుతూ తమ స్థానంలో కొన్ని జీవాలను పృథ్వికి అందించి తాము రాలిపోయే పవిత్ర కార్యనిర్వహణకేనా కల్యాణం? ఈ ప్రకృతి ధర్మ నిర్వహణలో స్త్రీ పురుష భేదాభిప్రాయాలు లేకుండా మనుగడ జరుగదా? వివాహంతో స్త్రీ పురుషుడికి అమ్ముడైపోతుందా? ఒక మనిషి మీద మరో మనిషికి సర్వ హక్కులూ లభిస్తున్నాయా?
పురుషుడు స్త్రీని సంపాదించుకున్నానని గర్వపడటంలో, విర్రవీగటంలో అర్ధం ఉందా? ఈ ఆలోచనలే నన్ను బాధిస్తాయి. మనశ్శాంతికి దూరం చేస్తాయి.
నేను ఎప్పుడూ ఆలోచించకూడదు. దుఃఖించ కూడదు. నాకు సంతోషం కావాలి. అపారమైన, అంతులేని సంతోషం కావాలి. ఎలా?
నాకు తెలుసు. నాలో పరివర్తన కలిగిన నాడు, నేను నేనుగా లేకుండా పోయిననాడు సంతోషంగా సుఖంగా ఉండగలను.
నేనూ ఒక వ్యక్తినని పూర్తిగా మరిచిపో గలిగిననాడు, స్త్రీపైన సదభిప్రాయమే లేని పురుషుడితో బ్రతకగలిగిననాడు, పురుషుని ప్రాపకం లేనిదే స్త్రీకి మనుగడలేదని నమ్మగలిగిననాడు, తిండికన్నా అభిమానం ఎక్కువ కాదని మనస్సు చంపుకొన్ననాడు-ఆనాడు ఏ దిగులూ లేదు. అంతా సౌఖ్యమే! అంతా సంతోషమే! కాని నాలో ఆ మార్పు వస్తుందంటావా? రావాలంటావా?" భాను కళ్ళవెంట నీటి బొట్లు జలజల రాలిపడ్డాయి. నేను విస్తుబోయి భాను ఆవేదన చూస్తున్నాను. భాను మాటల్లో ఆవేశం కట్టలు తెంచుకొంటోంది. భాను పడే మానసిక వేదన మితిమీరుతోంది.
"భానూ! నీ ప్రశ్నలకు సమాధానాలేమిటో నాకు బోధపడటం లేదు. చెప్పాలనుకొన్నా ఇప్పుడు పురుషుడుగా నాకా అర్హత లేదు."
"ఇక నేను దేన్ని గురించీ మాట్లాడను గానీ, నా కొక కోరిక ఉంది. నా కొడుకు పెరిగి పెద్ద వాడై వృద్దిలోకి రావాలి. ఆదర్శ ప్రాయుడైన వ్యక్తి కావాలి. పురుషలోకంలో, చీకటి సమాజంలో మాణిక్యమై వెలగాలి. అన్యాయాలు చూసి అసహ్యించుకొనే, అక్రమాలు చూసి ఆవేశ పడే, దౌర్భాగ్యుల్ని చూసి కన్నీరు గార్చే పవిత్ర మూర్తి కావాలి. ఆ రోజు......ఆ రోజు ఎప్పుడు? చెప్పు అన్నయ్యా!"
"వస్తుంది భానూ! తప్పక వస్తుంది. నీ వంటి మాతృమూర్తి పెంపకంలో నీ కొడుకు ఉదయుడు పూర్ణ పురుషుడుగా రూపొందుతాడు."
భాను బాధగా నవ్వింది. "కాని అన్నయ్యా! ఏనాటికైనా ఆ పెంపకానికి లోటు వస్తే?"
"భానూ! ఏవిటా మాటలు?"
"ఎందుకు అన్నయ్యా, అంత భయం? నువ్వు ఉన్నావుగా? నేను నీకు తెలుసు. నా కోరిక నీకు తెలుసు."
"భానూ! నువ్వు ఇలా మాట్లాడితే బావుండదు. భానూ! అన్నయ్య నీకు ఏ కష్టానికైనా ఏ సుఖానికైనా తోడుఉంటాడు. అంత మాత్రాన ఇటువంటి బరువైన బాధ్యతలు నామీద మోపుతావా? ఆ రోజు ఎప్పుడూ రాదు. నువ్వు తల్లివి. ఆ బాధ్యత నువ్వే వహించాలి. భానూ! నీకు ఏమైనా జరిగితే అన్నయ్య ఏమౌతాడో ఆలోచించు. కన్నీటికి కూడా కొంత విలువ ఇచ్చి నువ్వు బ్రతికి ఉండాలి. ఎవరి కోసమూ కాదు. నీ కోసమూ కాదు. నీ బిడ్డ కోసం! నువ్వు కాంక్షించే అభ్యుదయంకోసం! నీవంటి వాళ్ళు అన్నిటినీ ఓర్చి బ్రతికివుండి కొంతమంది పాపలని పెంచితే కదా, ఏనాటి కైనా ఈ అన్యాయం మాసిపోతుంది? అదే నీ ధ్యేయంగా పెట్టుకో భానూ! ఎన్నడూ పిచ్చి పిచ్చిగా ఆలోచించకు."
"లేదులే అన్నయ్యా! ఎంత దుఃఖాన్నైనా సహించి నా బాబుని నేను చేతులారా పెంచి పెద్ద చేస్తాను" అంటూ భాను కొడుకు ముఖాన్ని చెక్కిలికి చేర్చుకొంది.
* * *

భాను ఎటువంటి పరిస్థితులు రానీ బ్రతికి ఉంటుంది. కొడుకుమీద భానుకు అపారమైన అనురాగం! ప్రతి తల్లి ప్రతి బిడ్డనూ అంత గాఢంగా ప్రేమిస్తుందనేది నిజం కాకపోవచ్చు. భాను కొడుకును మాతృ హృదయంతోనే కాదు, ముందు తరాలకు జ్యోతి చూపించి నడిపించే ఒక ఆదర్శమూర్తిని రూపొందించాలనే నారీ హృదయంతో విశేషంగా అభిమానిస్తూంది. అంత గాఢ సంకల్పం ఏర్పరచుకున్న భాను ఏనాడూ ఏ అఘాయిత్యమూ చెయ్యదు-అదే నా విశ్వాసం!
ఒకరకంగా ఆలోచిస్తే భాను మానసికంగా అనారోగ్యానికి గురి అయింది. ముక్కుకు సూటిగా ఆలోచిస్తుంది. నూటికి నూరుపాళ్ళూ న్యాయం, అన్యాయం-రెండే ఉండా లంటుంది. కానీ ఆ ఆలోచనలు బెడిసికొడితే, ఆ నిర్ణయాలు విఫల మైతే కృంగిపోతుంది. ధైర్యం కోల్పోతుంది. తీవ్రమైన అభిప్రాయాలు ఏర్పరచుకొంటుంది. పరిస్థితుల్ ప్రతికూలిస్తే ఓర్చుకోలేకపోవటం బలహీనత కాదా? కాదంటుంది. వ్యక్తిత్వం బలంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితులు రానీ వ్యక్తి నైచ్యాన్ని అనుభవిస్తూ బ్రతకకూడదు. అక్కడితో అంతమైపోయి వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి, భాను పరిస్థితులకు తలవంచలేని దౌర్భాగ్యురాలు! భాను నాకు ఒక సమస్యే అయింది. అది ఎలా పరిష్కారమౌతుందో నా ఊహ కేమీ అందటం లేదు. ఏదో ఆలోచిస్తూంటే ఒకసారి అనిపించింది-భాను సుఖపడటంలేని ఆ సంసారం నుంచి తీసుకువచ్చి ఏ ట్రెయినింగైనా చదివిస్తే? ఎక్కడైనా ఉద్యోగంలో చేర్పిస్తే? మారని మనుషులకోసం ఎంతకాలం జీవితాలు నరకం చేసుకుంటాము?
మరి నాలుగు నెలలు ఓపికపడితే నా చదువు పూర్తి అవుతుంది. ఉద్యోగం వస్తుంది. అప్పుడు భాను దేనికి ఇష్టపడితే అది చేయవచ్చు. ఆ ఊహ నాకు చాల మనశ్శాంతి కలుగజేసింది.
* * *
భానును చూసి నెలరోజులు దాటింది. ఎన్నోసార్లు వెళ్ళుదామని బయలుదేరి ఆగిపోయాను. వెళ్ళబుద్ది కాలేదు. వెళ్తే ఏదో కొత్త విషయం వినాలి. ఈ నెలరోజుల్లో ఏమీ జరిగి ఉండదంటే, భాను సంసారం ఓ నెలపాటు ప్రశాంతంగా గడుస్తుందంటే-సూర్యుడు పడమట ఉదయించే టంత నిజం. కాని భానుకు దూరంగా ఉండటానికి నా మనసు అంగీకరించలేదు. భాను బాధపడుతుంది. భాను దగ్గర ఉన్న పుస్తకాల లైబ్రరీకి ఇచ్చేతేదీ కూడా దాటిపోయింది. స్నానం చెయ్యటానికి తువ్వాలు చుట్టుకున్న వాడినే తిరిగి బట్టలు వేసుకొని బయలుదేరాను.
"నెల్లాళ్ళకు గుర్తు వచ్చానన్నమాట" అంది నవ్వి భాను.
"నిజంగా తీరికలేదు భానూ! పరీక్షలు దగ్గరి కొస్తున్నాయి కదా?" అన్నాను కూర్చుంటూ.
"అల్లుడు బావున్నాడా? ఎక్కడికి పోయాడు.?"
"పక్క వాళ్ళింట్లో ఆడుకొంటున్నాడు కాబోలు."
"ఈమధ్య విశేషాలేమిటి? బావ బావున్నారా?"
"ఇద్దరం బాగానే ఉన్నాం. మాటలే లేవు."
"బావుంది. ఎప్పటినుంచి?"
"ఆమధ్య నాన్న ఉత్తరం రాశారు."
"ఏమిటి సంగతులు?"
"ఓ పెద్ద విశేషం. నాయనమ్మ బ్రతికి ఉన్నప్పుడు ఎవరికో ఓ వెయ్యి రూపాయలు వడ్డీకి ఇచ్చిందట. పోయేముందు అవి వసూలుచేసి నా కిమ్మని చెప్పింది. అప్పుడు నాకూ తెలుసు. నేను ఫిఫ్తుఫారం చదువుతున్నప్పుడు నాయనమ్మపోయింది. పదిహేనేళ్ళదాన్ని. నాకు వెయ్యి రూపాయ లెందుకా అనుకున్నాను. అక్కయ్యలూ, వాళ్ళూ అంతా తెగ వేళాకోళాలు చేసేవారు. ఆ విషయం నేను పూర్తిగా మరిచేపోయాను. అప్పటినుంచి ఈ ఎనిమిదేళ్ళుగా చెల్లుబడిపెట్టి తిరిగి నోట్లు రాస్తూ వచ్చాడట అతను. ఓ నా దగ్గర రెండువేల రూపాయలు ఉన్నాయి. బావగారు చాలా చాలా మారిపోయారు."
"నిజంగానా?"
"నిజమో, కాదో, నాకేం తెలుసు? ఆ ఉత్తరం చూసీ చూడగానే అకస్మాత్తుగా ప్రవర్తనలో పరివర్తన వచ్చేసింది. చేసిన తప్పులు తెలుసుకున్నారు. పశ్చాత్తాపంతో 'వెధవ' పేకాట త్యజించారు. వరుసగా వారం రోజులు రాత్రింబవళ్ళూ ఇంట్లోనే కూర్చున్నారు. అంతులేని శాంతం, మంచితనం నేర్చుకున్నారు. నానిగాడితో ఆటలాడుకున్నారు. ఇక పరివర్తన చాలనుకొని ఒకనాటి సాయంకాలం తీరిగ్గా నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని ఎంత ప్రేమగా మాట్లాడారనుకొన్నావు! అది ప్రేమ చరిత్రకే ఒక సరికొత్త ఘట్టం! 'భానూ, నేను పూర్తిగా మారిపోయాను. నువ్వు నమ్ముతావా?' అన్నారు.
"ఆ నమ్మకం ఏర్పడటానికి ఈ టైం చాలదే!'
'భానూ, నేను తొందర మనిషినని నీకు తెలీదా? నా తప్పులు నువ్వే క్షమించకపోతే నేనే మవ్వాలి?' అంటూ ప్రారంభించి, 'నేనొక సంగతి చెప్తాను. నన్ను అపార్ధం చేసుకోకు భానూ. నా కష్ట సుఖాల్లో నువ్వు గాకపోతే ఎవరు తోడుపడతారు? ఈ సంసార బాధ్యత నీకు మాత్రం లేదా? నిజానికి నేను కొంత డబ్బు వృధా చేశా ననుకో. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు పన్నెండు వందల వరకూ అప్పు ఉంది. ఎలా తీర్చను భానూ?'
