Previous Page Next Page 
మిధ్య పేజి 19


    శ్యామల బొబ్బర్లంక తీసుకు వెళ్ళమన్నది హరికృష్ణ ని. కాబోయే కోడలు లక్ష్మీ దేవిలా ఇల్లంతా కలయ తిరుగుతుంటే హరికృష్ణ వెంట పంపేందుకు మహేశ్వరి వెనుకాడలేదు. ప్రజలేమైనా అనుకుంటారనే భీతి ఆవిడకి ఏమాత్రమూ లేదు. పాపిష్టి సమాజం మంచికీ, చెడుకీ కూడా విపరీతార్ధాలు తీస్తుందని ఆవిడ ఉద్దేశ్యం. ఇద్దరూ కలిసి వీధిలో ఆగిన బస్సు ఎక్కగానే ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూడసాగిందావిడ.
    బస్సు బయలుదేరే దాకా అక్కడే నిలబడ్డ మహేశ్వరి ని చూసి నిట్టూర్చింది శ్యామల. రెండు వైపులా కొబ్బరి తోటలూ, పచ్చని పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం తో సన్నని రోడ్డు మీదుగా దూసుకు పోతుంది ట్రాన్స్ పోర్టు వాళ్ళ బస్సు.
    సాయంత్రం కాకముందే బొబ్బర్లంక చేరుకుంది. హరికృష్ణ మార్గ మద్యం లో శ్యామలని అడిగేడు, "కాఫీ తాగుతావా?' అని. చిన్న చిన్న పాకలు వేసుకుని ఊజలంక లో . శ్యామల చుట్టూ చూసి బస్సు దిగకుండా లోపలే కూర్చుని కాఫీకి ఆర్డరిచ్చింది. చినుకుల మూలంగా వర్షాకాలం కావడం వల్ల ఈగలు రాజ్యం ఏలుతున్నాయి. శ్యామల కి ఇంక అక్కడ దిగేందుకు మనస్కరించలేదు.
    గోదావరి ఒడ్డుకు నడిచి వెళ్ళాలనే ఊహ ఎంత మాత్రం లేదు. హరికృష్ణ తో తను ముఖాముఖి మాట్లాడాలి. అందుకే గోదావరి ని చూస్తాననే నెపంతో తీసుకు వచ్చిందతడిని. ఒడ్డు వెంట కొద్ది దూరం నడిచేక "ఇక్కడ కూర్చుందామా?" అని అడిగాడు హరికృష్ణ. దూరంగా తెరచాప పడవలు బారులు తీసి ఆకాశం లోకి ఎగిరిపోతున్న కొంగల్లా ఉన్నాయి. స్టీమర్ల శబ్దం వినిపించిన తరవాతే స్టీమరు కనిపిస్తుంది. మేఘాలతో ఆకాశం కప్పేసి సన్నటి చినుకులు నదీ ప్రవాహం మీద జలతారు గా ఏర్పడి స్టీమర్ల ని కనిపించనీయడం లేదు. బస్సు వాళ్ళ రోద, స్టీమర్ల దగ్గరి ర్యాలి, గంటి, నఖినేటి పల్లి, అమలాపురం వెళ్ళే ప్రయాణీకుల అలజడి చూస్తూ తను వచ్చిన పని ని మరిచిపోయింది శ్యామల.
    "మాట్లాడు , శ్యామలా!" అతను ఆగి రావుచెట్టు కింద కూర్చుండి పోయాడు. శ్యామల అతని పక్కనే కూర్చుంది వాస్తవం లోకి వచ్చేసి, అతను తిరిగి అదే మాట అన్నాడు.
    శ్యామల కొద్దిగా అలోచించి భూదేవి వైపు చూస్తూ కొంచెం ఆగి తలెత్తి అన్నది; "మీరు మీ అమ్మ చెప్పింది పూర్తిగా విన్నారు కదూ?"
    హరికృష్ణ తొణకలేదు. నిర్భయంగా జవాబు చెప్పేడు. "విన్నాను. మొదటి నుంచీ పూర్తిగా విన్నాను. అలా వినడం తప్పని తెలిసి కూడా అక్కడే నిలబడి పోయి అమ్మ గతాన్ని నీతో బాటు నేనూ విన్నాను."    
    "అయితే ఇప్పుడు చెప్పండి. గిరిజ ని మీరు పెళ్లి చేసుకుంటే ఏం?"
    హరికృష్ణ తెల్లబోయేడు. ఏమిటి, శ్యామలా నువ్వంటున్నది? గిరిజ ని నేను చేసుకుంటే అమ్మ బ్రతకగలదా? నాకోసం అమ్మ ఎన్ని అవస్థలు పడింది! ఒక్కగానొక్క మనిషి ఏ ఇతరమైన ఆసరా లేకుండా ఇంత కాలం ఆస్తి పాస్తులు రక్షించు కుంటూ నన్ను పెద్దవాడిని చేసింది కదా! అటువంటి మనిషిని క్షోభ పెట్ట మంటావా?"
    "మీరు ఈ ప్రశ్నకి జవాబు సూటిగా చెప్పండి."
    అతను తలెత్తి ఆమె వైపు చూశాడు.
    "ఇందులో తప్పు ఎవరిది?"
    "మామయ్యది."
    "ఎందుకనీ?"
    "మావయ్య అమ్మని నిజంగా ఆరాధించి నట్లయితే ఒక్కసారి కలుసుకుని ఉండేవాడు. అప్పుడు కధ మరో విధంగా మార్పు చెంది ఉండేది."
    "ఇంతకీ తప్పంతా అతనిదేనన్న మాట!"
    "ముమ్మాటికి ."
    "ఎంత సిగ్గు లేదు మీకు! ఎంత ధైర్యంగా చెబుతున్నారా మాట! తప్పు ఆయనది ఒక్కడిదే అయితే ఆ తప్పు ఇప్పుడు మీరూ చేశారు. మిమ్మల్ని ఎవరే మనగలరు?"
    "శ్యామలా!" అతను గట్టిగా అరిచేడు. "నేనేం చేశాను? నా గురించి నీకేం తెలుసునని ఇన్ని మాటలంటూన్నావు? మా అమ్మ ఆబల. ఆయన్ని నెత్తిన పెట్టుకుంది. ఆ మనిషి దగా చేసి కలకత్తా వెళ్లి అక్కడ పెళ్లి చేసుకుని గతం మరిచిపోయి ఈ ఊరు కులాసాగా చేరుకున్నాడు!"
    "ఇప్పుడు మీరు మాత్రం ఎందులో తీసిపోయేరు? ఆ పిల్ల మిమ్మల్ని మీ అమ్మ కన్నా ఎక్కువగానే నెత్తిన పెట్టుకుంది. అమ్మని అడ్డం వేసుకుని అమ్మ కోసం అంటూ మీరు కూడా హైదరాబాదు వచ్చేసి అక్కడ మరో పిల్లని వెతుక్కుంటూ గతాన్ని మరిచి పోవాలని ప్రయత్నం చేస్తున్నారు."
    "ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. హరి కృష్ణ గారూ. ఆడపిల్ల మగవాడి పట్ల 'అయ్యో' అని జాలిపడింది అంటే అది ప్రేమ అనీ, దాని పర్యవసానం పెళ్లి అనీ అనవసరంగా మీలాంటి మగవాళ్ళు అపోహలు పెంచుకుంటున్నారు."
    "ఏమిటి , శ్యామలా , నువ్వు అనేది?"
    "అందరు ఆడపిల్లల మాదిరిగా నేనూ పెరిగి ఉంటె మగవాడికి కొద్దిగా దూరంగా ఉండ గలిగే దాన్ని. నేనలా పెరగలేదు. మా నాన్న నన్ను పెంచిన తీరు నన్నిలా నలుగురిచేతా అనిపించు కునేట్లు చేస్తున్నది.
    "ఆడపిల్లలు తప్ప మగపిల్లలు లేరని మా నాన్న నన్ను మగపిల్లాడి మాదిరి పెంచేరు. పదకొండేళ్ళు వచ్చేవరకూ మీ మగపిల్లలకి మాదిరి గానే నాకూ నిక్కర్లూ, బుష్ షర్టు లూ కుట్టించి క్రాఫింగ్ చేయించి శ్యామల్రావు అని పిలిచేవారు. నేను ఆడపిల్లలతో ఆడటం మా నాన్నకి ఇష్టం లేకపోయేది. 'నువ్వు ఆడంగి చెక్కలా ఏవిటా ఆటలు నేర్చు కుంటున్నావు?" అంటే నాలో పౌరుషం బయలుదేరేది. నేను మగపిల్లాడిని అనుకునేదాన్ని. నాకు చెడుగుడు, గోళీలు -- ఇవి తప్ప మరో ఆటలు వచ్చేవి కావు.
    "ఆడపిల్లల్ని చూడగానే సిగ్గుపడి తొలగి పోయే దాన్ని. మగపిల్లలతో చెట్టా పట్టీలు వేసుకుని తిరగడం నాకు ఎబ్బెట్టు గా అనిపించేది కాదు. మా అమ్మ కూడా నన్ను గారభం చేసి పెంచింది.     నా ముందు   అరుంధతి అక్కయ్య పైన ఇద్దరు మగ పిల్లలు పోయి అక్క పుట్టిన తరవాత అపురూపంగా పెరగడం వల్ల నా సైకాలజీ దెబ్బతింది. మగపిల్లలతో విచ్చలవిడిగా తిరగడం , మనసులో మాటల్ని దాచుకోలేక పోవడం , మిమ్మల్ని చూడగానే చాలా కాలానికి కలుసుకున్న నా పాత స్నేహితుడిలా తోచడం -- ఇవన్నీ మిమ్మల్ని దగ్గరకు చేరిస్తే మీరు దానికి నగిషీలు చెక్కి ప్రేమ, పెళ్లి బ్రతుకు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. 'అయితే నువ్విలాగే ఉండి పోతావా ?' అని మీరు ప్రశ్నిస్తే , 'లేదు. నేను జీవితంలో స్థిర పడతాను పెళ్లి చేసుకుని!' అని సమాధానం ఇస్తాను.
    "చూడండి, సర్!"
    హరికృష్ణ నిర్ఘాంత పోయి వింటున్నాడు. శ్యామల అతన్ని పిలవగానే త్రుళ్ళి పడి "ఆ" అన్నాడు.
    "గిరిజ మీ కోసం బాధపడడం లేదనుకోగలరా మీరు?"
    అతను మాట్లాడలేదు.
    "చెప్పండి. ఇందులో ఆ పిల్ల తప్పేం ఉంది? నేనే మీ స్థానం లో ఉంటె మా అమ్మకి నేను నచ్చ చెప్పుకోగలిగే దాన్ని. అయినా మీ అమ్మ మిమ్మల్ని దగా చేయ లేదంటారా?"
    అర్ధం కాని వాడిలా చూశాడు హరికృష్ణ.
    "మరీ చిన్నపిల్లాడిలా ఏమీ ఎరగనట్లు చూస్తె బాగుండదు. సర్. ఆ పిల్లకి పెళ్లి కాబోతుందని అబద్దం అడి మిమ్మల్ని కలవనీయకుండా చూశారు మీ అమ్మ. మాతృప్రేమ ఎంత కట్టేయగలిగినా కొడుకు సుఖం కోరలే కానీ ఇదేమిటి? చాలా చిత్రంగా లేదూ?"
    "మా అమ్మ పట్ల జాలి చూపించాలి, శ్యామలా!"
    శ్యామల వెటకారంగా నవ్వింది. "కాదా మరి! మీ అమ్మ ఏ మోసం చేసినా జాలి చూపించాలి. అభం శుభం తెలియక మిమ్నల్ని నమ్ముకుని మోసపోయిన ఆ పిల్ల పట్ల ఏ జాలీ, ఎవరూ కూడా చూపించ నవసరం లేదు-- అనేనా మీ ఉద్దేశ్యం?"

                               
    హరికృష్ణ మొహం చిన్నబోయింది. అతని కళ్ళు నెమ్మదిగా నీలి మేఘాలని పరుచు కుంటున్నాయి.
    "చేతకాని సమయంలో కళ్ళనీళ్ళు పెట్టుకునే మగవాళ్ళన్నా నాకు భలే చిరాకు. మీరేం చేయగలరు చెప్పండి?"
    "శ్యామలా!' హరికృష్ణ ఆ పిల్ల రెండు చేతులూ పట్టుకున్నాడు. శ్యామల బెదిరి పోలేదు. అతని వైపు అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నది. "మీకు ఒకప్పుడు చెప్పెను గుర్తుందా, సర్?"
    "ఏమిటన్నట్లు చూశాడు అతను.
    "టెంపరరీ వరసలు నాకు నచ్చవని. అయినా సమయం వచ్చింది కనక చెప్పక తప్పదు. మా ఇంట్లో అక్కయ్య పైన పోయిన అన్నయ్య ఫోటో లో అచ్చం మీలానే ఉన్నాడు. వాడే నా కళ్ళ ఎదుట  చెడిపోతున్నట్లనిపించింది. నాకిలా మీరూ పాడ....."
    ఆ పైన మాట్లాడలేక రెండు చేతుల మధ్యా మొహాన్ని దాచుకుని బిగ్గరగా ఏడవసాగింది. హరికృష్ణ నిరుత్తరుడయేడు. అతని పెదాలు వణుకుతున్నాయి. శ్యామలని అ స్థితిలో చూస్తుంటే అంతవరకూ సాగి అతన్ని మభ్యపెడుతూ ఒక విధమైన స్వార్ధంతో ఆవరించిన హృదయం పెనుగాలికి చెల్లాచెదలైన మేఘాల తాలుకూ ఆచూకీ అయినా లేని స్వచ్చమైన వినీలా కాశం లా అయిపొయింది. రెండు చేతులతో దగ్గరికి తీసుకుని, "లేదు, నేను చచ్చిపోలేదు. చచ్చిపోను. ఎప్పటికీ నీకోసం అయినా బ్రతికేందుకు అటువంటి వాటి జోలికి వెళ్ళను. ఏడవకు. ఏదీ, తలెత్తు. నా వైపు చూడు. దూరంగా ఆకాశం వైపోసారి చూడు, కారు మేఘాలు దట్టంగా ఎలా అలుము కు పొయాయో! అమ్మ ఎదురు చూస్తుంటుంది. మాటల్లో మనకి సమయం తెలియలేదు కానీ ప్రొద్దు గూకుతున్నది. లే...వెళ్ళిపోదాం, పద" అంటూ లేవదీసి నడిపించుకుని బస్సు ఎక్కి" బండర్లంక " అన్నాడు కండక్టర్ తో. బస్సు శరవేగంతో ముందుకు పోతుంది. భారం తీరిన మనిషి లా నిశ్చింతగా కూర్చున్నాడు హరికృష్ణ. శ్యామల వెనక్కు వాలి కళ్ళు మూసుకుంది.
    ఆ విధంగా నిద్రపోయిన శ్యామల ఇంటికి వచ్చినా మేలుకోలేదు. యాంత్రికంగా అడుగులు వేయడం తప్ప వాస్తవం లోకి రాలేకపోయింది. మంచం మీద వాలిపోయి గాడ నిద్రలో మునిగిపోయింది.
    "లేపి భోజనం చేస్తుందేమో కనుక్కోరా!" అన్నది మహేశ్వరి.
    'ఇప్పుడు లేపద్దమ్మా. పొద్దుటే తేలిగ్గా లేస్తుంది. నాకు ఆకలిగా ఉంది పెట్టేయి." అన్నాడు కంచం ముందు కూర్చుంటూ.
    మహేశ్వరి మరి మాట్లాడలేదు. తెల్లవారినా శ్యామల లేవలేదు. మహేశ్వరి దగ్గిరగా వచ్చి ఒంటి మీద చేయి వేసి నిర్ఘాంత పోయి కొడుకుని పిలిచింది. శ్యామల ఒళ్ళు మరిగి పోతుంది. నిద్రలో అస్పష్టంగా కలవరిస్తుంది. "నేను తప్పు చేయలేదక్కా....ఒట్టు.... గిరిజ అసలెందు కెళ్ళాల్సి వచ్చింది కలకత్తా?'
    మహేశ్వరి బెంబేలు పడిపోయింది. రెండు మూడు రోజుల వరకూ తనే మంచం దగ్గిర కూర్చుని శ్యామల మగతలో లేచినప్పుడు పాలు అందించేది. నాలుగు రోజులు గడిచే సరికి శ్యామల జ్వరం తిరుగు ముఖం పట్టింది. డాక్టర్ పధ్యం పెట్టమనగానే ఆవిడ పొంగి పోయింది. కంచం ముందు కూర్చున్న శ్యామలనీ, పక్కనే కూర్చున్న కొడుకునీ చూసి నెమ్మదిగా అంది. "నిజం చెప్పాలంటే చాలా భయపడి పోయెను , హరీ. ఆ పిల్లని వాళ్ళ వాళ్ళకి చూపిస్తానో లేదో అని వెయ్యి దేవుళ్ళ కి మొక్కుకున్నాను. పోనీలే, దేవుడు మనల్ని అన్యాయం చేయడు. నిన్ను అసలే...."
    ఆవిడ మాటకి అడ్డు తగులుకున్నాడు. "అవునమ్మా , భగవంతుడు నాకు అన్యాయం చేయదు. రేపు, నేనూ చెల్లాయీ హైదరాబాదు వెళ్ళిపోతున్నాం."
    ఆవిడ వడ్డిస్తున్న గరిటని ఆ ప్రయత్నంగా జారవిడిచేసి నిలుచున్న చోట కుప్పలా కూర్చుండి పోయింది. ఐదు నిమిషాలకి గానీ తెప్పరిల్ల లేకపోయింది. శ్యామల అతని వైపు క్షణికం చూసింది. ఆ పిల్ల చూపులో కోటి భావ తరంగాలు కృతజ్ఞత ల్ని వెల్లడి చేస్తూ అతని   కళ్ళల్లోంచి గుండెల్లోకి ప్రవేశించి రక్త నాళాల గుండా శరీరమంతా వ్యాపించే ట్లు జారిపోతున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS