Previous Page Next Page 
పేక మేడలు పేజి 18

   
    'ఓహో! అగ్రహారంలో నీబోటి రామయ్యలు లక్షమంది వుంటారే! అందర్నీ నేను ఎరిగి వుండాలంటావా?' అంటూ మిత్రులతో కలిసి విరగబడి నవ్వటం ప్రారంభించాడట. తాతయ్య కోపం కట్టలు తెంచుకొంది. హుంకరించి పొన్ను కర్ర తిరగవేసేంతలో వియ్యపురాలు వీధి గుమ్మంలో తొంగి చూసింది. 'ఎవరయ్యా, నువ్వు?' తాతయ్య తాత్కాలికంగా శాంతించాడు. 'నేనమ్మా చెల్లీ! లక్ష్మి తండ్రిని!
    'ఏ లక్ష్మి?'
    నిర్ఘాంతపోయిన తాతయ్య మరు క్షణంలో చటుక్కున వెనుదిరిగాడు. తాతయ్య తీరని అవమానం అనుభవించాడు. ఆనాటినుంచీ ఆ యింటి గడప మరి తొక్కలేదు. నాయనమ్మని కూడా శాసించాడు. కూతురు చచ్చిపోయిందనే అనుకోమనీ, ఆ యింటి మాట ఎత్తవద్దనీ ఆజ్ఞాపించాడు. నాయనమ్మ వలవలా ఏడ్చింది. తాతయ్య పాదాలమీద పడి ప్రాధేయపడింది. దయామయుడు తాతయ్య కళ్ళు తుడుచుకొని నాయనమ్మని ఓదార్చాడు. పండుగకి కూతుర్నీ, అల్లుణ్ణి ససేమిరా రానని పంతం పట్టి కూర్చున్నాడు. 'నామాట కాదనకు బాబూ! నీ తల్లి వంటి దాన్ని. పండుగనాడు మా యింట విస్తరి ముందు కూర్చుని లేస్తే నా కడుపు చల్లబడుతుంది, నాయనా!' అని నాయనమ్మ అల్లుణ్ణి బ్రతిమాలుతోంటే వియ్యపురాలు మండిపడేది- 'పండుగపూట నీ యింట విస్త రెందు కెయ్యాలీ? ఆమాత్రం తిండి మేము తినటం లేదా? కన్న తల్లి ప్రేమ ఒలకబోస్తావా? కట్నాలూ కానుకలూ గుమ్మరిస్తావా?' అంటూ.    
    ఆవిడ ఇంగితం గ్రహించిన నాయనమ్మ ఏదో కట్నం ఇస్తానని మాటయిచ్చి అల్లుణ్ణి తరలించుకొచ్చేది. పండుగ రోజు అల్లుణ్ణి, కూతుర్నీ కలిపి వుంచటానికే ఈ ప్రయత్నమంతా. కానీ మామయ్య విందు భోజనంచేసి తాంబూలంలోని రూపాయలు జేబులో వేసుకొని బయల్దేరి వెళ్ళి పోయేవాడు. నాయనమ్మ దుఃఖిస్తోంటే అత్తయ్య ఓదార్చేదట. 'అమ్మా! ఎందుకంత బాధ పడతావు? మనకు పురాణ కథలు తెలిసినవి కావా? సీతాదేవిని త్యజించిన శ్రీరామచంద్రుడు తిరిగి పరిగ్రహించలేదా? అడవిలో దమయంతిని విడిచిపోయిన నలచక్రవర్తి తిరిగి చేరుకోలేదా? సావిత్రిని ఏకాకినిచేసి మరణించిన సత్యవంతుడు పునర్జీవి కాలేదా? కష్టాలు పడినవారంతా కలిసి సుఖపడలేదా? ధర్మానికి అపజయం కలిగినట్టు ఎక్కడైనా విన్నామా? ఎందుకమ్మా, అన్నీ తెలిసి  దిగులు పడతావు?'
    అత్తయ్య అదే ధైర్యంతో, భవిష్యత్తు మీద ఏదో ఆశతో నాలుగు సంవత్సరాలు కాపురం చేసింది. ఆనాడు ఊరూ వాడా అత్తయ్య సహన సద్గుణాలకీ, అందచందాలకీ పేరు పడింది.
    మామయ్య ప్రియురాలైన మోహనాంగికి అత్తయ్య సౌందర్యం తిలకించాలనీ, అత్తయ్య సౌశీల్యం పరీక్షించాలనీ బుద్ది పుట్టింది. మామయ్యని రెచ్చకొట్టింది. 'మీ దర్జా, మీఠీవీ మా దగ్గిరేకదూ? మీ భార్య ముందు నాతో కలిసి మీరు నిలబడగలిగితే మీ ప్రజ్ఞ తెలిసేది. అవునంటారా?' అని అపహాస్యం చేస్తూ కవ్వించిందట. అప్పుడు మామయ్య మోహనాంగిని వారగా చూస్తూ అతి తేలిగ్గా గర్వంగా నవ్వి వుంటాడేమో!
    ఆ మరుసటి రోజే మామయ్య మోహనాంగిని సవారీలో యింటికి తీసుకొచ్చాడు. మేనా దిగగానే అత్తయ్య చేత మోహనాంగి కాళ్ళు కడిగించాడట. అది అపూర్వమైన విషయం. సామాన్య మైన ఆడది విని సహించలేని విషయం. కానీ అత్తయ్య ఆ పని చిరునవ్వుతో చేసింది. మోహనాంగి పాదాలమీద తడి ఒత్తింది. చేయిపట్టి తీసుకొచ్చి పరుపుమీద కూర్చోబెట్టింది. రక రకాల ఫలహారాల పళ్ళేలూ, పాల గ్లాసులూ అందిస్తూ దాసిలా పక్కన నిలబడింది. మోహనాంగి కొరికింది మామయ్యతినటం, మామయ్య తాగింది మోహనాంగి తాగటం, ఇద్దరూ చమత్కరించుకొంటూ, ఎంగిళ్ళు కలుపుకొంటూ, సరస సల్లాపాలు జరుపుతోంటే అత్తయ్య ముఖ మండలంలో ఒక్క విచారరేఖ గానీ, కోప చిహ్నంగానీ, అసహ్య భావంగానీ ఏ లక్షణమూ పొడచూపలేదు. క్రీగంట అత్తయ్యని క్షణక్షణమూ శల్య పరీక్ష చేస్తూన్న మోహనాంగి నిర్ఘాంత పోయింది. గోచిపోసిన చీరకట్టుతో, అతి సుందర మైన హాసకళలతో, ఇహలోక విషయాలకు అతీతురాలై తిరిగే అత్తయ్య ఎదుట మోహనాంగి సిగ్గుపడి తల దించింది. తనే ఒక జగదీక సుందరినని గర్వించే మోహనాంగి భంగపడి పరాజితురాలైంది, వీడ్కోలు ముందు అత్తయ్య ఆశీస్సుతో పూర్తిగా పరివర్తన చెందింది. దుఃఖించే హృదయంతో మోహనాంగి చేతులెత్తి అత్తయ్యకు నమస్కరించి తన భవంతికి వెళ్ళి పోయింది.
    ఆ రోజే మోహనాంగి ప్రియుడి రాకను తిరస్కరించింది. పైగా మారిన మనసుతో అంధుడికి జ్ఞానజ్యోతి చూపించ ప్రయత్నించింది. 'స్వామీ! సాక్షాత్తూ లక్ష్మీదేవికి భర్తలై ఉన్న మీరు నాగడప ఎక్కి రావటం తీరని అపచారం. ఇక సహించలేను. రతీదేవిని భార్యగా ఇంట ఉంచుకొని, పై పై అలంకారాలతో గాజు పెంకు అందచందాలతో నీచాతి నీచంగా బ్రతికే మాపైన ఈ మోజుకి అర్ధమేమి? ఆమె సౌండర్యం, ఆమె సౌశీల్యం శాశ్వతాలు కావా? మీరు దేవిరించే ఈ రూపం ఏ క్షణాన మాసిపోతుందో, ఈ యౌవ్వనం ఏ ఘడియలో జారిపోతుందో ఆలోచించారా? జరిగిన దానికి బాధపడి ప్రయోజనం లేదు. ఈపైన ఆ దేవతా మూర్తికి అన్యాయం జరగకూడదు. నేను వ్యభిచారిణినైనా నాకు ఆత్మతృప్తి కావాలి. మరి ఈ జీవితంలో అడుగుపెట్టరాదు మీరు. మీకు జ్ఞానో దయమై మీ అపరాధం తెలుసుకోగలిగితే-ఆ దేవత ఈ దౌర్భాగ్యురాలిని క్షమించగలిగితే....'మోహనాంగి జలజలా కన్నీళ్ళు కార్చింది. మామయ్య నిర్ఘాంతపోయి, 'మోహినీ!' అని దాపుకు వెళ్ళబోతే ఆమె చరచరా పడకటింటి లోకి నడిచి తలుపులు బంధించుకొంది. మరి మామయ్యకోసం ఆ తలుపులు తెరుచుకోలేదు.మామయ్య మనోవ్యథతో మంచం పట్టాడు. విపరీతంగా కలవరించటం, దుఃఖించటం, పిచ్చిగా లేచి తిరగటం లక్షణాలు అధిక మౌతున్నాయి. ఔషధాలు విఫలమౌతున్నాయి.
    మామయ్య వేదన అత్తయ్యకు తెలుసు. స్వయంగా మోహనాంగి భవంతికి బయలు దేరింది. కానీ మోహనాంగి ఆ క్రిందటి రాత్రే ఊరు విడిచి వెళ్ళిపోయింది. అత్తయ్య హతాశురాలై వెనక్కి మళ్ళింది. ఇక మామయ్య మనోవ్యథకు మందులేదు. వైద్యం లేదు. రోజులు గడుస్తున్నాయి. పరిస్థితి విషమిస్తోంది. నిద్రాహారాలు మాని అత్తయ్య చేసిన సేవ స్వర్ణమౌతోంది. మామయ్య మృత్యు ముఖంలో, మరణ ఘడియలలో స్పృహతప్పి పడి ఉన్నాడు. లోకదేవత మాదిరి కూర్చునివున్న అత్తయ్య ఏదో స్ఫురించినట్టు లేచింది, భగవంతుని ధ్యానిస్తూ మామయ్య పడకచుట్టూ ప్రదక్షిణలు చేసింది. 'ప్రభూ! శ్రీరామా! నా ఆయుస్సు నా భర్తకు ప్రసాదించి ఈ దీనురాలిని నీదరికి చేర్చుకో తండ్రీ! సౌభాగ్యవతిగా ఈ జీవి సమాప్తి చెందాలి. రామా! ఇది నా కోరిక!' అని ప్రార్ధించి ఉంటుంది.    
    భక్తులను వేరొక విధంగా సంతోషపెట్టలేక తనదరికి తీసుకుపోవటానికి సిద్ధమౌతాడు కాబోలు ఆ భగవానుడు. పవిత్ర మూర్తియైన అత్తయ్య ప్రార్ధన ఫలించింది. మామయ్యకు స్వస్థత చిక్కింది. అత్తయ్య జబ్బు పడింది. అప్పుడు నాయనమ్మ నిండు గర్భవతి. కూతురి జబ్బు సంగతి తెలిసి పుట్టెడు దుఃఖంతో వచ్చింది. వైద్యం చేయించబోతే అత్తయ్య వారించింది. 'అమ్మా! నా భర్తగారి ఆరోగ్యంకోసం నా ప్రాణం దానం చేశాను. ఈ మొక్కు చెల్లకుండా నేను బ్రతకాలని కోరితే అది మహాపరాధం కాదా? నన్ను మరిచిపో అమ్మా! నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాను.'
    అత్తయ్యకు విషమించిన రోజునే తాతయ్య కోపం మరిచి, పంతం విడిచి, అల్లుడి ఇంట కాలు పెట్టాడు. అత్తయ్య వాదన త్రోసిపుచ్చి వైద్యం చేయించాడు.
    మరో దౌర్భాగ్యం! అత్తయ్య బహిష్టు అయింది. ఒంటిమీద వడ్లగింజ వేస్తే పేలిపోయే ఆ జ్వరంలో కోడలికి తల స్నానం చేయించి తీరాలని పట్టుపట్టింది అత్తగారు. నరరూప రాక్షసి! మేలు మరిచిన కృతఘ్నురాలు! నాయనమ్మ ఎంత ఏడ్చినా విన్పించుకోలేదు. అనాచారపు పనులు తన కొంపలో ఎంతమాత్రం జరగరానంది. తాతయ్య    
     దిగ్గున లేచి బండి సిద్ధం చేయించటానికి బయటి కెళ్ళాడు. అంత లోనే ఆ రాక్షసి బిందెడు నీళ్ళు తెచ్చి కోడలిమీద గుమ్మరించింది.
    ఆ రాత్రి అత్తయ్యకు స్పృహ తప్పింది. సూర్యుడు ఉదయించాడు. అత్తయ్య అస్తమించింది. సౌందర్యరాశి, పవిత్రమూర్తి సౌభాగ్యవతిగా తనువు చాలించింది. నిండు గర్భవతి నాయనమ్మ ఆ గర్భశోకం ఎలా భరించిందో, ఎందుకు బ్రతికి ఉందో అర్ధం కాదు.
    మరో విచిత్రం! అత్తయ్య దేహం అగ్ని జ్వాలలలో లీనమై మాయమైపోయిన సమయాన నాయనమ్మ ప్రసవించింది-కోరి కోరి ఒక్కగా నొక్క మగబిడ్డవి! ఏమిటీ ప్రకృతి! ఎన్ని చిత్రాలు సృష్టించగలదు!
    అప్పుడప్పుడూ భగవానుడు మనుషుల్ని బొమ్మలుగా పెట్టుకుని ఆటలాడుకుంటాడు కాబోలు.
    ఒక బిడ్డ మరణం! మరో బిడ్డ జననం! ఆ మాతృ హృదయం శోకిస్తుందా? సంతోషిస్తుందా? ఎలా అనుభూతి చెందుతుంది? నాయనమ్మ కూడా సరిగా జవాబు చెప్పలేక పోయింది. ఆ పసిపాపే మా నాన్న.
    నాన్న పెద్దవాడై, నాన్నకి నేను పుట్టి కొంత పెరిగాక, నాయనమ్మ నా కీ గాథ చెపుతోంటే ఆ అనుభూతి ఎలా వర్ణించను?"

                                 *    *    *

    భాను ఆగింది. నేను భారంగా నిట్టూర్చాను. "ఎంత చిత్రమైన కథ చెప్పావు, భానూ! అత్తయ్య పోలికలు నీకు వచ్చాయని చెప్పిందా, నాయనమ్మ?"
    "అవును ఒక్క రూపంలోనే కాదు. రాతలో కూడా ఉన్నాయని ఇప్పుడనిపిస్తోంది. అత్తయ్య చరిత్ర విని ఆనాడు నేనే మనుకున్నానో తెలుసా? అత్తయ్యకు ఎంత అందంఉన్నా, ఎన్ని సుగుణాలు ఉన్నా భర్తని పాదాక్రాంతం చేసుకోగలిగే ఆ తెలివితేట లేవో, ఆ శక్తిసామర్ద్యా లేవో లేవనీ, అత్తయ్య అమాయకతే అత్తయ్యని బలి తీసుకొందనీ, అత్తయ్య స్థానంలో నేనే వుంటే అటువంటి కష్టాలకు గురి కాననీ-అన్నయ్యా! ఇప్పుడు నాకు నవ్వొస్తుంది. నా నిర్ణయాల వెనుక ఎన్ని నిజాలు మరుగునపడ్డాయో అప్పుడు నాకు ఎవరైనా చెప్పివుంటే నమ్మేదాన్ని కానేమో!
    ఆనాడు-పెళ్ళికి ముందు-నా ఆలోచన లేమిటో వింటావా? ఆ రోజులు వేరు. ఆ మనుషులు వేరు. ఆనాడు స్త్రీకి భార్యగా గానీ, కోడలుగా గానీ ఎటువంటి స్థానమూ లేదు. కన్న బిడ్డ అత్తింట నరకం అనుభవిస్తోంటే తల్లి దండ్రులు కళ్ళు పెట్టుకు చూడటానికి తప్ప దేనికీ సమర్ధులు కారు. సాంఘిక నియమాలను    
    మీరగలిగే సాహసవంతులు కారు.
    కాని ఈనాడు అత్తయ్య మళ్ళా పుడితే అంత అన్యాయంగా బలైపోయె అవసరం రాదు. ఈనాటి పురుషుడు సత్యవాది! దయామయుడు! న్యాయపాలకుడు! స్త్రీ విలువ గ్రహించాడు. స్త్రీని అర్ధం చేసుకున్నాడు. స్త్రీని గౌరవిస్తాడు. ప్రేమిస్తాడు. ఆదరిస్తాడు. ఆరాధిస్తాడు. క్రమ క్రమంగా స్త్రీ అన్నివిధాలా పురుషుడి స్థాయి అందుకోగలుగుతుంది. ఆ అవకాశం పురుషుడే కల్పిస్తాడు. అట్టి స్త్రీ పురుషుల మధ్య కలహాలకు గానీ విముఖతలకు గానీ తావే లేదు. విద్యా వంతులై జ్ఞాన సంపన్నులైన ఈనాటి మనుష్యులు పూర్వపు వ్యక్తుల మాదిరి సనాతనంగా అనాగరికంగా బ్రతుకులు సాగిస్తారనుకొంటే సిగ్గుచేటు.
    అత్తయ్యకూ నాకూ అంతులేని అంతరం ఉంది. అత్తయ్య సాధించలేని అభ్యుదయం నేను సాధించగలను. అత్తయ్య శాసించలేని పురుషుణ్ణి నేను శాసించగలను. అత్తయ్య పొందలేని గౌరవ మర్యాదలు నేను పొందగలను. అత్తయ్య అందలేని స్వర్గసీమలు నేను అందుకోగలను. ఈ ప్రగతి, ఈ అభ్యుదయం, ఈ పరివర్తన అంతా అత్తయ్య చూస్తే!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS