Previous Page Next Page 
ఉన్నతశిఖరాలు పేజి 19


    హఠాత్తుగా డుంబ ప్రసంగం ఆపుజేశాడు. భయంతో నోటమాట రాక తదేకంగా అతడిని చూస్తూండిపోయాను. నెల్సన్ గూఢచారి కాడేమో నాకు కచ్చితంగా తెలియదుకాని కేవలం ముగ్గురు మాత్రం వస్తున్నారంటే వారు దానం కోసమే వస్తున్నారనుకున్నాను. తర్వాత గాభరాతో అడిగాను. "వారి దగ్గర రేడియో వుంది. ఎవరితోనో మాట్లాడుతున్నారు. నాకదంతా అర్ధంకాలేదుగాని వాళ్ళు ఎనిమిది పది అంటూ బేరమాడుతున్నారు. వారేదో ముఠాకు చెందినవారు. ఎందర్ని చంపితే అంత డబ్బు ఇస్తామని ఎవరో అంటున్నారు. ఎందరు బెల్జియన్లను చంపితే అన్నివేల కాంగోలీస్ ఫ్రాంక్స్ దొరుకుతాయి."
    "తర్వాత?" అన్నాను నేను నిస్సహాయంగా.
    "వారు కనుమరుగైన తర్వాత అడ్డదారిని మీ దగ్గరకొచ్చాను. నెల్సన్ గారి బెల్జియమ్ నౌకరు ఇక్కడే కనబడి వారిక్కడి కొస్తున్నట్లు చెప్పమని వెళ్ళిపోయాడు."
    అతడు మాట పూర్తి చేసేలోగా తలుపు చప్పుడైంది. కంగారుగా వక్క కిటికీలోంచి గమనించి ముఠా కాదని తెలుసుకొని తలుపు తెరిచాము నెల్సన్ తన పూర్ణ గర్భిణి భార్యను చేతులమీద ఎత్తుకొని ఆయాసంగా హడావిడిగా లోపలి కొచ్చాడు.
    ప్రసవ వేదన ఎప్పుడో ఆరంభమై వుండాలి. నెల్సన్ భార్య ఉస్సురస్సురంటున్నది. నా భార్య ఆమెను ఖమీనా సహాయంతో లోపలి గది లోనికి తీసుకొని వెళ్ళి పడుకోబెట్టింది.
    నావెంట గదివరకు వచ్చాడు డుంబా. "మీకై మీరు ఎట్లావున్నా ప్రమాదం లేదు వీరిని పంపెయ్యండి. వీరివల్ల మీకు హాని రాగలదు" అన్నాడు కఠినంగా.
    అంతకంటే కఠినంగా అదెలా కుదురుతుంది డుంబా! శరణన్న వారిని పొమ్మనడం ఏ మానవుడూ చేయనో పని పని-" అన్నాడు.
    వాడికి అర్ధమే కాలేదు కాని" అని గొణిగాడు.
    "నేను భారతీయుడిని. నువ్వు ఈ దేశస్థుడిని -అతను బెల్జియమ్ - కానీ మనం మానవులం మాపై గల ప్రేమతో మీరు మమ్మల్ని ఆపదనించి రక్షించదల్చారు వాళ్ళపైగల ప్రేమతో మేము- ఈ సమయంలో ఆదుకోవద్దూ-
    "డుంబూ క్షణం తలపంకించి నెల్సన్ భార్య పడుకొన్న మంచం వైపు చూచాడు. ముఖంలో శాంతం - కరుణ చోటుచేసుకున్నాయి. "సర్ మీరు తరువాత వద్దురుగాని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాను" అన్నాడు.
    నేను వెంటనే ఇనప్పెట్టె తెరచి అన్ని నగలు - డబ్బు వేరే ఒక పెట్టెలో పెట్టాను- ముఖ్యమైన కాగితాలనుకూడా పెట్టి ఆ ట్రంకు ఇచ్చాము......వాళ్ళు నలుగురు. వీళ్ళు ముగ్గురు మమ్మల్ని వీడి వెళ్ళిపోతుంటే మళ్ళీ మేం కలుస్తామా అని మా హృదయాలు అల్లాడిపోయాయి వాళ్ళు అలా వెళ్ళగానే నెల్సన్ భార్య ప్రసవవేదన పడుతున్న సంగతి మమ్ముల్ని మేల్కొలిపింది. ఉన్నంతలో ఏర్పాట్లు చేశాము. పది పదిహేను నిమిషాలలో లోపలినుంచి సుదీర్ఘమైన మూలుగు వినరావడం మరుక్షణం పాప ఏడ్పు ఎంతో రిలీఫ్ గా విన్పించాయి. ఆడపిల్ల పుట్టింది అంత ఆందోళన లో కూడా క్షణం అందరం వాయిని అనుభవించాము. నెల్సన్ హృదయం తేలిక పడింది. అప్పుడు చెప్పాడు. తను గూఢచారి అన్న పుకారు పుట్టించారని తను ఈ ప్రాంతాల్లో కంతా ధనవంతుడు కాబట్టి తనమీద కన్నువేశారని. వాళ్ళను తప్పించుకొని చుట్టుదారిలో రావటం కొద్దిగా ఆలస్యమైంది.
    ఆ రాత్రికి రాత్రి ఖమీనా మమ్మల్ని మరొక చోటికి తీసుకెళ్ళింది అది పెద్దగుంట. దానిమీద బలమైన వాసాలువేసి కలవ చిందరవందరగా వేస్తుంది. అలాంటి స్థలంలో ఎలావుండాలా అని సంకోచించాము కాని నిచ్చెన దిగగానే అది పన్నెండు అడుగుల చదరంలో వుంది. చక్కగా అలికివుంది. రెండు పలకలునేలమీద పరచిఅన్నాయి. దీన్ని డుంబా అపత్సమయంకోసం పిదంచేశాడు. ఆరాత్రి అక్కడే గడిచింది. మరుసటిరోజుకూడా ఆ గుంటలోనే ఉండిపోయాము కావిడుంబా రాలేదు.
    మానవుని చిత్త ప్రవృత్తి కడు చిత్రమైనది. డబ్బుకోసం ఏ క్షణంలో ఎవరు ఏ గడ్డి కరుస్తారో చెప్పలేము.
    ఖమీనా ఎదురుగా తిరుగుతున్నది. రెండు రోజులనుండి మాకందరికీ ఆహార పానీయాలు అమర్చుతూ వున్నది ఆ గుంట నుండి బైటికి తాను వెళ్ళకుండా మేము వెళ్ళనక్కరలేకుండా చూస్తున్నది.
    కానీ-
    ఇది ఎప్పటి సేవా ధర్మమేనా?
    తానూ తన భరాకలసి విప్లవం అనే భయంకరమైన సాకుతో కుట్ర చేసి మిమ్మల్ని. నెల్సన్ కుటుంబాన్ని ఇక్కడికి తీసుకురాలేదా? మళ్ళీ మా పిల్లల్ని మమ్మల్ని కలపటానికి ఎంత డబ్బు కావాలో వీళ్ళకు?? ఉన్నదంతా వీళ్ళకు పెట్టెలో పెట్టి చేతులారా చేతికిచ్చామే?
    మేమందరం ఖమీనా ఎదురుగా ఉండగా ఈ మాటలు అనుకోలేదు. కాని అందరము అనుకున్నాము ఎవరి కళ్ళల్లోకి చూచినా ఇదే సందేశము- ఇదే సందేహము.
    ఖమీనా ఎదుట మాట్లాడడానికి భయము విష ప్రయోగం కూడా చేయవచ్చునేమో.
    పగటి పూట అలా లోపల గడుపుతూ రాత్రివేళ గుంట ఉపరితలం మీదికి వచ్చిన నక్షత్రాలు లెక్కించే వాళ్ళం.    
    అలా మూడురోజుల య్యాక హఠాత్తుగా డుంబా ఊడిపడ్డాడు.
    "వెళ్ళిపోవాలి అన్నాడు హడావిడిగా.
    "ఎలా?" .... "ఎక్కడికి?" అనే మా ప్రశ్నలకు జవాబులు లేవు. అడిగే అర్హత మొదలే లేదు.
    బయలుదేరాము డోలికట్టి నెల్సన్ డుంబా కలసి నెల్సన్ భార్యను, పాపను మోశాను. అలవాటులేక మాకు త్వరగా నడవటం చేతకాలేదు. ఖమీనా ఆహారపదార్ధాలు మోస్తూ వెనక నడుస్తోంది. అర్ధరాత్రి వరకు నడిచి ఎక్కడో చెట్టుక్రింద చతికిలబడ్డాము. కాసేపయ్యేసరికి డుంబా తొందరపెట్టాడు విశ్రాంతికి సమయం కాదు ఆ తర్వాత మావేగం లెక్కలోకిరాదు.మగవాళ్ళకే కలలు తేలిపోతున్నాయి! మేము అలాగే సాగిపోయాము ఉన్నట్లుండి మాకు అడుగుల చప్పుడు వినవచ్చింది. ఎక్కడి వాళ్ళం అక్కడ నిలబడిపోయాము. డుంబా డోలిదించి తుపాకి తీసుకుని ముందుకెళ్ళాడు ఏం జరుగుతున్నదో - ఆ ఎదురొచ్చిన వ్యక్తు లెవరో! డుంబా ఎందు కెళ్ళాడో మా కర్ధం కాలేదు. స్తంభించిపోయి ఒకరినొకరు తాకుతూ దగ్గరగా నుంచున్నాము. మాకు ఏభై గజాల దూరంలో టార్చి వెలిగింది. పొదలచాటున ఏ దిక్కునుంచి లైటు పడ్తున్నదో తెలియదు. ఉన్నట్లుండి రెండు తుపాకి గుండ్లు పేలాయి మేము ఊపిరి బిగబట్టి నుంచున్నాము.
    మరికొంతసేపటికి డుంబా తిరిగివచ్చాడు. ఆ చీకటిలో అతని ముఖకవళికలు స్పష్టంగా కానరాలేదుగాని ఉచ్చ్వాస నిశ్వాసాలు త్వరగా జరుగుతున్నాయి. ఏం జరిగింది? తుపాకి గుండ్లు పేలడం, టార్చివేయడం-ఏమిటి ఇదంతా? ఇది కూడా ఒకనాటకం కాదుకదా అని అనుమానం వేసింది. ఏం జరిగిందోనని నెల్సన్ కంగారుగా అతనిదగ్గరగా వెళ్ళాడు. ఆ కంగారులో అతని భుజం నెల్సన్ అరచేతికి తగిలింది. నెల్సన్ పొలికేక పెట్టాడు డుంబా షర్టు చిక్కని రక్తంతో ముద్ద అయివుంది. ఒక తుపాకిగుండు ఇతనికి తగిలివుండాలి.        
    ఖమీనా ఏడుస్తూవెళ్ళి డుంబాను కౌగిలించుకొని బావురుమంది. క్షణంవరకూ వారి సేవాధర్మాన్ని శంకిస్తున్న మాకు సానుభూతి కలిగినా నోరుమూసుకుని కూర్చున్నాం.
    కాని డుంబా ఎంతోసేపు కూర్చోలేదు. "వెళ్ళాలి!" అన్నాడు స్థిర నిశ్చయంతో అందులో ఏదో మంత్రంవుంది.    
    "ఎట్లా?" అనే ప్రశ్న ఉదయించింది. గుండుదెబ్బతిన్న మనిషిని అట్లా వదిలేసి వెళ్ళడం అమానుషంకాదా?
    "త్వరగా వెళ్ళాలి!" అని డుంబా అందరికన్నా ముందులేచి నడవ సాగాడు. "ఇంతదూరం వచ్చి ఇక్కడ చిక్కిపోతారా?"
    మౌనంగా అతణ్ణి అనుసరించాము.
    తెలతెలవారుతుండగా పొదల్లో బసచేశాము. డుంబా ఏదో మందు మ్రింగి గాఢంగా నిద్రపోయాడు. ఆ రాత్రి తిరిగి బయలుదేరాము. మాకు ఎవరోవచ్చి మరిన్ని పండ్లు నీళ్ళు అందించారు. అంటే డుంబా ఎవరినోఇక్కడ మమ్ముల్ని కలుసుకొనేటట్లు ఏర్పాటు చేశాడన్నమాట.
    అక్కడి వరకు వచ్చిన డుంబా అనతి దూరంలో కాంగో నదీ తీరాన్ని చూసింది "ఇంక మీరు వెళ్ళిపోండి. నేను రారాదు" అని దిగడిపోయాడు.
    మాకు మనసులు ద్రవించాయి. గుండు దెబ్బతిన్న మనిషిని అతని దారికి అతన్ని వదలి మేము వెళ్ళిపోవాలా?
    "అవును మీరు వెళ్ళాలి రహదారిని నడవకుండా. పొదలగుండా నడవండి. నేను రావడం అనేది అసాధ్యం..." అతడు నేలమీద చతికిల బడి "నేనింకా ఎందుకు రావాలి? ఎందుకు బ్రతకాలి?....నా దేశం క్షమించని నేరంచేశాను. నా దేశస్థులు గూఢచారి అని నమ్మిన ఈ నెల్సన్ కుటుంబాన్ని రక్షించాను. ఎందుకు రక్షించాను? మాకు దేశభక్తికంటే ఉప్పు తిన్న విశ్వాసం ఎక్కువ. మీ ఉప్పు తిన్నాము. మీకు అవసరం వచ్చినప్పుడు సహాయం చేయాలి. నేనేకాదు. నా భార్య ఖమీనా మీ ఉప్పు తిన్నదీ దాని కడుపులో పెరుగుతున్న శిశువు మీ ఉప్పు తింటున్నది."
    "ఆఁ "అని ఆశ్చర్యపడ్డాము.
    "అవును ఖమీనా గర్భవతి......అందుకునే గర్భిణి అయిన ఈ నెల్సన్ సతి ప్రాణాలతో బయటపడగల్గింది. నా ఖమీన ముఖం చూచి ఆమెను వదిలాను. మీ ముఖంచూచి నెల్సన్ ను వదిలాను దీనికి. నేను ప్రాయశ్చిత్తం-"
    మేం మాట్లాడలేకపోయాము. నలభై సంవత్సరాల వయసులో ఖమీనా గర్భవతి అయింది. అయ్యో పాపం వైద్యంలేక, బలంలేక, ఆ పుట్టబోయే బిడ్డ తండ్రి ఇలా అంతరించి పోవలసిందేనా?
    ఖమీనా గబగబా వెళ్ళి డుంబాను కావిలించుకుంది. "నువ్వు అధైర్య పడవద్దు డుంబా....నాకు బిడ్డ పుడితే-అప్పటివరకు నేను బ్రతికుంటే-కుడి చేతిమీద బాణం గుర్తు వేస్తాను" అని ఇటు తిరిగింది. "అమ్మా...నన్ను కాపాడుతారా? నా బిడ్డకు ఆశ్రయమిస్తారా? మా బిడ్డ తండ్రికి మనశ్శాంతిని ప్రసాదిస్తారా?" అని ఆక్రోశించింది. ప్రార్దించింది.
    దేశ కాల పరిస్థితులు, ప్రాక్పశ్చిమాలు అనే భేదం లేకుండా ఉధృతంగా వచ్చేది తల్లిదండ్రులకు బిడ్డమీద కలిగే ప్రేమ దానికి జోహారులు అర్పించని వారెవ్వరు. నా భార్య వెంటనే ఖమీనా వద్దకు వెళ్ళి ఆమె గర్భం మీద రెండు చేతులువేసి నన్ను నమ్ము ఖమీనా నేను తల్లిని. నా బిడ్డలు నీ చేతుల్లో పెరిగారు. నీ బిడ్డను నేను నా బిడ్డవలె సాకుతాను" అన్నది. ఆ ఆర్ద్రత నాకు ఇన్నాళ్ళకు మరపురాదు-    
    అక్కడినుండి కాంగోనది ఎలా దాటామో. మా బిడ్డలను డుంబా రహస్యంగా వుంచిన చోటు ఎట్లా చేరామో అదంతా పరమాత్ముడి కెరుక.
    తరువాత చాల రోజుల వరకు ఖమినా గూర్చి ఏ కబురూ తెలియలేదు. మాకు స్వేచ్చ లభించిందన్న ఆనందంలేదు. ఆమె ఏమైపోయిందన్న వుత్కంఠ అధికమైంది రెండు మూడు నెలల తర్వాత నెల్సన్ నుండి ఒక ఉత్తరం వచ్చింది...నెల్సన్ ని డుంబా రక్షించినట్లు ఉద్యమకారులు తెలుసుకొని ఖమీనా కొరకు వేట ప్రారంభించారు. చివరికి ఆమె చిక్కింది. ఆమె కండ్లు రెండు పొడిచి వదిలారు.
    అంతే. తరువాత సంవత్సరానికి కూడా మాకు ఏ వివరం తెలియలేదు. ఖమీనా ఎలా వుందో. ఆమె ప్రసవించిందో లేదో ఏ బిడ్డ కలిగిందో, వారెట్లా వున్నాడో- ఎట్లా తెలుస్తుంది? అదంతా దుర్గను ప్రవేశం ఉధృతమైన రాజకీయ విప్లవం మాకు అదీనురాలి ఉదంతం చెప్పగల వారెవరు? నెల్సన్ కు వ్రాశాము అతడెవరికో వ్రాశాడు. ఫలితం సున్న-
    ఇలా కుదరదని రెడ్ క్రాస్ కు రాశాము. అప్పటికే ఒకటిన్నర సంవత్సరాలు దొర్లిపోయాయి. అప్పుడు తెలిసింది. ఖమీనా ఒక పిల్లవాడిని ప్రసవించి మరణించింది. ఆ పిల్లవాడు తన మేనమామ యింట్లో పెరుగుతున్నాడు. వాళ్ళు లియెపాల్డ్ విల్ వదలి లివాలా కెళ్ళి పోయారు అతడెవరోకాదు...... మేము తప్పించుకు వచ్చేటప్పుడు దారిలో మాకు పండు అందించినవాడే. కబురు తెలిసిన వెంటనే అతడు వీడిని ఇండియా పంపటాని కంగీకరించాడు. ఖమీనా చనిపోకముందు కడసారి కోరిక కోరిందట. ఏ సందర్భంలో నైనా- ఎప్పటికైనా మేము బిడ్డను అడిగితే ఇచ్చేయమని. ఇదెంత కష్టతరమైన కార్యమో అందరికీ తెలుసు. దేశ ద్రోహి ఆనందే డుంబా పుత్రుడు- అతడు వెళ్ళి ఎక్కడో సుఖించటాన్ని వారు సహిస్తారా? లిసాలా నుంచి యకోమా చేర్చి దొంగతనంగా దాటించాడు బిడ్డను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS